Friday, August 13, 2010

"ఆగస్టు విప్లవం" - బోయి భీమన్న

ఎందరో మహానుభావులు, కవులు, గాయకులు, రచయితలు, పత్రికా సంపాదకులు, రాజకీయనాయకులు, కార్యకర్తలు నడుంబిగించి తమకు చేతనైనపనిని కర్తవ్యంగా భావించి చేస్తేకదా స్వాతంత్రోద్యమం జాతీయోద్యమంగా రూపాంతరం చెందింది... అట్లాంటి జాతీయోద్యమ స్ఫూర్తితో ఉత్తేజపరచే రచనల్లోనిదే బోయి భీమన్నగారు రాసిన "ఆగస్టు విప్లవం" కావ్యం.

ఆంధ్రా యువకుల మహోత్తర పాత్ర, బాపూజీ నాయకత్వం, మహాత్ముని పిలుపు..వీటి నేపధ్యం లో స్వాతంత్ర్య సమరం లో పాల్గొనమని ఓక వీర యువతి తన ప్రియునకు చేసిన ప్రబోధమే ఆ కావ్యం

నన్ను ప్రభావితం చేసిన ఆ కావ్యంలోని కొన్ని ఆణిముత్యాలు సందర్భోచితం గా..."

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
బాపూజీ పిలుపాలకించి మురళీ వాదమ్మునన్ బోవు గో
గోప వ్రాతమువోలె, సాగు డిక త్యాగుల్ భోగులేకస్థులై.
రేపన్నట్టిది లేదు దేశ హిత కార్యేధ్ధ ప్రయత్నమ్మునన్;
వ్యాపింపన్ దగు నేడె వ్యూహ రచనా ప్రాగల్భ్యమాశాంతముల్.

ధీమంతుండంగు ఆంధ్రకేసరి ప్రబుధ్ధిన్, చెన్నపట్నమ్మునన్
సైమన్ సంఘముతో తొడన్ జరచి ఆంధ్ర ప్రాగ్యమున్ జూపె; మొ
న్నే మొన్నన్ యువరక్తనిర్ఝరుల నింకెన్ భూమి గుంటూరులో;
ఈ మీ దేమగునన్ తలంపు వల,దిప్డే దూకు డుద్బుధ్ధులై.

వార్తలు లేక, నాయకుల వైనము కోరిన దేశభక్తులన్
దూర్తులు సాయుధుల్ భటులు తూలగనేయ తుపాకులెత్తినన్
స్ఫూర్తి వహించి - 'పేల్చు ' డని ముందుకు దూకినవాడు మీ బి.ఎస్.
మూర్తి ! పరాక్రమమ్మదియ పో, బెజవాడకు భూషణమ్ముగా !

అల్లురి వంటి వీరసుతులాధుని కార్జును లెంతమందియో;
కల్లురి సుబ్బరావొకడె కాచెను సంజివరెడ్డి బోలు బల్
మల్లుర గూడి, రాష్ట్ర మొక మండల మంతయు; పెక్కులేల, మీ
పల్లము రాజు లేడె? కరువా యువవీరులు, దేశభక్తులున్?

అరుగో ఛూడుము సాంబమూర్తిని, గిరిన్, ఆచార్య రంగాను, ము
ట్నురి శూరున్, సరదారు లచ్చనను, మధ్ధూరన్ననున్, అయ్యదే
వరకాలేశ్వరు; చంద్రమౌళి, పుసులూర్వర్యున్, రవీంద్రున్ మహ
ద్గురుగా చేకొని పోరికిన్ చనిన మీ గోపాలరెడ్డ్యగ్రణిన్.

పరికింపన్ పనియేమి పండితుడు మీ పట్టాభి ముందుండ? పె
క్కురు కూర్మయ్యలు, చెర్కువాడలు, మహా కోట్రెడ్లు, మాగంటు, లు
ధ్ధురులౌ పొట్టులు, చిట్టుల్లున్ నడవగా; దువ్వూరి సుబ్బమ్మలై
తరుణుల్ దూకిరి దాస్యమోచన రణౌధ్ధత్యమ్మునన్ , చూడవే?

శంకయొకింత యేలను? శశాంకుని దీటగువాడు మీ కళా
వెంకటరావు 'స్యైడు 'లను వింత యమాసను ముంచి, ఇంచుకేన్
గొంకక , ఆంద్ర సర్క్యులరు గొంచు, జనమ్ముల కందజేయడే?
అంకెకు వచ్చువాడెవడు యాతనితో అసహాయ శూరతన్?

బడి మానుండు, స్వరాజ్యరాజ్యరమకై స్వాతంత్ర్య సంగ్రామ మం
దడు గుంచుం డని బాపు చెప్పగనె - విద్యన్ మాని, వాలంటిరై,
పడతిన్ బోవిడి, లాటిదెబ్బలకు తావై, ఖైదునన్ గూలి, ఆ
తడు దేశమ్మును గొల్చు జీవితపు సత్తా మొత్త మర్పించుచున్ !

త్యాగము గూర్చి చెప్పుట కుదాహరణమ్మిది, పాలపొంగుగా
భోగము లొందు యౌవన నవోదయమున్ నిజదేశభక్తి పూ
జాగరు వర్తిగా నిలిపి అర్చనచేసినవైనమిద్ది; సు
స్వాగతముల్ వచ్చించి, యువ సైన్యము గూర్చుక బైలుదేరుమా !

నను విడనాడి పోవగ మనమ్మున నీవెటు కుందుచుంటివో,
నిను విడనాడి యుండుటకు నేనును అంతకుమించి కుందుచుం
టిని; మన కుందు దేశ జననీ పరతంత్రత లోని కుందుతో
నెన యగునా? తదార్తి తొలగించుట కంటెను ధర్మముండునా?

యువకుల్ కల్గిన లాభమేమి బలవద్యోధ్ధత్వముల్ లేనిచో?
జవసత్త్వమ్ముల కార్యమేమి భరతక్ష్మా దేవి కాపాడమిన్ ?
నవలల్ లేచిరి తోడురాన్; నడువుడింకన్ శూరులై; సేనలై;
బవరం బందునె పుచ్చుకొందము ప్రియ స్వాతంత్ర్య లక్ష్మీ క్షమన్ !!