సీతా వియోగాన్ని గురించి తలచుకొన్నప్పుడు, రాముడు పడ్డ ఆవేదన విన్న ఎవ్వరైనా కళ్ళు చెమర్చక తప్పదు. 13 ఏళ్ళు పరస్పరం ఒకరికి ఒకరు గా సుఖ దు:ఖాల్లో చెరి సగం పంచుకుంటున్నప్పుడు సీతా వియోగం సంభవించే సరికి రాముడు బాగా చలించిపోయాడు.
జానకి ని వెదుకుతూ చెట్లూ,పుట్టలూ, కొండలూ, కోనలూ, నదులూ, అరణ్యములూ... అన్నీ వెదికాడు. "సీతా..సీతా.." అని ఎలుగెత్తి పిలిచాడు. రాముడు భూమి నేల నాలుగు చెరగులా వెదికాడు.. ఒక్క రాముడెనా.. లక్ష్మణుడు, సమస్త వానర సైన్యం వెదికింది....
మైథిలికి మాత్రం తెలుసు, తాను ఎక్కడికి కొని రాబడినదో..అందుకే అక్కడే రాముడికై నిరీక్షిస్తూ.. రాముడినే స్మరిస్తూ ఉండి పోయింది.
రాముడు పిలిచిన ఆ పిలుపు నేల నాలుగు చెరగులా మంత్రమై నిలిచిపోయింది. 'మననాత్ త్రాయతే ఇతి మంత్ర:' కదా
ఈ కారణం చేతనే సీతాఫలం చెట్లు ఎక్కడ పడితే అక్కడ, అన్ని చోట్లా కనిపిస్తాయి. రామాఫలం మాత్రం చెట్లు బహు అరుదు గా కనిపిస్తాయి. లంక లో మాత్రమే కదా సీతా దేవి పిలిచిన పిలుపు/ స్మరణ వినబడినది...
అవనిజ పేరు బిల్చుచు నరణ్యములందు పరిభ్రమించె రా
ఘవుడు ! మహీజ మాత్రమొక చోటనె రాముని తల్చుచుండె ! నే
డవగతమయ్యె సీత ఫల వృక్షములెందుకు ఎన్ని యున్నవో
భువనము నందు ! రామ ఫల వృక్షములన్నియు వేళ్ళ లెక్కలే !!
(యతి నియమోల్లంఘనమైనందులకు క్షమించగలరు)
స్పూర్తి: లాంచీ పట్టి సీమ, పేరంటాల పల్లి లో ఆగినప్పుడు గిరిజనులు తట్టల తో అమ్మకానికి తెచ్చిన సీతాఫలం పళ్ళు చూసినప్పుడు 'తట్టిన ' అలోచన.
స...రి! ఇలాంటి చమత్కృతులవలన రామకథ ఇంకా వినసొంపుగా తయారౌతుంది. మంచి ప్రయత్నం.
ReplyDeleteధన్యవాదాలు రాఘవ గారు. మనం ఒక విషయం చదివినా, చెప్పినా, మాట్లాడినా అందులో రుచి ఏర్పడి దాని మూలానికి ఆకర్షితుడవ్వాలని మా నాన్న గారు అనేవారు. నిజంగా మీరన్నట్టు ఏ ఒక్కరికైనా అట్లా రామాయణం పట్ల మక్కువ ఏర్పడగలిగితే నా జన్మకి సార్థకత వచ్చెసినట్టె.
ReplyDeleteనేను రాసిన మిగిలిన మూడు భావాలని మీరు చదివే ఉంటారనుకుంటున్నా. (లేకపోతే దయచేసి చూడ గలరు)..అభ్యర్థన మాత్రమె సుమా ..
మీ నాన్నగారు చెప్పినది నూటికి నూఱు పాళ్లూ నిజం. ఆగండాగండి... నాకేదో ఆలోచన వచ్చింది. నా బ్లాగులో వేసుకుంటాను దాన్ని.
ReplyDeleteమీ ఇతర భావాలని చదివాను, చదివినాక నాకు అనిపించినది వ్రాసాను కూడాను.