Saturday, October 29, 2011

రాముడు- స్ఫూర్తి - గ్రహణం

కార్తీక మాసం ఆరంభమయ్యింది, శనివారం కదా అని మా అబ్బాయితో కూర్చుని న్యాసం చేస్తూంటే " వక్త్రే సరస్వతీ తిష్టతు, నయనయోశ్చంద్రా దిత్యౌ తిష్ఠేతాం, సర్వతో వాయుస్థిష్ఠతు" అని వినగానే వాడడిగాడు అంటే ఏమిటి నాన్నా అని (ఆ పేర్లు వాడికి కొంచం పరిచయమున్నవి అవడం తో). సరస్వతీదేవి  నాలుక పైన, సూర్య చంద్రులు రెండు కళ్ళలోనూ, వాయువు అంతటా ఉన్నాడని అర్థం నాన్నా అన్నా...(వాడెక్కడ శివుడి తలమీద చంద్రుడుంటాడు కదా మళ్ళీ కళ్ళల్లో ఉండడమేమిటి అని అడిగేలోపు ఇంకేదో విషయం పైకి ధ్యాస మరల్చేశాను).

ఆ తర్వాత అదే విషయమై ఆలోచించటం మొదలెడితే ఒక ఊహ తట్టింది...

రవి యొక కంట వెల్గులిడు రాతిరి ఱేడు మరొక్క కంట నీ
భువి పయి వెల్గులీనునని పుత్రునకున్ వివరించువేళ చ
క్షువులను గీటి ఆడెనొ రఘూత్తముడున్ తన తండ్రి తోడ శై
శవమున! నాటి నుండి రవి చంద్రులకున్ గ్రహణమ్ము లొచ్చెరో !!

స్ఫుర్తి:
(1) నాగమురళి గారి ఆకాశంలో ఆంబోతు, కామేశ్వరరావుగారి దీపావళి చందమామ చదువగా ఊహలటువైపు సాగటం..
(2) మా అబ్బాయికొచ్చినట్టే సందేహాలు రాముడికీ వచ్చి ఉంటాయి, వాళ్ళ నాన్న ఒడిలో కూర్చుని ఆటలాడేటప్పుడు (అసలే ఆయనగారికా అబ్బాయంటే బహు గారాబమాయె) వాళ్ళ నాన్ని అడిగి ఉంటే ఆయన ఏమని సమాధనం చెప్పేవారో కదా అని కలిగిన ఆలోచన. కుడి కన్నుగీటగా సూర్య గ్రహణమూ, ఎడమ కన్నుగీటగా చంద్ర గ్రహణమూ అయ్యాయేమో...

మనసైనవాడు కన్నుగీటితే లభించే "కిక్కు" ను వర్ణించటం అలవిగాదు. అందులోనూ పసిపిల్లల బోసి నవ్వులు, కంటి చూపులూ.. అబ్బో మరింత ముద్దొస్తున్నట్టుంటాయి.  ఆ కొంటె కనుచూపుతోనే కద బాలకృష్ణుడు కూడా గోపికలందరి మనసునూ కొల్లగొట్టింది..

కావాలంటే సంపూర్ణ సూర్య గ్రహణమప్పుడు కనిపించే గోల్డెన్ రింగు ను చూడండి...










Tuesday, October 18, 2011

కాటుక కంటి నీరు...


బ్లాగ్మిత్రులు కామేశ్వరరావు గారు "తెలుగు పద్యం" లో ఇటీవలి కాలంలో సాహిత్యావలోకనం చేస్తూండగా తనకెదురైన ఒకానొక సంఘటనకి కలత చెంది ఒక చిన్నటపా పెట్టగా దానిలో చర్చ "కాటుక కంటి నీరు" పద్యం మీదకి వెళ్ళడం (అది పోతన గారి రచనా కాదా అనే విషయంలో), నాణేనికి రెండువైపులా సమమైన వాదన ఉండడంతో ఆ చర్చని అంతటితో సమాప్తి చేద్దామన్న ఒడంబడికకి రావటం జరిగింది. ఐతే అదేవిషయమై నిన్ననే ఇంకొక వివరణ చదవటం చేత దానిని అక్కడే చర్చించి మాట తప్పటం కన్నా ఇంకొక టపాగా ప్రకటించవచ్చనే ఉద్దేశంతో ఈ టపా...

ఆసక్తి కలవారు ఇక్కడ ఆ టపా చర్చను చదువవచ్చు.

"కాటుక కంటి నీరు" చాటువుకు ప్రస్తావన శ్రీనాథ కవి సార్వభౌముడు రాజులకు కృతినిచ్చి, ధన సంపాదన చేసి దారిద్ర్యము బాపుకొనమని పోతనకు ప్రబోధము చేసినట్లూ, అప్పుడు ప్రత్యుత్తరముగా పోతన భారతీ దేవితో పలికిన పద్యంగా ఈ పద్యరాజం ప్రశస్తమయ్యింది.

ఐతే నిడదవోలు వేంకటరావుగారు "పోతన" అనే గ్రంథం లో ఈ క్రింది విధంగా వివరణనిచ్చారు
"ఇందు పేర్కొనిన మువ్వురూ (కర్ణాట, కిరాట, కీచకులు) శ్రీనాథునికి సంబంధించినవారే !


కర్ణాట రాజు:- శ్రీనాథుడు కర్ణాట రాజగు ప్రౌఢదేవరాయల ఆస్థానమున, ముత్యాలశాలలో కనకాభిషేక మహా సత్కారమును గాంచినవాడు - కర్ణాట క్షితినాథ మౌక్తిక సభాగారాంతరాకల్పిత స్వర్ణ స్నాన జగత్ప్రసిధ్ద కవిరాట్టు" నని చెప్పుకున్నాడు 


కిరాటులు:- కిరాటులనగా వైశ్యులు. శ్రీనాథుడు తన హర విలాస ప్రబంధమును, కాంచీ పురవాసి యగు అవచి దేవయ సెట్టి పుత్రుడగు తిప్పయ శెట్టికి గృతినిచ్చియున్నాడు. చిఱు తొండనంబి ని వర్ణిస్తూ శ్రీనాథుడు "కోటికిన్ పడగనెత్తిన నక్కిరాట వంశ కిరీటాలంకారంబు. 2-34" అని చెప్పి యున్నాడు


కీచకులు:-  ఈ పదము వలన శ్రీనాథుడు చెప్పిన పల్నాటి వీర యుధ్ధ కథ సూచితమైనది. పల్నాటి వీరచరిత్ర ప్రశస్త దేశికృతియైనను హీనజాతి వారి కోరిక పైన రచించినదే కదా. 


శ్రీనాథుడీవిధముగా మువ్వురవలన వారికి కృతులనిచ్చి గాని, కవితా సమ్మాన రూపమున గాని ధనమునార్జించినట్లుగా, త్రిశుధ్ధిగా తానట్టి పనులు చేయనని భారతి దేవితో విన్నవించాడు"  

ఈ పద్యం చాటువు కనుక, అప్పటి దేశకాల రీతులు, జరిగి ఉండవచ్చునన్న కథాంశమూ నిజమే అయితే, ఈ వివరణ దానికి ఊతమిచ్చేదే కనుక అయినట్టైతే అది పోతన రచన కాకపోయుండవచ్చన్నది నా అభిమతం
శారదా పుత్రుడు, బ్రహ్మ దత్త వరప్రసాదుడైన శ్రీనాథుణ్ణి పరోక్షం గా నిరశిస్తూ వాగ్ఞియమాన్ని పాటించే భాగవతోత్తముడైన పోతన పలికి ఉండడన్నది నా భావానికి హేతువు.