బోయి భీమన్నగారు ఓ రకంగా నాకు ఏకలవ్య గురువుగారు. ఇంకోరకంగా చెప్పాలంటే విశ్వనాథ సత్యనారాయణ గారి ఆశిస్సులను నాకు ప్రత్యక్షం ఇప్పించటానికి పరోక్షం గా కారణమైన వారు.
ఏకలవ్య గురువుగారు అని ఎందుకు అన్నానంటే నా ప్రమేయం లేకుండానే నాలోనికి చొరబడి నన్ను ప్రభావితం చేసేశారు కాబట్టి (బహుశా నా ఊహేనేమో) కాకపోతే ఇది అర్ధమవ్వాలంటే కొంచం ఉపోద్ఘాతం కావాలి...(చిన్నదే).
నా జీవితంలో అప్పుడప్పుడుగా వచ్చి దోసిళ్ళతో పట్టి రామ రసాన్ని తాగించిన మహానుభావులెందరో ఉన్నారు. పుణ్యవశం చేతనో, ప్రేమ చేతనో గానీ నాకు ఇట్లాంటి మత్తునలవాటు చేసినవాళ్ళందరూ నాకు ప్రాతస్మరణియులే. శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు, శ్రీభాష్యం అప్పలాచార్యులవారు, మా తాతగారైన శ్రీపతి శ్రీధర స్వామి గారు, మా నాన్నగారైన శ్రీ రఘు రామ కుమార్ గారు, మంగళంపల్లి, నూకల, జేసుదాసు, మల్లాది సోదరులూ .. వీళ్ళందరూ ప్రత్యక్షం గానైతే పరోక్షం గా చేసినవాళ్ళల్లో హనుమంతుల వారు, త్యాగరాజు, రామదాసు, విశ్వనాథ సత్యనారాయణ గారు, ఎమ్మెస్ రామారావు గారు |మొ| ..
ఈ కోవకే చెందిన వారు శ్రీ.బోయి భీమన్న.
బోయి భీమన్నగారి గురించి కొత్తగా పరిచయం చేయనవసరంలేదు... కాకపోతే నాకూ, బోయి భీమన్నకూ, విశ్వనాథ సత్యనారయణ గారికీ గల లింకేమిటి? అదే ఇక్కడ హాట్టాపిక్కు...సస్పెన్సూ....ఏమయ్యుంటుందో మీరు గానీ ఏమైనా ఊహించగలరా???
బోయి భీమన్న నాకు ఏకలవ్య గురువుగారు అని ఎందుకు అన్నాను?? ఆయన్ను చదివిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా??
ఈలోపు "అశోక వనిలో రాముడు " కావ్యం లోనుంచీ మంచి పద్యాలు..
ముందుగా కావ్య భావన.. రావణ వధానంతరం ఆ రాత్రి రాముడు ఎవరికీ తెలియ కుండా ఒంటరిగా బైల్దేరి అశొకవనానికి వెళ్తాడు. తాను అంతగా ప్రేమించిన తన అర్ధాంగి సీత అంత కాలం పాటు లంకలో చెర అనుభవించిన అశోకవనాన్ని చూడాలని అనుకొని ఉంటాడనీ, అక్కద రకరకాల భావనలతో, బాధలతో సతమతమై, కన్నీరు కారుస్తాడనీ.. కావ్య నిర్మాణం....
రాముడు మాట్లాడకుండా తోటలో తిరుగుతున్నప్పుడు అనేక భావాలు సూర్యుడి నుండీ కిరణాల్లా మనసు నుండీ ప్రసరిస్తాయి... ఆ ప్రసారం లో రాముడి ఔన్నత్యం, ధీరోదాత్తత , మానవ లక్షణం, కార్య కారణ సంబంధం, సమాజ శ్రేయస్సు, సోషలిజం మొదలైనవనీ ప్రస్ఫుటం గా కనిపిస్తాయి.
నాదృష్టిలో రాముణ్ణి, వాడి వ్యక్తిత్వాన్ని సాపేక్షికంగా అద్దం లో చూపించినట్టు చూపిస్తుందీ కావ్యం, అందుకే నాదృష్టి లో ఈ నాటి కాలనికి రామ భక్తుడు బోయి భీమన్న.
"అశోక వనిలో రాముడు " కావ్యంలో .. నాకు నచ్చినవి, కొన్ని..
గుస గుస లాడసాగినవి కొండల గుండెలు తట్టి నిర్ఝరుల్ ;
రుస రుస లాడసాగినవి రోదసిపై ఘన హైమనీ లతల్ ;
వస వస లాడసాగినవి వన్య విహంగములర్ధ నిద్ర; సా
రస రస ధాముడా విజయ రాముడు తద్వని నట్లు సాగగన్ !
ఎక్కడివాడొ! ఏమి కధొ ! ఏ సతి కన్నదొ ! ఏల వచ్చెనో
ఇక్కడి కిప్డు ! సూర్యుడుదయించును రోజును; కాని, ఇంతగా
చక్కని వాడు చిక్కడెదొ సౌహృదముండిన దప్ప; ఇప్పుడే
మ్రొక్కెద మంచు రాము పదముల్ స్పృశియించె వనిన్ తృణాదులున్ !
రక్కసి చెట్లు రాము గని రంగులు మారె ! విభీషణమ్ములై
మ్రొక్కె మహాగమమ్ము లల మూడు జగమ్ములకేక రూపతన్;
అక్కున జేరె శ్రీలతలు ఆమని సంపదలెల్ల తామె యై ;
చొక్కె మధువ్రతాలు; వని సోభిలె రామ పదాభిరామమై ;
శివు విలు నుండబద్దవలె చేకొని, వింటికి తానె అల్లె త్రా
డవునన నిల్చి, ఆడుకొనదా జనకాత్మజ చిన్ననాడు? తత్
జవమెటు బోయె? నీ కొరకు తాళినదంతయు ! ఒక్క మట్టి పె
ల్ల విసిరి ఆమె లిప్త కొక లక్ష దశాస్యము లూడగొట్తదే?
శ్రీమదనంత మోదమున సీతను చూచిన కంట నేడు శ్రీ
రాముని జూచి, అందెవరి రాగము గొప్పదొ తేల్చుకోన్ వన
స్వామి తొ బాహు యుధ్ధముకు పాల్పడి, తేలక గ్రుద్దు కొందురో
తామె యనంగ చిక్కువడి; తద్వన వల్లులు రామునడ్డెడున్ !
తమపని తాము చూచుకొను దైత్యుల మీదన? కాదు, దైత్య త
త్వము పయి దాడి; దేహమును దాల్చిన యెల్లరు జీవితార్హులే;
తమ తెగ మాత్రమే బ్రతికి తక్కిన వారలు చత్త్రు గాక యన్
కుమతులు కూలరా? పుడమి కూతురు దుర్నయముల్ సహించునా?
శివధనువెత్తి ఎక్కిడుటె సీతను పొందుట; ముక్కలయ్యె కా
ల వశముచేత నద్ది; ఎవరందుకు బాధ్యులు? అంతదానికే
నవయువ దంపతీ ప్రణయ నాదము త్రెంచెడునే అపశృతిన్?
ఏవడది? బ్రహ్మ యన్న యతడెవ్వడు ? ఎవ్వడు ధర్మపీఠిపై ?
అనల శిఖా లతాగ్ర కమలామృత బిందు కళా ప్రపూర్ణుడై
తనువును గొన్నదాది -- సరదాకును పాపము చేయలేదు; స
జ్జన ముని మిత్ర కోటి కెదొ సాయము చేయ దలంచి తప్ప తా
ధనువును ముట్టలేదు; వల దా ఒక హేతువు ఎట్టి శిక్షకున్ ?
మనుజుడు తానుకూడ ; తన మార్గము నందును పూలు ముళ్ళు క
ల్గును ; తన చేతలందు నెవొ లోపము లుండును; కాని -- అక్రమ
మ్మొనరిచె నన్న దొక్కటియు నుండదు రామ చరిత్ర లోన; స
ర్వ నరుల నొక్క సూత్రమున రాముని హస్తము కుస్తరించెడున్ !
వాలి వధా విధాన మప వాదును తెచ్చునొ? మిత్ర కార్య దీ
క్షాళువు తాను; మిత్రునికి శత్రువు వాలి, తదన్య వన్య యో
ధాళితొ పేచిలేదు, బహి రంగరణమ్మెటు చేయు? ధర్మ సూ
క్ష్మాల నెరింగినట్టి ముని సత్తములుండరె నిర్ణయించగన్?
స్త్రీ నొకదాని జంపె; ఎవరేనియు దుష్టులు వధ్యులే; సుమో
ద్యానము నుండి కంటక లతల్ లతలైనను వర్జ్యములే కదా?
మానినులైన కామినుల మన్నన జేయడె? తానహల్యకున్
ప్రాణము పోయడే? శబరి భక్తిని గ్రోలడె? భేదమెంచెనే?
బంగరు లేడి గాంచి తన భామిని తెమ్మనుటేల? వంటకా?
చెంగున నేదొ అస్త్రమున చేకొన, కేటికి చావనేసె? దా
త్రిన్ గల ఏరికిన్ క్రియల తీరులు కర్మలు బట్టి కాదె? సా
రంగమె అద్ది? భావి రణ రంగమొ? కాలపుటంతరంగమో!
శివుని ధనుస్సు నెక్కిడుట, సేతువు కట్టుట, పంక్తి కంధరా
ద్యవమతులన్ హరించుట, మహాటవులన్ వ్యధలోర్చు, టయ్య వి
య్యవి యననేల -- రామ చరితాద్భుత కాండములెల్ల సీతవే!
అవనిజ చుట్టు అల్లుకొనినట్టివి గాధలు, వన్య వీధులున్ !
భూసుత ఒక్కనాడు, వన భోజన కేళి, స్వ హస్త పాకమున్
భాసుర లీల వడ్డన మొనర్చి, తదార్ద్ర సుగంధ హస్తమున్
బాసట నున్న భూరుహము పై నిడి నిల్వ ,తదీయ గంధమో
వీసము సోకి కాదె కరివేపగ అయ్యది నిల్చె నేటికిన్!
( మరికొన్ని తొందర్లో విడుదల.. )
పైన అడిగిన ప్రశ్నే మళ్ళీ...
నాకూ, బోయి భీమన్నకూ, విశ్వనాథ సత్యనారయణ గారికీ గల ప్రత్యక్ష - పరోక్ష లింకేమిటి? ....ఏమయ్యుంటుందో మీరు గానీ ఏమైనా ఊహించగలరా???
బోయి భీమన్న నాకు ఏకలవ్య గురువుగారు అని ఎందుకు అన్నాను?? ఆయన్ను చదివిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా ??
భళా! రామనవమి పానకం లా ఉందండీ పద్య ధార.
ReplyDeleteనిజమే చాలా బాగున్నాయి పద్యాలు.
ReplyDeleteరవి గారూ, మందాకిని గారూ !!
ReplyDeleteఏ లోకాన ఉన్నా భీమన్న గారు మీ వ్యాఖ్యలకానందించి ఉంటారు..
ధన్యవాదాలతో - సనత్కుమార్