రాముడి పై నేను రాసుకున్న ఇతర టపాలు.
ఆ
తీయనైన పండ్లు తినిపించ వలెనంచు
తపన జెంది, శబరి తనివి తీర
అడవి లోన వెదికి అరుదైన ఫలరాశి
నేరి తెచ్చి రాము నెదురు జూచె !!
ఆ
ఎదురు చూపు లోనె ఏళ్ళెన్నొ గడవగా
ఫలములన్ని మిగుల పండ సాగె !
జవములన్ని యుడిగి చరమాంకమును జేర
ఎండి పోవుచున్న ఎదను జూచి,
ఆ
'అమ్మ' లేని మాకు అమ్మైన, నాన్నైన
నీవె గాదె దిక్కు నీరజాక్షా ??
ఈ ఉపేక్ష లేల, నీకింతమరుపేల?
అవని పౌత్రులన్న అలుక లేల?
ఆ
అనుచు తల్చి, దుఃఖ మతిశయించగ, పండ్లు
నతులొనర్చి, రాము నడుగ సాగె
"ఎండి పోయె జన్మ మింకిపోయెను ఆశ !
వైరి కైన ఇట్టి బ్రతుకు వలదు !
ఉ
"ఏ తప మాచరించినను, ఎన్ని వ్రతమ్ములు చేసియున్ననున్ !
ఏ తరి పూల 'బూచినను ', ఎన్ని దినమ్ములు వేచియున్ననున్ !
మా తల రాత మారదొకొ ! మమ్ము భుజించుట కిచ్చగించవో !
ఈ తపనంతయున్నిసుక నింకిన తైలమొ ! శాప గ్రస్తమో !! "
ఆ
అనుచు మనసు లోని ఆక్రోశమును తెల్ప
గుండె లోని బరువు కొంత తీరె.
నీటి లోని అలలు నెమ్మదించిన రీతి
కుదురుకున్న మనసు కుదుట చెందె.
ఆ
మనసు లోని చింత మటుమాయ మవ్వగ
ఫలము పలికె మధుర వాక్కు లిట్లు
"ఏ సహాయమిత్తు మే రీతి సేవింతు
మెరుక పరచవోయి ఇనకులేశా !
ఆ
ఎట్టి దేశమైన, ఏకాలమైననూ
అధిక శక్తి నొసగు అమృత ఫలము
స్వీకరింపుమయ్య శ్రీరామ చంద్రుడా !
ఎండు ఖర్జురమ్ము, ఎండుద్రాక్ష !!
కం
ఎండిన ఫలముల బ్రతుకుల
పండుగ దినమొచ్చునట్లు వరమిటు లిడుమా!
పండిత పామర రంజక !
దండములివె ! స్వీకరించి దండిగ తినుమా !"
ఆ
పండ్ల హృదయ కుహరమవలోకనము జేయ
విశదమయ్యె పూర్ణ విమల భక్తి
అందు వలన రాముడాఢ్యుడై 'డ్రై ఫ్రూట్సు' *
నారగించి, మొరల నాలకించె !
స్ఫూర్తి:
(1) మొత్తం భావాన్ని పద్య రూపం లో ఇద్దామన్న ప్రయత్నం 'రామా ఆర్త రక్షామణీ' పద్యాలని చదువుతున్నప్పుడు తట్టిన ఆలోచన.
(2) రాముడూ thanks giving అనుకుంటున్నప్పుడు, శబరి ఆశ్రమం లో పళ్ళూ గుట్టలు గుట్టలు పడి ఉంటాయి అని ముందు పద్యం లో భావన వచ్చింది. వాటికి మానసం ఉంటే రాముడి తో ఏమని మొర పెట్టుకునేవో కదా అని ఆలొచన వచ్చినప్పుదు కలిగిన భావన 'డ్రై ఫ్రూట్సు' అని.
6 comments:
ఆటవెలది నడకని బాగా పట్టుకున్నారు. మొత్తంగా ఖండిక కూడా బాగా వచ్చింది. అభినందనలు.
కొత్త పాళీ గారూ ! ధన్యవాదాలు.
మీవంటి వారి ప్రోత్సాహం తో బుడి బుడి నడకలు ఇప్పుడే మొదలుపెట్టా..
మీకెప్పూడైనా తీరిక దొరికితే రాముడి పై నేను రాసుకున్న మిగిలిన భావాలని చూచి సూచనలనూ, అభిప్రాయాలనూ తెలియపరచగలరు.
విధేయుడు
సనత్
సనత్ గారు,
ఎప్పటిలానే మీ ఊహ ఓహో అనిపించేలా ఉంది. ఎక్కణ్ణుంచి ఎక్కడికి తీసుకొచ్చేరు! కొత్తపాళీగారు అన్నట్టు మీ చేతిలో ఆటవెలదులు చక్కగా నాట్యం చేస్తున్నాయి :-)
చిన్న చిన్న పొరపాట్లు:
"ఉడికి" కాదు "ఉడిగి", "ఇచ్చకించవో" కాదు "ఇచ్చగించవో".
"ఈ తపనంతయున్ ఇసుక" అన్నదగ్గర "ఇ" ముందున్న నకారప్పొల్లుతో కలవకపోతే నడక సాఫీగా సాగదు. "ఈ తపమంతయూ యిసుక", లేదా "ఈ తపమంతయు న్నిసుక" అంటేనో బాగుంటుంది.
"మధుర పలుకు" - దుష్టసమాసాఅలని నేను విపరీతంగా పట్టించుకోను కాని ఈ సమాసం నాకు వినసొంపుగా లేదు. "మధుర వాక్కు" అంటే బాగుంటుంది.
"అమృతమ్ము" - ఇక్కడ "అ" గురువు కాదు లఘువు. మృ అన్నది సంయుక్తాక్షరం కాదు కాబట్టి.
కామేశ్వరరావు గారూ,
ఎప్పటి లాగానే మీకు అనేకానేక నెనర్లు.
సహృదయులైన మీ వంటి వారికి నచ్చేట్టు పద్యం రాయగలిగితే ప్రయత్నం సఫలీకృతం అయినట్టే.
సూచనలకు అనుగుణం గా పద్యాలని ఇప్పుడు సరిచేశా, గమనించగలరు.
నమస్సులతో సనత్.
Its Nice
బావున్నాయండీ.
అవని పౌత్రులు... భలే ప్రయోగం చేసారు. :)
Post a Comment