Wednesday, October 6, 2010

పద్యం అనుకరణ, అనుసరణ



Copy from one, it's plagiarism; copy from two, it's research --Wilson Mizner (1876 - 1933)


ఎకడమిక్స్ లో దీన్ని రిసెర్చ్ అంటారు, ఆర్టులో "స్ఫూర్తి" అంటారు :-) --'ఫలానా' కామేశ్వరరావు గారు. 


రవిగారు తమ బ్లాగాడిస్తా లో  పద్యం రాద్దామనే ఔత్సాహికులకు సూచనలు ఇస్తూ "ఇదివరకు ప్రముఖ కవులెవరైనా వ్రాసిన టెంప్లేటును వాడుకుని మీరు అందులో సబ్జెక్టు, కొన్ని పదాలు మార్చి, మీ పద్యంలా భ్రమింపజేయవచ్చు. ఇదొక ట్రికీ కళ. అలవడితే మాత్రం భలే రంజుగా ఉంటుంది" అన్నారు. దాన్నించి స్ఫూర్తి పొందినదే ఈ టపా.


పద్య రచనలో అనుకరణ, అనుసరణ వీటికి ఒక ప్రత్యేకత ఉంది. మనలను ప్రభావితం చేసిన వారి పంథాలో మనమూ నడిస్తే (ఇష్టం ఉన్న కారణం చేత) అప్రయత్నం గా మన రచనలో వారి శైలి పొడచూపితే అది అనుకరణ. ఇక్కడ స్ఫూర్తి పద ప్రయోగం వరకు మాత్రమే నియమితమై ఉంటుంది.


ఉదా. "మందర మకరంద" అనో, "ఎవ్వనిచే జనించు" అన్న పదంతోనో ఏదైనా పద్యం మొదలైతే, చదువరులకు అసలు పద్యం (చిరస్థాయిగా నిలిచిఉన్న ఆణిముత్యాలవంటి పద్యాలు) స్ఫురణకు రావటం, ఆహ్లాదం కలగటం అన్నవి అటువంటి ప్రయోగాలకు, పదాల వాడుకకూ స్ఫూర్తి.


అదేకనుక పద్యభావం నుండి కూడా స్ఫూర్తిపొందితే అది అనుసరణ. ఒక విధం గా చెప్పలంటె తత్ మూల పద్యాన్ని రాసిన కవికి ఈ పద్య రచయిత సమర్పించుకునే కృతజ్ఞతాపూర్వక నమస్కృతి అన్నమాట.


పోతన కృతులలో నేను గమనించిన కొన్ని అనుకరణలు...అనుసరణలూ....


కవిత్రయంలో ముందుగా "ఆంద్ర కవితా గౌరవ జన మనోహారి నన్నయ్య సూరి" అని పిలువబడ్డ నన్నయ్య కవితానుసరణ


నన్నయ్య:


శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే


పోతన- (వీరభద్ర విజయము లో ఇట్లనువదింపబడింది)
సిరియును వాణి గౌరి యనుజెన్నగు కన్యకు మేను, వాక్కు బె
న్నురమును నుంకువిచ్చి ముదమొప్పవరించి జగంబులన్నియున్
దిరములు సేయబ్రోవదుదిదీర్పగ ద్రష్టయుగేక్షణుండునై
హరివిధిశంభుమూర్తి యగు నాద్యుడు మాకు ప్రసన్నుడయ్యెడిన్.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"హరి హర చరణారవింద వందనాభిలాషిందిక్కన మనీషింభూషించి" అని కీర్తించిన తిక్కన అనుసరణలు


తిక్కన 1 :


రాజటె ! రాగహీనుడతె ! రాజిత సుందరమూర్తి యట్టె ! వి
భ్రాజిత సంపదున్నత విభాసిత వర్తనుడట్టె ! కామినీ
రాజ మనోజ్ఞ భంగి చతురత్వధనుండటె ! బ్రహ్మచర్య దీ
క్షాజిత మన్మధుండునటె జన్మము లిట్టివు యెందు గల్గునే ? --> (శాం. 2 -103)


పోతన:
రాజటె ! ధర్మజుండు ! సుర రాజ సుతుండతె ధన్వి! శాత్రవో --> (1 - 211)


తిక్కన 2 :
సకల స్థావర జంగమంబులు భవత్సాన్నిధ్య మాత్రంబునన్ --> (ఉద్యో. 1 - 186)


పోతన 2:
సకల స్థావర జంగమ ప్రతతికిన్ జర్చింప దానాఢ్యుడై --> (3 -1019)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


ఎఱ్ఱన రచించిన నృసింహ పురాణం లో పద్యాలకు పోలికగలిగిన పోతన పద్యాలు.....


అసలు 1:
వాసుదేవుని పాదవనరుహంబుల భక్తి తగదను తండ్రియు తండ్రికాదు
వేదచోదితమైన విష్ణుధర్మమునకున్ గోపించు గురుడును గురుడుగాడు
భవదుఃఖముల మ్రాంప బ్రభువైన హరిసేవ నెడలించు హితుడును హితుడుగాడు 
వరయోగ మతమగు వైష్ణవ జ్ఞానంబు వదలిన చదువును చదువు గాదు
కేశవాకార లీలలు గీలుకొని ము
దంబు బొందని తలపును తలపుగాదు
మాధవస్తోత్ర ఘన సుధా మధుర రుచుల 
జిలుకకుండెడి జిహ్వయు జిహ్వ కాదు. ---> (నృ. 5-22)


కొసరు పద్యం 1 ఏమిటో చెప్పగలరా?


అసలు 2: 
కలడు మేదినియందు కలడుదకంబుల
గలడు వాయువునందు గలడు వహ్ని
గలడు భానుని యందు గలడు సోముని యందు
గలడంబరమున గలడు దిశల
గలడు చరంబులచరంబుల గలడు బాహ్యంబునగలడు లోన
గలడు సారంబులగలడు కాలంబుల గలడు ధర్మంబులగలడు క్రియల
గలడు కలవాని యందును గలడులేని
వానియందును గలడెల్ల వాని యందు
నింక వేయునునేల సర్వేశ్వరుండు
కలడు నీయందు నాయందు గలడు గలడు --> (నృ. 5 - 78)


కొసరు పద్యం 2 ఏమిటో చెప్పగలరా?


అసలు 3:
కుడిచినపుడు నిద్రగూరినయప్పుడు
మేలుకొనిన యపుడు మెలగినపుడు
విష్ణు కీర్తనంబు విష్ణు చింతయు కాని
పలుకడొండు బుధ్ధి దలపడొండు --> (నృ.3 - 150)


కొసరు పద్యం 3 ఏమిటో చెప్పగలరా?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


సోమనాధుని బసవ పురాణం:


క్షీరాబ్ధి లోపలక్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావగ?
జూత ఫలంబులజుంబించు చిలుక
భ్రాతి బూరుగు మ్రాని పండులు గన్గొనునె?
రాకామల జ్యోత్న దావు చకోర
మాకాంక్ష సేయునే చీకటి ద్రావ?
విరిదమ్మి వాసన విహరించు దేటి
పరిగొని సుడియునే ప్రబ్బిలి విరుల? --> (3 - 82)


కొసరు పద్యం 4 ఏమిటో చెప్పగలరా?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


భాస్కరుని రామాయణం:


కుప్పించు నురవడి గుంభిని వడిగ్రుంకి
సర్వాధిపతి తలల్ సదియ నదుమ
నగయు నూకున మీది కెత్తి పాఱిన తరు
శ్రేణులు చుక్కలు జెదర నడువ
నెఱకలు జాడించు నేపున గడలెత్తి
యేడు వారాసులు నెడములొత్త
బఱచు బల్వడి నభ్ర పంక్తులు సుడిగొంచు
వలయంపుగొండ యవ్వలికి దూల దూల
పర్వతములు వడక్ బ్రహ్మాండ కోటర
మదృవ గగన వీధి నరుగుదెంచె?
రఘుకులేంద్ర బంధ విఘటనత్వరితాంత  
రంగుడగుచు నవ్విహంగ విభుడు.


కొసరు పద్యం 5 ఏమిటో చెప్పగలరా?