Saturday, October 10, 2020

రాముడూ- స్ఫూర్తి - దత్తపది

Vijaya Bhaskar Rayavaram
గారు B+ with Bhaskar .అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో నేటి అంశం పద్య లహరి. స్వర్గీయ ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యంగారి బహుళ ప్రచారంపొందిన వేర్వేరు సినిమా పాటలలోని నాలుగు పదాలతో (దత్తపది) రామాయణార్థములో ఒక పద్యము, భారతార్థంలో ఒక పద్యము చెప్పమన్నారు. కార్యక్రమంలో భాగంగా సిరాశ్రీ గారు ఒకే పాటలోని నాలుగు పదాలతో ఒక పద్యాన్ని చెప్పారు. వారలా అంటూండగానే నాకూ స్ఫూర్తి కలిగి ఆశువుగా వ్రాసాను. కార్యక్రమం సమయాభావంకాకూడదు కాబట్టి అక్కడ ప్రస్తావించలేదు. ఇక్కడ ప్రకటిస్తున్నాను..

పదాలు : యురేక, సకమికా, నీ ముద్దు, తీరేదాకా

రామాయణార్థం: హనుమ సంజీవనీ పర్వతమును తీసుకు వచ్చిన సమయం ఒక వానర సైనికుని హృదయ స్పందన.

భళిరా ఏమది వాయురేఖ ! గగనవ్యావృత్తమై నౌషధా
ఖిలమై వచ్చె నగమ్ము! పంచకమికన్ కించిత్కృపా వృష్టిమై
చలగంగా మృతులైన వానరులుకున్ సంజీవనీ ముద్దు గా
లిలజీవమ్మిడె ! మారుతీ ! ఋణము తీరేదాక సేవించెదన్ !!

లక్ష్మణుని మూర్చనుండీ ఉధ్ధరించటానికి సుషేణుడు నాలు మొక్కలను తేవయ్యా అంటే సర్వౌషధ సంపన్నమైన సంజీవని పర్వతాన్నే తీసుకొచ్చేశాట్ట హనుమ. ఒక జెట్ ప్లేనో అంతకన్న వేగంగా వెళ్ళగలిగేదో పయనిస్తే మనకు కనిపించేది దాని మార్గమే. అలా హనుమ వెళ్ళి వస్తూంటే సంజీవనీ పర్వతం ఒకటే ఎగిరి వస్తోందా అన్నట్టు కనిపిస్తోందిట దూరం నుండీ... ఎంత కరుణ కాకపోతే రణరంగం (పంచకము) నకు ఆ పర్వతం తేవడం వల్ల, పర్వతం మీద ఉన్న ఔషధముల మీదుగా ఎగిరిన ముద్దు గాలి (పిల్లగాలి) సోకి మృతులైన వానర వీరులు సజీవులైనారట.. ఆంజనేయుని ఋణము తీర్చుకోలేను ఆజన్మాంతమూ అతనిని సేవింతునని ఒక వానరుని భావన !!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
భారతార్థం: కృష్ణలీల సందర్భం - ఒక గోపిక అంతరంగం.

భళిరా నీమురళీ ద్యురేఖ గగనవ్యావృత్తమై చెల్వగో
కుల స్త్రీ మానసమెల్ల పంచకమికన్ ! గో, గోపికా, గోపకుల్
చెలులై రాసవిలాస లీలలను నిల్చేరంట ! నీ ముద్దు మ
ల్లెల మోమెంతని చూచినా తనివితీరేదా? కనా కష్టమే !!

కృష్ణుని వేణుగానం ఒక వెలుగు రేఖయై (ద్యు రేఖ) ఆకాశమంతా సుడులు తిరుగుతూ గోపికల మానసమును ఒక రణరంగం (పంచకము) గా చేస్తున్నది. కృష్ణుడొక్కడే పురుషుడన్నప్పుడు గోవులూ, గోపకులూ, గోపికలూ అన్న బేధం లేకుండా అన్ని ప్రాణులూ రాసలీలా విలాసములో చెలులై నిలిచిపోయారట. ముద్దు మల్లెల మోమును ఎంతచూచినా తనివి తీరేనా? కనా కష్టమే అని గోపిక భావన