Sunday, January 29, 2012

రాముడు- స్ఫూర్తి- మాతృ హృదయం


శ్రీ కృష్ణ జననం కథ చదువుకుంటున్నప్పుడు దేవకీ దేవికి సప్తమ గర్భంగా జన్మించిన బలరాముణ్ణి యోగమాయ గోకులానికి చేర్చింది, ఆ తరువాత కృష్ణుడు పుట్టడం, కావలి వాళ్ళందరూ నిద్రపోతూంటే వసుదేవుడు బుట్టలో పెట్టి తీసుకెళ్ళడం, యమున దారినివ్వటం, ఆదిశేషుడు గొడుగుపట్టడం వంటివి చదువుతున్నప్పుడు యోగమాయ అక్కడ పుట్టడమేంటి, మహా విష్ణువు ఇక్కడ పుట్టడమేంటి, వసుదేవుడు అంత రిస్కు చేసి అక్కడి పిల్లనిక్కడ, ఇక్కడి పిల్లవాణ్ణి అక్కడ మార్చడం ఏమిటి? యమున దారినివ్వడమేమిటి? ఎంచక్కా బలరాముడిలా ఆ పుట్టేదేదో అక్కడే పుట్టెయ్యచ్చు కదా, అంతగా అయితే దేవకికీ వసుదేవుడికీ కనిపించి అన్నయ్యలాగానే నేనూ గోకులంలో పుట్టి పెరిగి వస్తాను అని చెప్పవచ్చుకదా అని ఒక ప్రశ్న పుట్టింది (ఊహే కావచ్చుగాక). దాన్లోంచి పుట్టిన సమాధానమే ఇది...

ఎట్టి తపముజేసె నేమొకో కౌసల్య
బాలరాముడాడి బాడువేళ
కాంచ గలిగె నమ్మ ! కైకమ్మ, సౌమిత్రి  
తల్లి జూచె నిన్ను దనివి దీర

అదితి పొందగలిగె ననసూయకున్ దక్కె
నమ్మదనములోని కమ్మదనము !
నిన్ను గన్నవారు, నిను గన్నవారలున్
పొందు భాగ్యమేమనందు నేను?

పాము బొందగలిగె ! పక్షిరాజుకు దక్కె!
నమ్మ వంటి భాగ్యమంబుజాక్ష !
నిన్ను నెత్తుకొనగ నెట్టి పుణ్యము చేయ
వలెను దెలుపుమిందు వదన, నేడు !!

ముద్దులొలుకు లేత ముంగురుల్ వర్ణింప
దరమె? బ్రహ్మ నారదాదులకును
అరుదుగాదె జూడ నరచేతి గుప్పెట్లు
మూసి యుంచు లీల మోహనాంగ?

ఆవలించువేళ నాశ్చర్యమనిపించు
బోసినగవు మనసు దోచి నట్లు
కనులు మూసికొనియు కన్నతల్లిని తడుం
గొనెడి శిశువు నెత్తుకొన దలంతు

నీదు చిట్టి కనులు, నీ చిన్ని పాదాలు
ముగ్ధ మైన నీదు మోము గంటి !
నిన్ను కోరుకుంటి ! నిన్నెత్తుకోదలచి,
ఎదురు జూచి, వేచి, వెదురు నైతి !

ఒడిని జేర్చుకొనిన నుప్పుంగు మనసంత
క్రొత్త పుంత లందు కొనునుగాని
తీయనైన కోర్కె తీరదాయెను ! ఇల్లు
గుల్ల యైన గుల్ల పుల్ల నేను !

పత్ర, పుష్పములను, ఫల, తోయములనేమి
ఇవ్వలేను ! తల్లి నవ్వలేను !
వింతగోర్కె యనుచు విదిలించి పోవద్దు
బుట్ట మనసు నొడిసి బట్ట వయ్య !

యనుచు విన్నపముల నర్పించె శ్రీరామ
విభుని జేరి నొక్క వెదురు బుట్ట !
దాని కోర్కె దీర్ప ద్వాపరమ్మున స్వామి
బుట్టగానె వెదురు బుట్టనెక్కె !

అడ్డేది వాని లీలకు?
గొడ్డూ గోదముల కడకు ! గోకులమునకున్
బొడ్డూడని బిడ్డడు జనె
నడ్డంబడి యమునదాటె నాశ్చర్యముగా !!



యోగమాయ గూడి యుక్తితో బలరాము
నంపె వ్రజకు తాను నట్లె బోవ
గలిగి గూడ నెక్కె గంపనొక్కటి జూడ
బుట్ట  భాగ్యమింక బొగడ దరమె?

6 comments:

కామేశ్వరరావు said...

చాలా బాగున్నాయి పద్యాలు! "బుట్టనైనా కాకపోతిని యొడిని శ్రీహరి బట్టగా!" అనికూడా పాడుకోవాలన్న మాట. :)

>>సౌకుమార్యమైన ముంగురులు వర్ణింప
ఇక్కడ యతి సరిపోలేదు. అంతేకాదు సౌకుమార్యము నామవాచకం అవుతుంది, విశేషణం కాదు. సుకుమారమైన అన్నది సరైన రూపం.

>>గలిగి గూడ జూపె కృష్ణుడింతటి లీల!
ఇక్కడ కూడా యతి సరిపోలేదు. "గలిగి గూడ జూపె కన్నయ్య యీ లీల!" అంటే సరిపోతుంది.

Sanath Sripathi said...

ధన్యవాదాలు కామేశ్వర రావు గారు.

(1) ఋకారం ఉంది కాబట్టి గ కి కృ కి యతి సరిపోదా?
(2) నామ వాచకం సంగతి గమనించలేదనుకోండి కానీ సౌకుమార్యమైన ముంగురులులో నేను ప్రాస యతి 'కు' కి 'గు'కి వాడాననుకున్నాను. కరెక్టుకాదంటారా?

- నమస్సులతో సనత్

Sanath Sripathi said...

కామేశ్వర రావు గారు కానీ ఒక్క విషయంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించాలి...

ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేకుండానే మీరు మనసునొడిసిపట్టేస్తారు. అందుకోసం మీకు మరొక్కమారు మనఃపూర్వక అభినందనమందారాలతో కూడిన నమస్కారాలు.

చిన్నప్పుడు విశాఖపట్నంలో కనకమహాలక్ష్మి గుడి దగ్గర కంచర్ల రామబ్రహ్మంగారి వీధి అని రెందు సందుల అవతల ఉండేది. అక్కడ ఒక పురాతన కోదండ రామాలయం ఉంది. అక్కడ తెల్లారి లేవగానే ఈ పాటలన్నీ వరుసగా వచ్చేవి. లవకుశలో పాటలూ, "శ్రీ రామ నామాలు శతకోటి" "శ్రీరాముని వంటి దైవమెవరు జగములో - ఆరాధ్య పురుషుడతడు ఆ యుగములో", "రాయినైనా కాకపోతిని" వంటి పాటలు వచ్చేవి. అవి వింటున్న ప్రతీరోజూ (అక్కడున్నన్నేళ్ళు) ఆ పాటలేవో నేనే పాడేస్తున్నట్టు రాముడికి విన్నవించేస్తున్నట్టు, మొర పెట్టుకున్నట్టు అనిపించి గొంతుక ఆర్ద్రతత తో ఆర్చుకుపోయేది, కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసేవి.. (ఇప్పటికి కూడా). ఎవరైనా ఉపన్యాసంలో లక్ష్మణుడు అన్న గురించి ఇట్లా అనుకున్నాడు అంటే మళ్ళీ అదే సీను. హనుమంతుడు రాముడు గురించి ఎమనుకున్నాడో అన్నప్పుడు ఏదో మిస్స్ అయిపోయానే.. అదేదో నెను చేయలేకపోయానే. వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అని ఒక థాట్ వెనువెంటనే మళ్ళీ సీను రిపీట్.

మరీ ఇంత "ఇది" పిచ్చేనేమో కూడా.. కానీ ఆనందాన్నిస్తుంది. ఎంచెయ్యను చెప్పండి ?

:-)

బహుశా అందుకేనేమో అప్రయత్నం గా, అసంకల్పితంగా రాముడు - స్ఫూర్తి పాద్యాలు అన్నీ కూడా రాయినైనా కాకపోతిని థీం లోనే ఉంటాయి...

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

అద్భుతమైన ఊహలు, అందమైన కూర్పులు!!
అభినందన శతసహస్రాలు మీకు!!

ఇంతగా అడిగిన వెదురుని పుట్టగానే మాత్రమే కాదు , ఎప్పుడూ కరములయందు, అధరముల యందు ఉంచుకున్నాడు కదూ!

మీకు చెప్పగలిగేదాన్ని కాదు గానీ, చిన్న సందేహాలు కొన్ని.
"కనులు ముసికొనియు కన్నతల్లిని తడుము"
ఈ పాదంలో మూ టైపాటు అనుకుంటున్నా, ఒక లఘువు ఎక్కువైందనుకుంటాను.
"తోయము" అంటే నీరు, తోయజమని మళ్ళీ పుష్పాన్నే చెప్పారా?
క, కా, కై,కౌ లకు యతి చెల్లుతుంది.
కి,కీ,కృ,కౄ, కె,కే లకు యతి చెల్లుతుంది.

Sanath Sripathi said...

మందాకిని గారు, కామేశ్వర రావుగారు !! ధన్యవాదాలు.
టైపాటులను తప్పులను సరిజేశా.. గమనించగలరు

మందాకినిగారు! ఎంతమాట? నేనింకా బుడ్డోణ్ణే.. బ్లాగ్లోకం లోనేకాదు పద్యవిపంచిలోనూ.. ఎదో స్వోత్కర్షగా అప్పుడప్పుడు ఎవో రాస్తూంటా.. సరిచేసెవాళ్ళుండగా నాకేంటి బెరుకు అన్న ధైర్యంతో.. :-)

కామేశ్వరరావు said...

>>మరీ ఇంత "ఇది" పిచ్చేనేమో కూడా.. కానీ ఆనందాన్నిస్తుంది. ఎంచెయ్యను చెప్పండి ?
అంత పిచ్చి ఉంటే కాని, ఇంత చక్కని పద్యాలు రావు లెండి!

>>ముద్దులొలుకు లేత ముంగురులు వర్ణింప
బాగుంది. "ముద్దులొలుకు లేత ముంగురుల్ వర్ణింప" అంటే గణాలు సరిపోతాయి.

>>(1) ఋకారం ఉంది కాబట్టి గ కి కృ కి యతి సరిపోదా?
అవును. మందాకినిగారు చెప్పినట్టు "ఋ"కి ఇ,ఈ,ఋ,ఎ,ఏ లతోనే అచ్చు మైత్రి ఉంది.

>> ప్రాస యతి 'కు' కి 'గు'కి వాడాననుకున్నాను. కరెక్టుకాదంటారా?
ప్రాసయతికి ప్రాసకి సంబంధించిన నిబంధనలే వర్తిస్తాయి. "కు"కి "గు"కి ప్రాస చెల్లదు కాబట్టి "కు"కి "గు"కి ప్రాసయతి చెల్లదు. ఇంకొకటి - అక్కడున్నది "కు", "ంగు". ప్రాసలో ఒక అక్షరం బిందుపూర్వకమైతే మిగిలిన అక్షరాలు కూడా బిందుపూర్వకమే అవ్వాలి. కాబట్టి "కు"కి, "ంకు"కి కూడా ప్రాస కుదరదు. అందుకే వాటి మధ్య ప్రాసయతి కూడా కుదరదు. ప్రాసకి అచ్చుమైత్రితో సంబంధం లేదు కాబట్టి, ప్రాసయతికి కూడా అది అవసరం లేదు. అంటే "క"కి, "కు"కి యతి చెల్లదు కాని ప్రాసయతి చెల్లుతుంది.