Tuesday, October 15, 2013

మధుర స్మృతులు..

చిన్నప్పుడు పెద్దగా అనారోగ్యం చేసింది కూడా లేదు..కానీ ఏపాటి జ్వరం గట్రా వచ్చినా  "ఏరా ఎలా ఉంది ఒంట్లో?" ఖంగుమని కంఠం వినిపించటంతోటే అన్ని నెప్పులూ, బాధలూ హుష్కాకి అనే ఫీలింగో ఎమో ... "బావుంది మావయ్య" అని మాత్రమే సమాధనం వచ్చేది  ... ఎన్నేళ్ళైనా (9 వ తరగతికి వచ్చేవరకూ)ఇదే వరస... డాక్టరు దగ్గరకి వస్తే మనకి ఎలా ఉందో చెప్పాలన్న ధ్యాస/ ఇంగితం రెండూ లేవు.. వచ్చాం కాబట్టి తగ్గిపోతుంది, కాబట్టి ఇంక వేరే చెప్పక్కర్లెదు అనో, అమ్మా, నాన్న ప్రొద్దున ఒక కార్యక్రమానికి తీసుకెళ్తే అక్కడ కనిపించి/ సాయంత్రం మరోచోటికి వెళ్తే అక్కడ కనిపించేసరికి, మనకి ఎక్కడికెళ్ళినా ఎమైనా పర్వాలేదు, మన డాక్టరు నుండి ఎప్పుడూ దూరం లేము అన్న నిబ్బరమో, అందులోనూ మన మాస్టరుగారి ఇల్లు, సీతక్క తో స్నేహం.. అందరిలో ఆప్యాయంగా దగ్గరకి తీసుకుని ముద్దు చేసే సింగరి వదినతో చనువు కారణమో తెలీదు కానీ మాస్టరుగారి పిల్లలందరిలోకి బుజ్జి మావయ్యతో (డా. వరాహ మిహిరాచార్య)  ఒక ప్రత్యేకమైన అనుబంధం...





ఆసలు మాస్టరుగారి ఇంటితో మాకు "సంబంధమే" ఒక ప్రత్యేకం. "ఈ.కే తాతగారు -అక్కయ్యగారు",  "అనంత కృష్ణ మావయ్య - తాయారొదిన", "బుజ్జి మావయ్య -సింగరొదిన", "లక్ష్మక్క", "శ్రీనన్నయ్య", "సుదర్శనం అన్నయ్య", "సీతక్క".. ఇవీ మా వరసలు.

బుజ్జి మావయ్య - సింగరొదిన ఏమిట్రా అని సరదాగా అడిగేవారు పున్నయ్య శాస్త్రిగారు.. నాకింత వీజీగా ఉంది ఆయనకెందుకు అంత డౌటొస్తోంది అని నాకు మిలియన్ డాలరు ప్రశ్నగా ఉండేది. అనంత్ పెళ్ళిలో కలిసినప్పుడు మా పిల్లవాడికి పరిచయం చేస్తూ కూడా ఇవే వరసలు చెప్పాం.. వాడిక్కూడా అవే వరసలా అని సత్యనాధం గారు అడిగారు.. "చందమామ" లాగానే "ఈ.కే తాతగారూ, బుజ్జిమావయ్య కూడా" అన్నా..

అక్కకి చేయి ఫ్రాక్చరైనప్పుడు, టైఫాయిడ్ వచ్చి తగ్గినప్పుడు అమ్మ బహుశా బేకరీలో సాల్ట్ బిస్కెట్ట్ (ఉస్మానియా బిస్కెట్టు మాదిరి) కొనితెచ్చేది. తినమంటే తిననంటే "బుజ్జిమావయ్య ఇచ్చిన బిస్కెట్టు" అని నమ్మబలికేది. అదెంత స్ట్రాంగు డొసో... జ్వరం తగ్గాకా కూడా బుజ్జిమావయ్య బిస్కెట్టులిమ్మనమని చెప్పవా అని అడిగేవాళ్ళం....

పిల్లలు దసరా సెలవలు, వేసవి సెలవలు వస్తే వాళ్ళ అమ్మమ్మలింటికి, బామ్మలింటికీ  వెళ్తూంటారు.. మాకుమాత్రం ఏ సెలవలొచ్చినా చినముషిడివాడే.. చిన్నతనమంతా అక్కడ మామిడితోపుల్లో ఆడుకోవడంలోనే గడిచిపోయింది.. అనంతకృష్ణ మావయ్య సంస్కృతం క్లాసులూ, శ్రీనన్నయ్య జ్యోతిష్యం క్లాసులూ, అమలాపురం నర్సింహరాజు గారు హోమియో క్లాసులు తీసుకునేవారు.. ప్రొద్దున్న నగర సంకీర్తనతో మొదలై రాత్రి పున్నయ్య శాస్త్రిగారి రామాయణం ప్రవచనంతో ముగిసేది...

బి.హెచ్.ఎం.ఎస్ చదువుకోడానికి హైద్రాబాదు వచ్చి శ్రీ జగన్మోహనరావుగారి ఇంట్లో ఉంటున్నపటినుండి మొదలు ఆ సాన్నిహిత్యం .. రాజమండ్రి లో ఎన్.జీ.వోయస్.హోం లో మందులకి మాస్టరుగారితో రెణ్ణెల్లకొకసారో, నెలకొకసారో (సరిగ్గా గుర్తు లేదు) మెడికల్ టూరుకి వచ్చేవారు.. అప్పడు మరింత బలమై... నరింగ్ హోం లో, చినముషిడివాడలో మందులుతీసుకోవడం, హోమియోక్లాసులతో తో మరింత ధృఢమై పెనవేసుకుంది ఈ అనుబంధం...

మాస్టరుగారి పిల్లలందరికీ మా ఇంటిల్లిపాది అందరిమీదా ఆప్యాయతా ఉన్నా మాకు మాత్రం భయమూ, భక్తీ, చనువూ, అనుబంధమూ అన్నీ బుజ్జిమావయ్య తోనే ఎక్కువ .. అందుకే తాయారొదిన, సింగరొదిన ఆఖరికి అక్కయ్యగారు కూడా అమ్మనీ మమ్మల్నీ ఎప్పుడు అనేవారు .. "మీరు మీ బుజ్జి మామయ్య పార్టినే కదా అని"

తలచుకుంటే ఎన్నో మధుర స్మృతులు...

మావయ్యా !! గంభీరమైన కంఠంతో, కళ్ళల్లో చిరునవ్వుతో మా స్మృతిపథంలో మీరెప్పుడు నిలిచే ఉంటారు..... మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు.."


1 comment:

Tejaswi said...

ఫోటోలోనూ, మీ పోస్ట్ లోనూ ఉన్న ఈకే - ఎక్కిరాల కృష్ణమాచార్యగారొక్కరే తెలిసింది. కొంచెం వివరంగా రాయకూడదా గురువుగారూ!