Monday, April 12, 2010

చిత్రవర్ణ రేఖా విలాసం... (తెరసెల్లా -1)

"పెళ్ళంటే నూరేళ్ళ పంట" --> ఓ ముసలావిడ సలహా
"గాస్ సిలిండరు మీద వంటేం కాదు...? --> గడుసు పిల్ల సమాధానం..
సౌందర్యకీ నిర్మలమ్మకీ మధ్య జరిగే ఈ సంభాషణ అదేదో సినిమాలోది..

"పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళూ, ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు" ఓ ప్రేమికుడి నిర్వచనం...

"పెళ్ళంటే పప్పన్నం పెట్టాలి కదమ్మా..." ఓ అమాయకుడైన చంటి ప్రశ్న.

"ప్రేమంటే రెండు హృదయాల కలయిక, కానీ పెళ్ళంటే రెండు కుటుంబాల కలయిక" ... ఓ మన్మధుడి హిత బోధ.

నాణేనికి ఒక పార్శ్వం...


"షాదీ మాటే వద్దు గురు సోలో బతుకే సో బెటరు" ఓ సూక్తి ముక్తావళి.
"పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా" ఓ తెలివైన వాడి ఉచిత సలహా

మరో పార్శ్వం

ఒక్కో సినిమాలో ఒక్కో నిర్వచనం. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కడిదీ ఒక్కో డైమెన్షను.

పెళ్ళంటే: -
కొందరికి సరదా,
కొందరికి బాధ్యత,
కొందరికి ఆత్రం,
కొందరికి అవకాశం,
కొందరికి డాబు,
కొందరికి వేడుక,
కొందరికి జీవితం
ఎంతో మందికి పెళ్ళన్నది ఓ భుక్తి... ఓ పెద్ద ఇండస్ట్రీ...

ఎన్నో వందల వేల కుటుంబాలు ఈ ఇండస్ట్రీని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నమ్ముకుని బతుకుతున్నారు....
ఇప్పుడు వారిలో కొందరికైనా అశనిపాతం లాంటి తీర్పు ఉన్నత న్యాయస్థానం వెలువరించింది.

సహజీవనమూ ఓకే అని. నాణేనికి మూడో పార్శ్వం కాబోలు....

---***-------***-------***-------***-------***----

ఇంతకీ పిల్లల పెళ్ళి గురించి ఆరాటపడే తల్లిదండ్రులు గానీ, వధూవరులుగానీ పెళ్ళి అనే తంతుని ఎంతవరకూ తెలుసుకుని ఆచరిస్తున్నారో ??

ఇక్కడో చిన్న ఉటంకింపు:
ఉఛ్ఛారణ లో లోటుపాట్లు రావడంతో బరాక్ ఒబామా అరుదుగా రెండోసారి ఆ దేశాధ్యక్షుడిగా శ్వేత సౌధంలో ప్రమాణం చేశారుట.

మరి మన పెళ్ళిళ్ళలోనో???

ఎంతమంది పురోహితులు మంత్రాలని సరిగ్గా చెబుతున్నారు ? ఒకవేళ సరిగ్గా చెప్పినా ఎంతమంది వధూవరులు గానీ తల్లిదండ్రులు గానీ ఆ మంత్రాలని సరిగ్గా చెబుతున్నారు?
ఎంతమందికి ఆ చేసే ప్రమాణాల అర్థం భావం తెలుసు?

---***-------***-------***-------***-------***----

ప్రాముఖ్యతనూ, ఆవశ్యకతనూ మర్చిపోయి ఆచారం, సాంప్రదాయం, కట్టుబాట్ల పేరిట అవసరమైనవీ కానివాటినీ జొప్పించి ప్రతీదానినీ నాశనం చేసుకుని దాని తాలుకు ఖర్మ ఫలాల్ని తిట్టుకుంటూ తినడం మనకి మామూలైపోయింది.

బాల్య వివాహాలైతేనేం, వితంతు వివక్షలైతేనేం, సతీ సహగమనమైతేనేం, కన్యాశుల్కం, వరకట్న పిశాచాలైతేనేం, బీరకాయి పీచు మేనరికలైతేనేం, ఇప్పటి సహజీవనమైతేనేం... అన్నీ ఒకానొకప్పుడు ఆలోచించక చేసిన పనుల పర్యవసానమే.. మనసు పొరల్లో ఏర్పడిన ప్రతీకారేచ్చ. వ్యక్తి స్వాతంత్ర్య రూపం లో వడ్డి చెల్లించమంటోంది...

వీటన్నిటికీ కారణం ఏమయ్యుంటుందో మనకి తెలీనిదేం కాదు.

ఏం చేస్తున్నా ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని చేయటం కొరవడడం, తన్మూలంగా కొన్ని ఆచారాలు మూఢాచారాలై, వాటి బంధాలనుంచీ బయట పడేందుకు విశ్వప్రయత్నం జరగటం, అణగద్రొక్కబడటం మూలాన బయటపడ్డాక విశృంఖలత్వాన్నందటం... ఇదో చక్ర భ్రమణం... తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు మేధావులూ, కళాకారులూ, చరిత్రకారులూ, చదువుకున్నవారు, శాసనాధికారులూ .... ఎవరికి వారు యథాశక్తి తమవంతు సహాయం చేసినవారే. వారెవ్వరి ప్రమేయమూ లేకుండా వారెరుక లేకుండా ఇంతటి అన్యాయం జరిగే అవకాశమే లేదు. ఈ పాపాన్ని తరతరాల తలరాతలుగా శాసిస్తూంటే.. చేతులు కట్టుకుని కూర్చోటమో, అంతకన్నా చేయగలిగిందేముంది అని సర్దుకుపోవడమో.. ఇవే సగటు వ్యక్తి చేయగలిగినవి అని నమ్మే స్తితి కి చేరుకున్నాం....

ఆత్రేయ లాంటి కవి "స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదరూ" అన్నడంటే దాన్లో ఎంత లోతుందో.... అక్కడ దెప్పిపొడుపు చావు కి చేసే తతంగం మీద మాత్రమే కాదు, పెళ్ళి పేరున చేసే తతంగాం మీద కూడానూ.. ఇంకా చెప్పాలంటే మనుష్యులమీద, వాళ్ళ ఆలోచనా సరళి మీదానూ..

---***-------***-------***-------***-------***----

"పెరుగుట విరుగుట కొరకే ధర హెచ్చుట తగ్గు కొరకే" అని చదువుకున్నా చిన్నప్పుడు.

గమనిస్తే ఆచారాలు దురాచారాలుగా మారడానికి గల కారణం అవగాహనా రాహిత్యమే కానీ మరోటి కాదు. అందుకే ఆ చక్రభ్రమణంలో ఒక గౌతమ బుధ్ధుడు,బ్రహ్మనాయుడు , వివేకానందుడూ, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, గురజాడ , శ్రీశ్రీ, గాంధీ, అంబేద్కర్ వంటి వాళ్ళు మళ్ళీ జీవన రథాన్ని గాడిలో పెట్టి బుధ్ది ప్రచోదనం జరపటానికి కృషిజేశారు. వీళ్ళందరూ సామాజిక స్పృహ కలిగి ఉన్న సామాన్యులే... అసామాన్యమైన శ్రధ్ధ చూపి ముఖ్యంగా త్రికరణ శుధ్ధిగా నమ్మి ఆచరించారు... దురాచారాల్నుంచీ సరైన దారి చూపించారు.

ప్రతీవ్యక్తికీ వ్యక్తి ధర్మం, సామాజిక ధర్మం ఉంటాయి కదా. తన వృత్తి ప్రవృత్తులతో తన ఆలోచనలతో తనదైన ముద్రవేసుకుంటూ, సాగిపోతూంటే యద్యదాచరతి శ్రేష్ఠః అన్నట్టుగా అతనిని ఆదర్శంగాతీసుకుని అతని నుండీ స్ఫూర్తి పొంది, అనుసరిస్తూ మార్పు కు నాందీవాక్యం పలుకుతారు. బిందువు బిందువు జేరి సింధువైనట్టు.

(1) బయటకెళ్ళొచ్చాక బట్టలుమార్చుకుని, కాళ్ళు చేతులూ కడుక్కుని లోపలకి రావలన్నది తాతలనాటి ఆచారం...ఇప్పుడు డాక్టర్లూ అదేచెబ్తున్నారు క్రిములు లోపలకి రాకుండా ఉండాలంటే చెయ్యల్సింది అదేనని.
(2) ఇంటికి వచ్చినవాడికి ఉపచారాలు చేసి తాగటానికి మంచినీళ్ళివ్వటం, ఉపచారాలు చేయటం సాంప్రదాయం.. హొస్పిటాలిటీ తరగతుల్లో బోధించేదీ, విమానాల్లో, పెళ్ళిళ్ళల్లో మనం గమనిచేదీ అదె... సాదరంగా ఆహ్వానించటం, అథిథి సత్కారాలు చేయటం...
(3) అభ్యాగతో స్వయం విష్ణుః అన్నదే గాంధీగారు వినియోగదారుడి గురించి నిర్వచించినది....

ఇలా చేసే ప్రతీ పని వెనక ఉన్న భావమేమిటో తెలుసుకుని చేస్తే దక్కేది ఆనందం, లేకపోతే దక్కేది శ్రమ.
అందుకేనేమో కృష్ణుడు భగవద్గీత లో నహిజ్ఞానేన సదృశం పవిత్రమిహవిద్యతే అన్నాడు. పవిత్రీకరణ చేయటం లో జ్ఞానానికి సమమైనదేదీ నేనెరుగను అన్నాడు.

---***-------***-------***-------***-------***----

మళ్ళీ మన పెళ్ళి విషయానికొస్తే

పెళ్ళిళ్ళలో అతిసాధారణంగా కనిపించే తంతే... జీలకర్ర బెల్లం పెట్టడం ఆలస్యం ఏదో తరుముకొస్తున్నట్టు అందరూ అందినకాణ్ణుంచీ అక్షింతలు వేసేయటం (గిరవాటెసెయ్యడం అనాలేమో....) ఫొటో గ్రాఫర్లూ, వీడియో వాళ్ళు మొహం అటుపెట్టు, ఇటు పెట్టు, ఇల్లా చూడు, నవ్వూ... అనుకుంటూ డైరక్షన్లివ్వటం, అన్నివైపులనుండీ గుమిగూడిపోయి వధూవరులిద్దరూ బిజీగా ఉన్నా/ మంత్రాలను చదువుతున్నా , వాళ్ళ చేయి దొరకబుచ్చుకుని తెచ్చిన గిఫ్టేదో ఇచ్చామనిపించుకుని (వచ్చామని హాజరీ వేయించుకుని) వెళ్ళటం.. వచ్చిన వాళ్ళల్లో ప్రముఖులు ఉంటే తల్లిదండ్రులే జరిగే తంతుని పక్కన పెట్టేసి అమ్మయినీ అబ్బాయినీ పలకరించమనటం... ఇవన్నీ మనం నూటికి తొంభై శాతం పెళ్ళిళ్ళల్లో చూసేవే, చూస్తున్నవే.

జీవితానికి అత్యంత ముఖ్యమైన రోజు, ముఖ్యమైన సమయానికి చేసినదేమున్నదయ్యా అంటే హంగూ, ఆర్భాటమూ, హడావుడీ, గందరగోళమూ. ఆసలు విషయం (శుభ ముహూర్తము) ఏమయ్యిందయ్యా అంటే భజగోవిందం, పరమానందం..

ఇందుకా మనం అంతగా ఎదురుచూసేది? మన ప్రమేయం లేకుండా మనచుట్టూ ఉన్నవాళ్ళు మనకి ఏది ముఖ్యమో మనబదులు నిర్ణయించేయటం సబబేన?? ఇదెల్లాంటిదంటే.. అత్యంత వ్యయప్రయాసలకోర్చి, టిక్కెట్లు ముందుగా కొనుక్కుని, రిజర్వేషన్లు చేసుకుని, తిరుపతి వెళ్ళి తీరా స్వామివారిని దర్సించుకోవడానికి దొరికే ఆ ఒక్కక్షణంలోనూ, వాడెవడో లాగేశాడనో, తొక్కేశాడనో, చూడనివ్వట్లేదనో వాడిని ఖయ్య్ మనడానికే సరిపోతుంది. అసలు విషయం కాస్తా చెట్టెక్కేస్తుంది.

పెళ్ళి చేసుకోడానికి సంసిధ్ధత చూసుకోవడం బట్టలు కుట్టించుకోవడం, బ్యూటీ పార్లర్లకి వెళ్ళి అందాన్ని ఇనుమడిమజేసుకోవడం (స్త్రీ పురుషులిద్దరూను), పురోహితుణ్ణి, కళ్యాణమండపాలనీ, వంటవాళ్ళనీ |మొ| చూసుకోవడమేనా?

పెళ్ళి కి తమని తాము సిధ్ధం చేసుకోవడం ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకి చెబుతున్నారు?

ఒక నూతన అధ్యాయానికి తెరతీసేవేళ జరగవలసిన సంసిధ్ధత ఇంతేనా?

శుభ ముహూర్తం అంటే వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒక ముహూర్త కాలం ఒకరి భ్రూమధ్యమును ఒకరు చూడాలి. (జీలకర్ర బెల్లం వాడటానికి వెనక వైజ్ఞానిక హేతువు ఉందనుకోండి). అది కాస్త పక్కనపెట్టి మిగిలినవీ ప్రాముఖ్యతని సంతరించుకోవడం సమంజసమేనా?

---***-------***-------***-------***-------***-------***----

అందుకే ఆ శుభముహూర్తానికి నాదైన రీతిలో/ నాకుచేతనైన రీతిలో సహాయం చేస్తూంటా నేను.

వధూవరులిద్దరి మధ్యన ఒక తెర పట్టుకుంటూంటారు కదా, అసలుకి తెల్లని వస్త్రాన్ని ఒక స్వస్తికాకారముగా లిఖించి దానిని తెర పట్టాలి. కాకపోతే కొన్నిచోట్ల
"తెర వెనుక అందం, తెరతీస్తే బంధం"
"దివిలో నిర్ణయం, భువిలో పరిణయం"
వంటివి చూసి, వరుడికి ఇంతకన్నా ఉత్తమంగా, శ్రేయోదాయకంగా, శుభముహూర్తం వేళకి భగవదాశిస్సుల సూచికగా తెరసెల్లా ఉంటే బావుంటుందనిపించి

"చూపులు కలిసే శుభవేళ"
"కల్యాణ మహోత్సవ శుభవేళ"

అన్న శీర్షికతో తెరసెల్లాలను శ్రధ్ధతో తయారుచేస్తూంటా....

దీనివల్ల మూడు ఉపయోగాలు.
(1) "అప్పటి దాక ఆ మాటలూ ఈ మాటలూ మాట్లాడుతూ కాలక్షేపం చేసేవారికి మండపంలో ఇట్లాంటిది చూడగానే ఒకరకమైన ఏకాగ్రత (పిచ్చా పాటీ కన్నా శుభవిషయ చర్చ)
(2) పెళ్ళి కొడుక్కి మరీ కళ్ళముందే సుందరమైన భగవద్రూపం చూడగానే అప్రయత్నం గా మానసిక ప్రశాంతత, ఏకోన్ముఖత (ఇది పెళ్ళి కొడుకులు చెప్పినదే).
(3) ఆ తెరసెల్లా పట్టుకునేది నేనే కాబట్టి వధూ వరులిద్దరికీ సుముహూర్తానికి ఒకరి భ్రూమధ్యం లో ఒకరు చూడండి. అదే కల్యాణం అంటూ చివరాఖరి నిముషం లో కూడా హెచ్చరిక చేయటానికి సావకాశం దొరకటం...

అల్లా వివిధ పెళ్ళిళ్ళకు నేనేసిన తెరసెల్లాలు...



ఇదీ వాటి మాతృక ....

Tuesday, April 6, 2010

రేఖా విలాసం


నేనేసిన బొమ్మల్లో ఇదోటి.

దీన్లో ప్రత్యేకతలేమిటో ఎవరైనా చెప్పగలరా?

(దీని మాతృకతో పాటు, దీని వెనకున్న కథా కమామిషు వివరాలు తర్వాత టపాలో ..)