Tuesday, October 18, 2011

కాటుక కంటి నీరు...


బ్లాగ్మిత్రులు కామేశ్వరరావు గారు "తెలుగు పద్యం" లో ఇటీవలి కాలంలో సాహిత్యావలోకనం చేస్తూండగా తనకెదురైన ఒకానొక సంఘటనకి కలత చెంది ఒక చిన్నటపా పెట్టగా దానిలో చర్చ "కాటుక కంటి నీరు" పద్యం మీదకి వెళ్ళడం (అది పోతన గారి రచనా కాదా అనే విషయంలో), నాణేనికి రెండువైపులా సమమైన వాదన ఉండడంతో ఆ చర్చని అంతటితో సమాప్తి చేద్దామన్న ఒడంబడికకి రావటం జరిగింది. ఐతే అదేవిషయమై నిన్ననే ఇంకొక వివరణ చదవటం చేత దానిని అక్కడే చర్చించి మాట తప్పటం కన్నా ఇంకొక టపాగా ప్రకటించవచ్చనే ఉద్దేశంతో ఈ టపా...

ఆసక్తి కలవారు ఇక్కడ ఆ టపా చర్చను చదువవచ్చు.

"కాటుక కంటి నీరు" చాటువుకు ప్రస్తావన శ్రీనాథ కవి సార్వభౌముడు రాజులకు కృతినిచ్చి, ధన సంపాదన చేసి దారిద్ర్యము బాపుకొనమని పోతనకు ప్రబోధము చేసినట్లూ, అప్పుడు ప్రత్యుత్తరముగా పోతన భారతీ దేవితో పలికిన పద్యంగా ఈ పద్యరాజం ప్రశస్తమయ్యింది.

ఐతే నిడదవోలు వేంకటరావుగారు "పోతన" అనే గ్రంథం లో ఈ క్రింది విధంగా వివరణనిచ్చారు
"ఇందు పేర్కొనిన మువ్వురూ (కర్ణాట, కిరాట, కీచకులు) శ్రీనాథునికి సంబంధించినవారే !


కర్ణాట రాజు:- శ్రీనాథుడు కర్ణాట రాజగు ప్రౌఢదేవరాయల ఆస్థానమున, ముత్యాలశాలలో కనకాభిషేక మహా సత్కారమును గాంచినవాడు - కర్ణాట క్షితినాథ మౌక్తిక సభాగారాంతరాకల్పిత స్వర్ణ స్నాన జగత్ప్రసిధ్ద కవిరాట్టు" నని చెప్పుకున్నాడు 


కిరాటులు:- కిరాటులనగా వైశ్యులు. శ్రీనాథుడు తన హర విలాస ప్రబంధమును, కాంచీ పురవాసి యగు అవచి దేవయ సెట్టి పుత్రుడగు తిప్పయ శెట్టికి గృతినిచ్చియున్నాడు. చిఱు తొండనంబి ని వర్ణిస్తూ శ్రీనాథుడు "కోటికిన్ పడగనెత్తిన నక్కిరాట వంశ కిరీటాలంకారంబు. 2-34" అని చెప్పి యున్నాడు


కీచకులు:-  ఈ పదము వలన శ్రీనాథుడు చెప్పిన పల్నాటి వీర యుధ్ధ కథ సూచితమైనది. పల్నాటి వీరచరిత్ర ప్రశస్త దేశికృతియైనను హీనజాతి వారి కోరిక పైన రచించినదే కదా. 


శ్రీనాథుడీవిధముగా మువ్వురవలన వారికి కృతులనిచ్చి గాని, కవితా సమ్మాన రూపమున గాని ధనమునార్జించినట్లుగా, త్రిశుధ్ధిగా తానట్టి పనులు చేయనని భారతి దేవితో విన్నవించాడు"  

ఈ పద్యం చాటువు కనుక, అప్పటి దేశకాల రీతులు, జరిగి ఉండవచ్చునన్న కథాంశమూ నిజమే అయితే, ఈ వివరణ దానికి ఊతమిచ్చేదే కనుక అయినట్టైతే అది పోతన రచన కాకపోయుండవచ్చన్నది నా అభిమతం
శారదా పుత్రుడు, బ్రహ్మ దత్త వరప్రసాదుడైన శ్రీనాథుణ్ణి పరోక్షం గా నిరశిస్తూ వాగ్ఞియమాన్ని పాటించే భాగవతోత్తముడైన పోతన పలికి ఉండడన్నది నా భావానికి హేతువు.

9 comments:

  1. బాగుంది! కర్ణాట, కిరాట పదాల అన్వయం సూటిగానే ఉంది కాని కీచక పద అన్వయం కాస్త ద్రవిడప్రాణాయామంలా ఉంది! :-)
    ఈ పద్యం ఎవరు వ్రాసినా, రాజులపైన బాగా ఒళ్ళుమండి, ఆ మంటని కన్నీళ్ళ రూపంలో ఆర్ద్రంగా పలికించిన పద్యం!

    నాకు మీతో విభేదం ఎక్కడంటే, పోతన యిలాంటి పద్యాలు వ్రాసి ఉండడానికి అవకాశమే లేదని భావిస్తూ చేసే idealization. పాత్రలయితే ఏమో కాని, ఒక మనిషిని మన ఊహలో అలా idealize చేసుకొని, ఇత నిలాగే చేసి ఉండాలి అని నిశ్చయించుకోవడం నా మనసుకి నప్పదు. బహుశా నా statistics background కూడా దీనికి కారణమేమో!
    A natural process always has variation in it is what we learn in statistics. There may even be few outliers, which are outside the confidence limits! Unless there is a substantial evidence otherwise, we consider them as outliers of the same process instead of deciding that they belong to a different process.

    ReplyDelete
  2. కామేశ్వరరావుగారు, సనత్ కి కూడా గట్టి స్టాటిస్టిక్స్ బాక్ గ్రవుండ్ ఉంది. :-)

    ReplyDelete
  3. అవునా! అయితే statistics కారణం కాదన్నమాట :-)
    సనత్ గారూ, మీరు డిగ్రీ/పీజీ statisticsలో చేసారా? (మీరింతకుముందు చెప్పేరేమో నాకు గుర్తులేదు!)

    ReplyDelete
  4. ఈ ద్రవిడ ప్రాణాయామం గురించి కూడా కాస్త చెప్పండి గురువు గార్లూ

    ReplyDelete
  5. కామేశ్వర రావు గారూ, నాది స్టాటిస్టికల్ ఎకనామిక్సు లో బీ.ఏ. (డబల్ మ్యాథ్స్ అని పిలుస్తారు కూడా..) మీలాగానే నాకు కూడా స్టాటిస్టిక్స్ అంటే ఇష్టం (ఇప్పటికీ).

    కాకపోతే పోతనను నేనేమీ ఐడిలైజ్ చేయలేదు. అది చాటువు కాబట్టి పోతన వ్రాసాడని కర్ణాకర్ణిగానే వినిఉంటారు/ చదివి ఉంటారు గానీ ప్రమాణం లేదు కనుక, నాకున్న (లేదా తెలిసిన) మిగిలిన కారణాలు/ ఉదంతాలతో పోతనది అని నమ్మకుండా ఉండడానికి అంతే అవకాశం ఉంది అని భావిస్తున్నా..

    మీకింకో మాట.. ఆ చాటువుల స్టొరీ లోనే సిరికిన్ జెప్పడు కథను శ్రీనాథుడు అవహేళన చేశాడని అప్పుడు పోతన/ పోతనగారి అబ్బయి శ్రీనాథునకు ప్రాక్టికల్ గా చూపించారు అని ఒక కథ కూడా నడుస్తుంది. కాడెద్దులు లేని నాగలీ - బోయీలు లేని పల్లకి కథ కూడా అట్లాంటి చాటువుల స్టోరీ నే... అయితే ఈ కథల విషయం లో నేను మీటపాలో చెప్పినట్టుగా అతిశయోక్తి అలంకారం, ఎమోషన్స్ ను బాగా పండిస్తే మనసుకి బాగా హత్తుకుంటుందన్న ఉద్దేశం తో పోతన పేరిట చేసిన ప్రచారమని నేను నమ్మటానికి కారణం... ఎవరికీ చెప్పకుండా హరి వచ్చేస్తాడా అని శ్రీనాథునికి వచ్చిన డౌటు కథ మీదనా? పోతన రాసిన పద్యం మీదనా? కథ అయినట్టైతే వ్యాసుడి మూలంలోనే ఉంది (పోతన కొత్తగా వ్రాసిన స్టొరీ కాదు). ఒక వేళ కథనం మీద అనుకుందాం అప్పుడు అది సాధ్యా సాధ్యాల మీదకన్వయింప బడుతుంది .ఒకవేళ అదే అయినట్టైతే వెయ్యి సంవత్స్రాలు పగలూ రాత్రి మొసలి ఏనుగూ పెనుగులాడటం ఏమిటి అని వెయ్యి సంవత్సరాలంటే ఎన్ని రోజులు? ఎన్ని నెలలు వంటివి అడిగి ఉండాలి. అక్కడ అడగలేదు. గజేంద్రుడు పెంజీకటికవ్వల ఎవ్వండేకాకృతి వెలగు అని అన్నప్పుడు దానినీ శంకించలేదు. గజేంద్రుడు అడగటానికీ లేదు ఈయనగారు ఊపుకుంటూ వచ్చెయ్యటానికీ లేదు... అదేమన్నా సాధ్యమా అని శ్రీనాథుడు అడిగాడనే అనుకుందాం... అంటే కథను కాదని, కథనాన్ని కాదనీ పోతన రాసిన పద్యాన్ని శంకించాడనే అర్థం వస్తుంది. అయితే ఈ కథని ప్రాచుర్యంలోకి తెచ్చినవారు మర్చిపోయినదేమిటంటే...గజేంద్రుడూ శ్రీహరిని ఎల్లా రమ్మన్నాడు? చుటుపక్కలేమి జరుగుతోందో కూడా పట్తకుండా ఉన్నపళాన ఉన్నట్టుగా వచ్చెయ్యి అనే పద్యం ముందు వచ్చి ఆపై మిగిలిన పద్యాలొస్తాయి. దానికి ఊతం గానే అమ్మవారి కొంగు తన చేతిలో ఉంది అన్న సంగతి కూడా పట్టకుండా ఆయనగారు గుయ్యాలించి వచ్చేస్తూంటే ఆవిడ చీర పమిటని పట్టుకుని ఆయనతో పాటు వేగం గా పరుగెత్తలేక అడుగులు తడబడుతూంటే (దానిని సంకేతిస్తూ సర్వలఘు కందంలో ఆ తడబాటునూ సూచిస్తూ) తుమ్మెదలొస్తూంటే వాటిని అదిలిస్తూ పరుగెత్తింది అని వర్ణించారు. ఈ మొత్తం లో ఆయుధాలు తీసుకెళ్ళడం అన్నది ఒకటైతే భార్యతో రమావినోదిగా ఉన్నవాడు అదికూడా పట్తకుండా పరుగెత్తాడు అంటే అక్కడ శ్రీనాథుడంటటి కవిసార్వభౌముడు సంశయించాల్సిన విషయమేమిటో నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ గనక పోతన వ్రాసిన భాగవతానికి ప్రాచుర్యం కల్పిద్దామని శ్రీనాథుడనుకుని ఉంటే ఇట్లాంటి చీప్ పబ్లిచిటీ స్టంట్ చేసి ఉండడని నా నమ్మకం. ఆ కథ ఎమోషన్స్ ను కదిలించదా అంటే మీరన్నట్టుగా పోతనను ఐడిలైజ్ చేసి పోతన మహత్తుని సూపర్లేటివ్ డిగ్రీలో ఆవిష్కరిస్తుంది... ఇట్లాంటిదే బాల రసాల చాటువు విషాయం లో కూడా అనిపిస్తుంది. (ఒకవేళ మీకు అది పోతన వ్రాసినదే అనిపిస్తున్నట్టైతే అది ఇంకోసారి ముచ్చటించుకుందాం..ఎందుకంటే మీవంటివారితో చర్చిస్తే/ ముచ్చటిస్తే తెలియని ఎన్నోవిషయాలు తెలుస్తాయి)

    ReplyDelete
  6. వ్యాసుడి మూలంలో గరుత్మంతుని మీద ఆరోహించి విష్ణుమూర్తి వస్తాడని ఉందని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలలో విన్నానండి.

    ReplyDelete
  7. >>వ్యాసుడి మూలంలో గరుత్మంతుని మీద ఆరోహించి విష్ణుమూర్తి వస్తాడని ఉందని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలలో విన్నానండి

    అవును మూలంలో గరుఢారూఢుడై, చక్రధారియై వస్తాడు. వచ్చేది "విష్ణువు" కాదు "హరి"! ఆశ్చర్యపోకండి, "హరి"కూడా విష్ణువు యొక్క ఒకానొక అవతారమే(నట)! నాల్గవ మన్వంతరంలో హరిమేధునికి, హరిణికి పుట్టినవాడు హరి. ఇతనే గజేంద్రుని కాపాడినవాడు. మరో తమాషా ఏమిటంటే, నాల్గవ మనువు కాలానికి అసలు వైకుంఠమే నిర్మితమవ్వలేదు. అది నిర్మితమైనది అయిదవ మన్వంతరంలో. కాని పోతనగారు, గజేంద్రమోక్షణ సందర్భంలో, "అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల" విష్ణుమూర్తి రమావిదోనిదియై ఉన్నట్టు చిత్రించారు!

    పోతనగారి దృష్టి భక్తిపైన కవిత్వంపైనా ఉన్నంతగా పౌరాణికసత్యాసత్యాల మీద లేదు. దానివల్లనే మనకి రసభరితమైన భాగవతం లభించిందనుకోండి!

    ఇంతకీ "సిరికిం జెప్పడు..." పద్యం చుట్టూ అల్లబడినది కట్టుకథే అని పండితులందరూ నిర్ణయించిన మీదట దాని నిజానిజాల గురించీ ఔచిత్యానౌచిత్యాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అవి చాటు సంప్రదాయంలోని కథలుగా మనం గ్రహించాలి. ఒక మహాప్రవాహంగా సాగే ఒక రసభరితమైన సన్నివేశంలో ఏవోలొసుగులని వెదకబూనడం అసందర్భమని ఆ కథ చెపుతున్న నీతిగా నేను తీసుకున్నాను. దీన్నే పింగళివారు కృష్ణుని నోట, "రసపట్టులో తర్కం కూడదు" అనే అద్భుతమైన మాటగా మాయాబజారులో పలికించారు.

    ఊ.దం.గారు, ద్రవిడప్రాణాయామం అంటే చేతిని తలవెనకనుండి తీసుకువచ్చి ముక్కుపట్టుకోవడం. సూటిగా చెప్పని విషయాలు అనీ, దూరాన్వయం కలిగున్నాయనీ చెప్పడానికి ఇది నానుడి.

    ReplyDelete
  8. కామేశ్వర రావు గారు, మందాకిని గారు ! ధన్యవాదాలు. మూలం 'సరిగ్గా' తెలుసుకోలేదు గానీ మీరు చెప్పాక తెలుసుకున్నాను. తెలిసీ తెలియని అవగాహన వల్ల వచ్చిన పాట్లే గనక మన్నించండి.

    పోతనామాత్యుడు మూలం లో విస్తారంగా ఉన్నదానిని సంక్షిప్తంగానూ, సంక్షిప్తంగా ఉన్నది విస్తారంగానూ చెప్పారన్నది కొన్నిచోట్ల చదివాను/ తెలుసుకున్నాను కానీ మూలంలో లేనికథను అల్లారన్నవిషయం తెలియదు.

    కామేశ్వర రావు గారు, గజేంద్రమోక్షం ఎన్నవ మన్వంతరం లో జరిగింది?

    ReplyDelete
  9. నాల్గవ మన్వంతరమండి. మనువు పేరు తామసుడు.

    ReplyDelete