Friday, January 30, 2009

రాముడూ - స్ఫూర్తీ

సహృదయులైన పాఠకులకు నమస్సుమాంజలి.

ముందుగా 'రాత - గీత' గురించి రెండు ముక్కలు.
చిన్నపుడు (అంటే మనం బడి కి ఇంకా వెళ్ళకముందు) మనం ఏం చేసినా, ఏం నేర్చుకున్నా, ఏం ఆడుకున్న అన్నీ రాతలూ - గీతలే. బ్లాగ్బడి లో చేరిన చిన్న పిల్లవాడిని కదా !! అందుకే నా ఈ ప్రయత్నానికి కూడా అదే పేరు పెట్టా !!

ఇక అసలు విషయానికి వస్తే ప్రతీ వ్యక్తీ జీవితం లో ఎప్పుడో అప్పుడు ఏదో ఒక భావానికో, ఊహ కో స్పందిస్తాడు. ఆ స్పందన వారి వారి జీవ లక్షణానికి తగ్గట్టు ఉద్రేకం గా గానీ ఉత్సాహం గా గానీ ఉంటుంది. ఒక పాట నచ్చినా , ఒక సినిమా నచ్చినా , ఒక వాక్యం నచ్చినా, ఒక ఆట నచ్చినా అది వ్యక్త పరుస్తాడు. ఎవరి కోసం? అంటే? తన కోసం.. తన వంటి వారి కోసం...తన చుట్టూ తన వంటి వారు ఉంటే బాగుణ్ణు అని కోరుకుంటాడు... నా ఈ ప్రయత్నం కూడా అటువంటిదే.

పాపి కొండల మధ్య గోదావరి పై భద్రగిరి రఘువర దర్శనార్ధమై ప్రయాణం చేయటం నా జీవితం లో ఒక మరచి పోలేని అనుభూతి. అది నా ఊహ కావచ్చు, నా భావన కావచ్చు .. అనుభూతే అయి ఉండవచ్చు కూడా...నిజం ఏమిటో తెలియదు కానీ ఒక అనిర్వచనీయమైన భావన... దాశరధీ శతకం చదువుతూంటే గోరువెచ్చని కన్నీళ్లు ధారా పాతం గా వస్తూనే ఉన్నాయి... గొంతుక తడి ఆర్చుకు పోయింది... చుట్టూ రాళ్ళూ.. రప్పలూ.. పువ్వు లూ చెట్లూ..కోతులూ.. అన్నీ రాముడి తో మాట్లాడుతున్నట్టు కనిపించింది (అనిపించింది) . వేదన తీవ్రమై అలజడి కలిగింది.
ఉడుతనై , చిమనై , సీతనై, మరిచుడినై, భక్తుడినై, ఇసుక రేణువునై, రాయినై, చెట్టునై, పండునై .... పరి పరి విధాలుగా పరితపించాను. విరహ వేదన అనుభవించాను. కనిపించిన ప్రతీ వస్తువూ నేనై రాముడి కి నా వేదన నివేదించుకున్నాను.

మయతీతి రామః కదా... బహుశా రామానుభూతి కలిగిందేమో అనిపించింది. (కలగక పోయినా ఊహించుకోవటం తప్పు కాదు గా)

ఇది ప్రయాణం జరిగినప్పుడు మాత్రమే కాక ఎన్నో రోజులు నిలబడింది.. ఒక మత్తు లాంటి అనుభూతి మిగిల్చింది.
అనుకోకుండా పద్య - వర్ణన ల రూపం లో వ్యక్తమయ్యింది..

ఇది జరిగి ఇప్పటికి సరిగ్గా ౧౦ సంవత్సరాలు అయ్యింది. (౨౮ జన ౧౯౯౯) . ఇప్పటి కి ఇలా వ్యక్త రూపం లోనికి సన్నిహితుల ప్రోద్బలం తో వస్తోంది.

రాత- గీత లో ఇంకొక విశేషం. భావానికి అనుగుణం గా నేను కొన్ని సార్లు బొమ్మలు కూడా గీసాను. వీటినీ - వాటినీ యథా తథం గా పొందు పరుస్తున్నాను (వీలున్నంత వరకూ) . అందుకే ఈ పేరు కూడాను.

ఇంకొక్క చిన్న(ఆఖరి) మాట. భావ స్ఫోరకం గా సాగిన ఊహల్లో యతి కొన్ని సార్లు ఆశీస్సులను, కొన్ని సార్లు అలకలను అనుగ్రహించారు (యతి తప్పి ఉండవచ్చు). పెద్ద మనసు చేసుకుని ఈ చిన్ని వాడిని క్షమించెయ్యండి.
ఇతి శం.

భావన ౧.
చీమ మనోగతం ...