అదేమిటి? ఇదేదో అప్పుతచ్చు లాగా ఉందే అనుకుంటున్నరా?
"విష్ణు సహస్ర నామ"మని చెప్పి వాక్యమును పూరింపుము అనగానే ఎవ్వరైనా "స్తోత్రం" అని ఠక్కున సమాధానమిస్తారు. నేనూ అలాగే అనుకునేవాణ్ణి "బాలకవి", "శతావధాని" శ్రీ సంపన్ముడుంబ సింగరాచార్యులవారి కృతి గురించి తెలియనంత వరకే.
శంకర భగవత్పాదులు, మధ్వాచార్యులు, పరాశర భట్టరులు, భగవద్రామానుజులు, కంచి పరమాచార్యులు,కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు మొ. ఎందరో మహానుభావులు ఈ స్తోత్ర రాజానికి భాష్యాన్నందించారు.
శ్రీ సంపన్ముడుంబ సింగరాచార్యులవారు భగవద్గుణ ప్రతిపాదకములైన ఈ అనర్ఘమైన గ్రంథరాజానికి పద్య వ్యాఖ్యానం అందించారు అదీ "నీవే గతి కృష్ణా దీనచింతామణీ" అనే మకుటంతో దశ శతకాలుగా....అంటే ఇది విష్ణు సహస్ర నామ స్తోత్ర పద్య సాహస్రం. అందులోనూ వ్యాఖ్యాన సహితం గా....
ఆంధ్ర దేశంలో పావన కృష్ణాతీరం లో జగ్గయ్యపేట ధనాచలం ప్రసిధ్ధ శ్రీవైష్ణవ క్షేత్రం. ఇక్కడి శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధి అపర శ్రీరంగం వలే భాసించింది. అలనాటి సుప్రసిధ్ధ నల్లాన్ చక్రవర్తుల, సంపన్ముడుంబై, మరింగింటి వంశస్థులు ఈ స్వామి వారికి కైంకర్యం చేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలురుగా వన్నెకెక్కారు. సంగీత-సాహిత్య గోష్ఠులూ, అవధానములూ, చందనగోష్ఠులూ, తదీయారాధనలూ వెరసి "ఆ నిష్థా నిధి గేహసీమ.." అని ఆముక్తమాల్యదలో వర్ణించినట్టు శ్రీవైష్ణవ సిరి ప్రకాశించింది.
అట్లాంటి శ్రీమధ్ధనశైల సీతారమచంద్రులవారు శ్రీ సంపన్ముడుంబ సింగరాచార్యులవారి కులదైవం. ఆ ఆలయంలో అష్టోత్తరశత శిలాస్తంభ మహామంటపం ప్రతిష్ఠించిన మహోత్సవ సమయంలో తమ కులదైవం అనుగ్రహంగా ఒక్కొక్క నామానికీ ఒక్కొక్క పద్యం రచించాలని సంకల్పం కలగటం, శార్దూల, మత్తేభ విక్రీడితాలతో (వాటిలో ఇమడని నామాలను అదనం గా గీత, కందపద్యాలలో) రచించారు. వారు రచించిన కృతులలో సంస్కృత భాగవతానుసారము "శ్రీభాగవతం", శ్రీ హరి శతకం, భ్రమర గీత, అవధూత గీత, భిక్షు గీత, శ్రుతిగీత, గోపికాగీత, రుద్రగీత మొదలగునవే కాక సాత్రాజితీ పరిణయం, రుక్మిణీ కల్యాణం, ప్రహ్లాద చరితం మొ|| హరికథలూ ఉన్నాయి.
దీర్ఘ సమాస సమన్వితమైన పద్యాలనెంత హృద్యంగా రచించారో సరళతరమూ, అలంకారశొభితమూ అయినపద్యాలనూ అంతే రమ్యం గా రచించిన విద్వత్కవి శ్రీ సంపన్ముడుంబ సింగరాచార్యులవారు.
నాకు బాగా నచ్చిన ఈ సాహిత్య సేవను మీకూ పరిచయం చేద్దామని చిన్న కోరిక. వారి పద్యాలలో కొన్ని....
స్ఫారత రాగ సంకలిత జన్మజరామరణాది రూప సం
సార మహాసముద్ర శత సంగత దుఃఖ తరంగ పంక్తి బి
ట్టూరక ఈడ్చి కొట్టగడు నుక్కిరిబిక్కిరియై నరుండు త
త్తారక నామమున్ నుడివి తత్ క్షణమందు విముక్తినందెడున్
అభయాత్ముండన నొప్పుచుండుదువు నీవశ్రాంతమున్! కేవలా
నుభవానందమయ స్వరూపగుడవెందున్ నీకు నీ భూత భ
వ్య భవద్భూతచయంబు శేషమగుటన్ భాసిల్లెడిన్ "భూత భ
వ్య భవత్ప్రభ్వ"భిధాన మీవెగతి కృష్ణా ! దీన చింతామణీ !!
ఘనకారుణ్య సుధా తరంగములు పొంగం గాంక్షితార్థంబులున్
దనరన్ జేయుచునెట్టి యాపదయు జెంతంజేరనీ కర్మిలిం
గనుచున్ భారము బూని భూతవితతిన్ గాపాడుతన్ "భూతభృ
త్త"ని చెప్పంబడుచుండు నీవెగతి కృష్ణా ! దీన చింతామణీ !!
త్యక్తాన్య స్పృహులూర్జితాత్మ కులవిద్యా బంధ నిర్ముక్తులౌ
భక్త శ్రేష్థులకున్ నిరంతరము ప్రాప్య స్థానమై యొప్పుటన్
"ముక్తానాం పరమా గతి" స్త్వ మనుచున్ భూషించి భాషించు నా
సక్తిన్ వైదికవాణి నీవెగతి కృష్ణా ! దీన చింతామణీ !!
నీ రూపంభును నీ గుణ ప్రకరమున్ నీయద్భుతైశ్వర్యమే
పారున్ వాఙ్మనసాతి భూములగుచున్ స్వాత్మానుభూతిన్ మహో
దారున్ సూరలకిచ్చుటం "బురుష" శబ్దంబొక్క నీ యందు న
న్యారూఢంబుగ మెప్పు నీవెగతి కృష్ణా ! దీన చింతామణీ !!
పిడకలవేట: టపాల్లో మొత్తనికి అటుచేసి ఇటుచేసి హాఫ్ సెంచరీ అయ్యిందనిపించానోచ్చ్... అయితే ఉపయోగపడినవెన్నో అని అంతే మాత్రం...తత్తత్తా మెమ్మెమ్మే....
ఆచార్యులవారికి ప్రణామాలు.
ReplyDeleteమీకు అభినందనలు.
(మాకీ ఆహ్లాదకర కవితాసుమ సౌరభాల మలయ మారుత వీచికల వనవాటికా ప్రవేశము కలిగించినందుకు ధన్యవాదాలూను.)
హరికథా రచయితలు చాలా అరుదు అనుకుంటాను. అలాంటి వారిలో ఒకరైన సింగరాచార్యుల వారి పరిచయం బావుంది. పద్యాలు చక్కగా ఉన్నాయన్నమాట పేలవంగా ఉంటుంది.
ReplyDeleteహాఫు సెంచరీ అయిందిగా, ఇన్నింగ్సు డిక్లేరు చేయకుండా కొనసాగించండి.
@ మందాకిని గారూ, @ రవీ !!
ReplyDeleteనెనర్లు...