Sunday, April 5, 2009

రాముడూ - స్ఫూర్తి -7- రాళ్ళు.

అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !!
పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం.

మోహనమైన రూపు నవమోహనమై ప్రసరించు చూపు స
మ్మోహనమైన భాషణము మోదము కూర్చు ప్రవర్తనమ్ము మ
న్మోహనమైన రీతి నగు మోమున గన్పడు రాముడా జగ
న్మోహను డెల్లకాలముల మోక్ష పథమ్మున నిల్పు గావుతన్ !!

ఆఫీసు హడావుడి తో రాముడూ స్ఫూర్తీ పై గత కొద్ది రోజుల గా రాయలేకపోయా. రాముడి దయవల్ల రెండ్రోజులు రామ నవమి చేసుకోవటం తో కొంచం సమయమూ, అనందమూ, ఉత్సాహమూ కలిసి వచ్చి మళ్ళీ ఇంకొక టపా రాస్తున్నా.

ఇక రాబోయే 4-5 టపాలూ రాముడూ - Thanks Giving పైనే ఉంటాయి. రాముడూ - స్ఫూర్తి- రాళ్ళూ, రాముడూ -స్ఫూర్తి- జల చరాలూ, రాముడూ -స్ఫూర్తి- పళ్ళూ, |మొ|

ముందు గా రాముడూ - స్ఫూర్తి- రాళ్ళూ

రాముడు తనకి సహాయ పడ్డ వారందరికీ కృతజ్ఞతా భావంతో ఆశీ:పూర్వకంగా వరాలను అనుగ్రహించాడు ట. అప్పుడే ఆ వరుసలో ఆఖరున ఉడుత ఉన్నదనీ దానిని ఏవిధం గా అనుగ్రహించాడో ఇక్కడ మనం చదువుకున్నాం.....

ఉడుత గుర్తుకురాగానే వారధీ నిర్మాణం మదిలో మెదిలిందిట రాముడికి. వారధీ నిర్మాణం లో ముఖ్య భూమిక వహించిన వారిని అందరినీ మనసులో తలచుకున్నాడుట. రాముడు ధర్మ స్వరూపుడు కదా... ఆయనకు అందరూ ఒక్కటే.అందుకే నర వానరులను ఎటువంటి భేధాభిప్రాయం లేకుండా సమానం గా చూచాడు. స్మృతి పథం లో మెదలిన కొందరు ప్రత్యేకమైన వారిని పలకరించటానికి తానే వారి వద్దకు చేరుకున్నాట్ట.

వారెవరో కారు... మన రాళ్ళు. వారధి వద్దకు చేరుకుని అడిగాడట రాళ్ళను. నీటి పై తేలియుండడమే కాక అశేష వానర సేననూ సముద్రం దాటించటానికి మీరు చేసిన సహాయం అమేయం. రామ నామ మహిమ ను చాటిన మీ భక్తి ప్రపత్తులు అమోఘం. మీకు ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడుట.

అచేతనములూ, ప్రాణ రహితములూ అనుకునే రాళ్ళ లో కూడా మనసుంటుందని భావించి రాముడు వారి మనోగతాన్ని అవలోకనం చేసుకోడానికి కళ్ళు మూసుకున్నాట్ట. నువ్వు సముద్రుడిని దారి ఇవ్వమని కోరుతూ మూడు రోజులు దీక్ష చేపట్టినప్పుడు మాత్రం మేమందరం ఎంత మనోవేదన అనుభవించామో తెలుసా.. నీ సేవ చేసే అవకాశం దొరికే ఒకే ఒక్క అదృష్టమూ చేజారిపోవలసిందేనా..అని. నీ సేవ చేయగలుగుతామో లేదో అన్న భారం తో బరువెక్కిన మా తనువులు నీ నామాన్ని ధరించే అవకాశం రావటం తో తృప్తి తో తేలికైపొయాయి... ఇది చాలు అన్నాయిట. అయితే వారిలొ చిన్ని గులక రాళ్ళు మాత్రం రాముడి వంక బుంగమూతి తో చూస్తున్నాయిట. బుంగమూతి ఎందుకుట అంటే బంధుత్వం కలుపుతున్నయిట (చిలిపి గా). పోనీ మీరు చెప్పండి అన్నాడుట రాముడు. అందరూ మనసు బండరాయి ని చేసుకుని అని వాడుతూంటారు. ఏం? బండరాయికి మాత్రం మనసుండదా..?అందరూ అసలు అలా ఎందుకు అనాలి అన్నాయిట. తేనెలొలికే పూల బాలలకు మూణ్ణాళ్ళ ఆయువువెందుకిచ్చావో నీకే ఎరుక. కాకపోతే బండరాలను చిరాయువులు గా ఎందుకు దీవించావు? చెప్పు - మా జన్మ కి సార్ధకత ఎలా? అని అడిగాయిట.

అప్పుడు అన్నాట్ట రాముడు మీ హృదయాన్ని ఆవిష్కరిస్తే అవి చాటి చెప్పే సత్యాలు, ధర్మాలూ శాశ్వతం గా నిలిచి ఉంటాయి. శిల శిల్పం అయినప్పుడు మాత్రమే చిరాయువుగా నిలిచినందుకు సార్ధకత అన్నాడుట. అప్పటి నుండీ శిలలు శిల్పాలై, విగ్రహాలై ఆలయ ప్రాకారాల్లో భగవన్మహిమ ను చాటుతూ చిరస్థాయి గా నిలిచాయిట.

చం:
తడవగ రాళ్ళు నీదు 'మరదళ్ళు'ను కాదొకొ - 'బావ' కావొకో !
పుడమిజ తోడబుట్టువుల పూజలు నోములు నీవెరుంగవో !
(జడములచేతనమ్ములని జాగొనరింపగ నెంచుచుంటివో !)
అడుగిడి జన్మ సార్ధకత నందునటుల్ శిల శిల్పమౌనటుల్
కడపటి కోర్కె తీర్చగదె ! కావగ రాగదె ! బ్రోవ రాగదే !!

స్ఫూర్తి !!
మా అమ్మగారు భద్రాచలం లో పసుపు రాయి, కుంకం రాయి, నార చీరలూ చూడడానికి అతి కష్టం మీద నడుస్తూ ఎంత అదృష్టమో కదా, రాముడు నడచిన రాళ్ళను చూస్తేనే ఇంత సంతోషం గా ఉందే, ఇక ఆయన నడిచినప్పుడు ఇవెంత ఆనందించి ఉంటాయో కదా అని అన్నప్పుడు కలిగిన భావన. రామార్పణం.

9 comments:

  1. చాలా రోజుల నుండి మీ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నా, చరిత్ర అనే నా పాత స్నేహితుడిని కలుసుకున్నట్లుంది.

    ReplyDelete
  2. ఇన్ని రోజులూ ఏమైపోయారండీ!
    ఎప్పటిలానే మీ ఊహకి జోహారులు. "రాయినైనా కాకపోతిని రామునికి బావవ్వగా" అని పాడుకోవలన్న మాటిప్పుడు :-)
    యతిలు కూడా చక్కగా అతుకుతున్నాయి పద్యాలలో. "అడుగిడి జన్మ సార్థకత నందునటుల్" అంటే అక్కడున్న చిన్న నెరుసుకూడా తొలగిపోతుంది.
    "పుడమిజ" ప్రయోగం వ్యాకరణ విరుద్ధమనుకుంటా. అయినా వినడానికి బాగానే ఉంది, అక్కడ చక్కగా సరిపోయింది.

    ReplyDelete
  3. ఱాళ్లు మరదళ్లూ, శ్రీరాముడు బావ! అమ్మో ఎలా వచ్చిందండీ ఈ ఆలోచన?

    నాకు ఎందుకో
    మామను సంహరించి యొక మామకు గర్వమడంచి యన్నిశా
    మామను రాజుజేసి యొక మామ తనూజున కాత్మబంధువై
    మామకుఁ గన్నులిచ్చి సుతు మన్మథు పత్నికిఁ దానె మామయై
    మామకు మామయైన పరమాత్ముడు మాకుఁ బ్రసన్నుడయ్యెడిన్
    అన్న పద్యం గురుతొచ్చింది. బావుంది. :)

    ReplyDelete
  4. రెండో పాదం చివర మన్ను, మూడోపాదం చివర గన్నూ చూసీ ఇదేదో భస్మాసురహస్తపు రాజకీయాల గురుంచి అనుకొని వెనుదిరగబోయాను.. కాదన్నమాట..
    అయ్యా,, మీ టపాలు నేరుగా వచ్చి మా తపాలాపెట్టెలో పడే అవకాసం ఏదైనా ఉందా?

    ReplyDelete
  5. మనోహర్ గారూ - ధన్యవాదాలు. నా టపా కోసం ఎదురుచూస్తున్నారంటే నాకొక అందమైన భావం మెదిలింది. అది ఇంకొక టపాలో రాస్తా..

    కామేశ్వర రావు మాస్టారూ !! మీ ఆప్యాయతకి నమస్సులు. మీ వద్ద దాచేదేముంది? కొంతమంది ఆటలు చూస్తూ, కొంతమంది సినిమాల్లో పడి వళ్ళూ పై తెలియకుండా ఉండిపోతూంటారు కదా.. అల్లానే నాకు తెలుగు పద్యాల వ్యాహ్యాళి ఒక వ్యసనమైపోయి (కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు కదా) ఏ కొద్ది సమయం దొరికినా అంతర్జాలం లోనో, అందివచ్చిన పుస్తకాల్లోనో ఎదో ఒకటి వినటమో చదవటమో లాగా అయిపోయింది.

    ఉదా. చాగంటి కోటేశ్వర రావు గారి రామాయణ ప్రవచనాలు, బోయి భీమన్న గారి 'అశోకవని లో రాముడు 'అనే పద్య కావ్యం, తెలుగు పద్యాల మీద మీ యాహూ గ్రూపులలో అన్ని పోస్టులూ చదువుకోవటం...

    చిన సందేహం. అవని జ, పుడమీజ ఒక్కటి గా తీసుకోకూడదా?
    నిజం చెప్పాలంటే 'పుడమిజ ' అన్న పద ప్రయోగం అశొకవని లో రాముడు నుంచే తస్కరించా. యతి విషయం లో 'అ ' కి 'య ' మైత్రి కుదిరింది కదా అనుకున్న కానీ అచ్చుల్లో కలవలేదు అని మీరు రాసిన తరువాత గమనించా. ధన్యోస్మి.

    ఇంతకీ పుత్రోత్సాహము అన్నట్టు మాకు మాత్రం మీరు మా పద్యాలు ఎలా ఉన్నాయో చెబితే తప్ప ఎందుకో మృష్టాన్న భోజనం తిన్నా ఎడో తక్కువైపోయినట్టే ఉంటుంది. (మరీ ఎక్కువ గా భారం వెశెస్తున్నం అని తెలిసినా..) నిజం చెబుతున్నా.. రాముడి తలుచుకుంటునప్పుడు అత్యంత అలవోకగా, యతి ప్రాసల ఊహ కూడా లేకుండానే ఆసువుగా వచ్చెసిన మొట్ట మొదటి పద్యం మోహనమైన రూపు అన్న పద్యం. దాని పై మీ అమూల్యమైన అభిప్రాయం?

    ReplyDelete
  6. రాఘవ గారూ ! ధన్య వాదాలు. 'అహల్య 'అనే పద్య కావ్యం లో భూమాత తన కూతురికి కష్టం కలిగించాడు అన్న అక్కసు తో అల్లుడనైనా చూడకుండా రాముడి పాదాలు కంది పొయే లాగా సూర్యుడి ప్రతాపం రాముడి మీద చూపిస్తొంది. ఆవిడంటే అర్ధముంది, కానీ సూర్య వంశంలో పుట్టి సూర్యుణ్ణి ఆరాధించే రాముడి కి సూర్యుడు అంత పని చేస్తాడా? అని రచయిత వాపోయారు. మనసు చివుక్కు మంది. అంత కన్న వేరే భావం ఉండి ఉండదా అనిపించింది. బంధుత్వం వస్తే అత్తగారు మాత్రమె ఉంటారా, బావలూ మరదళ్ళూ ఉండరా..ఏం... ఒకవేళ ఉంటే వాళ్ళ మధ్య చిలిపి సంభాషణలు ఉండి ఉండవా? అసలే జగన్మోహనుడయ్యె, సుందరాంగుడైన బావంటే ఏ మరదలు మాత్రం మాట్లాడకుండా బుంగమూతి పెట్టుకుని కూర్చో గలదు? ఆయనకి ఒక్కటే భార్య అన్న నియమం ఉంది కానీ ఆయన్ని చూసిన ఋషులకూ, మునులకే మోహం తప్పలేదు కదా. ఆ చనువు తో, బంధుత్వం అడ్డు వస్తే కనీసం మా భక్తి నైనా చూడచ్చు కదా అని అడిగాయిట. అదీ ఆంతర్యం.

    ReplyDelete
  7. ఊకదంపుడు గారూ, మంచి మాట చెప్పి పొంచి ఉన్న ఉపద్రవాన్ని సూచించారు. మీకు నా ధన్యవాదాలు. ఇప్పుడే మార్చేసా.

    నేను బ్లాగ్లోకం లో మూణ్ణళ్ళ బాలుణ్ణి. రాఘవ గారు టపాలను నేరుగా తపాలా పెట్టె లో కి సాధించుకునే మార్గం ఒడిసి పట్టారని ఆనోటా ఈ నోటా విన్నాం. పబ్లిగ్గా అది చెప్పకపోవచ్చేమో, అయినాసరె అతన్ని అడిగి ప్రయత్నిద్దాం..RSS Feed dwaaraa అది సాధ్యం అనుకుంట.

    నేను ఊక దంపుడు దంపుతున్నా అనుకోకపోతే పనిలో పని గా రాముడి మీద నేను రాసుకున్న మిగిలిన టపాలను కూడా ఒక్క సారి చూడరాదూ ! please??

    ReplyDelete
  8. అన్నీ చదివానండీ, మనుషులను వస్తువులుగా , వ్యాపార వస్తువులుగా చూస్తున్న ఈ కాలం లో వస్తువుల మనసుల్లోకి తొంగి చూడటం మీకే చెల్లు.

    ReplyDelete
  9. ధన్యవాదాలు ఊకదంపుడు గారూ !!

    ReplyDelete