అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
వినాయక చవితికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెబుతున్నాడేంటి అని హాస్చర్యపోవద్దు. నేనెక్కాల్సిన ట్రైను జీవితకాలం లేటు అన్నట్టు ఇన్నాళ్ళకి గానీ వీలు పడలేదు. అయినా ఇవ్వాళ కథ చదువుతూంటే రాద్దామనుకున్న టపా రాయలేదని గుర్తొచ్చింది.
"మనుషులను వస్తువులుగా , వ్యాపారవస్తువులుగా చూస్తున్న ఈ కాలంలో వస్తువుల మనసుల్లోకి తొంగిచూడటం మీకే చెల్లు" అని ఒక బ్లాగ్మిత్రులు ఒకానొకసారి నా టపాలో వ్యాఖ్యానించారు. వారికి అనేకానేక ధన్యవాదాలు.
వస్తువుల మనస్సునైతే అర్ధంచేసేసుకోవచ్చు, వచ్చే ఇబ్బందేం లేదు. మనుష్యుల మనస్సులు అర్ధంచేసుకోవటం మొదలైతే ఇంకేమన్నా ఉందా? ఉదాహరణకి కళాంజలో, కళానికేతనో దాటేస్తూంటే శ్రీమతి మదిలో మెలిగే శతాధిక భావాలు నాకు అమాంతం అర్ధమయిపోయాయనుకోండి, నాగతేంకాను? ఆ నడిరోడ్డుమీద ఉక్కిరి బిక్కిరి అయిపోనూ? ఆఫీసులో టాస్కులిచ్చి ఇంకంటాక్సువాడి మాదిరి పీల్చిపిప్పిచేస్తే టీమ్మెంబరుగాళ్ళు తిట్టుకునే శాపనార్ధాలు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? 'ఢా'మ్మని అక్కడికక్కడే పోనూ? అందుకే వస్తువుల మనసుల్లోకి తొంగిచూడటం కొంచం సేఫ్. అవైతే నిష్కర్షగా "నా భావం అది కాదు మొర్రొ" అని ఖండించవుకదా. నిర్మొహమాటంగా వాటి పేరు మీద మనకి తోచింది, నచ్చిందీ చెప్పేయచ్చు. అది నా ధీమా.
నిజానికి నేన్రాసుకున్న పద్యాలని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటూంటే ( రాసినవి కొన్నే అనుకోండి) అప్రయత్నంగానే భావావిష్కరణలో నా మొగ్గు ఖనిజాలు,వృక్షాలు,జంతువుల పైకే ఎక్కువ తూగుతుంది.
రాముడు-స్ఫూర్తి పద్యాల్లో రాళ్ళు రాముడి మరదళ్ళమని ఫీలయినా, జలచరాలు రాముడిమీద అలిగి అటకెక్కినా, తక్కెడ ధర్మాధర్మాల గురించి రాముణ్ణి నిలదీసినా, ఉడుత "గాఢపరిష్వంగ" వాంచని రాముడికి విన్నవించున్నా, తాటాకు చప్పట్లలో తాటి చెట్టు తన వేదనని నివేదించుకున్న; పులి విలాపం అన్నా ...అన్నిట్ళో ఉన్నది అదే.
అయితే ఈ మొగ్గు అప్రయత్నం అని ఎందుకన్నానటే నేన్చదువుకున్న పద్యాలు అట్లాంటివి మరి. బోయిభీమన్నగారి ప్రభావం నామీద అలాంటిది. ఇంతకముందు టపాలో చెప్పినట్టుగా, బోయి భీమన్నగారు ఓ రకంగా నాకు ఏకలవ్య గురువుగారు. ఏకలవ్య గురువుగారు అని ఎందుకు అన్నానంటే నా ప్రమేయం లేకుండానే నాలోనికి చొరబడి నన్ను ప్రభావితం చేసేశారు కాబట్టి.
ఒక గ్రీటింగు షాపు కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వందలాది గ్రీటింగుల్లో ఒక్కటి మాత్రమే మనకి తెగ నచ్చేస్తుంది. ఎందుకంటే అది మనం చెప్పకపోయినా మన హృదయాన్ని మాటల్లో ఆవిష్కరించినట్టు అనిపిస్తుంది.
బోయిభీమన్న గారి "మణి మానసం" కావ్యం నా దృష్టిలో అట్లాంటిదే.
ఆత్మతో కలిసిపోయిన అనుభవ్సారమే అనుభూతి. అనుభూతి జాగృతం కావడమే భావ స్పర్శ. అట్టి అనుభూతి రససంబంది అయినప్పుడు కళాసృజన జరుగుతుంది. రసానుభూతికి రూపకల్పనలే కళలు -- సాహిత్యం, సంగీతం, నృత్యం, శిల్పం వంటి కళలకు మూలబీజం రసమే.
లోకిక, భౌతిక, వ్యావహారిక, శారీరక సంబంధ బాంధవ్యాలతో ప్రమేయం లేని మనోరమణమే రసస్థితి. విప్రలంబ శృంగారమే రసాద్వైతానికి బీజం. వియోగం వల్ల మనోరమణం ఏర్పడి నిరంతర ధ్యానం వల్ల తాదాత్మ్యం సిధ్ధిస్తుంది. ఇది భక్తికంటే మధుర భక్తికంటే భిన్నం. ఇది స్త్రీ పురుష మనస్సంబంది. పరమానంద సిధ్ధికి సహజ మార్గం. శ్రీకృష్ణుడు గోపికలకు ఉధ్ధవుడి ద్వారా పంపిన సందేశం లో ఈ రసాద్వైత మూలసూత్రం కనిపిస్తుంది. ప్రతీ వ్యక్తి జీవితంలోనూ విప్రలంభం ఉంటుంది. అయితే గోపీకృష్ణ వియోగం ఒక శాస్వతమైన మధురవేదన. అందుకే దానిది సచ్చిదానంద రసస్థాయి.
అటువంటి రసానుభూతికి సాహితీ కల్పనే "మణి మానసం" కావ్యం.
శ్యమంతకమణి మానసం ఆ కావ్య వస్తువు, బీజం. భాగవతంలోని శ్యమంతకమణి కేవలం ఒక మణి. కానీ ఈ కావ్యంలోని శ్యమంతకమణి మానవ హృదయం కల ప్రేయసి. కృష్ణుణ్ణి ప్రేమించి, తన ప్రేమను అతడు గుర్తించకపోవడం వల్ల మూగ వేదనను అనుభవిస్తున్నట్టిది. ఒక్క ముక్కలో చెప్పలంటే శ్యమంతకమణి స్వాంతనం. గోపికలవలే కృష్ణుణ్ణి కామించి, ప్రేమించి, ప్రేమైకభావం లో తాదాత్మ్యత చెంది విరహవేదన అనుభవించినదే ఈ కావ్య నాయిక- శ్యమంతక మణి.
వినాయక చవితి సందర్భంగా గోపీకృష్ణుల రాసలీల స్మృతిగా ఆ పద్యాలు, మీకోసం... చదివి ఆనందించండి.. కృష్ణానుభూతిని అనుభవించండి.
పనిలో పనిగా కృష్ణాష్టమి సందర్భంగా ...నా 'గీత '
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
లూతల పట్టుకోక సిగలో ఎదొ పిట్టల ఈక, చుట్టునున్
వ్రేతల మూక, దట్టినొక వేణు శలాక; రసాధినేతకే
తాత యనంగ వెల్గెడునితండెవడా అనుకొంటి, కృష్ణ ! ని
న్నా తొలిసారి చూచి ! నయనామృతమయ్యనదే దినే దినే !
గాన రసమ్ముతో వెదురు కర్రకు ప్రాణము పోసినావు; నీ
వేణు రవమ్ముతో మొరటు వ్రేతను రాధనుజేసినావు; నీ
యాన రయమ్ముతో జడ మహస్సుకు కళ్ళెము వేసినావు; నా
మానస మంతకన్న ఖిలమా? ఖలమా? నినుగోరుటబ్రమా?
సూరుడు కాడె తండ్రి? తను చూడనిదున్నదె? నన్నెరుంగడే?
కోరిక దీర నే క్షణమొ కొమ్మని నీకిడడే- అటంచు నే
నారని ఆశ నుంటి ! అకటా ! తన దండకమున్ పఠించుచున్
దారిన పోవువానికొక దానయకున్ నను దానమిచ్చెపో !
నా యాత్మన్ కరగించి లోగొనినదే నాదౌ ! తదన్యం బదే
శ్రేయంబైనను వ్యర్థభారమె యగున్; చేతో ధరా ధారలో
నా యానందమె నాది; దానికొకడే నథుండు కృష్ణుండు; కృ
ష్ణా యోచింపు, ముపేక్ష చేసెదవు పో - షష్టాష్టకంబయ్యెడున్ !
మహిమ గలట్టి రత్నము శ్యమంతము, హేమము నిచ్చు, నంచు నన్
బహుగతులన్ నుతింత్రు; మరి నాకెవరిత్తురు నా అభీష్టముల్?
స్వహితము నైజమౌ మనుజ జాతికి! సర్వ హితైక మూర్తివౌ
మనుజుడవీవుగా? మణికి మాత్రము మానసముండదా? ప్రభూ?
బృందా సుందర సీమలో, మధురలో, వ్రేపల్లెలో రమ్య కా
ళిందీ తీరములో భవచ్చరణ సంలీనాత్మలై నిన్ను నీ
డెందమ్మున్ గొను చొక్కరొక్కరె నవోఢీ భూతలై కాంతలా
నందం బందుచు నుండ చూచెదను కానా? నే నలోలాత్మనా?
దీపజ్యోతికి మూలపీఠమయి తధ్ధీవల్లికిన్ పుష్పమై,
శ్రీ పాదమ్ముల నీలపద్మమై, తన్నృత్య క్రియా రంగమై
రూపారూప పరాప రోదిత కళా రోచిష్ణువై వెల్గు నీ
గోపీ వల్లభ మూర్తి నా కనులలో గోవత్సమై గెంతదే?
ఇంత ఉపేక్ష చేతువది ఎందుకొ? హేతువు కానరాదు ; నా
యంతట నేను వెంటబడినందుకొ? నాకిల నీవుతప్ప గ
త్యంతర మేదియున్ గలుగ నందుకొ? దైవము జేసి నిన్ను నా
స్వాంతము నందు నిల్పుకొనినందుకొ? ధైర్యము చాలనందుకో?
మనసిది నిన్ను కోరి కడు మ్రగ్గుచునున్నది; తండ్రి యా మరో
మనుజునకిచ్చె; ఈ కొలది మన్గడయున్ దరిజేరి చచ్చెనా?
అనయము నెవ్వడో ఒకడు అగ్నికి కట్టియ రీతి వచ్చి నన్
చెనక దలంచు ! రుక్మ మొక చెడ్డది, రుక్మిణి మంచిదీ నటో?
ఆనాడే నను జూచి నీ మనసు రాగారక్తమైనప్పుడే
పోనిమ్మంచనుకోక, కాలగతిలో పోకళ్ళు గుర్తించి, పం
తానన్ రుక్మిణినట్లు నన్ను గొనియున్నన్ ఇంత కాకుండు ! దే
వా ! నీ దానను, నేటికైన నను గావన్ నేరవా? కోరవా?
జేజెలమీర నన్గొని ప్రసేనుడు చచ్చె; మృగేంద్రుడిల్గె; స
త్రాజితుడంతమయ్యె; శతధన్వుడునున్ తెగె; జాంబవంతుడు
గ్రాజియొనర్చె; నొచ్చె బలరాముడు; ఇంతయు నాగురించి ! స్వా
మీ! జగదాత్మ ! ఇంత అఘమెందుకు నా నుదుటన్ లిఖించితో?
మరిన్ని తర్వాతి టపాలో...
భలే రాసారండీ
ReplyDeleteహరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ రామ హరే హరే
కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకు కూడా :)
పరమానందం!!!
ReplyDeleteకృష్ణాష్టమికీ, వినాయకచవితీ భలే ముడిపెట్టారే! :-) వినాయకవ్రత కథలో వినేది ఈ శమంతకమణి గురించే కదా!
ReplyDeleteచాలా హృద్యంగా ఉన్నాయి భీమన్నగారి పద్యాలు. శమంతకమణిని కృష్ణప్రేయసిగా చేసిన ఊహే చాలా అద్భుతంగా ఉంది!
Sanath Sripathi గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం
ReplyDeleteహారం
సార్ బొమ్మ ముచ్చటగా వుంది, ముఖ్యంగా అబ్బా! ఏం కళ్ళు!
ReplyDeleteహరే కృష్ణగారు, మందాకిని గారూ, కామేశ్వర రావుగారు, భాస్కర్ గారు, అన్వర్ గారు!!
ReplyDeleteహృదయ పూర్వక ధన్యవాదాలు