నాదోపాసనే జీవిత పరమావధిగా ఆరు దశాబ్దాల పాటు సంగీత సాహిత్యాలకు అనితర సాధ్యమైన సేవ జేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు డా. నూకల చిన సత్యనారాయణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన శుభ సందర్భంలో వారికి పద్య కుసుమాంజలి
సీ
సంగీత సామ్రాజ్ఞి సంప్రదాయపు కంచి
గద్వాల చీరల్ని గట్టినట్టు
స్వర, రాగ, తాళాలు స్వర్గ సీమలు జేరి
తాదాత్మ్యతనుబొంది దవిలినట్లు
కృతుల సంగతులన్ని కరుణించి నాల్కపై
నటరాజ నాట్యమ్ము నాడినట్లు
నాదాబ్ధి మధియించి, నారదాదుల భక్తి
నావలో భావమ్ము నడచునట్లు
తే.గీ.
గాన మాలపించు మధుర గళము మెచ్చి,
వేయి చంద్రులు జూచెడి వేళలందు (@)
అమ్మహామహోపాధ్యాయు నాదరించి
పద్మ 'భూషణ ' మిచ్చెరో 'పాణి', 'వాణి' (*)
(*) శ్రీపాద పినాకపాణి
(@) విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో యజ్ఞ చయనమ్మ, అన్నపూర్ణేశ్వర శర్మ దంపతులకు 1927 ఆగస్టు నాలుగోతేదీన ఆయన జన్మించారు. ఇది వారి సహస్ర చంద్ర దర్శన వత్సరం. భారత ప్రభుత్వం ఏ కారణం చేతనో ఆయన సేవల్ని ఇన్నాళ్ళకు గానీ గుర్తించలేకపోయినా సరిగ్గా ఎనభై నాల్గో సంవత్సరం లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించటం దైవ సంకల్పమే తప్ప కేవలం యాదృచ్చికం కాదేమో.
కం
వాణికి, శాస్త్రీయమ్మౌ
గానానికి, త్యాగరాజ కృతులకి, విద్వత్
శ్రేణికి సత్కారమ్మిది
బాణికి, గురుడౌ పినాక పాణికి చెందున్
త్యాగరాజ ఆరాధనల్లో నూకల వారితో ఫొటోల్లోని వారు
(1) శ్రీ చింతలపాటి కాశీ విశ్వనాథ శర్మగారు (మా మామగారు)
(2) శ్రీమతి శారద గారు (నూకల వారి శిష్యురాలు, మా అత్తగారు)
(3) శ్రీమతి శ్రీవల్లీ లావణ్య (నా శ్రీమతి)
(4) వటపత్రమ్మీద త్యాగరాజులు (నా గీత)
నూకల వారితో
మరిన్ని రాతలూ, మరికొన్ని గీతలూ తర్వాతి టపాలో ...........
5 comments:
చాలా బావుంది. నూలు పోగేమీ, పద్యాల పట్టుశాలువాయే
గీత, గీతమూ అందంగా ఉన్నాయి. పద్మభూషణ్ తో ప్రభుత్వం వారు వారిని గౌరవించి, తమని తాము గౌరవించుకున్నారు.
Pl mail me
kottapali at gmail dot com
ముదావహమైన విషయమండీ.
మీ పద్యం చాలా బావుంది.
శీర్షిక చివర ఒకటి అని ఉంచటం ఇంకా బావుంది.
నూకలవారికి నూలు పోగు అని అన్నా సీసపద్య పాదం ఉత్తరార్ధమే కదండీ.
కొత్తపాళీ గారూ,
ఒకటి రెండు కీర్తనల గురించి చెబుతారనుకున్నాను.
భవదీయుడు
ఊకదంపుడు
కొత్త పాళీ గారూ, రవి గారూ, ఊ.దం.గారూ !! ధన్యవాదాలు.
కొత్తపాళీ గారూ, నాకు తెల్సిన కొద్ది మంది తెలుగు బ్లాగర్లలో సంగీతం తెల్సిన మీరో, రాఘవ గారో, ఊకదంపుడు గారన్నట్టు రెండు మూడు కీర్తనలగురించి ఉటంకిస్తారనుకున్నా.. తర్వాత అనిపించింది. బహుశా త్యాగరాజు మీద ఒక టపా రాస్తే అప్పుడు భలే రంజు గా ఉండచ్చేమో అని... ఎమో...
ఊ.దం. గారూ,
ఇదే నా మొదటి సీస పద్యం. చెప్పాలనిపించిన భావం (rather) మనసుకి తట్టిన భావం పెద్దదైపోయేసరికి అప్రయత్నం గానే సీసం రాయచ్చేమో అనిపించి. కాకపోతే తేటగీతి వెయ్యాలా, ఆటవెలది వెయ్యాలా అని సంశయం కలిగి "మహామహోపాధ్యాయు"లన్న బిరుదు రావాలంటే తేట గీతి బెస్టని ఇలా డిసైడయ్యా..
నిజం చెప్పాలి కదా.. నా 'సీసా' కి స్ఫూర్తి మీ 'తూగు ' చదివాక తట్టినదేననుకోండి. పన్లో పనిగా మీ పాత టపాలు కూడ చదివాననుకోండి.
- సనత్ కుమార్
Post a Comment