Wednesday, February 4, 2009

రాముడు - స్ఫూర్తి -౩ - గడ్డి పోచ.

గడ్డి పోచ
~~~~~~~
రామాయణం లో గడ్డి పోచకి ఒక భూమిక ఉన్నది. కాకాసుర వధ, ఆశోక వనం ....మొదలైనవి దానికి నిదర్శనం. తరచి చూస్తే నాకు ఈ విధంగా అనిపించింది.

ఆశోక వనం లో ఉన్నప్పుడు రావణుని తో సంభాషించే ప్రతీ సారీ సీతా దేవి ఒక గడ్డి పోచని అడ్డుపెట్టుకున్నదట. దీనికి "నీవు గడ్డి పోచ తో సమానం" అని ఒకరూ, "పర పురుషునితో పతి వ్రతలు ముఖాముఖి సంభాషించరు" అని కొందరు భావం చెబుతారు. కానీ నాకు ఇంకొక అంతరార్ధం ఉందేమో అని అనిపిస్తోంది.

సాధారణంగా మనకి గ్రహణం కొద్ది సేపే అని తెలుసు. అందుకనే గ్రహణ సమయం లో మైల అంటకుండా దేవతార్చన విగ్రహాల మీద, పచ్చళ్ళ మీద, పాలు, పెరుగు మీద దర్భలు వేసి ఉంచుతాం. అపవిత్రత అంటకూడదని.
రావణుడు మహా శివ భక్తుడు. నిష్ఠా గరిష్ఠుడు. వేద వేదాంగాల్లొ నిష్ణాతుడు. కానీ ఒక్కటే దుర్లక్షణం. "పర స్త్రీ వ్యామొహం.".

సీతమ్మ వారితో మాట్లాడడానికి వచ్చిన ప్రతీ సారీ ఆవిడ "ఎంతో మంచి వాడు. ఇలా అయిపోయాడే... తెలివినీ, శక్తి సామర్ధ్యాలనూ సత్కర్మాచరణకు వినియోగించుకుని సార్థకత పొందక, బుధ్ధి కి గ్రహణం పట్టిన సమయం లో తెలియక తప్పు చేసాడు. ఈసారి పశ్చాత్తాపం తో మారిపోయి వస్తున్నట్టున్నడు. ఆ మైల అంతా వెంఠనే పోవాలి. మరింత మైల పడిపోకుండా ఉండాలి" అని దర్భ తీసుకుని సిధ్ధం గా ఉందిట - బడి నుండీ తిరిగి వచ్చే పిల్లవాడి కోసం ఫలహారం చేసి వీధి గుమ్మం లో ఎదురు చూసే తల్లి లాగ.

తప్పు దారిన పోయే పిల్లవాడు తొందరగా తన తప్పు తెలుసుకుని, మారి, తండ్రి ఆశీస్సులు పొందాలని ఎక్కువ శ్రధ్ధ తీసుకునేది తల్లే కదా...

అహిత పథమ్ములందు చను బిడ్డకు దర్భను చూపి "బుధ్ధికిన్
గ్రహణము పట్టెనేమొ ! కడు ఘోర అఘమ్ములనన్నిటిప్పుడే
రహితము చేసుకొమ్మనుచు" రావణు కివ్వదలంచె ! బాధలో
సహితము మాతృ మూర్తి సహనమ్మును జూపదే ! సర్వవిజ్జయీ !!!

6 comments:

  1. http://www.timmiri.com/2008/08/sita-tears.html

    Chalaa baavundhi your interpretation.

    So "Seeth kanneru" bomma loo Dharbha pettalannamaata.

    Nice

    Keep coming up with more

    Parimi

    ReplyDelete
  2. మీ ద్రుష్టికోణం(perception),దాని వివరణ బాగుంది.
    All the best!

    ఆదిత్య మాధవ్

    ReplyDelete
  3. ధన్యొస్మి ఆదిత్య మాధవ గారు, పరిమి గారు.. మీరిద్దరూ నాకు అశ్వినీ దేవతలు.. "ప్రపూర్వగౌ" కదా.. నా మిగిలిన రెండు భావాలూ కూడా చూసే ఉంటారని భావిస్తున్న.. (లేకపోతే చూడ గలరు..) మీ అభిప్రాయాలకై ఎదురు చూస్తున్న - సనత్ కుమార్

    ReplyDelete
  4. సిరి తా పక్కనున్నదని
    సిరులను త్యజియించి శ్రీరాముడైనాడు!
    సీతను వరియించి
    సీతకై కలవరించి సీతా రాముడైనాడు!
    వేదాలలో చెప్పిన ధర్మ
    వేద సార స్వరూపమై వేద రాముడైనాడు!
    వానప్రస్థాశ్రమ విధులు తెలిపి
    వానర మైత్రి సలిపి, వనవాస రాముడైనాడు!
    దశరధుని ముద్దుల పట్టియై
    దశముఖుని మర్దించి దశరధ రాముడైనాడు!
    శబరి ఎంగిలిపండ్ల రుచి చూసి
    శతాబ్దాలు కొలిచే శాశ్వత రాముడైనాడు!
    ఒక్క మాట ఒక్క బాణం
    ఒక్క భార్య తనవని చాటి ఏక రాముడైనాడు!
    దండకారణ్యంలో తిరిగి తిరిగి మన
    దండాలకు కోరిన వరాలిచ్చే కోదండ రాముడైనాడు!
    గోదావరి తీరాన నిలచి అందరికీ దారి చూపుతూ
    గోదా ప్రియుడైన గోవింద రాముడైనాడు!
    గిరిజనుల ప్రియ బాంధవుడై భద్ర
    గిరిపైన వెలసిన భద్రాచల రాముడైనాడు!
    మనకోసం మళ్ళీ మళ్ళీ మహాలక్ష్మిని
    మనువాడే సుందర కళ్యాణ రాముడైనాడు!
    రామ మూర్తియై రాత-గీత లలో
    రాముని స్ఫూర్తియై, సనత్కుమారుని మదిలోని ఆత్మా రాముడైనాడు!

    ReplyDelete
  5. హనుమంతుడి ని చూడ గానె, రాముడు అన్నడుట - ఇతడు వేద వేదాంగ పారంగతుడు, చందొ వ్యాకరణ నిష్ణాతుదు అని. అతని భాష, ఉచిత పద ప్రయోగము దీనికి నిదర్సనము అని.

    విరజాజి గారి స్పందన చదవగానే నాకు ఇది స్ఫురించింది.ఆశీ: పూర్వక శుభాకాంక్షలు గా తోచింది.

    విరబూసిన జాజి మల్లెల గుబాళింపు లాగ నిగూఢంగా సాధనా పరమైన జ్యోతిష్య రహస్యాలను అందించింది. రాముడిని ద్వాదశ నామలతో ఉదహరించటం వెనుక రాముడికీ, 12 కీ గల సంబంధం (రాముడు సూర్య వంశపు రాజు కావటం - ద్వాదశ ఆదిత్యులు), ద్వాదశాక్షరీ మంత్రాధిదేవత దేవత అయిన వాసుదేవుణ్ణి అన్ని రూపాలలో ఉపాసన ను చేయటానికి ప్రాతిపదిక గా 12 మంది భక్తాగ్రేసరులను ఉదహరించటం, జన్మ సాఫల్యత కు పరమావధి ఆత్మానుభూతి కనుక ఆత్మారాముడి ని 'మకుటం' లో ప్రస్తావించటం, భద్రాచల రాముడి యాత్రా ఫలం గా కలిగిన భావాన్ని ఆయనే ఆశీర్వదించాడా అన్నట్టు ఆ భద్రాచల రాముడి పేరే 'మకుటం' కావటం.. యాదృచ్చికం కాదేమో...

    ఇంతటి ఉన్నత భావాలను పాదుకొల్పిన విరజాజి గారికి మన: పూర్వక ధన్యవాదాలు.

    ReplyDelete
  6. పలికెడిది బాగవతమట
    పలికించెడి వాడు రామ భద్రుండట నే
    పలికిన భవహరమగునట
    పలికెద వేరొండు గాధ పలుకగనేలా.

    అని బమ్మెర పోతనగారు అన్నట్టు.. మీ బ్లాగులో వ్యాఖ్య రాయాలనుకున్నా ... రామునిమీద రాయాలనుకున్నా, అంతే.! రాముడే నాతో ద్వాదశ నామాలు రాయించాడు. మీ పరిశీలనకి ధన్యవాదాలు... అంతా శ్రీ రామార్పణం !

    ReplyDelete