Tuesday, March 30, 2010

హనుమజ్జయంతి శుభాకాంక్షలు.

దాశరధీ శతకం పద్యాలు చదువుతూంటే, నా భావాలని నేనే రాముడితో మొర పెట్టుకుంటున్నట్టు భావనే, ఎన్నేళ్ళు గా చదువుతున్నా.. ఇప్పటికీ... మిగిలిన ప్రపంచం ఉందన్న స్ఫురణే జారిపోతూంటుంది... చాల ఎమోషనల్ గా సెంటిమెంటల్ గా కూడా ఔతూంటుంది....

హనుమజ్జయంతి సందర్భం గా....నన్ను బాగా కదిలించే పద్యాలు .. ఓ మూడు ఇక్కడ...

డాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
దాసుల దాసుడా గుహుడు? తావక దాస్యమొసంగినావు; నే
జేసిన పాపమా? వినుతి సేసినఁ గావవు! గావుమయ్య! నీ
దాసులలోన నేనొకడ దాశరథీ! కరుణాపయోనిధీ!

పెంపున దల్లివై, కలుషబృంద సమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై, మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా
రింపను వెజ్జవై కృప గురించి పరంబు తిరంబుగాగ స
త్సంపదలియ్య నీవె గతి దాశరథీ! కరుణాపయోనిధీ!

సిరులిడ సీత, పీడ లెగఁజిమ్ముటకున్ హనుమంతు, డార్తి పోఁ
దరుమ సుమిత్రసూతి, దురితంబులు మానుప రామనామమున్
గరుణ దలిర్ప, మానవులఁ గావగఁ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ! దాశరథీ! కరుణాపయోనిధీ!

పద్యాలు రాసే ప్రారంభదశలో (యతి, ప్రాసలపై ధ్యాసేలేని పాతరోజుల్లో) ఒకానొక రోజు రాసుకున్న పద్యం...

హృదయము నందు మిమ్ము గొనినంతనె మారుతి ఆఢ్యుడయ్యెనా?
విదితము గాదె? రామ ! తమ గేహము సేసితి నాదు ఆత్మనున్
ముదమున; గాని ఆత్మ దరి జేరెడి మార్గము మర్చిపోతి; శ్రీ
మదఖిల లోక పాలక సమస్తము జూపెద ! దారి జూపినన్ !!

స్ఫూర్తి:- కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే "ఆత్మారవిందం" అనుకుంటూ నా ఆత్మని మీ ఇంటిగా తీర్చిదిద్దా... పెద్దవాళ్లైన మిమ్మల్ని ఇంట్లో పెట్టి, పిల్లాణ్ణైన నేను బయటెక్కడో తప్పిపోయా... తిరిగి ఇల్లెలా చేరుకోవాలో తెలీటం లేదు....రామా.. ఆత్మని ఎలా చేరుకోవాలో దయచేసి చెప్పవా? అక్కడ నిన్నే కాదు సమస్తాన్నీ చూపించకపోతే అప్పుడు అడుగు అని నా ని'వేదన' !! (నువ్వుంటే సమస్తమూ ఉన్నట్టె కదా...)

ఏ మార్గమైనా/ ఏ గురు సాంప్రదాయమైనా ఆత్మని తెలుసుకో, నీవెవరో తెలుసుకో అనే అంటుంది కదా... ఆత్మని తెలుసుకుంటే సమస్తమూ తెలిసినట్టే, ఆత్మారాముణ్ణి తెలుసుకున్నా సమస్తమూ తెలిసినట్టే అనే భావన ఆలంబనగా...

రామార్పణం...

Wednesday, March 24, 2010

శ్రీరామనవమి శుభాకాంక్షలు!


అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

రామ నవమికి నా 'గీత 'లు (ఒకటి భక్తుడిదీ, ఇంకొకటి భగవంతుడిదీ)


బోయి భీమన్న గారి "అశోకవనిలో రాముడు" పద్యాలలో ఇంకొన్ని ....


అశోకవనంలో రాముడు మొదటి భాగం ఇక్కడ
అశోకవనంలో రాముడు రెండవ భాగం ఇక్కడ

పది నెలలాత్మ నుంచుకుని, ప్రాణములన్ దనియించి, పెంచు కొ
న్నది కద సీత? దీర్ఘ విరహాముధి తీరి, తటమ్ము చెరుకొ
న్నది కద? ఎప్పు డెప్పు డను నాత్రము నే కులగోత్ర మడ్డు కొ
న్నదొ, రఘు రాము నిండు హృదయాన నెదో బడబాగ్ని రేగెడున్ !

సత్య మసత్య మంచెరుగ జాలదు లోకము, సర్వదా పర
ప్రత్యయ నేయ బుధ్ధి; అది వాలు నసత్యము వైపె నిత్యమున్;
సత్యము నమ్ము లోక మొక శక్తి పరీక్షనె; లోక ప్రీతి కై
ముత్యము వంటి జానకిని ముంచునె తా నస దగ్ని కీలలన్ ?

నాతియె సీత? నిశ్చల సనాతని; సాకృత బ్రహ్మ విద్య; ధీ
శ్వేత; అనాది; ఆమె రఘు శేఖరు ప్రస్థితికే ప్రబుధ్ధ సం
కేతము; సీత పట్ల తనకేమిటి వంక? అదంతె; కాని - సా
కేత జనాళి శంక తొలగించక లంకను గెల్చినట్లె టౌ?

ప్రణయము కొత్తదా? హృదయ భాండము ఉత్తద? రెండు మూడు దు
క్షణములు బాధపెట్టినను సైచి, పరీక్షకు నిల్వగా వలెన్;
రణములు, రంధి రంపులును, రచ్చలకీడ్చుటె రాజ వృత్తి; ఏ
అణువును లేదు సొంతమగు నట్టిది రాజుకు రాజ్య పధ్ధతిన్ !

"చీకటి విచ్చె నింక రఘు శేఖర సూర్యుని పాద పద్మ ప
ద్మా కరమౌదు" నంచు తమి మై మని యుండిన సీత - తా నటన్
లేక, విదారితాత్మ సళిన్ ఎటులేడ్చునొ ! ఎంత క్రుళ్ళునో !
లోకపు తృప్తికోసమిటు లుర్విజ నేచుట ధర్మమౌనటో?

సీతను తా నెరుంగడె? వశి కృత చేతను? యోగ రాగ భూ
మాతను? మర్మ వేద్య యగు మంత్రజ ఆమె; స్వతంత్ర నేడు ; ఖ
ద్యోత విభాత కాంతి సకలోర్వికి మార్గము చూపనిమ్ము; ఏ
లా తన ఇంటి వెల్గు జనమంతకు చీకటి మూల్గు కావలెన్?

శ్రావణ సంధ్యలై కురియ సాగిన కన్నులలో శరద్ద్యుతుల్
భావ విశేష పర్వములు పండగ, రాముడు లోక తారకో
జ్జీవన దీప్తినంది, విర జిమ్మెను చుట్టును మాధవోన్మనీ
శ్రీ విలస ద్విభాత రవి రేఖలు దృ క్శశి రేఖలొక్కటన్ !!

ఒక సతి, ఒక్క మాట, శరమొక్కటి - ఇయ్యవి మూడొకట్లు; ఇన్
దొకటియె చాలు మానవుని విశ్వ సమున్నతు జేయగ; మూడు నొక్కటై
వికసన మందు మానవుడు విశ్వ సమున్నతుడేల కాడు? అం
దుకె పరిపూర్ణుడై జన మనో రముడయ్యెను రాముడెంతయున్ !

వ్రత మొకటున్న, దానికొక వర్తనముండు; మార్గముండు; ని
శ్చిత మతి యైన మానవుని చేర్చును లక్ష్యము తత్ వ్రత ప్రభల్;
సతి పయి ప్రేమ, వాక్కు పయి శ్రధ్ధ , స్వశక్తి పయిన్ ప్రభుత్వ, మీ
త్రితయము కల్గు జీవుడు ధరిత్రి నెవాడును రామ దేవుడే !!


Monday, March 22, 2010

అశోకవని లో రాముడు - 2

అశోకవనంలో రాముడు మొదటి భాగం ఇక్కడ చదవచ్చు






రాతిని నాతి జేసిన పరాత్పరుడాతడు ; తత్పదాంకితో
ర్వీ తలి బీటి దేని చిగురించును పుష్ప ఫలాభిరామమై;
చేతము రామ పాద సరసీ పరిశొషిత నిత్యనూతనో
న్నూతనమై రహించు సుమనో విభవమ్మునకేది సాటియౌ !

రాముని పాదధూళి నొక రాయెదొ తోయలి యైనదంట , ఏ
లా మనవౌ అదృష్ట గతులన్ సరిచూచుకొనంగ రాదు? పో
దామని యాత్ర సాగెడునొ తచ్చరణాధ్వము వెంట-- మన్గడన్
బాములు వడ్డ జీవులిరు ప్రక్కల మూగెడు రాలు రప్పలై !

రాముడు పోవు త్రోవ కిరు ప్రక్కల నట్టిటు దూకుచున్న త
ధ్ధూమ శలాక లా చరణ ధూళికి ప్రాణము గొన్న రాళ్ళొ? ఆ
రామము గాచు వాళ్ళు ! రఘు రాముని తద్వని గాంచి భ్రాంత చి
ద్భూమిక లైన వాళ్ళు ! ఎటు తోచక చీకటి మున్గు వాళ్ళునున్ !

మిణికెడు తోట నెల్లడల - మిణ్గురులా ? ఉడు కాంతి తున్కలా?
దినమణి నుండి వేర్వడిన ధీధితి రవ్వల? అంధకార కం
ధిని వెలుగొందు రత్నముల? నెమ్మదిగా నిలువెల్ల కన్నులై
వనరమ రాము జూచు రుచి వైఖరులా? అవి సీత చూపులా?

అదె పులి యన్న, తోక అదె అందురు లోకులు ; లోక నైజ మ
ట్టిద యగు; వింధ్య కీవలి తటిన్ వనభూముల యందు రాజ్య సం
పద నెసలారు ప్రాఙ్నరుల వానరులందురు ; నామ సామ్యపుం
బదమును బట్టి పల్కుదురు వానరు మర్కటుడంచు నేరమిన్ !

సీతయు లక్ష్మణుండు తన జీవిత దృష్టికి రెండు కళ్ళు; తత్
సీతకు ప్రాణమిచ్చి, రణ సీమను కూలిన లక్ష్మణున్ పున
శ్చేతను జేసి -- అంధ తమసీ పరిశూన్యము నుండి ఎవ్వర
బ్బా, తన నుధ్ధరించ గల బంధువు వాయు సుతుండు తక్కినన్ ?

మావులు పూచె, నల్దిశల మంచు తెరల్ విరబారె, సంపేగల్
తావులు చల్లె, బర్హితతి తాండవమాడె, నగెన్ శరత్కళల్ --
భావము జానకీ వదన పద్మము చుట్టు పరిభ్రమించి శో
కావిలుడైన రాముని పదాబ్జము చుట్టు పరిభ్రమించుచున్ !

సుందర సుందర ప్రణవ సుందర సుందర సౌమ్య సౌహృదా
నంద రతీందిరుండు రఘు నందనుడా విపినేందిరా మనో
మందర సైందవ ప్రణయ మందిరుడై ఎటబో నటన్ నవేం
దిందిర బృందమై పరుగు దెంచు స్మృతుల్ క్షితిజా గత శ్రుతుల్ !

పుట్టిన దాది (ఎట్టులుగ పుట్టెనొ!) అట్టులె ఆరు వర్షముల్
మట్టిన ఉండి (ప్రాణమెటులాడెనొ!) ఆరు రసాలకున్ తనే
పుట్టిన ఇల్లుగా (తదను పూర్వము పృథ్వి రసార్ద్ర కాదొ !) చె
న్నుట్టి పడంగ సీత వెలయున్ జనధాత్రి కి అన్నధాత్రి యై !

కోమలమౌచు, సిత జడ కుచ్చులు గా అభిదన్ ధరించి, సౌ
దామని దారలట్లు వనధాత్రి ని నిండిన తీగలేమి? భృం
గామల కాళి దువ్వినపుడా కొనగోళ్ళకు చిక్కుకున్న తత్
భూమిజ కేశ లేశములు పో? రసకందము, లాత్మ విందముల్ !

తెల తెల వారు జాముల క్షితీ సుత తానె ఉషః కుమారి నాన్
అలరుల తోటలన్ దిరుగు నప్పుడు, కొమ్మల జిక్కు నామె వ
ల్కలముల వల్కముల్ మన్సు గైకొనినట్టివి సీత కోక చి
ల్కలు ! మధు ముగ్ధ మోహనములై విహరించును వన్నె చిన్నెలన్ !

జనకుడదేలొ సర్వమును సర్వుల నుండియు దాచి, గప్పు చ
ప్పున యువరాజు జేయ దల పోసెను ! కాని, రహస్య మెట్లు దా
గును, అది గాక, తా నయిన కోరెనె రాజ్యము? కొంప మున్గెనే?
తనయుల నైజముల్ కనరు తండ్రులు, కుందుదురర్ధలోభులై !

పాదములందు వ్రాలి , పర పాదుకలన్ గొనిపోయి, రాజ్య ల
క్ష్మీ దరహాస ముగ్ధముల జేసిన మానవుడొక్కడుండెనే?
మేదిని నెవ్వడేన్ పదవి మీద గలట్టి తమిన్ త్యజించెనే?
సోదర మాత్రుడే? సుగుణ సూర్యుడు పో భరతుండు చూడగన్ !

(మిగిలిన చుక్క గుర్తు పద్యాలు రామనవమి రోజున...)

1975 లో జన్మించిన నాకు మిగిలిన ఒక్కగానొక్క సంవత్సరంలో విశ్వనాథ వారు ఆశిస్సుల నందించారు, దానికి భీమన్న గారు పరోక్షం గా కారణం అయ్యి ఆయన కూడా ఆశీర్వదించారు... అన్న నా ప్రశ్న కు సమాధానం....

ఇదిగో ఈ పుస్తకమే...

1972 వ సంవత్సరం లో

భీమన్నగారి షష్టి పూర్తి సన్మాన సందర్భం లో సన్మాన సంఘం వారు సభనేర్పటు జేసి ఈ పుస్తాకాన్ని ప్రచురించిన సందర్భం లో, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారికి భక్తి తో తన కావ్య కన్యకలను భీమన్న గారు సమర్పించారుట.

ఆచార్య జి.వీ. సుబ్రహ్మణ్యం గారూ, మా నాన్నగారు, నేను పుట్టిన సంవత్సరం (1975) లో విశ్వనాథ వారింటికి వెళ్లగా, ఆయన అలమార లోనుండీ ఈ పుస్తకాలను తీసి నాన్న గారికి అందించారుట. ఎందుకో ...భగవంతునికి ఎరుక.

మానాన్న గారు నాకు ఈ మాటలను చెప్పి, భీమన్న గారి దస్తూరి ని చూపించటం లీలగా గుర్తు. ఆ ఇద్దరు మహానుభావుల ఆశిస్సుల సాక్షిగా మా ఇంట ఆ పుస్తాకాలు పూజ్య స్థానమలంకరించినవి.

సనత్

Friday, March 19, 2010

నన్ను ప్రభావితం చేసిన రామ భక్తుడు - బోయి భీమన్న


బోయి భీమన్నగారు ఓ రకంగా నాకు ఏకలవ్య గురువుగారు. ఇంకోరకంగా చెప్పాలంటే విశ్వనాథ సత్యనారాయణ గారి ఆశిస్సులను నాకు ప్రత్యక్షం ఇప్పించటానికి పరోక్షం గా కారణమైన వారు.

ఏకలవ్య గురువుగారు అని ఎందుకు అన్నానంటే నా ప్రమేయం లేకుండానే నాలోనికి చొరబడి నన్ను ప్రభావితం చేసేశారు కాబట్టి (బహుశా నా ఊహేనేమో) కాకపోతే ఇది అర్ధమవ్వాలంటే కొంచం ఉపోద్ఘాతం కావాలి...(చిన్నదే).

నా జీవితంలో అప్పుడప్పుడుగా వచ్చి దోసిళ్ళతో పట్టి రామ రసాన్ని తాగించిన మహానుభావులెందరో ఉన్నారు. పుణ్యవశం చేతనో, ప్రేమ చేతనో గానీ నాకు ఇట్లాంటి మత్తునలవాటు చేసినవాళ్ళందరూ నాకు ప్రాతస్మరణియులే. శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు, శ్రీభాష్యం అప్పలాచార్యులవారు, మా తాతగారైన శ్రీపతి శ్రీధర స్వామి గారు, మా నాన్నగారైన శ్రీ రఘు రామ కుమార్ గారు, మంగళంపల్లి, నూకల, జేసుదాసు, మల్లాది సోదరులూ .. వీళ్ళందరూ ప్రత్యక్షం గానైతే పరోక్షం గా చేసినవాళ్ళల్లో హనుమంతుల వారు, త్యాగరాజు, రామదాసు, విశ్వనాథ సత్యనారాయణ గారు, ఎమ్మెస్ రామారావు గారు |మొ| ..

ఈ కోవకే చెందిన వారు శ్రీ.బోయి భీమన్న.

బోయి భీమన్నగారి గురించి కొత్తగా పరిచయం చేయనవసరంలేదు... కాకపోతే నాకూ, బోయి భీమన్నకూ, విశ్వనాథ సత్యనారయణ గారికీ గల లింకేమిటి? అదే ఇక్కడ హాట్టాపిక్కు...సస్పెన్సూ....ఏమయ్యుంటుందో మీరు గానీ ఏమైనా ఊహించగలరా???

బోయి భీమన్న నాకు ఏకలవ్య గురువుగారు అని ఎందుకు అన్నాను?? ఆయన్ను చదివిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా??

ఈలోపు "అశోక వనిలో రాముడు " కావ్యం లోనుంచీ మంచి పద్యాలు..

ముందుగా కావ్య భావన.. రావణ వధానంతరం ఆ రాత్రి రాముడు ఎవరికీ తెలియ కుండా ఒంటరిగా బైల్దేరి అశొకవనానికి వెళ్తాడు. తాను అంతగా ప్రేమించిన తన అర్ధాంగి సీత అంత కాలం పాటు లంకలో చెర అనుభవించిన అశోకవనాన్ని చూడాలని అనుకొని ఉంటాడనీ, అక్కద రకరకాల భావనలతో, బాధలతో సతమతమై, కన్నీరు కారుస్తాడనీ.. కావ్య నిర్మాణం....

రాముడు మాట్లాడకుండా తోటలో తిరుగుతున్నప్పుడు అనేక భావాలు సూర్యుడి నుండీ కిరణాల్లా మనసు నుండీ ప్రసరిస్తాయి... ఆ ప్రసారం లో రాముడి ఔన్నత్యం, ధీరోదాత్తత , మానవ లక్షణం, కార్య కారణ సంబంధం, సమాజ శ్రేయస్సు, సోషలిజం మొదలైనవనీ ప్రస్ఫుటం గా కనిపిస్తాయి.

నాదృష్టిలో రాముణ్ణి, వాడి వ్యక్తిత్వాన్ని సాపేక్షికంగా అద్దం లో చూపించినట్టు చూపిస్తుందీ కావ్యం, అందుకే నాదృష్టి లో ఈ నాటి కాలనికి రామ భక్తుడు బోయి భీమన్న.

"అశోక వనిలో రాముడు " కావ్యంలో .. నాకు నచ్చినవి, కొన్ని..

గుస గుస లాడసాగినవి కొండల గుండెలు తట్టి నిర్ఝరుల్ ;
రుస రుస లాడసాగినవి రోదసిపై ఘన హైమనీ లతల్ ;
వస వస లాడసాగినవి వన్య విహంగములర్ధ నిద్ర; సా
రస రస ధాముడా విజయ రాముడు తద్వని నట్లు సాగగన్ !

ఎక్కడివాడొ! ఏమి కధొ ! ఏ సతి కన్నదొ ! ఏల వచ్చెనో
ఇక్కడి కిప్డు ! సూర్యుడుదయించును రోజును; కాని, ఇంతగా
చక్కని వాడు చిక్కడెదొ సౌహృదముండిన దప్ప; ఇప్పుడే
మ్రొక్కెద మంచు రాము పదముల్ స్పృశియించె వనిన్ తృణాదులున్ !

రక్కసి చెట్లు రాము గని రంగులు మారె ! విభీషణమ్ములై
మ్రొక్కె మహాగమమ్ము లల మూడు జగమ్ములకేక రూపతన్;
అక్కున జేరె శ్రీలతలు ఆమని సంపదలెల్ల తామె యై ;
చొక్కె మధువ్రతాలు; వని సోభిలె రామ పదాభిరామమై ;

శివు విలు నుండబద్దవలె చేకొని, వింటికి తానె అల్లె త్రా
డవునన నిల్చి, ఆడుకొనదా జనకాత్మజ చిన్ననాడు? తత్
జవమెటు బోయె? నీ కొరకు తాళినదంతయు ! ఒక్క మట్టి పె
ల్ల విసిరి ఆమె లిప్త కొక లక్ష దశాస్యము లూడగొట్తదే?

శ్రీమదనంత మోదమున సీతను చూచిన కంట నేడు శ్రీ
రాముని జూచి, అందెవరి రాగము గొప్పదొ తేల్చుకోన్ వన
స్వామి తొ బాహు యుధ్ధముకు పాల్పడి, తేలక గ్రుద్దు కొందురో
తామె యనంగ చిక్కువడి; తద్వన వల్లులు రామునడ్డెడున్ !

తమపని తాము చూచుకొను దైత్యుల మీదన? కాదు, దైత్య త
త్వము పయి దాడి; దేహమును దాల్చిన యెల్లరు జీవితార్హులే;
తమ తెగ మాత్రమే బ్రతికి తక్కిన వారలు చత్త్రు గాక యన్
కుమతులు కూలరా? పుడమి కూతురు దుర్నయముల్ సహించునా?

శివధనువెత్తి ఎక్కిడుటె సీతను పొందుట; ముక్కలయ్యె కా
ల వశముచేత నద్ది; ఎవరందుకు బాధ్యులు? అంతదానికే
నవయువ దంపతీ ప్రణయ నాదము త్రెంచెడునే అపశృతిన్?
ఏవడది? బ్రహ్మ యన్న యతడెవ్వడు ? ఎవ్వడు ధర్మపీఠిపై ?

అనల శిఖా లతాగ్ర కమలామృత బిందు కళా ప్రపూర్ణుడై
తనువును గొన్నదాది -- సరదాకును పాపము చేయలేదు; స
జ్జన ముని మిత్ర కోటి కెదొ సాయము చేయ దలంచి తప్ప తా
ధనువును ముట్టలేదు; వల దా ఒక హేతువు ఎట్టి శిక్షకున్ ?

మనుజుడు తానుకూడ ; తన మార్గము నందును పూలు ముళ్ళు క
ల్గును ; తన చేతలందు నెవొ లోపము లుండును; కాని -- అక్రమ
మ్మొనరిచె నన్న దొక్కటియు నుండదు రామ చరిత్ర లోన; స
ర్వ నరుల నొక్క సూత్రమున రాముని హస్తము కుస్తరించెడున్ !

వాలి వధా విధాన మప వాదును తెచ్చునొ? మిత్ర కార్య దీ
క్షాళువు తాను; మిత్రునికి శత్రువు వాలి, తదన్య వన్య యో
ధాళితొ పేచిలేదు, బహి రంగరణమ్మెటు చేయు? ధర్మ సూ
క్ష్మాల నెరింగినట్టి ముని సత్తములుండరె నిర్ణయించగన్?

స్త్రీ నొకదాని జంపె; ఎవరేనియు దుష్టులు వధ్యులే; సుమో
ద్యానము నుండి కంటక లతల్ లతలైనను వర్జ్యములే కదా?
మానినులైన కామినుల మన్నన జేయడె? తానహల్యకున్
ప్రాణము పోయడే? శబరి భక్తిని గ్రోలడె? భేదమెంచెనే?

బంగరు లేడి గాంచి తన భామిని తెమ్మనుటేల? వంటకా?
చెంగున నేదొ అస్త్రమున చేకొన, కేటికి చావనేసె? దా
త్రిన్ గల ఏరికిన్ క్రియల తీరులు కర్మలు బట్టి కాదె? సా
రంగమె అద్ది? భావి రణ రంగమొ? కాలపుటంతరంగమో!

శివుని ధనుస్సు నెక్కిడుట, సేతువు కట్టుట, పంక్తి కంధరా
ద్యవమతులన్ హరించుట, మహాటవులన్ వ్యధలోర్చు, టయ్య వి
య్యవి యననేల -- రామ చరితాద్భుత కాండములెల్ల సీతవే!
అవనిజ చుట్టు అల్లుకొనినట్టివి గాధలు, వన్య వీధులున్ !

భూసుత ఒక్కనాడు, వన భోజన కేళి, స్వ హస్త పాకమున్
భాసుర లీల వడ్డన మొనర్చి, తదార్ద్ర సుగంధ హస్తమున్
బాసట నున్న భూరుహము పై నిడి నిల్వ ,తదీయ గంధమో
వీసము సోకి కాదె కరివేపగ అయ్యది నిల్చె నేటికిన్!

( మరికొన్ని తొందర్లో విడుదల.. )

పైన అడిగిన ప్రశ్నే మళ్ళీ...

నాకూ, బోయి భీమన్నకూ, విశ్వనాథ సత్యనారయణ గారికీ గల ప్రత్యక్ష - పరోక్ష లింకేమిటి? ....ఏమయ్యుంటుందో మీరు గానీ ఏమైనా ఊహించగలరా???

బోయి భీమన్న నాకు ఏకలవ్య గురువుగారు అని ఎందుకు అన్నాను?? ఆయన్ను చదివిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా ??