"రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠం దక్కిందంటే అది ఒక మహాద్భుత రచన అయిఉండాలి. కనుక అది మనం కూదా చదవాలి" అన్న ఆలోచన తో మొదలయ్యింది ప్రస్థానం. పుస్తకం కొనుక్కుని చదివితే అర్థం అవదా అని ఒకప్పుడనిపించేది. తీరా కొనడానికి ప్రయత్నించేసరికి తెలిసింది అది పుస్తకం కాదని పుస్తకాలు అని. కొంపదీసి తక్కువ అంచనా వేశామా ఏమిటి అనిపించింది.
అదృష్టం కొద్దీ కొన్నేళ్ళు బజార్లో ఆపుస్తకాలు దొరక్కపోవటం వల్ల (లేదా ఎక్కడదొరుకుతాయో నేను సరిగ్గా తెలుసుకోకపోవటం వల్ల) కొంచం సమయాభావం అవ్వటం, ఆలోపు అక్కడక్కడ వ్యాసాల్లో, రచనల్లో రామాయణ కల్పవృక్ష ప్రస్తావన రావటం, నా అజ్ఞానం కొద్దిగా తగ్గి, ఆ కావ్యం పట్ల కించిత్ గౌరవ భావం పెరగటం, శ్రధ్ధ కలిగిన తర్వాత వెదకగా కోటీ లో ఒకానొక షాపులో బాలకాండం ఒక్కటీ దొరికిటం తో మలి అడుగు పడింది అనుకున్నా.
తీరా పుస్తకం కొన్నాకా నా పరిస్థితి "అనుకున్నదొకటి, అయ్యింది ఒకటి" అన్న చందంగా తయారయ్యింది. అప్పటికి నాకింకా పద్యాల పేరున పైత్యం రాయడం కలలో కూడా వచ్చి ఉండదు. మొత్తానికి ఏమైతేనే భాగవతం లో పద్యాలని చదువుకున్నాం కదా అట్లానే ఇదీ చదివేద్దాం. అర్థం అయిపోతుంది అనుకుంటూ మొదలెట్టా... గ్రీకు లాటిన్ అంటే ఏమిటో అనుభవ పూర్వకంగా తెలిసొచ్చింది. ఆదెబ్బకి రెండువిషయాలు అర్థం అయ్యాయి (అనిపించింది). ఒకటి -విశ్వనాథను పాషాణపాక ప్రభువనెందుకన్నారో. రెండు - కల్పవృక్షం చదువుదామన్న క్రేజే గానీ చదవటానికి, అర్థం చేసుకోటానికి నాకు అంత పరిపక్వత లేదని. ఆదెబ్బకి పుస్తకం మూసేసి అటకెక్కించేశా. విశ్వనాథ నవలలు తీశా.. బహు బాగా అర్థం అవసాగాయి. దాంతో ఒకటి తేల్చేసుకున్నా. పద్యాలు మనకబ్బవురా అబ్బయి అని. ఇది జరిగి దాదాపు పదహారేళ్ళు దాటి ఉంటుంది.
ఇంటర్లో సంస్కృతమయ్యాక మళ్ళీ ఎట్లా ఏర్పడిందో రుచి తెలియదు గానీ పద్యాలు కొంచం కొంచం అర్ధం అవసాగాయి. దాంతో అటకమీదనుంచీ తీసి మళ్ళీ కొన్ని పదుల పద్యాలు చదివా. పోతనగారి ఎఫెక్టో, మన బుర్ర కెపాసిటీనో గానీ భారతం లో పద్యాలు గానీ, కల్పవృక్షం పద్యాలు గానీ అంతగా అర్థం కాలేదు. కాకపోతే ధారుణి రాజ్య సంపద మొదలైన పద్యాలు రాగాలాపనలో బాగున్నాయని కొన్నింటిని కంఠస్థ పట్టి కాలీజీలో కొంచం ఫోజు కొట్టా. అంతటితోనే సరి. మళ్ళీ పుస్తకాలు యథాస్థానం ప్రవేసించాయి. శొభనార్థే క్షేమాయ పునరాగమనాయచ అని కూడా అన్నా.. ఈ సారి.
అన్నట్టుగానే నాన్నగారితో అవధానాలకి వెళ్ళటం, సరదాగా ఉందనిపించటంతో పుస్తకాన్ని మళ్ళీ తీశా. ఈ సారీ అదే రిజల్టు. వయసు పెరిగినకొద్దీ అవగాహన కలిగి అర్థం అయిపోతుంది అని భావించానేగానీ అంతకుమించి సాధన ఏమీ చేయలేదు. ఇక దీనికీ మనకీ రామ్రాం అనుకున్నా. కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి గోదావైభవ కావ్యాన్ని, దాని రహస్యప్రకాశాన్ని చదివా. అద్భుతం అనిపించింది. ఇన్నాళ్ళుగా నేనెటువంటి అనుభూతికోసం ఎదురుచూస్తున్నానో అది దక్కింది అనిపించి. ఒక మూడేళ్ళు ఆపుస్తకాన్ని ఆసాంతం చదువుకుని ఆనందించాక బోయి భీమన్న గారిని అనుకోకుండా చదవటం నా పయనంలో ఒక అనుకోని మలుపు.
భద్రాచల యాత్ర రాముడి ఆత్మీయతని పరిచయం చేస్తే అసంకల్పిత ప్రతీకార చర్యగా భావాలు ఒక పద్యం లాంటి వాటితో రావడం ఇంకొక మజిలీ. తోచింది రాసి అబ్బో అని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నప్పుడు బ్లాగన్నదై పరిచయమవ్వడం. అప్పటిదాక నూతిలో కప్పమాదిరి ఉన్నవాణ్ణి ప్రపంచాన్ని తెలుసుకోవడం మరొకమజిలీ...దాని పర్యవసానం కొంచం వ్యాకరణం, చందస్సు నేర్చుకుని చదివితే రమాయణ కల్పవృక్షం అర్థం అవుతుందేమో అని కొంచం ఇంగితం కలగటం..ఆ దిశగా ప్రయత్నం చేయటం.....
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు ఏ జన్మ లో చేసుకున్న పున్నెమో మంచిపద్యం లో వడలి మందేస్వర రావుగారి గురించి తెలుసుకోవడం, ఆపై "ఇదీ కల్పవృక్షాన్ని ఆస్వాదించగలగటం" అటుపై మొన్నీమధ్య విశ్వనాథ పుస్తకాలని కొనడానికి వెళితే నా కష్టాన్ని గమనించి విశ్వనాథ వారే కరుణించారన్నట్టుగా "కల్పవృక్ష రహస్యములు" పుస్తకం దొరికింది.
తన కావ్యానికి తానే వ్యాఖ్యాన్నందిచారని తెలిసిన మరుక్షణం నా ఆనందనికి అవధులు లేవు. నన్ను కరుణించటానికే అని నేననటానికి గల కారణం విశ్వనాథ వారు ఒక్క బాలకాండకు మాత్రమే వ్యాఖ్యానన్నందిచారు. (దురదృష్టవశాత్తు మిగిలిన కాణ్డలకు వారి వ్యాఖ్యానం లేదు).
కల్పవృక్షమెందుకు అంతటి బృహత్తర రచనో తనమాటల్లో తానే వ్యక్తపరిచారు. ఎంతో అరుదైన భాష్యాన్నందిచారు. ఆ మహాకావ్యానికి వెనుకనున్న ఆలోచన, హృదయమూ, రచనా శిల్పం, అలంకారాలూ, నానుడులూ, విశేషాలూ, రహస్యాలూ తనంత తానుగా ఆవిష్కరించారు. ఆశ్చయకరమైన విషయమేమిటంటే ఇటువంటి పుస్తకం లిస్టులో అమ్మకానికి ఉందని విశాలాంధ్రవారు చెప్పలేదు, విశ్వనాథ మనవళ్ళవద్దనున్న కేటలాగ్ లో కూడా ప్రస్తావనలేదు, కానీ విమర్శ గ్రంథాల సెట్టు కొంటే దాన్లో ఈ పుస్తకాన్ని ఉచితంగా అందిస్తున్నారు (పాత పుస్తకం మాదిరిగా ఉంటుంది. స్టాక్ క్లియరెన్సులో భాగంగానో ఎమో).
విశ్వనాథ విమర్శ గ్రంథాల సెట్టు కొనుక్కోవడం నాకే తెలియకుండా నాకునేను చెసుకున్న గొప్ప సాహయమేమో అని అనిపించింది..
చదివావా అంటే చదివాననిపించుకోవటానికేముంది? ఒక్క బిగిన చదివేయచ్చు కానీ కల్పవృక్షం అర్థమవ్వాలంటే చందస్సు, వ్యాకర్ణము, నిఘంటువు వంటివి ఉంటే సరిపోదు, తెలుగు తెలియాలి, తెలుగుదనం తెలియాలి, తెలుగు సంస్కృతి తెలియాలి, ఆ తీయని మకరందాన్ని ఆస్వాదించే విధానం కూడా తెలియాలి అప్పుడే దాని హృదయం ఆవిష్కృతమౌతుంది అన్న నిజం నిఖార్సుగా తెలిసొచ్చింది. అసలైన తెలివొచ్చింది. మనసు నిండింది.
ఆల్రెడీ "ఇదీ కల్పవృక్షం" చదివినవారికి ఈ పుస్తకం ఇంకోక దర్పణం. విశ్వనాథని తెలుసుకోడానికి. పుస్తకంలోని మధురానుభూతులు..... మచ్చుక్కి కొన్ని [వారి వ్యాఖ్య నీలం రంగులో]
(1) పుత్రకామేష్టి సందర్భంగా అగ్నిదేవుడు రాజుచేతిలోపాయసము పెట్టే సందర్భములో వారి వ్యాఖ్యానము
ముదిపృదాకువు సెజ్జమునులు జోదిళ్ళీయ
హాళిమై గూర్కు సుమాళి యొకడు
ప్రామింకు చిట్టచివళ్ళలో నసురుల
దోరించునట్టి కటారి యొకడు
ప్రామఱ్ఱి క్రీనీడ బాఠమ్ము ముసలులౌ
మునులచే జదివించు పోఱడొకడు
పాలవెల్లి కరళ్ళపై వెలికింతలై
కాలివ్రేల్చీకెడు కందొకండు
పసిమియై గాలికిని రాలిపడిన యొక్క
నలుసు నివ్వరిముల్లైన వెలుగొకండు
స్థూలమై వచ్చి వచ్చి తా సూక్ష్మమగుచు
జనపతి కరస్థమగు పాయసమున జొచ్చె
(అ) పృదాకువు - సర్పము. ముది పృదాకువు - ఆదిశేషువు
జోదిళ్ళు- నమస్కారములు
ఆదిశేషువనే సయ్యపై మునులు నంస్కరించుచుండగా నిద్రపోవునొక యొయ్యారి. ఇతడు విరాణ్మూర్తి
(ఆ) ప్రామినుకు - వేదములు
ప్రామిన్కు చిట్తచివళ్ళు - వేదాంతములు. అక్కడ రాక్షసులను సమ్హరించు ఖడ్గధారి.
విరాణ్మూర్తికన్న ఈ ఖడ్గధారి తక్కువరూపముకలవాడు
(ఇ)ప్రాత మఱ్ఱి చెట్టుకింద వృధ్ధులౌ ఋషులచేత పాఠమ్ములను వల్లెవేయించీ పోఱడు- బాలుడు. ఇతని మూర్తి మరియు చిన్నది
(ఈ)పాలవెల్లి కరళ్ళపై క్షీరసముద్ర తరంగములమీద తన కాలి వ్రేలు చీకెడి కందు-పసివాడు.
(ఉ) మరల వరిముల్లంతవాడు
విరాట్స్వరూపంతో మొదలెట్టి తగ్గుతూ తగ్గుతూ వచ్చి రాజు చేతిలో పాయసంలో ప్రవేశించాడు. అంతటి స్వామి ఇంతగా అయ్యాడని అర్థం. పరమేశ్వరుడు అణోరణీయాన్, మహతోమహీయాన్ కద"
చెప్పదలుచుకున్న విషయాన్ని సాపేక్షికంగా, పథకం ప్రకారంగా (planned గా అని నా ఉద్దేశం).. భావప్రసక్తి చేయటం, పద్య రచన దానిని పరిపుష్ఠిచేయటం అందులోనూ "జోదిళ్ళు", "ప్రామిన్కు చిట్టచివళ్ళు", "పోఱడు (తెలంగాణ యాస కూడానేమో)", కాలి వ్రేల్చీకెడు కందు" వంటి తెలుగు పదాల పోహళింపు మామూలుగా చదివేసుకుంటూ పోతే వాటి అందం సొబగూ, అర్థం ఔతాయా?
(2) రామయణంలో రామ జననమయ్యక ఒక పద్యముంటుంది. దానిని కనీసం ఒక 10 సర్లైనా చదివి ఉంటా. ప్రత్యేకంగా ఏమీ అర్థం కాక ముందుకి వెళ్ళిపోయా కుడా....
వెలికి గొనిపోకుడీ బిడ్డబిట్టలారు
సంజవేళల నంచు గౌసల్య పలుక
గరుడి వైకుంఠమున భయకంపితుండు
మడమలను ద్రొక్కుకొను ఱెక్క ముడుచుకొనుచు
దానికి వ్యాఖ్యానాన్నందిస్తూ "ఈ భాగమంతయూ తెలుగుల ఇండ్లలో పురుళ్ళు, పిల్లలు పెరుగుటలు వారినాడించుటలు, ఆ మహాశోభ ఉన్నది. వట్టి కావ్యకఠిన బుధ్ధులకుతెలియదు. అంతయు రసభరితముగానుండును. ఆ రసము జీవితమందున్నది. తెలుగుగృహములలోనున్నది. ఇచ్చటకవిచేసినది పద్యములు వ్రాయుట మాత్రమే. తెలుగు దేసములో నేడాదిదాటని పిల్లలను సాయంకాలమందు నారుబయతకు దీసుకొనిపోనీయరు. పిట్టలారునందురు. పూర్వము పసిపిల్లలకదియొక జబ్బువచ్చెడిది. అట్లు రామచంద్రుని గూర్చి ఎవ్వలైన ననగా గరుత్మంతుడు భయముతో తన ఱెక్కలను ముడుచుకొనెడివాడట" అన్నారు.
ఇలా ఎన్నెన్నో ఆణిముత్యాలను, చందో విశేషాలను, చారిత్రక రాజనీతి రహస్యాలను, తెలుగువారి ఆచార వ్యవహారాలను ప్రతిపాదిస్తూ తానుచేసిన బృహత్కావ్యానుగత హృదయాన్ని విహంగవీక్షణంగావిస్తారు విశ్వనాథ.
పద్యరచనపై, అందునా కల్పవృక్షంపై మక్కువగలవారి ఇంట నీరాజనాలందుకోగల మేటి పుస్తకమీ "కల్పవృక్ష రహస్యములు". విశ్వనాథవారి జయంతిని పురస్కరించుకుని వారికి కృతజ్ఞతగా నా ఈ టప...
10 comments:
చాలా మంచి టపా.నేను కుడా రామాయణ కల్పవృక్షం చదువుదామనుకొని, తర్వాత అర్థం చేసుకొనే పాండిత్యం లేదని గ్రహించి విరమించుకున్నా
శ్రీకాంత్ గారూ !!
వదిలేయకండి, నెమ్మదిగా మొదలెట్టండి, అదే వంటపట్టేస్తుంది. (పుస్తకాలూ, తెలిసిన వాళ్ళూ దొరకనే దొరుకుతారు)
ఒక రహస్యం మాతో పంచుకున్నందుకు ధన్యవాదములండీ.
కల్పవృక్షం అరువు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ పుస్తకం అరువు దొరికే చొటు తెలిసింది.:)
కల్పవృక్షం అర్థమవ్వాలంటే ఏమిటి కావాలన్నది విశ్వనాథవారు కల్పవృక్ష అవతారికలోనే ఒక పద్యంలో యిలా చెప్పారు!
ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వరభారతి దీప్తి కల్గినన్
సదమల బుద్ధికిన్ సకలశాస్త్ర రహస్యవివేక మబ్బినన్
మదికి నుదాత్త కల్పనల మక్కువ కల్గిన విశ్వనాథ శా
రద సకలార్థదాయిని సురద్రువు రామకథన్ భజింపుమీ
ఈ లిస్టు చూసి నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు :-) ఇవి కల్పవృక్షాన్ని సర్వసమగ్రంగా అర్థం చేసుకోడానికి అవసరమయిన లక్షణాలు. మనలాంటి పామరులకు కొద్దిపాటి ఆసక్తి ఓపిక ఉంటే చాలు, కల్పవృక్షాన్ని కనీసంగా అర్థం చేసుకోడానికి. కల్పవృక్షమ్మీద అనేక వ్యాసాలు పుస్తకాలు వచ్చాయి. దొరికినవి దొరికినట్టు చదువుకుంటూ పోవడమే!
ఒక ఆలోచన - ఆసక్తి ఉన్నవాళ్ళం నలుగురం ఒక study groupలా చేరి కలిసి చదువుకోవచ్చు. అందులోని రహస్యాలని కలిసి శోధించవచ్చు.
భాగ్యనగరం లకడీకాపూల్ లో బెస్ట్ పుస్తకాల దుకాణం ఒకటుంది. అక్కడ కల్పవృక్షం పాత పుస్తకాల కాపీలు, వడలి మందేశ్వరరావు గారి పుస్తకమూ మొన్న చూశాను.మీకు కావాలంటే అక్కడికి పరుగెట్టండి.
కామేశ్, ఊ.దం, ధన్యవాదాలు.
కామేశ్వర రావుగారూ, Study Group కి నా ఓటు.
శ్రీమాన్ సనత్ శ్రీపతి గారికి శత సహస్ర నమస్కారములు.పై మీ వ్యాసం మాకు చాలా ఉపకరించింది.ఎన్నో రోజులుగా విశ్వనాథ వారి కల్పవృక్షం గురించి ప్రయత్నం చేస్తున్నాము,మీరు దయచేసి రామాయణ కల్పవృక్షం మరియు కల్పవృక్ష రహస్యాలు ఎక్కడ దొరుకుతాయో తెలియజేయగలరు.
భవదీయ
కొవ్వూరు వేంకట నరసింహారావు
రఘువీర్ !!! విశ్వనాథ వారి సమగ్ర సాహిత్య గ్రంథావళిని విశ్వనాథ వారి మనుమడు, విశ్వనాథ పావని శాస్త్రి గారి అబ్బాయి - విశ్వనాథ సత్యనారాయణ (బహుశా జూనియర్ అనాలేమో) పునర్ముద్రణ గావించారు. జూనియర్ వి.స.నా. ఫోన్ నంబర్ : 9246100751 (లేదా) నవోదయ పబ్లిషర్స్ : 9247471362
విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం మీరు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. వివరాలకు శ్యామలీయం బ్లాగు లోని టపాను సంప్రదించండి: విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము (Download)
ఉచితంగా రామాయణ కల్పవృక్షం నెట్‌లో లభిస్తున్నది. వివరాలకు చూడం: విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము (Download)
Post a Comment