Thursday, January 27, 2011

పూరించిన (సమస్యా) శంఖం : శ్రీ కంది శంకరయ్య గారు


కంది శంకరయ్య గారికి పోలికలు చెప్పాలంటే "జగమెరిగిన బ్రాహ్మడు", "అలుపెరుగని బాటసారి". "నిత్య కృషీవలుడు" మొదలైనవి టపటపా వచ్చేస్తాయి. అన్నింటిలోకీ ఉత్తమమైనది మాత్రం "నిశ్శబ్ద విప్లవం".  నిర్మొహమాటం గా చెప్పాలంటే రెండొందలు పై చిలుకు సమస్యలనిచ్చినా ఇంకా ఆయన "కొత్త బిచ్చగాడే - పొద్దెరగడు". పండగలేదు పబ్బం లేదు, శనివారం లేదు ఆదివారం లేదు, సమస్యలు వస్తూనే ఉంటాయి. పూరించపోతే వెనకబడిపోతున్నామనే దిగులు పట్టుకుంటుందనటంలో అతిశయోక్తి లేదు.

ఈత నేర్చుకొనుట ఎట్లు? వంటి క్లాసులు తీస్కోకుండా ఎందరినో ఏట్లోకి దింపి, ఈత కొట్టించిన ఘనత, చెయ్ తిరిగిన ఈతగాడికి మల్లే ఫీట్లు కొట్టించిన ఘనత ఈయనదే. దిగితేనే ఈత వస్తుంది, మొదలెడితేనే రాయటం వస్తుంది. ఏదో భావాన్ని ఊహించుకుని రాసుకో అనటం వేరు. అది ఇంటర్మీడియట్, ఆపై చదువులాంటిది. అది కొందరికి అబ్బుతుంది. కానీ ఎంతోమందికి క్లాసు వర్కు, హోం వర్కు ఇస్తూ నేర్పవలసి రావచ్చు. జ్ఞానార్జన పెంచటం, సందేహాలనూ, దోషాలనూ తీర్చటం,  భాషణలెక్కువ ఇవ్వకుండా బాధ్యత తలకెత్తుకోవటం అందరికీ సాధ్యమయ్యేది కాదు.

ఒంట్లో బాగోలేకపోతే సమస్యాధార కి ఆటంకమౌతోందేమో అని చిన్నబుచ్చుకుంటారు. ఇంట్లో నెట్ లేకపోతే ఎక్కడో ఇంటర్నెట్ సెంటర్ లో కూర్చుని త్వర త్వరగా దిద్దుబాటులిచ్చేసి వెళ్ళిపోతారు. అడగనివాడిది వాడిది తప్పు అన్నట్టు అడిగిన ప్రతివాడికీ విద్యా దానం చేస్తునే ఉన్నారు, రాసిన ప్రతీ పూరణకీ స్పందిస్తారు. ఆత్మీయంగా హృద్యంగా పలకరిస్తారు. ఆడంబరాలకీ, భేషజాలకీ ఏమాత్రం తావివ్వని వ్యక్తిత్వం. అన్నీ వెరసి అన్నపూర్ణలా సుష్టుగా భోంచేయిస్తారు.

నిశ్శబ్ద విప్లవం కాస్త పెద్దమాటేమో అని అనిపించవచ్చు. అంత తెచ్చేసిన విప్లవం ఏముంది అని కూడా అనిపించవచ్చు. "నేను సైతం పద్య వీణకు కవులనే తంత్రులుగ జేస్తాను" అన్నట్టుగా చ్చిన్న చిన్న ఎక్షర్సైజులతో ఒక్కొక్కరిచేత ఇన్నేసి పద్యాలకు పూరణలు ఇప్పింపజేయటం మాటలా? బిందువు బిందువును జేరి సింధువగును అన్న దాశరథిగారి మాటలు వీరి కర్తవ్య నిర్వహణలో నిత్య సత్యాలు.

కెమిస్ట్రీ చదువుకునేటప్పుడు కేటలిస్టు అన్నది ఒకటి ఉంటుందనీ, రసాయనిక చర్యలలో దానంతట అది ఏమీ చెయ్యదు కానీ దాని సాన్నిధ్యమే చెయ్యాల్సినది చేసేస్తుందనీ చిన్నప్పుడు చదువుకున్నం. ఇప్పుడు అనుభవం తో నేర్చుకుంటున్నాం
 
ఎన్టీవోడికున్నంత ఫాన్ ఫాలోయింగు రేలంగికి ఉండకపోవచ్చు. కళామతల్లి సేవలో వారి స్థానం వారిది. కవిత్రయాన్ని, పోతననూ, విశ్వనాథనూ వివరింపకపోవచ్చు కానీ తెలుగు సాహిత్య సేవలో శంకరైయ్య గారి స్థానం వారిది.

నన్ను ప్రభావితం చేసిన వ్యక్త్యులలో శంకరయ్య గారొకరు. వారికిదే కృతజ్ఞతా పూర్వక నమస్కృతి

స్పందనమును నేర్పి పద్యాలు కూర్పించి
పూరణమ్ము లిచ్చె పుణ్య మూర్తి
ఏమొసంగగలను? ఈ పద్య పుష్పమ్ము
కంది శంకరయ్య కంద జేతు

లంకె : http://kandishankaraiah.blogspot.com/

Wednesday, January 26, 2011

గణతంత్ర దినమ్మునాడు క్షమియింపగదే?





అణువణువున దోపిడితో
క్షణమునకో కుట్రతోడ, కక్షలతో దు
ర్గుణముల వెల్గెడి బిడ్డల
గణతంత్ర దినమ్మునాడు క్షమియింపగదే ?


Tuesday, January 25, 2011

పండిట్ భీంసేను మీకు ప్రాఞ్జలు లివ్వే




దండిగ ఆలాపనలున్,
మెండుగ రాగాలు బాడు మేలౌ గానో
ద్దండా, కీర్తి ప్రచండా    
పండిట్ భీంసేను మీకు ప్రాఞ్జలు లివ్వే