Tuesday, November 2, 2010

పోతనవారి "కాపీ" పద్యాలు

పోతనామాత్యుణ్ణి కాపీకొట్టాడు అనటం భావ్యం కాదేమో కానీ పోతనను అంతగా ప్రభావితం చేసిన ఎఱ్ఱన వారి అనుసరణ, అనుకరణలతో పోతనకృతులు చూస్తూ ఉంటే....స్ఫూర్తిగొన్న పద్యాలనటం బావుంటుందేమో...

అసలు పద్యం 1: (నృసింహ పురాణం . 5-22)
వాసుదేవుని పాదవనరుహంబుల భక్తి
తగదను తండ్రియు తండ్రికాదు
వేదచోదితమైన విష్ణుధర్మమునకున్
గోపించు గురుడును గురుడుగాడు
భవదుఃఖముల మ్రాంప బ్రభువైన హరిసేవ
నెడలించు హితుడును హితుడుగాడు
వరయోగ మతమగు వైష్ణవ జ్ఞానంబు
వదలిన చదువును చదువు గాదు
కేశవాకార లీలలు గీలుకొని ము
దంబు బొందని తలపును తలపుగాదు
మాధవస్తోత్ర ఘన సుధా మధుర రుచుల
జిలుకకుండెడి జిహ్వయు జిహ్వ కాదు.

కొసరు పద్యం 1: (పోతన భాగవతం 7- 169)
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
శేష శాయి కి మొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పిడి గురుడు గురుడు
తండ్రి హరిచేరుమనియడీ తండ్రి తండ్రి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


అసలు పద్యం 2: (నృసింహ పురాణం . 5-78)
కలడు మేదినియందు కలడుదకంబుల
గలడు వాయువునందు గలడు వహ్ని
గలడు భానుని యందు గలడు సోముని యందు
గలడంబరమున గలడు దిశల
గలడు చరంబుల గలడచరంబుల
గలడు బాహ్యంబున గలడు లోన
గలడు సారంబుల గలడు కాలంబుల
గలడు ధర్మంబుల గలడు క్రియల
గలడు కలవాని యందును గలడులేని
వానియందును గలడెల్ల వాని యందు
నింక వేయునునేల సర్వేశ్వరుండు
కలడు నీయందు నాయందు గలడు గలడు

కొసరు పద్యం 2 :  (పోతన భాగవతం 7- 274)

కలడంబోధి గలండు గాలి గలడాకాశంబునం గుంభినిం
గలడగ్నిన్ దిశలంబగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మ లం
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులందంతటం
గలడీశుండు గలండు తండ్రి వెదకంగా నేల యీ యాయెడన్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

అసలు పద్యం 3: (నృసింహ పురాణం . 3-150)
కుడిచినపుడు నిద్రగూరినయప్పుడు
మేలుకొనిన యపుడు మెలగినపుడు
విష్ణు కీర్తనంబు విష్ణు చింతయు కాని
పలుకడొండు బుధ్ధి దలపడొండు

కొసరు పద్యం 3: (పోతన భాగవతం 7- 123)
పానీయంబులు డ్రావుచు న్ గుడుచుచున్ భాషించు చు న్ హాస లీ
లా నిద్రాదులు సెయూఛూన్ దిరుగుచున్ లక్షించుచున్ సంతతా
శ్రీ నారాయణ పాద పద్మ యుగళీ చింతామృతా స్వాద సం
ధానుండై మఱచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భువరా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


అసలు పద్యం 4: (సోమనాధుని బసవ పురాణం లోని ద్విపద. 3 - 82)
క్షీరాబ్ధి లోపలక్రీడించు హంస
గోరునే పడియల నీరు ద్రావంగ(?
జూత ఫలంబులజుంబించు చిలుక
భ్రాతి బూరుగు మ్రాని పండ్లు  గన్గొనునె?
రాకామల జ్యోత్న దావు చకోర
మాకాంక్ష సేయునే చీకటి ద్రావ?
విరిదమ్మి వాసన విహరించు దేటి
పరిగొని సుడియునే ప్రబ్బిలి విరుల?

కొసరు పద్యం 4: (పోతన భాగవతం 7- 150)
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ జనునె తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం
బరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు చేరనేర్చు
వినుత గుణశీల మాటలు వేయునేల.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అనుసరణ పద్యాలన్నీ చిత్రంగా సప్తమస్కంధంలో ప్రహ్లాద చరిత్రలోనే ఉండటం, వాటికి స్ఫూర్తినిచ్చిన పద్యాలు నృసింహపురాణంలోవి కావటం వెనక కారణం బహుశా భాగవతంలోని ఆ కథా రచన చేసేముందు పోతనామాత్యుడు నృసింహపురాణాన్ని ఆస్వాదించి ఉంటాడేమో... అందుకే అట్లాంటి భావాన్నే చెబుదామనుకున్నప్పుడు పద్యం కూడా అట్లానే వచ్చేసి ఉండి ఉంటుంది. (ఇది నా ఊహ మాత్రమే సుమా ! )     

5 comments:

కొత్త పాళీ said...

quite possible! :)

రాజేష్ జి said...

@Sanath Sripathi

మీరు చెప్పిన దాని బట్టి..నిజమే.. అదే స్పూర్థితో రాసానట్లుంది.. కాపొతె మరీ గ్రాంధికం కాకుండ కొద్దిగా లేతనైన పదాలు వాడారు.
ముఖ్యముగా "మందార మకరంద మాధుర్యమున దేలు" నాకు బాగ నచ్చింది.. ఆహా ఎంత తీయగా ఉందో

Sanath Sripathi said...

ధన్యవాదాలు రాజేష్ , కొత్తపాళీ గారు!!

Nrahamthulla said...

వ్యాప్తినిజెందక వగవక ప్రాప్తించిన లేశమైన పదివేలని ఎంచి.... అనే వామనుడి పూర్తిపద్యం ప్రచురించగలరా?

Nrahamthulla said...

వలబోజు జ్యోతి గారు పద్యాన్ని పంపారుః
వ్యాప్తిన్ జెందక,వగవక,
ప్రాప్తించినలేశమైన పదివేలనిచున్
దృప్తింజెందని మనుజుఁడు
సప్త ద్వీపములనైనఁ జక్కంబడునే?
---- పోతన భాగవతం అష్టమ స్కంధము ౫౭౩