Tuesday, February 1, 2011

త్యాగయ్య - అందుకో నా వందనాలు !!

అందరికీ త్యాగరాజ ఆరాధనోత్సవాల శుభాకాంక్షలు (ఆలస్యంగా)

యోగము చేసెనో? విమల యూహల మిమ్మనుభూతి చెందగా
యాగము చేసెనో? స్వర లయాత్మకులౌ మిము ప్రస్తుతింపగా
ఏ గరిమన్ లభించెనయ ఇంతటి తీయదనమ్ము వ్రాయగా    
త్యాగయకున్, వచింపుమయ ! దాశరధీ, హృదయాంతరాకృతీ  !!



ఏ రస వాహిని మదికిన్
తారణ మార్గమ్ము నిచ్చె, తలచెద వానిన్
కారుణ్యామృత రాశిని,
తారక నామమ్ము వాని, త్యాగయ వానిన్ !!

19 comments:

ఊకదంపుడు said...

బావున్నాయండి, మకుటం చాలా అందంగా వచ్చింది. మీకు చక్కగా అమరింది.తా పొరబాటున దీర్ఘం బడింది, చూడండి.

Sanath Sripathi said...

ఊదం.గారూ, నెనర్లు. టైపోనూ సరిచేశా, ధన్యవాదాలు

రాఘవ said...

వ్రాతా గీతా రెండూ బాగున్నాయండీ. అభినందనలు, అభివందనములు. :)

కామేశ్వరరావు said...

చాలా హృద్యంగా ఉన్నాయి పద్యాలు. చిత్రం కూడా చాలా బాగుంది. ఆ కూర్చున్న తీరులోను, ముఖకవళికల్లోనూ త్యాగయగారి తన్మయత్వం చాలా చక్కగా గోచరమవుతోంది!
పద్యాలలో కొన్ని దిద్దుబాట్లు. "చేసితో" అంటే "చేసావో" అనే అర్థం వస్తుంది, నాకు తెలిసి. "చేసెనో" అన్నది ఇక్కడ సరైన పదం అనుకుంటాను.
"మిమ్మనుభీతి" - ఇది "మిమ్మనుభూతి" కాదా?
రెండవ పద్యం మూడవ పాదంలో మొదటి అక్షరం లఘువవ్వడం మూలాన ప్రాస తప్పింది. "కారుణ్య నిధిని" అంటే సరిపోతుంది.

Sanath Sripathi said...

నిజమే కదా... కనీసం ఒక పది సార్లైనా చూసుకుని ఉంటా, సరిగా ఉందా, తప్పులేమైనా ఉన్నాయా అని... కళ్ళెదుటనే ఉన్నా తప్పును ఒప్పుగా చదివేయటం మనసుకు ఎంత సుళువో కదా...

ధన్యవాదాలు గురూజీ, రాఘవా.. :-)

జ్యోతి said...

రాత, గీత రెండూ అద్భుతంగా ఉన్నాయండి..

చింతా రామ కృష్ణా రావు. said...

డియర్ సనత్! అభినందనలు.

రాత కాదది భక్తుని వ్రాత గాని.
గీత కాదది శ్రీపతి గీత కాని.
సత్తుయౌనది కవి సనత్తు చేత.
వ్రాత గీతల నేర్పరీ! వ్రాయు మెపుడు.

కొత్త పాళీ said...

"దాశరధీ, హృదయాంతరాకృతీ !!"

Beautiful. absolutely beautiful.

డా. గన్నవరపు నరసింహమూర్తి said...
This comment has been removed by the author.
డా. గన్నవరపు నరసింహమూర్తి said...
This comment has been removed by the author.
డా. గన్నవరపు నరసింహమూర్తి said...

వర్ణచిత్ర మందు వాగ్గేయ కారుని
ప్రభల నలరఁజేయ భాసురుండై
త్యాగరాజు పాడె రాగ తాళము లందు,
సనతు దర్శనమ్ము చక్షు హితము !

సనత్, త్యాగరాజుల వారి చిత్రము చాలా బాగుంది. మీ పద్యములు చిత్రమునకు తగునట్లు మధురముగా ఉన్నాయి. మీకు హృదయపూర్వక అభినందనలు.

Sanath Sripathi said...

నారాయణ స్వామి గారూ, జ్యోతిగారూ, చింతావారు, మూర్తిగారు!!
ధన్యవాదాలు.

చింతా రామ కృష్ణా రావు. said...

ప్రభల నలరఁజేయ భాసురుండై

అనే దానిలో భాసురుడయి
అని వ్రాస్తే సరిపోతుందండి.

ఫణి ప్రసన్న కుమార్ said...

సనత్ గారూ,
త్యాగయ్య గారి బొమ్మ చాలా బాగుంది. ఇంతకు మునుపు మీ బ్లాగు చూశాను కానీ, మీ బొమ్మలని గమనించలేదు. పాత టపాలన్నీ చూశాను. బొమ్మలు, పద్యాలు చాలా బాగున్నాయి.

రవి said...

అద్భుతంగా ఉంది. రంగులు, త్యాగయ్య ముఖంలో నిర్మలత, తేజస్సు చక్కగా కుదిరాయి. మా పాపాయి మీ అంత చక్కగా బొమ్మలు గీయాలని నా ఆశ.

దాశరధీ, హృదయాంతరాకృతీ! - దాశరథీహృదయాంతరాకృతీ అని సమాసంగా ఉండి త్యాగయ్యనే ప్రశ్నిస్తున్నట్టు ఉంటే బావుంటుందా? ఆలోచించండి.

రవి said...

క్షమించాలి. ఇందాక వ్యాఖ్య ఆవేశంగా రాశాను. దాశరథీ, హృదయాంతరాకృతీ! సబబుగా ఉంది.

డా. గన్నవరపు నరసింహమూర్తి said...

శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి నమస్కారములు, ధన్య వాదములు. రెండో పాదము సాఫీగా సాగ లేదు. పోస్ట్ చేసాక గణ దోషము చూసాను. రౌటరు ,అంతర్జాలము,సహకరించ లేదు,తప్పు సవరించడానికి.

Sanath Sripathi said...

రవిగారు, ఫణిగారూ !
ధన్యవాదాలు

Several tips said...

Your blog is good.