భైరవ భట్ల కామేశ్వర రావు గారు http://www.padyam.net లో పద్యం తో కసరత్తు లో పచ్చనైన చెట్టు పద్యమయ్యె అని మొదటి సమస్య ని పూరణ కు ఇచ్చారు. ముందు ఒక పద్యం రాసా..
తేట తెనుగు గాలి తెమ్మెరలు 'గద్యాలు',
స్వాంత 'వచన' విరులు, స్వాగతింప,
సేద దీర్చి అతిథి సత్కార ములుసేయు
పచ్చనైన చెట్టు 'పద్య ' మయ్యె !!
సాహిత్య పరంగా 'గద్యం, వచనం, పద్యం ' లతో పూరణ బాగానే అనిపించింది కానీ తృప్తి కలగలేదు
రామనవమి భావాల్లో నే ఇంకా తూగుతున్నందుకో ఏమో ఆ పద్యాన్ని పూరించే ప్రయత్నం లో రామాయణ స్ఫూర్తి తో మరి రెండు భావాలు మెదిలాయి.
రామ కథల కల్ప వృక్షమ్ము నననేమి?
కాండలందు ఇక్షు ఖండ మెట్లు
అలరె? నంచు గురుడు అడుగ శిష్యుడు తెల్పె
'పచ్చనైన చెట్టు', 'పద్య మయ్యె' !!
అయినా తృప్తి చాలలేదు.
గరళ తరులు నీదు కరుణ సోకగ నెట్లు
మరలె మరల మరులు మరువలేక?
అమృత కరము నైన కర పత్రమేదయ్యె?
'పచ్చనైన చెట్టు', 'పద్య మయ్యె' !!
* గరళ తరువు = విష వృక్షం.
రామ నామ మహిమ ఎంతటిదంటే దానిని పట్టుకున్నవాడు ఎటువంటి వాడైనా వాడికి మహత్వం అబ్బాల్సిందే, రామాయణ కల్ప వృక్షాల పుస్తకాలు ఎన్ని అమ్ముడయ్యాయో విష వృక్షాలూ అన్ని అమ్ముడయ్యాయి. బాంధవమున నైన పగనైన వగనైన అన్నట్టు తిట్టుకుంటూ నైనా రామ నామాన్ని జపించాల్సిందే... తిట్టుకుంటున్నప్పుడు అక్కసు తో ఇంకొచం ఎక్కువ సార్లు అంటామేమో కూడా ... మంచో చెడో 'పట్టున్న 'విషయం లెకుండా పుస్తకాన్ని రాయడమూ వీలుకాదు, రాసినా గీసినా అది చదివేవాడూ ఉండదు. కాబట్టే 'వాణ్ణి 'పురుషుడు అన్నారేమో. దాశరధీ శతకం లో చెప్పినట్టు చెప్పాలంటే... "మ్రొక్కిన నీకె మ్రొక్క వలె, మోక్ష మొసంగిన నీవె ఈవలెన్ తక్కిన మాటలేమిటికి?" ఇప్పటి కాలానికి అనుగుణం గా చెప్పుకోవాలి అంటే మేనరిజమ్సు ఏ రజనీకాంత్ కో రామారావుకో పెడితే జనాలు నీరాజనాలు పడతారు కానీ సైడు కారెక్టరులకి పెట్టరూ, పెట్టినా అవి అంతగా పండవు. ఒక 'బిల్లా ' కావాలన్న, ఒక 'లవకుశ 'కావాలన్న.. సరైన హీరో కావాలి
మళ్ళీ అసలు విషయానికి వచ్చేస్తే, అందుకేనేమో విశ్వనాథ సత్యనారాయణ గారిని వాళ్ళ నాన్నగారు "రాస్తే గీస్తే రామాయణం రాస్తే అర్ధం పరమార్ధం గానీ కవిత్వాలు ఎన్ని రాస్తే మాత్రం ఏముందీ రా " అన్నారుట. రామాయణం ఒక నవల/ పుక్కిట పురాణం అనుకున్నా, ఆ పాత్రలూ, దానిని మలచిన విధానం... దాన్లోని కథ, అప్పటి నుండీ ఇప్పటి దాకా అలా చెప్పుకుంటూ వచ్చేలా ఊరించ గలుగుతోంది అంటే దాన్లో 'ఏదో 'ఉంది. వెతుక్కున్న వారికి వెతుక్కున్నంత. ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు. ఒక కథ అందరికీ నచ్చాలనీ లేదు. అందుకే ఇంతక ముందు ఎందరో రాసిన రామాయణాన్నే మీరూ ఎందుకు రాస్తున్నారు అని అడిగితే విశ్వనాథ వారు ' ఏ జీవ లక్షణానికి సరిపోయింది ఆ జీవ లక్షణం ఉన్నవాడు చదువుకుంటాడు. ఇంతక ముందు ఎందరో తిన్న, నా ఆకలి నాది, నా రుచి నాది, నా తృప్తి నాది అన్నారు ట (నేను విన్నదె కానీ నిజమో, కాదో నాకు తెలీదు అనుకోండి). అప్పుడు రాశారుట రామాయణ కల్పవృక్షం కావ్యాన్ని. అమోఘమైన రచన. నేను చాలా కొంచమే చదివాను కానీ చదువుతున్నంతలో ఎదో తెలియని మత్తు. సాహిత్యాన్ని, దాన్లోని రసాస్వాదన నిపూర్తి గా అర్ధం చేసుకోలేదు కూడా.
అయినా రాముడన్నా విశ్వనాథ అన్నా ఎంతో ఇష్టం కాబట్టి ఇద్దరినీ స్మరించుకుందామని ఈ టపా రాస్తున్నా..
నా రుచి నాది, నా తృప్తి నాది .
గమనిక. మీ భావాలు అందుకు విరుధ్ధం గా ఉంటే అది మీ వ్యక్తి గత స్వేచ్చ. నా భావాలే సరైనవని నేను అనటం లేదు. మీరు అనదలచుకుంటే ఇక్కడ మాత్రం దయచేసి మీ అక్కసు వ్యక్త పరచకండి. మీ మీ బ్లాగుల లో యధేచ్చ గా వ్వ్యక్త పరచుకోండి.
ఈ మాత్రం సహకరించండి.
బావుంది.
ReplyDeleteమీరు ప్రస్తావించిన విశ్వనాథవారి పద్యాలు ఇవి:
వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితివంచనిపించుకో వృథా
యాసముగాక కట్టుకథ లైహికమా పరమా యటంచు దా
జేసిన తండ్రి యానతియు జీవునివేదన రెండు నేకమై
నా సకలోహవైభవ సనాథము నాథుకథన్ రచించెదన్
మరల నిదేల రామాయణంబన్నచో
ఈ ప్రపంచకమెల్ల యిన్నినాళ్ళు
తినుచున్న యన్నమే తినుచున్నదిన్నాళ్ళు
తన రుచి బ్రతుకులు తనవి గాన
చేసిన సంసారమే సేయుచున్నది
తనదైన యనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెద నేనును
నా భక్తి రచనలు నావి గాన
కవి ప్రతిభలోన నుండును కావ్య గత శ
తాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్విపశ్చిన్మతమ్మున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి
కామేశ్వర రావు గారు !! మంచి పద్యాన్ని గుర్తుకు తెచ్చారు. అద్భుతం!!
ReplyDeleteమీకు నా ధన్యవాదాలు.
చాలా బావున్నాయండి మీ పద్యాలు, భావస్పందనలు. కొనసాగించండి.
ReplyDeleteతలచిన రామునే తలచెద నేనును నా భక్తి రచనలు నావి గాన :)
ReplyDelete