Wednesday, November 27, 2024

రాముడు స్ఫూర్తి - పాదసేవనం

శ్రవణం, స్మరణం, కీర్తనం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తులని భాగవతం చెబుతుంది. అందులో పాదసేవనం అనగానే నా వరకు నాకు ఠక్కున గుర్తుకు వచ్చేది ఇద్దరు. ఒకరు హనుమంతుల వారు, రెండవది లక్ష్మీ అమ్మవారు. 

రాముడు ఎప్పుడు గుర్తుకు వచ్చినా  కళ్ళముందు మెదిలే రూపం 

దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా । 

పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ అన్నదే. 

హనుమంతుల వారు ఎప్పుడూ రాముల వారి పాదాల వద్దే కనిపిస్తారు. అలానే స్వామి వారి పాదాలు అనగానే వైకుంఠం లో పాలకడలి పై శేష తల్పమున పవళించిన స్వామివారు, ఆయన పాదసేవ చేస్తూ అమ్మవారు ఇదే రూపం కనిపిస్తుంది.

హనుమంతుల వారిని చూసినప్పుడు ఒక చిలిపి ప్రశ్న తలపుకు వచ్చింది. ఎందుకు స్వామి వారి పాదాలు వత్తుతూ ఉంటారు అని, అమ్మవారిని తలుచుకోగానే అది మరింత బలపడింది. ఆవిడ కూడా అంతేగా, ఎప్పుడూ ఆయనగారి కాళ్ళొత్తుతూ కనిపిస్తారు. అంతలోనే సమాధానం కూడా స్ఫురించింది. 

లీలార్ధమ్ము నహల్య గాచుతరి కాలేమైన నొప్పెట్టెనో !

కాళీయాస్ఫట రత్నమానికములన్ గాల్నొచ్చెనో ఏమొకో !

నేలా శ్రీసతి కేశవాంఘ్రి యుగమున్నెల్లప్డు కేల్నొక్కెడు

న్నౌలే ! నేటికి వేంకటేశు గవుద న్నద్దేముగా కప్రమున్ !!


అప్పుడెప్పుడో అహల్యకు శాపవిమోచనం ఇవ్వడానికి శిలను తాకావు, అప్పుడేమైనా కాలు నెప్పి పుట్టిందా? కాళీయుని మదమణిగించి నృత్యము చేసే సమయంలో మణులేమైన గుచ్చుకున్నాయా? (కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీ పదాంబుజా) ఎందుకు అమ్మవారు ఎప్పటికీ కాళ్ళు ఒత్తుటూ ఉంటారు? అవునులే అప్పుడెప్పుడో అనంతాళ్వారులు ఒక గడ్డపార చిన్నపిల్లవాడిపై విసిరితే చుబుకం పై దెబ్బ తగిలింది అని, గర్భాలయంలో వేంకటేశ్వరులకు ఆ గాయం కనిపించింది అని ఉపశమనమునకై పచ్చకర్పూరం అద్దగా అక్కడ ఇంకా నెప్పి/ మంట ఉన్నవేమో  అని ఇప్పటికీ మనం అద్దటం లేదూ, అలానే అమ్మవారు, హనుమంతులవారు కూడా అనుకుంటున్నారేమో అని చిలిపి ఊహ.. 

గవుద = చుబుకము = గడ్డం      


1 comment:

chkvsharma said...

ప్రియమయిన విష్ణు స్వరూప సనత్ కుమారా, నీవు మస్తీష్కములోని భక్తితో పారవస్యమయిన తరంగాలను అక్షర రూపం లో అద్భుతంగా రచించితివి.
పట్టించుచుంటే ఆ సరళ భాషలో అచించిన నీ బావములు చక్కగా అర్ధమయినవి.
చాలా సంతసించితిని.
సదా మా శుభాశీస్సులు.
ఇంకా ఇంకా ఇలా రాయాలి, మేము చదివి ఆనందించాలని కోరిక.
శుభం భూయాత్.