మా ఇంట రాముల వారి కళ్యాణం గత పాతికేళ్ళుగా నిర్వహిస్తున్నా... మా నాన్నగారు రాసి పెట్టిన స్వామి వారి గోత్రనామాల పుస్తకం కనపడక ఈ సంవత్సరం కొంచం ఖంగారయ్యింది. ముక్కు రాఘవుణ్ణి, కామేశ్వరరావు గారినీ, తెలిసిన మిగిలిన సాహితీ బంధువులనీ అడగటానికి ప్రయత్నం చేశా ఆఖరు నిమిషంలో, కానీ వివరాలుతెలియలేదు
మొన్న భద్రాచలం లో ప్రధానార్చకులవారిని అడిగి వ్రాసుకుని వచ్చాను. మీ అందరికోసమై ఇక్కడ పొందుపరుస్తున్నా....ఇది "శంఖచక్రధారి అయిన భద్రాచల రామ నారాయణుని ప్రవర. అయోధ్యా రాముడిది కాదు)
అమ్మవారు:
చతుర్వేదాధ్యాయినీం, సౌభాగ్య విశ్వంభరీం, నిరాకార, సాకార చతుజిగీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం....
విశ్వంభరశ్శర్మణో నప్త్రీం
రత్నాకరశ్శర్మణః పౌత్రీం
క్షీరార్ణవశ్శర్మణః పుత్రీం
శ్రీ సాక్షాన్మహాలక్ష్మీ స్వరూపిణీం సీతా నామ్నీం ఇమాం కన్యాం
అయ్యవారు:
అనంత వేదాధ్యాయనే, అచ్యుత పరబ్రహ్మణే, ఆదినారాయణాయ
నిరాకార, సాకార, పరవ్యూహ, విభవ, అంతర్యామి అర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ
పరబ్రహ్మ శర్మణో నప్త్రే
వ్యూహనారాయణ శర్మణః పౌత్రాయ
విభవవాసుదేవ శర్మణః పుత్రాయ
సాక్షాన్నారాయణ స్వరూపాయ శ్రీ రామ చంద్ర పరబ్రహ్మణే వరాయ
(మా నాన్న గారు అజ, రఘు దశరథ వంశ ప్రవర వాశిష్ట మైత్రావరుణుల గోత్రప్రవరతో చెప్పేవారేమోనని లీలగా గుర్తు)
6 comments:
సంతోషం. ఈ వివరాలు నేను మిత్రులతో పంచుకోవాలి.
సీతారాముల వారి దర్శనం, గోదావరి దర్శనం చక్కగా అయిందా? ఆ వివరాలూ వ్రాయండి.
డియర్ సనత్!
ప్రవర చాలా బాగా సేకరించి ప్రచురించినందుకు సంతోషం.
చిన్న సవరణ చేయాలనుకుంటాను.
ప్రవరలో శర్మణః అని వ్రాసావు కదా? అది శర్మణః కాకపోవచ్చు. వర్మణః అయి ఉండవచ్చు.
నిర్ధారించుకొని సరి చేయగలవు.
శుభమస్తు.
అమ్మవారి ప్రవరలో నప్త్రీం అనాలనుకుంటా. ప్రవరల్లోని పేర్లు నిజమైన వ్యక్తులవి కావని తెలుస్తూనే ఉంది. అమ్మవారిని విశ్వంభర అయిన ఆదిశక్తి యొక్క మునిమనుమరాలుగా, సముద్రుని మనుమరాలుగా, క్షీరసముద్రుని పుత్రికగా సంకేతించారు. అలాగే అయ్యవారిని పరబ్రహ్మయొక్క మునిమనుమడుగా, నారాయణ వ్యూహం యొక్క పౌత్రునిగా, వాసుదేవ వ్యూహం యొక్క పుత్రునిగా పేర్కొన్నారు. కాబట్టి 'శర్మ' సరి అయినదే అనిపిస్తోంది.
మనుమరాలికి నప్త్రి అయినా, మనుమడికి నప్త మాత్రమే కదా,
వ్యాసం వశిష్ఠ నప్తారం అని వస్తుంది.
నా భద్రాచల యాత్ర చాలా అనుభూతిప్రదంగా, చిరస్మరణీయంగా సాగింది. ముఖ్యంగా పొద్దున్నే గోదాట్లో చీకట్లో స్నానసంధ్యాదులు కానిచ్చుకుని నాలుగు గంటలకల్ల సుప్రభాతసేవలో ఒక అరగంటసేపు నిరాటంకంగా, సీతా రామలక్ష్మణుల దివ్యమంగళవిగ్రహాలను కన్నులారా తనివితీరా చూడగలిగే మహదవకాశం, రాత్రి పవళింపుసేవ (అప్పుడు పెట్టే వేడి వేడి కట్పొంగలి ప్రసాదం, గోరువెచ్చని పాల తీర్థం...) ఆదివారం నాడు ఉదయం మాత్రమే జరిగే అభిషేక సేవ, ఆపై సువర్ణపుష్పార్చన, కల్యాణము .. ... అబ్బో ఒక్కోటీ ఏక్ సె బడ్కర్ ఏక్ అన్నట్టున్నాయి. ఊరెళ్ళే ముందే "ఇది కల్పవృక్షం" కొనుక్కునెళ్ళాను. అక్కడ ఆలయంలో కూర్చుని దాశరథీ శతక పద్యాలు పాడుకుంటూంటే, హనుమాన్ చాలీసా పారాయణచేసుకుంటూంటే, కల్పవృక్ష రసాస్వాదనచేస్తూంటే అదొక అనిర్వచనీయమైన ఆనందానుభూతి (ఊహ ఎమోకూడా.. తెలీదు) కానీ బాగా నచ్చింది.
మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చూస్తానా అన్నట్టనిపిస్తోంది.
మురళీ, అది టైపో మాత్రమే... ఉండాల్సింది నప్త్రీం అనే....ధన్యవాదాలు
చింతావారూ !! రామచంద్రుడు వర్మణే గాని రామనారాయణుడు శర్మణే నేమో కదా...
Post a Comment