ఏదో తరుముకొస్తున్నవాడికి మల్లే మురళీ ఇంట్లోంచి బయట పడ్డాడు. ఆలోచనల్నుంచీ దూరంగా వెళ్ళడానికి ప్రయత్నమన్నట్టు సింబాలిక్ గా విశాఖ నగర వీధులన్నీ బండి మీద చుట్టేసి చివరికి బీచొడ్డుకి చేరాడు. సాయంత్రం ఔతోందేమో పిల్లలు స్కూళ్ళనుండీ, ఉద్యోగులు ఆఫీసుల్నుండీ బిలబిలమంటూ బస్టాపుల్లో చేరుతున్నారు. మురళికి ఇవేవీ పట్టటం లేదు.
దురదృష్టవశాత్తూ ప్రముఖ నాయకుడు అకాలమరణం చెందటం, గొప్ప నేతను పోగొట్టుకున్నామే అని ఆంధ్రదేశం ఒకవైపు దుఃఖ సాగరంలో మునిగిపోవటం, దాన్లోనుంచీ తేలిగ్గా సామాన్య ప్రజానీకం బయటపడదేమో అన్న జాలితో (ఉరఫ్) కరుణతో, వారి అనుచరగణం అనుకునే కొందరు అభిమానులు ఆయన పార్థివ దేహం కూడా రాకముందే సంతకాలు సేకరణ, ప్లకార్డులూ అంటూ ఇంకొకవైపు కోలాహలం చేయటం, ముణ్ణాల్గు రోజులుగా ఏ టీ.వీ చానెల్ చూసినా ఒకటే వార్త, అదీ బ్రేకింగు న్యూసు అనుకుంటూ.. ఎవరు ఎవరిపై ఎప్పుడు ఎలా ఒత్తిడి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నారూ, ఎవరెవర్ని కలిశారు, ఏ ఇద్దరి మధ్య ప్రైవేటు సంభాషణ ఏమయ్యుంటుంది అన్న ఊహాగానాలూ, చర్చలూ, రాజకీయ వాతావరణం ఎన్ని డిగ్రీలు వేడెక్కిందీ అని ఊదరగొట్టెయ్యటం తో అసలే కకావికలై ఉన్న మనస్సుకి కూసింత విశ్రాంతి కావాలనుకుంటూ మురళీ బీచొడ్డున ఉన్న తెన్నేటి పార్కు దగ్గర బెంచీ మీద చతికిల పడ్డాడు.
జేబులో నుండీ మొబైల్ ఫోను తీసి వివిధభారతి ఎఫ్.ఎం. ట్యూను చేసి ఇయర్ ఫోన్లు తగిలించుకున్నాడు. లలిత సంగీతం గాబోలు మంద్రం గా వినిపిస్తోంది.చల్లని గాలి తెమ్మరలు వీస్తూంటే పాటనీ, వాతావరణాన్నీ ఆస్వాదిస్తూ ఎప్పుడు నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడో తనకే తెలీదు.
తనేదో అడవిలో నడుచుంటూ వెళ్తూంటే ఎక్కడినుంచో ఒక పరిచయం ఉన్న గొంతు వినిపిస్తోంది. అన్నయ్యా నమస్తే, చెల్లమ్మా నమస్తె.. ఔను కదూ ఇది మన ప్రియతమ నాయకుడిదే... నడకవేగం పెంచా.. శభ్దం వస్తున్న దిశగా.. లోపల ఏదో బలమైన ఆశ... ఏదో తెలియని ఉద్విగ్నత...కాళ్ళకి రాళ్ళూ, రప్పలూ ఎవీ పట్టట్లేదు..కళ్ళు మాత్రం చెవులతో అనుసంధానం అయిపోయి అన్వేషణ సాగిస్తున్నయి.. ఎక్కడనుండీ ఆ పిలుపు?? మనస్సు పరిపరి విధాల ఆలోచనల్ని చేస్తోంది..
ఇది కలా నిజమా ?? డౌటు రాగానే నడక ఠపీమని ఆగిపోయింది.
ఒక్క క్షణం నన్ను నేను గిల్లుకుని చూశా. అబ్బ... నొప్పి పుట్టింది. అయితే నిజమే... ఎందుకైనా మంచిది అని చుట్టూ చూశా. నాలానే చుట్టూ చాలా మంది ఉన్నారు. అటూ ఇటూ హడావుడిగా పరిగెడుతున్నారు. అందరి మొహాల్లోనూ ఏదో ఆందోళన, ఏదో తాపత్రయం కనిపిస్తోంది. సందేహ నివృత్తి చేసుకుందామని ఒకణ్ణి అడిగా, ఏమిటి సంగతి అని. వాడొక క్వొశ్చెన్ మార్కు ఫేసుతో చూశాడు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ట్రై చేశా.. నాకొచ్చినవి ఆ మూడే మరి..ఊహూ. ఏం లాభం లేకపోయింది... వాడికి అర్ధమయ్యీ చెప్పట్లేదా? నా భాషే అర్ధం కావట్లేదా?..కొంపతీసి తమిళమో/ మళయాళమో/ ఒరియానో కాదు కదా? ఔనూ మన నాయకుడికి కూడా ఇటువంటి పరిస్థితే ఎదురయ్యి ఉంటే..
అమ్మో...ఒక్కసారి వెన్ను లో జలదరింపు....
అయ్యుండదులే అని నాకు నేనే భరోసా.. ఇంతలోనే మళ్ళీ ప్రశ్నలు...
ఔనూ నేనున్నది ఏ ప్రాంతం అడవి? మొబైల్ తీసి జి.పి.ఆర్.ఎస్ చూడాలా? నేనసలు అడవిలో ఎందుకున్నా? ఎక్కడకి వెళ్తున్నా??.....పుట్టలోంచి పాములొస్తున్నట్టు ఆలోచనలు దొంతర్లు దొంతర్లు గా వచ్చేస్తున్నై...
అంతలోనే మళ్ళీ స్వరం వినిపించింది...నమస్తే.. నమస్తే.. ...వెనక ఎక్కణ్ణుంచో..
అనవసరంగా ఆగానే అనిపించి మళ్ళీ నడకందుకున్నా... దగ్గరౌతున్నకొద్దీ మరింత స్పష్టంగా వినిపించసాగింది... నడక పరుగయ్యింది....దార్లో తుమ్మ చెట్లూ, వాగులూ, వంకలూ ఏవీ నాకడ్డుగా అనిపించలేదెందుకనో... పరిగెత్తటం వల్లనో.. లేక మనస్సులో ఆందోళన వల్లనో.. గుండె వేగంగా కొట్టుకోసాగింది..
కాళ్ళైతే దగ్గరికి తీస్కెళ్తున్నాయన్న మాటే గానీ వింత వింత ఆలోచనలు అమాంతం నామీద దాడి చేసేస్తూనే ఉన్నయి. టీ.వీ విపరీతం గా చూసేసిన ఫలితంగానో ఏమో గానీ.. ఆయన కనిపించగానే నా రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఆశ్చర్యమా..? ఉద్వేగమా..? ఆనందమా...? దుఃఖమా..? ఏమో... ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తూంటే. పంచుకోటానికి సరైన తోడు లేదే.. ఎవరికైనా ఫొన్ చేసి చెప్పనా? ఇంటర్వ్యూ చేసేసి దాన్ని ఏ టీ.వీ పంధొమ్మిదికో, నక్షత్రా టీ.వీ కో పంపెయ్యనా.. రెండుమూడు క్లోజప్ ఫోటోలు దిగి న్యూస్పేపరోళ్ళకి ఇచ్చేసుకోనా....సెల్ ఫోనులో పిక్చర్లు తియ్యనా..?
ఖస్స్...ముల్లొకటి కాల్లోకి దిగటంతోనే మళ్ళీ ఈ లోకం లోకి వచ్చా.. అనుచరుణ్ణి అనుకుంటూనే పిచ్చి పిచ్చి పోకడలకి పోవటం నాకె వింతగా అనిపించినై.
అలోచనలు ఇంకో రూట్లో వెళ్ళిపోసాగాయి.. నాయకుడు ఏమయ్యిందీ 18 గంటలయ్యినా ఇంకా ఎవరికీ అంతు చిక్కలేదు. అసలు ఇంటెలిజెన్సు, భద్రతా సిబ్బందీ, అధికారులూ ఏంచేస్తున్నట్టు? కాలక్షేపానికి టీ.వీ.కి అతుక్కుపోయారేమో అనుకోటానికి కనీసం ఐ.పి.ఎల్ మాచులు గానీ.. శాసన సభా ప్రసారాలు కానీ లేవే.. అయినా ఆ ఎగిరే విమానమో, హెలికాప్టరో ఇంగ్లీషు సినిమాలోలాగా రోడ్డు మార్గానికి పైనే ఎగరచ్చుగా? అడ్డం పడి అడవులమ్మట పోకపోతే నష్టమేమిటి? ఒక ఆర్.టీ. ఐ. ఫైలు చెసి పాడేద్దాం.. ఒక ముఖ్య అధికారి టూరుప్రోగ్రాం ఔతూంటే విధినిర్వహణ లో ఎన్నిసార్లు ఎంతమంది ఎలా తప్పులు చేసారు? ఇకపై అలా జరక్కుండా ఉండాలంటే తీస్కుంటున్న జాగ్రత్తలేమిటి? ఒక ఇరవై రూపాయల్తో ఆర్.టీ. ఐ. వేసేస్తే సరి. తలా తోకా లేకుండా ఉన్న ఆలోచనలతో ఆవేశంగా ఊగిపోతున్నా...
సౌండు మరింత దగ్గరయ్యింది. కనుచూపు మేరలో ఒక పెంకుటిల్లు ...దాని బయట చప్టా చేసిన అరుగు, రెండు మూడు బెంచీలు.. వేలాడుతున్న లాంతర్లు...కనిపించినై
మిణుకు మిణుకు మంటున్న ఆశ కాస్తా గుండెకిమల్లే లబ్-డబ్, లబ్-డబ్ అని కొట్టుకోసాగింది... కొంపతీసి అది అన్నలో తమ్ముళ్ళో ఉండె ఇల్లుగానీ కాదుకదా.. అప్పటిదాకా రాని ఆ ఊహ అప్పుడే రావటంతో గుండె ఒక సెంటీమీటరు కిందకి జారినట్టయ్యింది. ఇంట్లో మా అవ్వ, మా ఆవిడ, మా బుడ్డోడు, ఊర్లో ఉండే మా అమ్మ, నాన్న గుర్తొచ్చారు. గాలొస్తే ఎగిరిపోయే రూపం నాది, నాకెందుకొచ్చిన ఆత్రం??? పిరికిదనం విశ్వరూపసందర్శన యోగం ఇవ్వటంతో వళ్లంతా ముచ్చెమటలు పట్టేశాయి. నాలుక తడార్చుకు పోయింది.
అంతలోనే గంభీరమైన గొంతు.. నమస్తే.. నమస్తే.. అన్నయ్యా నమస్తే, చెల్లమ్మా నమస్తె.. నమస్తే.. నమస్తే..
ఇక ఉండబట్టలేక ధైర్యం చేసి ఉదుక్కున ఆ పెంకుటింట్లోకి దూరా. అక్కడున్నది చూసి ఒక్కసారి అవాక్కయ్య..
మహానాయకుడి ఎన్నికలలో మాటల్ని అదేదో టీ.వీ. లో పదే పదే వినిపిస్తున్నారు. నమస్తే.. నమస్తే.. అన్నయ్యా నమస్తే, చెల్లమ్మా నమస్తె.. నమస్తే.. నమస్తే.. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం, ఆనందం ఒక్కసారి ఉస్సూరుమని పోయాయి. అయ్యో.. ఎంత ఊహించుకుంటూ వచ్చానో, పడ్డ శ్రమంతా వృధా ప్రయాస అయ్యిందే... నిస్సత్తువ వళ్లంతా పాకింది.
టీ.వీ. మాత్రం నిరాటంకంగా ప్రసారం చేస్తూనే ఉంది..
అప్పుడప్పుడు ఆవేశపరుల్ని, కొన్నిసార్లు ఆచరణపరుల్ని చూపిస్తూ మధ్యమధ్య నాయకుడి ఫోటోల్నీ, చరిత్రనీ, చేసిన సేవనీ తిప్పి తిప్పి చూపిస్తున్నారు. ఇంతలో జనం నాడి తెలుసుకుందాం రమ్మంటూ అక్కడ ఉన్న జనవాహినికి మైకందించింది రిపోర్టరమ్మ. "ఏ విధంగా మన ప్రియతమ నేత ఆశయాల్ని ముందుకు తీసుకెళ్దామనుకుంటున్నారు" అమాయకం గా అడుగుతోంది రిపోర్టరమ్మ.
"అడవిలో స్మారక స్థూపం కట్టించాలి" ఒక యువనేత నినాదం.
"అడవుల్ని కొట్టించి మంచి రోడ్డు వేయిస్తే ఇకపై అట్లాంటి ప్రమాదాలు జరగవు. మేఘాలూ రావు కాబట్టి దారికనిపించకపోయే చాన్సే లేదు" ఇంకొకళ్ళు దాన్నే బలపర్చారు.
"ఒకవేళ దురదృష్టవశాత్తూ ప్రమాదం లాంటిదేమైనా జరిగినా ప్రమాదస్థలి చేరుకోటానికి ఆలస్యం జరగదు." మరొకళ్ళు గొంతు కలిపారు.
ఒకళ్ళిద్దరికి ఎవో ధర్మ సందేహాలొస్తున్నట్టున్నాయి.. 'స్థూపం వద్ద ...మరి... రక్షణ...." మధ్యలోనే అందుకున్నారు మరొక వృధ్ధనేత. "దారి వెయ్యటం వల్ల స్తూపం వద్ద అశెష ప్రజానీకం పూజలూ చేసుకోవచ్చు" "ఆ కొట్టించిన అడవి స్థానం లో ఆవాస్ యోజన ఇళ్ళు వగైరా కట్టిస్తే ఆయన పేరు చెప్పుకుని గిరిజనులూ, ఆయన అభిమానులూ నివాసం ఏర్పరచుకుని జీవనం సాగిస్తారు" ఇంకొక వీరాభిమాని నినాదం...జనం చప్పట్లలో ఒక మంత్రివర్యులు కళ్ళు తుడుచుకుంటూ అందుకున్నారు "అలా చెయ్యటం వల్ల అక్కడకి భవనాలు, వసతులూ, మంచి నీరు, ఆరోగ్యం.. పరిశ్రమలూ అన్నీ ఏర్పడతాయి. సెల్ ఫోన్లూ, ఇంటర్నెట్టూ ఒకటేమిటి ఈ ప్రాంతం రూపు రేఖలే మారిపోతాయి".. అందరూ అంగీకరిస్తున్నట్టు కరతాళధ్వనులు...
ఈ వర్గం వాళ్ళు ఇల్లా టీ.వీ. లో పంచవర్ష ప్రణాళికలు వేయటం పక్కనే ఉన్న ఇంకొక వర్గం వాళ్ళకి అంతగా రుచించలే. "మన నాయకుడికి పద్మశ్రీ ప్రకటించాలి". వాళ్ళల్లో ఉన్న ఒక పండుటాకు అంది. "ఒక్క పద్మశ్రీ ఏమిటి? ఒకేసినిమాని అన్ని అవార్డులూ వరించినట్టు, ఈ సంవత్సరం పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ వగైరా అన్నీ ప్రకటించాలి" ఆ నాయకుడి అనుచరగణం లో ఒక ఉడుకు రక్తం గొంతెత్తింది. "అంతే కాదు. అర్జున, ద్రోణాచార్యలతో పాటూ ప్రతిష్ఠాత్మకమైన రాజీవ్ ఖేల్ రత్న కూడా ప్రదానం చెయ్యలి" కోరుకున్నాడో ప్రభు భక్తి పరాయణుడు. ఇక్కడా దాదాపు ఏకాభిప్రాయం సాధిస్తున్నట్టే కనిపిస్తోంది.. కరతాళధ్వనులు మిన్నంటాయి.
ఇంకొక వర్గం ఇంక ఇల్లా లాభంలేదనుకుని జయజయధ్వానాలు ఎత్తుకుంటున్నాయి. కెమేరా అప్పటికి గానీ వాళ్ళని క్లోజప్ లో చూపించలేదు మరి. "ఆ మహాత్ముడు చూపించిన దారే మా ముందున్న కర్తవ్యం. ఆయన కన్న కలల్ని సాకారం చేస్తాం అదే ఆయనకు మా నివాళి. కాకపోతే అది మా అంతట మేం చెయ్యలేం. ఫలానా వాళ్ళు మాత్రమే మాకు దారి చూపించగలరు. అప్పుడు మాత్రమే మేము ఇవన్నీ చెయ్యగలం. లేకపోతే మమ్మల్ని మేము నాశనం చేసేకుంటాం... ఉద్యోగాలకీ, పదవులకీ, జీవితాలకీ రాజీనామా చేసేస్తాం..." ముక్తకంఠం తో అన్నారు. అందరూ ఒకేసారి ఒకే మాడ్యులేషన్ తో ఒకే మాటని అనగలగటం ఖచ్చితం గా ఒక కళే. ఉన్నట్టుండీ వాతావరణం రాజుకుంది..
అప్పటిదాకా బరువెక్కిన గుండెలతో భోరుమన్న ప్రదేశం కాస్తా జయజయ ధ్వానాలతో ఎన్నికల వాతావరణాన్ని మరిపించింది. పొందిన సాయానికి కృతజ్ఞతగా ఆ మహాత్ముణ్ణి కడసారి దర్శించుకుందామని వచ్చిన పేదావాళ్ళతో పాటూ టీ.వీ లోఈ తతంగం చూస్తున్న నాకు కళ్ళు తిరగసాగాయి. ఎవరో మొహమీద నీళ్ళు చిలకరిస్తున్నట్టు లీలగా గుర్తు.
ఉలిక్కి పడి కళ్ళు తెరిస్తే నీళ్ళు చిలకరించటం కాదు గుమ్మరిస్తున్నట్టుగా వర్షం. అప్పటికి గానీ మురళి ఈ లోకంలోకి రాలేదు. అందరిలాగే తనూ ఒక చెట్టు నీడకి పరుగెత్తాడు.
2 comments:
కథనం బావుంది.
రవిగారూ జరుగుతున్న పట్టాభిషేకం హడావుడి చూస్తూంటే పాములపర్తి వారికీ, నందమూరి వారికీ ఉత్తమ గతులు కాదు కదా కనీసం ఉత్తర కర్మలు కూడ సరిగ్గా జరగలేదు కానీ ఇక్కడ భజన మరీ ఎక్కువైపోయిందే అని ఆవేశం, ఉక్రోషం తన్నుకొస్తోంది మరి.
Post a Comment