Monday, March 22, 2010

అశోకవని లో రాముడు - 2

అశోకవనంలో రాముడు మొదటి భాగం ఇక్కడ చదవచ్చు






రాతిని నాతి జేసిన పరాత్పరుడాతడు ; తత్పదాంకితో
ర్వీ తలి బీటి దేని చిగురించును పుష్ప ఫలాభిరామమై;
చేతము రామ పాద సరసీ పరిశొషిత నిత్యనూతనో
న్నూతనమై రహించు సుమనో విభవమ్మునకేది సాటియౌ !

రాముని పాదధూళి నొక రాయెదొ తోయలి యైనదంట , ఏ
లా మనవౌ అదృష్ట గతులన్ సరిచూచుకొనంగ రాదు? పో
దామని యాత్ర సాగెడునొ తచ్చరణాధ్వము వెంట-- మన్గడన్
బాములు వడ్డ జీవులిరు ప్రక్కల మూగెడు రాలు రప్పలై !

రాముడు పోవు త్రోవ కిరు ప్రక్కల నట్టిటు దూకుచున్న త
ధ్ధూమ శలాక లా చరణ ధూళికి ప్రాణము గొన్న రాళ్ళొ? ఆ
రామము గాచు వాళ్ళు ! రఘు రాముని తద్వని గాంచి భ్రాంత చి
ద్భూమిక లైన వాళ్ళు ! ఎటు తోచక చీకటి మున్గు వాళ్ళునున్ !

మిణికెడు తోట నెల్లడల - మిణ్గురులా ? ఉడు కాంతి తున్కలా?
దినమణి నుండి వేర్వడిన ధీధితి రవ్వల? అంధకార కం
ధిని వెలుగొందు రత్నముల? నెమ్మదిగా నిలువెల్ల కన్నులై
వనరమ రాము జూచు రుచి వైఖరులా? అవి సీత చూపులా?

అదె పులి యన్న, తోక అదె అందురు లోకులు ; లోక నైజ మ
ట్టిద యగు; వింధ్య కీవలి తటిన్ వనభూముల యందు రాజ్య సం
పద నెసలారు ప్రాఙ్నరుల వానరులందురు ; నామ సామ్యపుం
బదమును బట్టి పల్కుదురు వానరు మర్కటుడంచు నేరమిన్ !

సీతయు లక్ష్మణుండు తన జీవిత దృష్టికి రెండు కళ్ళు; తత్
సీతకు ప్రాణమిచ్చి, రణ సీమను కూలిన లక్ష్మణున్ పున
శ్చేతను జేసి -- అంధ తమసీ పరిశూన్యము నుండి ఎవ్వర
బ్బా, తన నుధ్ధరించ గల బంధువు వాయు సుతుండు తక్కినన్ ?

మావులు పూచె, నల్దిశల మంచు తెరల్ విరబారె, సంపేగల్
తావులు చల్లె, బర్హితతి తాండవమాడె, నగెన్ శరత్కళల్ --
భావము జానకీ వదన పద్మము చుట్టు పరిభ్రమించి శో
కావిలుడైన రాముని పదాబ్జము చుట్టు పరిభ్రమించుచున్ !

సుందర సుందర ప్రణవ సుందర సుందర సౌమ్య సౌహృదా
నంద రతీందిరుండు రఘు నందనుడా విపినేందిరా మనో
మందర సైందవ ప్రణయ మందిరుడై ఎటబో నటన్ నవేం
దిందిర బృందమై పరుగు దెంచు స్మృతుల్ క్షితిజా గత శ్రుతుల్ !

పుట్టిన దాది (ఎట్టులుగ పుట్టెనొ!) అట్టులె ఆరు వర్షముల్
మట్టిన ఉండి (ప్రాణమెటులాడెనొ!) ఆరు రసాలకున్ తనే
పుట్టిన ఇల్లుగా (తదను పూర్వము పృథ్వి రసార్ద్ర కాదొ !) చె
న్నుట్టి పడంగ సీత వెలయున్ జనధాత్రి కి అన్నధాత్రి యై !

కోమలమౌచు, సిత జడ కుచ్చులు గా అభిదన్ ధరించి, సౌ
దామని దారలట్లు వనధాత్రి ని నిండిన తీగలేమి? భృం
గామల కాళి దువ్వినపుడా కొనగోళ్ళకు చిక్కుకున్న తత్
భూమిజ కేశ లేశములు పో? రసకందము, లాత్మ విందముల్ !

తెల తెల వారు జాముల క్షితీ సుత తానె ఉషః కుమారి నాన్
అలరుల తోటలన్ దిరుగు నప్పుడు, కొమ్మల జిక్కు నామె వ
ల్కలముల వల్కముల్ మన్సు గైకొనినట్టివి సీత కోక చి
ల్కలు ! మధు ముగ్ధ మోహనములై విహరించును వన్నె చిన్నెలన్ !

జనకుడదేలొ సర్వమును సర్వుల నుండియు దాచి, గప్పు చ
ప్పున యువరాజు జేయ దల పోసెను ! కాని, రహస్య మెట్లు దా
గును, అది గాక, తా నయిన కోరెనె రాజ్యము? కొంప మున్గెనే?
తనయుల నైజముల్ కనరు తండ్రులు, కుందుదురర్ధలోభులై !

పాదములందు వ్రాలి , పర పాదుకలన్ గొనిపోయి, రాజ్య ల
క్ష్మీ దరహాస ముగ్ధముల జేసిన మానవుడొక్కడుండెనే?
మేదిని నెవ్వడేన్ పదవి మీద గలట్టి తమిన్ త్యజించెనే?
సోదర మాత్రుడే? సుగుణ సూర్యుడు పో భరతుండు చూడగన్ !

(మిగిలిన చుక్క గుర్తు పద్యాలు రామనవమి రోజున...)

1975 లో జన్మించిన నాకు మిగిలిన ఒక్కగానొక్క సంవత్సరంలో విశ్వనాథ వారు ఆశిస్సుల నందించారు, దానికి భీమన్న గారు పరోక్షం గా కారణం అయ్యి ఆయన కూడా ఆశీర్వదించారు... అన్న నా ప్రశ్న కు సమాధానం....

ఇదిగో ఈ పుస్తకమే...

1972 వ సంవత్సరం లో

భీమన్నగారి షష్టి పూర్తి సన్మాన సందర్భం లో సన్మాన సంఘం వారు సభనేర్పటు జేసి ఈ పుస్తాకాన్ని ప్రచురించిన సందర్భం లో, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారికి భక్తి తో తన కావ్య కన్యకలను భీమన్న గారు సమర్పించారుట.

ఆచార్య జి.వీ. సుబ్రహ్మణ్యం గారూ, మా నాన్నగారు, నేను పుట్టిన సంవత్సరం (1975) లో విశ్వనాథ వారింటికి వెళ్లగా, ఆయన అలమార లోనుండీ ఈ పుస్తకాలను తీసి నాన్న గారికి అందించారుట. ఎందుకో ...భగవంతునికి ఎరుక.

మానాన్న గారు నాకు ఈ మాటలను చెప్పి, భీమన్న గారి దస్తూరి ని చూపించటం లీలగా గుర్తు. ఆ ఇద్దరు మహానుభావుల ఆశిస్సుల సాక్షిగా మా ఇంట ఆ పుస్తాకాలు పూజ్య స్థానమలంకరించినవి.

సనత్

No comments:

Post a Comment