రాముడన్నా, కృష్ణుడన్నా ఇష్టం. వివేకానందుడూ,విశ్వనాథ సత్యనారాయణా, కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి రచనలంటే అభిమానం.
Wednesday, October 6, 2010
పద్యం అనుకరణ, అనుసరణ
Copy from one, it's plagiarism; copy from two, it's research --Wilson Mizner (1876 - 1933)
ఎకడమిక్స్ లో దీన్ని రిసెర్చ్ అంటారు, ఆర్టులో "స్ఫూర్తి" అంటారు :-) --'ఫలానా' కామేశ్వరరావు గారు.
రవిగారు తమ బ్లాగాడిస్తా లో పద్యం రాద్దామనే ఔత్సాహికులకు సూచనలు ఇస్తూ "ఇదివరకు ప్రముఖ కవులెవరైనా వ్రాసిన టెంప్లేటును వాడుకుని మీరు అందులో సబ్జెక్టు, కొన్ని పదాలు మార్చి, మీ పద్యంలా భ్రమింపజేయవచ్చు. ఇదొక ట్రికీ కళ. అలవడితే మాత్రం భలే రంజుగా ఉంటుంది" అన్నారు. దాన్నించి స్ఫూర్తి పొందినదే ఈ టపా.
పద్య రచనలో అనుకరణ, అనుసరణ వీటికి ఒక ప్రత్యేకత ఉంది. మనలను ప్రభావితం చేసిన వారి పంథాలో మనమూ నడిస్తే (ఇష్టం ఉన్న కారణం చేత) అప్రయత్నం గా మన రచనలో వారి శైలి పొడచూపితే అది అనుకరణ. ఇక్కడ స్ఫూర్తి పద ప్రయోగం వరకు మాత్రమే నియమితమై ఉంటుంది.
ఉదా. "మందర మకరంద" అనో, "ఎవ్వనిచే జనించు" అన్న పదంతోనో ఏదైనా పద్యం మొదలైతే, చదువరులకు అసలు పద్యం (చిరస్థాయిగా నిలిచిఉన్న ఆణిముత్యాలవంటి పద్యాలు) స్ఫురణకు రావటం, ఆహ్లాదం కలగటం అన్నవి అటువంటి ప్రయోగాలకు, పదాల వాడుకకూ స్ఫూర్తి.
అదేకనుక పద్యభావం నుండి కూడా స్ఫూర్తిపొందితే అది అనుసరణ. ఒక విధం గా చెప్పలంటె తత్ మూల పద్యాన్ని రాసిన కవికి ఈ పద్య రచయిత సమర్పించుకునే కృతజ్ఞతాపూర్వక నమస్కృతి అన్నమాట.
పోతన కృతులలో నేను గమనించిన కొన్ని అనుకరణలు...అనుసరణలూ....
కవిత్రయంలో ముందుగా "ఆంద్ర కవితా గౌరవ జన మనోహారి నన్నయ్య సూరి" అని పిలువబడ్డ నన్నయ్య కవితానుసరణ
నన్నయ్య:
శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే
పోతన- (వీరభద్ర విజయము లో ఇట్లనువదింపబడింది)
సిరియును వాణి గౌరి యనుజెన్నగు కన్యకు మేను, వాక్కు బె
న్నురమును నుంకువిచ్చి ముదమొప్పవరించి జగంబులన్నియున్
దిరములు సేయబ్రోవదుదిదీర్పగ ద్రష్టయుగేక్షణుండునై
హరివిధిశంభుమూర్తి యగు నాద్యుడు మాకు ప్రసన్నుడయ్యెడిన్.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"హరి హర చరణారవింద వందనాభిలాషిందిక్కన మనీషింభూషించి" అని కీర్తించిన తిక్కన అనుసరణలు
తిక్కన 1 :
రాజటె ! రాగహీనుడతె ! రాజిత సుందరమూర్తి యట్టె ! వి
భ్రాజిత సంపదున్నత విభాసిత వర్తనుడట్టె ! కామినీ
రాజ మనోజ్ఞ భంగి చతురత్వధనుండటె ! బ్రహ్మచర్య దీ
క్షాజిత మన్మధుండునటె జన్మము లిట్టివు యెందు గల్గునే ? --> (శాం. 2 -103)
పోతన:
రాజటె ! ధర్మజుండు ! సుర రాజ సుతుండతె ధన్వి! శాత్రవో --> (1 - 211)
తిక్కన 2 :
సకల స్థావర జంగమంబులు భవత్సాన్నిధ్య మాత్రంబునన్ --> (ఉద్యో. 1 - 186)
పోతన 2:
సకల స్థావర జంగమ ప్రతతికిన్ జర్చింప దానాఢ్యుడై --> (3 -1019)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఎఱ్ఱన రచించిన నృసింహ పురాణం లో పద్యాలకు పోలికగలిగిన పోతన పద్యాలు.....
అసలు 1:
వాసుదేవుని పాదవనరుహంబుల భక్తి తగదను తండ్రియు తండ్రికాదు
వేదచోదితమైన విష్ణుధర్మమునకున్ గోపించు గురుడును గురుడుగాడు
భవదుఃఖముల మ్రాంప బ్రభువైన హరిసేవ నెడలించు హితుడును హితుడుగాడు
వరయోగ మతమగు వైష్ణవ జ్ఞానంబు వదలిన చదువును చదువు గాదు
కేశవాకార లీలలు గీలుకొని ము
దంబు బొందని తలపును తలపుగాదు
మాధవస్తోత్ర ఘన సుధా మధుర రుచుల
జిలుకకుండెడి జిహ్వయు జిహ్వ కాదు. ---> (నృ. 5-22)
కొసరు పద్యం 1 ఏమిటో చెప్పగలరా?
అసలు 2:
కలడు మేదినియందు కలడుదకంబుల
గలడు వాయువునందు గలడు వహ్ని
గలడు భానుని యందు గలడు సోముని యందు
గలడంబరమున గలడు దిశల
గలడు చరంబులచరంబుల గలడు బాహ్యంబునగలడు లోన
గలడు సారంబులగలడు కాలంబుల గలడు ధర్మంబులగలడు క్రియల
గలడు కలవాని యందును గలడులేని
వానియందును గలడెల్ల వాని యందు
నింక వేయునునేల సర్వేశ్వరుండు
కలడు నీయందు నాయందు గలడు గలడు --> (నృ. 5 - 78)
కొసరు పద్యం 2 ఏమిటో చెప్పగలరా?
అసలు 3:
కుడిచినపుడు నిద్రగూరినయప్పుడు
మేలుకొనిన యపుడు మెలగినపుడు
విష్ణు కీర్తనంబు విష్ణు చింతయు కాని
పలుకడొండు బుధ్ధి దలపడొండు --> (నృ.3 - 150)
కొసరు పద్యం 3 ఏమిటో చెప్పగలరా?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సోమనాధుని బసవ పురాణం:
క్షీరాబ్ధి లోపలక్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావగ?
జూత ఫలంబులజుంబించు చిలుక
భ్రాతి బూరుగు మ్రాని పండులు గన్గొనునె?
రాకామల జ్యోత్న దావు చకోర
మాకాంక్ష సేయునే చీకటి ద్రావ?
విరిదమ్మి వాసన విహరించు దేటి
పరిగొని సుడియునే ప్రబ్బిలి విరుల? --> (3 - 82)
కొసరు పద్యం 4 ఏమిటో చెప్పగలరా?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
భాస్కరుని రామాయణం:
కుప్పించు నురవడి గుంభిని వడిగ్రుంకి
సర్వాధిపతి తలల్ సదియ నదుమ
నగయు నూకున మీది కెత్తి పాఱిన తరు
శ్రేణులు చుక్కలు జెదర నడువ
నెఱకలు జాడించు నేపున గడలెత్తి
యేడు వారాసులు నెడములొత్త
బఱచు బల్వడి నభ్ర పంక్తులు సుడిగొంచు
వలయంపుగొండ యవ్వలికి దూల దూల
పర్వతములు వడక్ బ్రహ్మాండ కోటర
మదృవ గగన వీధి నరుగుదెంచె?
రఘుకులేంద్ర బంధ విఘటనత్వరితాంత
రంగుడగుచు నవ్విహంగ విభుడు.
కొసరు పద్యం 5 ఏమిటో చెప్పగలరా?
చాలా బాగుంది టపా! పోతన పద్యాలపై పెద్ద పరిశోధనే చేశారు.
ReplyDeleteపోతన పాండిత్యంపైన ఆనాటి వారికి కొంత చిన్నచూపు ఉండేదని, అందుకే ఛందో వ్యాకరణ గ్రంధాలలో పోతన పద్యాల్ని ఉదాహరణగా చూపలేదని ఎక్కడో చదివాను.
కష్టపడి సేకరించి చక్కటి టపా వ్రాశారు. అనుకరణ కు చాలా ఫేమస్ ఉదాహరణలు రెండు.
ReplyDelete"అరిజూచున్ హరిజూచు..."
"పరుజూచున్ వరుజూచు.."
"ఎవ్వనిచే జనించు జగమ్మెవని.." ఈ పద్యాన్ని అనుసరిస్తూ రాయలవారు ఆముక్తమాల్యదలో ఓ పద్యం వ్రాశారు.
నాకు ఇష్టమైన పద్యం "అటజని కాంచె.."ను అనుసరిస్తూ ఓ పద్యం పూర్వకవులు ఎవరో వ్రాశారు. ఈ మధ్య చూశాను కానీ గుర్తుంచుకోవడం మరిచాను.
మ.
Deleteనృపు జూచున్ రిపు జూచు స్మిత సంహృత్హాస ద్వంద్వంబునన్
చపలత్వంబును లేక లేమ పచరించన్ స్వేద బిందు ద్యుతిన్
యపురూపంబుగ కన్పడన్ పతియు ప్రత్యర్థుల్ కాంచి వి
స్తు పడన్ పుష్ప శరమ్ములన్ శరములన్ జొప్పించు నయ్యయ్యెడన్.
మ.
పగ జూచున్ మగజూచు సత్య రణ సంభావ్యంబు నూహించుచున్
నగవున్ శ్రీహరికిచ్చి రెచ్చి నరకున్ నా భీకరా రావంబుతో
తెగవేయన్నట దివ్యబాణములు సంధించె న్నమోఘంబుగా
మగవారెవ్వరు సాటియే నరకు నమ్మాన్యాభ కూలార్చగన్.
నాచన సోమన, పోతన పద్యాల స్ఫూర్తితో వ్రాసుకున్నవి ఈ రెండూ.
చాలా బాగుంది! వీరభద్రవిజయం వ్రాసే సమయానికి ఇంకా పోతన కవిత్వం పరిపక్వమైనట్లు లేదు.
ReplyDelete"సిరియును వాణి గౌరి యనుజెన్నగు కన్యకు మేను, వాక్కు బె
న్నురమును నుంకువిచ్చి"
అన్నప్పుడు ప్రక్రమ భంగం జరిగింది, బహుశా ప్రాస కోసం. సిరి, వాణి, గౌరి - ఉరము, వాక్కు, మేను సరైన క్రమం కదా. నన్నయ్య పద్యంలో ఈ క్రమం సరిగా ఉంది.
ఈ పద్యంలో "మాకు ప్రసన్నుడయ్యెడిన్" అన్నది కూడా నన్నయ పద్యాల "స్ఫూర్తే". ఉదంకోపాఖ్యానంలో పాములని చేసే స్తుతి పద్యాలు ఒక నాలుగు "మాకు ప్రసన్నుడయ్యెడిన్" అని అంతమవుతాయి.
చంద్ర మోహన్ గారు, రవి గారు, కామేశ్వర రావు గారు ధన్యవాదాలు.
ReplyDeleteఉదంకోపాఖ్యానం శ్లోకాలు నేనూ ప్రస్తావిద్దామనుకున్నాను కానీ పోతనపై కవిత్రయం లో ఎఱ్ఱన ప్రభావం ఉన్నంతగా మిగిలిన ఇద్దరివీ లేకపోయేసరికి ఈ టపాలో అంతవరకే ముచ్చటించా... శ్రీనాథుడి శైలి, పద్యాలతో పొంతన మరో టపాలో మాట్లాడతా.
ఇంతకీ కొసరు పద్యాలేవో ఎవరూ తెలియజేయలేదు ?
చంద్రమోహన్ గారూ ! పోతన తరువాతి కాలంలో కవులు పోతనను, భాగవత పద్యాలనూ అనుసరించటం నేను కొన్ని కృతులలో గమనించాను కానీ పోతన పాండిత్యం పై వారి అవగాహన మీరన్నట్టు ఉన్నదనటానికి దాఖల నాకు కనిపించలేదు ఇప్పటి వరకు.
ReplyDeleteమందార మకరంద .. పద్యమునకు కూడా పోలిన పద్యం ఉందని విన్నానండి ( నాచన సోముడు?)
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete@ఊ.దం. గారూ!!
ReplyDeleteధన్యవాదాలు, ఎవరూ కూడా అసలు పద్యాలు చెబితే కొసరు పద్యాలేమిటో చెప్పలేదేమిట్రా అనుకుంటూ ఉన్నా.
"క్షీరాబ్ధి లోపలక్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావగ?" అన్న సోమనాథుని బసవ పురాణంలోని పద్యాన్ని "స్ఫూర్తి" పొంది రాసినదే "మందార మకరంద మాధుర్యమునదేలు " పద్యం. అయితే ఏ మాటకామాట చెప్పుకోవాలి. పోతన పద్యంలో ఉన్న ఆర్ద్రత సోమనాథుని పద్యంలో కొంచం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది.
@ రవీ !!
ఎవ్వనిచే జనించు పద్యానికి నేను కూడా అనువాదాన్ని విన్నా. ఆముక్తమాల్యదలోదో కాదో తెలీదు. కాకపోతే అది కొంచం విభక్తులు మార్చి రాసిన "ప్రయత్నం" గానే తోచిందే కానీ మెచ్చే స్థాయిలో ఉన్నట్టు నాకు అనిపించలేదు. మీరువిన్నదీ ఈ పద్యమేనా?
"ఎవ్వని వల్న బుట్టు జగమంతయు సంతతమున్ ప్రవర్ధనం
బెవ్వని వల్న లీనమగునెవ్వనివల్న తిరోహితంబునౌ "
అదే పోతన పద్యం చూస్తే నిజంగా మకరందం కారుతోందా ఎమిటి అనిపిస్తుంది.
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
ఎవ్వనియందు డిందు, పరమేశ్వరుడెవ్వదు? మూలకారణం
బెవ్వడనాది మధ్య లయు డెవ్వదు?".... అద్భుతంగా లేదూ?....
పోతనను తత్కాలంలో కవులు, తర్వాతి వారు, ఎందరో మహానుభావులు కాపీ కొట్టినవారు ఉన్నారు.. ఆ పద్యాలు చూస్తూంటే ముచ్చటేస్తుంది కానీ లిస్టు చెప్పుకోవాలంటే మాత్రం చాలా పెద్దదే ఔతుంది.
అయినా వీలు కలిగినప్పుడు ఒకటపాలో బ్లాగుతా...
THis is found in Amuktamalyada last chapter
ReplyDeleteఉ. ఎవ్వని చూడ్కి జేసి జనియించు జగంబు వసించు నిజ్జగం
బెవ్వని యందు డిందు మరి యెవ్వనియం దిది యట్టి విష్ణుతో
నివ్వల నొక్క వేల్పు గణియించిన పాతకి నౌదు నేడ నే
నెవ్విధినైన నిన్ గదియనేని యనన్విని బంధ మూడ్చినన్.
పరిమి వేంకట కవి గారిది మరో పద్యం యిలాగే ఉంది. అదీ చూడండి.
Deleteఎవ్వనిచే జగంబు జనియించు, వసించు నశించు, నవ్యయుం
డెవ్వడు కార్యకారణము లెవ్వడు భూతనమాశ్రయుండువా
డెవ్వడు చిత్కళాసహితుడెవ్వ డపారదాత డీవెకా
యివ్వసుధాస్థలిన్ వెదుకనేనిక కూడలి సంగమేశ్వరా!
ధన్యవాదాలు కొత్తపాళీ గారు!!
ReplyDelete