Wednesday, January 4, 2012

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

మఱ్ఱియాకు పైన మఱులు గొల్పుచు గాలి
వ్రేలు చప్పరింతువేల ? దల్లి
గర్భమందు నీదు  గాల్జేతులాడించు
వేళ నొచ్చె నేమో వ్రేలు, గనగ



నీటిమీద దేలు నీకెట్లు దినిపింతు
బువ్వ యనుచు నడుగ నవ్వ సాగె
చీకగానె వ్రేలు  నాకలంతయు దీరె
గంగ ఊరెనేమో కాలి నుండి

అన్నమయ్య మిమ్ము నట్లేల కీర్తించె
చిలిపి ఊహ గలుగ దెలిసె నాకు
ఎంగిలయ్యెననుచు నెంచెనేమొకొ బ్రహ్మ
కడుగ సాగె పాద కమలములను

అట్టి పాదయుగ్మమర్చించుకోనిమ్ము
ముక్తి గిక్తి వలదు మోహనాంగ
నీదు పాదయుగళి నిత్యమ్ము సేవించు
వరమునిమ్ము  మార్గ శిరమునందు !!

అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
(బొమ్మలు అంతర్జాలం లో సేకరించినవి)

11 comments:

  1. మత్యాహ్లాదనకరముగఁ
    బ్రత్యక్షముగఁ దెలిసెడిని పద్యస్ఫూర్తుల్
    ప్రత్యేకముగాఁ దెలుప న
    గత్యము లేదండి మీదు కైతలతోడన్

    ReplyDelete
  2. ప్రియ సనత్, ఎంత చక్కగా రాశావయ్యా. మహా ఋషులైనా ముక్తి కావాలన్నారు, నువ్వు అది కూడ వద్దన్నావు. ధన్యూడవైనావు, నీ చక్కని ఆటవెలదులతో మమ్ముల ధన్యుల జేశావు.

    ReplyDelete
  3. చాలా ముచ్చటగా, అద్భుతంగా ఉన్నాయి మీ పద్యాలు. మీకు కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు!

    ReplyDelete
  4. మీకు కూడ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. బొమ్మలు, పద్యాలూ సరిపోయాయి, బావుంది.

    ReplyDelete
  5. ఇరంజీవి సనత్! శుభమస్తు.
    నీవు వ్రాసిన ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు పద్యాలు చూచాను.
    చక్కని హృదయమార్దవము ప్రస్ఫుటమౌతోంది.
    అభినందనలు.
    యతులు ప్రాసలు విషయంలో నీకు ఉపయోగ పడుతుందేమో చూడు.
    http://chramakrishnarao.blogspot.com/2008/10/blog-post_8652.html
    http://chramakrishnarao.blogspot.com/2008/10/blog-post_26.html
    http://chramakrishnarao.blogspot.com/2008/10/blog-post_7260.html
    http://chramakrishnarao.blogspot.com/2008/10/blog-post_24.html

    ReplyDelete
  6. అందరికీ నెనర్లు !!

    చింతావారూ !! ధన్యవాదాలు. సరిజేసిన పద్యాలను గమనించి తప్పులుంటే సూచించగలరు

    నమస్సులతో - సనత్

    ReplyDelete
  7. మొదటిపద్యం మొదటిపాదంలో తప్పితే మఱెక్కడా యతిభంగం జరగలేదండీ.

    ReplyDelete
  8. రాఘవ గారు ! యతుల గురించి నాకు సందేహం వచ్చినప్పుడు ఆఫీసులో వికీపీడియాలోని యతి లంకె ను సందర్శిస్తూంటా. అందులో ఱ కి ర కి యతి మైత్రి ఉంది అనేసరికి కరక్టేనేమోననుకున్నా..

    http://te.wikipedia.org/wiki/%E0%B0%AF%E0%B0%A4%E0%B0%BF

    చింతావారు తెలియజేసిన యతి నియమాలు కొంచం వంటపట్టించుకోవాలి మంద్బుధ్ధులం కదా కొంచం టైం పడుతుంది..

    ReplyDelete
  9. ఇక్కడ మీరనుకుంటున్నది ప్రాసయతి కాబట్టి ప్రాస నియమాలను పాటించాలి. ప్రాసలో ఒక అక్షరం సంయుక్తమైతే (ద్విత్వమైనా), అన్ని అక్షరాలూ అదే సంయుక్తాక్షరం రావాలి. ఇక్కడ రెండవ అక్షరం "ఱ్ఱి", ద్విత్వం. కాబట్టి దానికి "రి"తో ప్రాసయతి కుదరదు.
    మీ ఊహలు చాలా బాగున్నాయి, ఎప్పటిలాగే.

    ReplyDelete
  10. ఈ మధ్య అద్వైతం నుండి విశిష్టాద్వైతం వైపుకు వస్తున్నట్టున్నారు. :)

    "వటపుటమునఁ జేరి ప్రమదంబుతో కాలి" - అంటే ఎలా ఉంటుంది?

    ReplyDelete
  11. కామేశ్వర రావుగారు, రవి గారు !! ధన్యవాదాలు. సరిజేసిన పద్య పాదం గమనించగలరు

    రవీ... రవి గాననిచో కవిగాంచునన్నారు, మీరొ!! రవీ ఆపైన కవీ !! మిమ్మల్ని తప్పించుకోగలమా???

    అయినా నేనున్నానూ, రామాలయం లో రాముడూన్నాడూ, రామాలయంలొ పెట్టే చక్రపొంగలి ఉంది అని గాఠ్ఠిగా నమ్మి మూడిట్నీ అమితానందంగా ఆస్వాదించేవాణ్ణి నేను అద్వైతినెట్టా ఔతానండీ....

    పొనీ నేనులేను, రాముడొక్కడే ఉన్నాడు అని సర్దుకుపోదామనుకున్నా చూస్తూ చూస్తూ చక్రపొంగలి మిధ్య అని ఎట్టా అనుకోగలను చెప్పండి, తినేసిన తర్వాతనైతే ఓ.కే. అనుకోండి.... ;)

    ReplyDelete