Monday, August 1, 2011

రాముడూ - స్ఫూర్తి -2 (కొనసాగింపు)


(భావం పన్నెండేళ్ళ క్రితం భద్రాచల యాత్రలో కల్గినా ఇన్నాళ్ళకు మళ్ళీ భద్రాచలయాత్ర అయినపిదప పద్యరూపం ధరించింది. అందుకే దీని శీర్షిక రాముడూ - స్ఫూర్తి -2 (కొనసాగింపు) అని ఇచ్చాను. )


రాముడు అడవి లో పయనిస్తూంటే ఒక సంఘటన జరిగిందిట. అది ఇరు ప్రాణుల సంభాషణ. అందులోనూ తల్లీ పిల్లల మనో భాషణం , అదీ రాముడితో.


" పిల్లలు అమాయకులు. పసితనం వీడి పోలేదు. రాముడు గనక స్వీకరించక పక్కన పెట్టేస్తే మిగిలిన వారితో పోల్చుకుని తామేం తక్కువ చేసాం, తమ తప్పేముంది  అని మనసులో నొచ్చుకుంటారు. తాము పుల్లగా ఉన్నామన్న నిజాన్ని గుర్తించలేని పసి హృదయం కదా.. ఉడుకుమోత్తనం తో బుంగ మూతి తో బాధ పడతారేమో" అని తన పిల్లలని హృదయానికి హత్తుకుని పట్టుకుని ఉన్నదట. పండి పోయినా రాలిపోనీయకుండా...


పుల్లని వారలంచు రఘుపుంగవడే స్పృశియింపకున్న ! నా
పిల్లలు ఆర్తితోడ విలపించెదరేమొ ! ఫలాలు పండినన్ 
ఉల్లము నందు హత్తుకొని యుంచెద రాలగనీక రాఘవా !!
తల్లులు తల్లడిల్లరటే? తాళుదురే పసివారి శోకము 
త్ఫుల్లసరోరుహాక్ష ! మదిపూజలు గైకొనరా! మనోహరా !!   


అయితే ఆ పిల్లలు అమాయకులేం కాదుట.


అయ్యో.. ఒక వేళ మనం పుల్ల గా ఉన్నాం కదా అని రాముడు గనక తినకుండా మనని పక్కన పెట్టేస్తే , "నా కడుపున పుట్టటం వలన కదా వీరికి రామ స్పర్శానుభూతి లేకపోయిందే " అని తల్లి మనసు నొచ్చుకుంటుందేమో అని పండి పోయినా సరే నేల రాలి పోకుండా ఆ తల్లి ని అలాగే హృదయానికి హత్తుకునే ఉండిపోయాయిట. 


అమ్మరొ! పళ్ళుపుల్లనని అచ్యుతుడే దలపోవ "నాదు గ 
ర్భమ్మున బుట్టి సేవనిడు భాగ్యము గోల్పొయెనంచు క్రుందు" మా
యమ్మ ! భరింపగల్గుదుమె ఆయమ బాధ ! మనస్సెరుంగమే 
గమ్మున వ్రాలకుండ బిగి కౌగిలి నుండెద మెంత పండినన్ !
(మమ్ము క్షమింపుమయ్య జన మాన్య! అధర్మమనెంచబోకుమా !! )


(అధర్మము+అని+ఎంచబోకుమా = అధర్మమనెంచబోకుమా  అని అనుకున్నాను తప్పైతే సరిజేయగలరు)
ప్రకృతి ధర్మానుసారం పండిన పళ్ళు వ్రాలిపోవాలి, కానీ ఇక్కడ ధర్మ వ్యతిక్రమమౌతున్నా అధర్మమని భావనచేయకుమయ్య అని వినతి . తల్లి బాధ పడకూడదని పిల్లలు.. పిల్లలు బాధ పడకూడదని తల్లీ... ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ బాధ తెలియకుండా హృదయానికి హత్తుకుని ఉండిపోయాయిట. అన్యోన్యత్వం... పరస్పరం భావయన్తః పరస్పరం బోధయన్తః 


ఇంతకీ ఆ తల్లి ఎవరో తెలుసా.. "నేరేడు చెట్టు". రాముడు ఈ అన్యోన్యత్వానికి ముగ్ధుడైపోయాడు. అందుకే మరు జన్మ లో "కృష్ణ" వర్ణం ఎంచుకున్నాడేమో ...ఇంతటి 'ఉన్నతమైన' భక్తీ భావం ఉంది కనుకనే పళ్ళ చెట్లలో చాల 'ఎత్తుకు' పెరిగే చెట్టు కూడా నేరేడు చెట్టు మాత్రమె....