చిన్నప్పుడు పెద్దగా అనారోగ్యం చేసింది కూడా లేదు..కానీ ఏపాటి జ్వరం గట్రా వచ్చినా "ఏరా ఎలా ఉంది ఒంట్లో?" ఖంగుమని కంఠం వినిపించటంతోటే అన్ని నెప్పులూ, బాధలూ హుష్కాకి అనే ఫీలింగో ఎమో ... "బావుంది మావయ్య" అని మాత్రమే సమాధనం వచ్చేది ... ఎన్నేళ్ళైనా (9 వ తరగతికి వచ్చేవరకూ)ఇదే వరస... డాక్టరు దగ్గరకి వస్తే మనకి ఎలా ఉందో చెప్పాలన్న ధ్యాస/ ఇంగితం రెండూ లేవు.. వచ్చాం కాబట్టి తగ్గిపోతుంది, కాబట్టి ఇంక వేరే చెప్పక్కర్లెదు అనో, అమ్మా, నాన్న ప్రొద్దున ఒక కార్యక్రమానికి తీసుకెళ్తే అక్కడ కనిపించి/ సాయంత్రం మరోచోటికి వెళ్తే అక్కడ కనిపించేసరికి, మనకి ఎక్కడికెళ్ళినా ఎమైనా పర్వాలేదు, మన డాక్టరు నుండి ఎప్పుడూ దూరం లేము అన్న నిబ్బరమో, అందులోనూ మన మాస్టరుగారి ఇల్లు, సీతక్క తో స్నేహం.. అందరిలో ఆప్యాయంగా దగ్గరకి తీసుకుని ముద్దు చేసే సింగరి వదినతో చనువు కారణమో తెలీదు కానీ మాస్టరుగారి పిల్లలందరిలోకి బుజ్జి మావయ్యతో (డా. వరాహ మిహిరాచార్య) ఒక ప్రత్యేకమైన అనుబంధం...