Monday, November 16, 2009

రాముడూ - స్ఫూర్తి - తరాజు

రాముడూ - పళ్ళు.

రాముని దాసులందరును రాజులె, నిక్కము భాగ్యరాజులే !!
రాముని సన్నుతించి కపిరాజుయు, త్యాగయ, నాగరాజులున్,
రామ రథంబునౌచు ఖగరాజు, హయమ్ము, మృగాధి రాజులున్,
ఈ మహిలోన 'రాజు 'లన నింత యశంబు గడించిరంట ! నా
నామము గూడ రాజె! మరి నన్నెటు బ్రోచెదొ? ఎట్లు గాచెదో ??

చింతలన్ని "గొలుసు" చిక్కులై తూగాడు,
పక్షపాతి "ముల్లు" ఫలిత మిచ్చు !!
"పళ్ళెరద్వయంబు" పనికిరాదాయెనా ?
మిమ్ము గొలుచు భాగ్యమీయలేవె?

పూజ చేయలేను ! పుష్పాలు తేలేను !
బొజ్జ నింపలేను బువ్వ తోడ !!
మనసు తెలుపలేను ! మాటాడగాలేను !
ఇట్టి జన్మ మిస్తివెందుకయ్య !!!

ధరణి పైన నెల్ల ధర్మంబు రూపుగా
అవతరించి నట్టి అమృత మూర్తి,
ఏమొసంగ గలను? ఏరీతి సేవించి
అమరమైన యశము నరయ గలను?

అనుచు తలచి, దు:ఖమతిశయించగ "త్రాసు"
మథనపడ దొడంగె మనసులోన.
"త్రాసు"అంతరంగ మవలోకనము జేసి
హృదయనాథు డాదరమున పల్కె !!

"ఆడుదానిహత్య, అడవిలో కపిహత్య
నేరమనుచు నిశ్చయించి జనులు
శబరి కోర్కె తీర్ప; శరభంగు తరియింప
ధర్మ మంచు తలపదగునె? చెపుమ?

తప్పు ఒప్పులనుచు తర్కింప పనిలేదు
ధర్మ విహితమెల్ల తనకు "నొప్పు"
ధర్మ రహితమెల్ల "తప్పౌను", పరికింప
కర్మ మొకటె నిజము, కర్త సాక్షి !

కర్మసాక్షి వౌచు కరుణతో ధర్మమ్ము
తీర్పులిచ్చి గొడవ తీర్చువేళ
ఇట్టి ధర్మ సూక్ష్మ మిలలోన ప్రసరింప
జేయగలవు, 'నన్ను' చేరగలవు !!

మంచి చెడుల మీద మనసునిల్పితిరేని
'నన్ను ' తెలియ లేరు, నరులు, మునులు
మంచిచెడుల ధర్మ మర్మంబు తెలుయుటే
'నన్ను' తెలుసుకొనుట, నడచు కొనుట !!

అని వచించె రాము"డంచేత ధర్మాస
నంబొసంగ సాగె నమ్మకమ్ము !!
ఇద్ధరిత్రి పైన నిదె కారణమ్మహో !
అతిశయోక్తి కాదు, ధర్మ మూర్తి !!.

ధర్మ నిరతి నెరిపి ధరణితలమ్ముపై
రామ రాజ్య ఫలము రంగరించి
సగుణ మార్గ మిచ్చి, సత్య నిష్ఠత నేర్పి
తత్త్వమంద జేసె త్రాసు ముల్లు.

స్ఫూర్తి:
(1) భైరవభట్ల కామేశ్వర రావు గారు "తన తనా తనన తనా" అనుకుంటూ ప్రశ్న వేస్తున్నప్పుడు సుప్రభాతం లో "నాగాధి రాజ గజరాజ హయాధి రాజాః" అన్న శ్లోకం గుర్తొచ్చింది.. అందరూ రాజులే కావాల్సి వచారే.. అందుకే కీర్తనలకి కూడా త్యాగ 'రాజే' కావాలనుకున్నట్టున్నాడు.కొంపతీసి ఆయనక్కూడా వర్గపట్టింపూ, గట్రా ఉన్నయా ఏమిటి? అని డౌటు వచ్చింది. మరి నాసంగతెట్టా? నా పేరు లో రాజు లేదే అని ఒక భావన వచ్చింది.. అంతలోనే మదిలో మెదిలింది ఈ తరాజు.

(2) జీవితంలో ఒడిదుడుకులు, సుఖ దుఃఖాలు కలుగుతూంటే... రెండిట్లోనూ నన్ను చూడమని రాముడు చెబుతున్నాడేమో అనిపించింది. సుఖానికి పొంగిపోవటం, దుఃఖానికి క్రుంగిపోవటం కన్నా మధ్యస్థం గా ఉండాలి అని భావన వచ్చినప్పుడు త్రాసు గుర్తుకు రావటం, త్రాసుతోనే న్యాయస్థానమూ.. దానితోటే ధర్మాసనమూ గుర్తుకు వచ్చాయి. న్యాయస్థానమూ, ధర్మాసనం అనీ ఎందుకన్నారు? ధర్మస్థానమూ, న్యాయాసనమూ అని ఎందుకనలేదు చెప్మా అని ఆలోచిస్తున్నప్పుడు కలిగిన భావన. రాముడు నదచి చూపినది ధర్మం... రాముడి సమదృష్టిని నిర్వచించగలిగేది త్రాసు మాత్రమే. ధర్మమాధారంగా న్యాయ నిర్ణయం చేయటం, "వామాంకస్థిత" అన్నట్లుగా త్రాసు ప్రక్కనుండగా, దాని స్ఫూర్తితో తీర్పునిచ్చేది ధర్మాసనం అని తట్టిన భావన.

5 comments:

  1. పద్యాలు అద్భుతం. మీ టపాలు అన్నీ ఒక్కొక్కటిగా నిదానంగా చదవాలి.

    ReplyDelete
  2. చాలా బావుంది.
    "రాముని దాసులందరును రాజులె, నిక్కము భాగ్యరాజులే"
    ఇది చదవంగానే ముందు మదిలో మెదిలింది త్యాగరాజే :)
    రాముని మీద చాలా రాశారే. అన్నీ మళ్ళి చదువుతాను.

    ReplyDelete
  3. శీర్షిక చూడకుండా టపా చదవడం మొదలుపెట్టాను. మీ పేరులో "రాజు" ఎక్కడ ఉందా అని కొన్ని సెకన్లు ఆలోచించాను. ఆ తర్వాత రెండో పద్యం అసలు అర్థం కాలేదు. అయిదో పద్యంలో "త్రాసు" పదం చూసిన తర్వాత అసలు విషయం బోధపడింది! ఎప్పటిలాగే మంచి ఊహ చేసారు. పద్యాలు చక్కగా నడిచాయి.

    ఈ పద్యం మాత్రం పూర్తిగా అర్థమవ్వలేదు:

    ఆడుదానిహత్య, అడవిలో కపిహత్య
    నేరమనుచు నిశ్చయించి జనులు
    శబరి కోర్కె తీర, శరభంగు తరియింప
    ధర్మ మంచు తలప తగునె? చెపుమ

    "కర్మసాక్షి వౌచు" - ఆ కర్మ"సాక్షి" కళ్ళకే గంతలు కట్టేసాం! :-)

    ReplyDelete
  4. రవిగారూ, కొత్తపాళీ గారూ నెనర్లు.
    సమయం చూసుకుని మీ వ్యాఖ్యలనూ, అభిప్రాయాలనూ తెలియజేయగలరు....

    కామేశ్వరరావు గారూ !! మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    "తాటకి వధ, వాలి వధ తప్పనీ, శబరినీ శరభంగుణ్ణి కరుణించటం ఒప్పనీ అంటూంటారు ఈ జనులు, తనదృష్టి లో మాత్రం రెండూ ధర్మమే కదా... అన్నీ కర్తవ్యాలే కానీ తప్పొప్పుల లెక్క లేదు కదా.." అని రాశాననుకున్నా..

    కొంపతీసి ఆవేశపడ్డానా ఏమిటి? నిజం చెప్పండి.

    ReplyDelete
  5. తప్పేమీ లేదండి. అన్వయం నాకు కొంచెం క్లిష్టంగా అనిపించిందంతే. మొదటిపాదంలో చెప్పిన విషయాలని నేరమనే జనులు, మూడవ పాదంలో చెప్పిన విషయాలని మాత్రం ధర్మ మనడం తగునా(అంటే ఇవి కూడా నేరమే!) అని స్ఫురించింది నాకు!

    "శబరి కోర్కె తీర" - "శబరి కోర్కె తీర్చ" అని ఉండాలేమో?

    ReplyDelete