అశొకవన ప్రస్థానం లో తాటాకులకు కూడా ఇంకొక ప్రత్యేక స్ఠానం ఉంది.
పుంసాం మోహనరూపాయ కదా.... ఎవరికి వారు రాముడిని ఎప్పుడెప్పుడు చూస్తాం.. రాముడికి ఏ విధంగా సేవ చేయగలం అని నిరంతరం ఎదురుచూస్తున్నారుట. శబరి, కబంధుడు, జటాయువు, సంపాతి ఎవరికి వారు తమకు చేతనైన సేవ చేసుకున్నారు. అదే బాటలో ఒక చెట్టు కూడా అనుకుందిట.
"రావణుడు ఈ మార్గం లోనే కదా వెళ్తున్నాడు. వాడిని ఏదో ఒక విధంగా ఆపి తీరాలి" అని అనుకుంది ట తాటి చెట్టు. చాలా ఎత్తుకి ఎదిగిందిట ఆపుదామని. కానీ రావణుదు ఇంకా ఎత్తు గా ఎగిరిపోయాడుట. అయ్యో .. 'పత్రం, పుష్పం, ఫలం, తోయం' వేటితోనైనా నీకు దగ్గర కావచ్చు కానీ, నాకా పుష్పాలు లేవు, తోయమా పవిత్రం గా భావించ బడదు.. పత్రాలా ఫెళ ఫెళ లాడుతూంటాయి. అందుకే చాలా ఎత్తుకి ఎదిగా.. ఆపుదామని కానీ ఏం లాభం? ఫలితం శూన్యం. ఇక నీ సేవ చేసే భాగ్యము ఇక లేదే అని ఎంతో బాధ పడిపోతోందిట.
దానికి ఊరట కలిగించటానికి రాముడు ఇక ఏ చెట్టుకూ లేని ప్రత్యేకత దానికి సంతరింపజేసాట్ట. ఆ వృక్షపు పత్రాలనే వింజామరలుగా వాడుకున్నాట్ట. అవే విసన కర్రలు. లేకపోతే రాముడి వంటి మహా రాజుకు వింజామరలను అందించే అవకాశం ఉండేది కాదు కదా..
పద్యం.
రావణుడీ పథాన మహిజన్ గొని లంకకు పోవునప్పు డే
దో విధి వాని నాపవలెనంచు తలంచియు చేయనైతి. మీ
సేవను చేయు భాగ్యమిక లేదొకొ యంచు తలంచు వృక్షమున్
బ్రోవగ గాదె పత్రమును ప్రేమతొ గొంటివి చామరంబుగన్ !!
స్పూర్తి: (1) భద్రాచలం లో తాటాకు పందిళ్ల లో జరిగే రామ కళ్యాణం చూచినప్పుడు కలిగిన భావం. నా వరకు నాకు రామ కళ్యాణానికి తాటాకు పందిళ్ల తో వచ్చే కళ ఏ ఐదు నక్షత్రాల పెళ్ళి మంటపం లోనూ కనపడదు.
(2) తాటి చెట్టల్లే ఎదిగావు కానీ ఏం లాభం అని దెప్పిపొడుపు సాధరణం గా వింటూంటాం కదా.. దాని వెనుక కరణం ఏమైనా ఉంటుందా.. ఆ మాట వింటున్నప్పుడు తాటి చెట్టు మనో భావన ఎలా ఉంటుందో అని ఒక ఆలొచన.
3 comments:
chaalaa baagaavraasaaru srustilo prati jada,chaitanyavastuvulanni bhagavd sevaku padigaapulu kaastumtaayi
అన్నీ కలిపి ఒక సంకలనం చేసి ప్రచురించవచ్చు అనిపించేలా ఉన్నై.
ఏదో ముద్రారాక్షసమనుకుంటానూ. పద్యంలో మొదటి పాదం గణాలు కుదరలేదు. సాహసించి నేనే పూరించేసాను...
"రావణు డీ పథాన చని రాణ్మహిజన్ గొనిపోవునప్పుడే" :)
సోదరులు భైరవ భట్ల కామెశ్వర రావు గారు ఈ క్రింది సూచనని తెలియజేసారు.
"చామరము" అంటే చమరీ మృగ సంబంధమైనదని అర్థం. చమరీ మృగం తోకతో తయారు చెయ్యబడుతుంది కాబట్టి చామరం అయ్యింది. కాబట్టి ఇక్కడ తాటాకు విసనకర్రని చామరం అనడం సరికాదు. మరో పదం వేస్తే బాగుంటుంది.
-కామేశ్వర రావు
వారికీ, వచనాన్ని స్ఫురించె నా పద్యానికి ప్రౌఢి గూర్చి సవరించి స్ఫూర్తి కలిగించిన రాఘవ గారికి, దుర్గేశ్వర గారికి నా నెనర్లు..
కామేశ్వర రావు గారు, రాఘవ గారు
మీకు అనేక ధన్యవాదాలు.. టైపాటు లో నేను గమనించ లేదు. మీరు నిశిత దృష్టి కలవారు.. ఇట్టే పట్టేసారు.
'రావణుడీ పథాన మహిజన్ గొని లంకకు పోవునప్పు డే '
అని ఉండాలి మొదటి పాదం...
ఇక చామరం అన్నది వ్యజన చామారాభ్యాం వీజయామి అనే మంత్రం నుండి స్వీకరించా. సరి అయిన పదం ఇంకొకటి స్ఫురించగానె దిద్దుకుంటా..
నెనరులు...
Post a Comment