మీకిది భావ్యమా? రమణ ! మీకయి మీరిటు నిశ్చయించినన్
మాకెవరయ్య దిక్కు యని మారము చేయరొ బుంగమూతితో
మీ కతి ప్రీతిపాత్రులగు మీ బుడుగున్, మరి బాపు బొమ్మలున్!
శ్రీ కరమైన ధామమును జేరగ మీకిటు తొందరేలనో?
కమ్మగ కధలను జెప్పగ
రమ్మని పిలుపొచ్చెనేమొ రమణకు ! బాపూ
కొమ్మల నూగెడు కోయిల
ఇమ్మహి విడి నాకమునకు ఇటజనె నకటా !!
కళ్ళల్లో వెలుగువు మా
ఇళ్ళల్లో నవ్వునింపు ఇనుడవు ! నీకే
మళ్ళీ జన్మొకటుంటే
వెళ్ళొచ్చెయ్ ముళ్ళపూడి వెంకట రమణై !!
మా తండ్రిగారికి బాబాయి వరస ఔతారు శ్రీ ముళ్ళపూడి వారు (పెత్తల్లి, పినతల్లి బిడ్డలు). ఎప్పుడు మద్రాసు వెళ్ళినా కక్కిగారిని (ముళ్ళపూడి వారి తల్లిగారిని) కలవకుండా వచ్చేవారు కాదు నాన్నగారు. రాముడూ - స్ఫూర్తి అని నేన్రాసుకున్న పద్యాలు విన్న మొదట్లో నాన్నగారు బాపు రమణలకు వీలైనప్పుడు చూపిస్తే సంతోషిస్తారు అన్నారు. అది కాస్తా తీరకుండానే వీరు విజయం చేయటం.... వేటూరివారు, ముళ్లపూడి వారు మొదలైన హేమాహేమీలు, జగజ్జెట్టీలు ఇట్లా తెలుగు ప్రియులను వదిలి సుదూర తీరాలకు వెళ్ళిపోవటం అత్యంత దురదృష్టకరం....
వారి రచనలద్వారా, వారి బుడుగుద్వారా, బాపూ బొమ్మలద్వార వారు మనలకు స్ఫూర్తి కలిగించాలని ఆకాంక్షిస్తూ...
(నాకు నచ్చిన ఈ బొమ్మ అన్వర్ గారు వేసినది. దాని లంకె ఇక్కడ)
http://www.flickr.com/photos/anwartheartist/5441482567/sizes/m/in/photostream/
వారి నుండీ లిఖిత పూర్వక అనుమతితీసుకోకుండా ఇక్కడ ప్రచురించినందుకు వారికి సభాముఖంగా క్షమాపణలు
5 comments:
"వేటూరివారు, ముళ్లపూడి వారు మొదలైన హేమాహేమీలు, జగజ్జెట్టీలు ఇట్లా తెలుగు ప్రియులను వదిలి...."
భాషకు, సాహిత్యానికి తన జాతి ఇచ్చిన(?) ప్రాముఖ్యతను చూసి ఉండాలనిపించలేదేమో నండి.
శ్రీపతి గారు మరేం పర్లేదు.
ఘనమైన నివాళి
సనత్ శ్రీపతి గారు
మీరు బాగా రాస్తారని తెలుసును. కానీ విశ్లేషణాత్మకమైన పెద్ద టపాలు మీ బ్లాగులో నేనెప్పుడూ చూడలేదు. ఇప్పుడు మీరు రాస్తున్న వ్యాఖ్యలు చూసి అడుగుతున్నాను. అలాంటి టపాలు మీరు గతంలో ఎప్పుడైనా రాసి ఉంటే లింక్ ఇవ్వగలరు.
నీకే
మళ్ళీ జన్మొకటుంటే
వెళ్ళొచ్చెయ్ ముళ్ళపూడి వెంకట రమణై..!!
Really true Santh
Post a Comment