Wednesday, April 16, 2014

రాముడూ- స్ఫూర్తి - సాధించెనే !

కవిత్వం వికసించడానికి అనువైన పరిస్థితులను పెద్దన్నగారు నిరుపహతి స్థలంబు, రమణీ ప్రియదూతిక మొదలైనవన్నారు గానీ .. నా వరకు నాకు వసంతఋతువు, ఉగాది, వసంత నవరాత్రులు, రామనవమి.. రామనామం వీటిలో ఏ ఒక్కటైనా చాలు కవిత్వమూ, మంచి మంచి ఆలోచనలూ రావడానికి..  అలా వచ్చిన ఒక ఊహే.. ఈ టపా...

నవరాత్రులలో త్యాగరాజ ఘనరాగ పంచ రత్న కృతులు వింటూండగా ఒక సంశయం కలిగింది. తనలో ఏమైనా లోపముందేమో అని బాహ్య ప్రపంచములో ఉన్న మానవులు చేస్తున్న తప్పిదాలను తనకు ఆపాదించుకుని దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా అని.. కీర్తన జేస్తారు త్యాగరాజ స్వామివారు.. ఆ కీర్తనలో బ్రోచేవారెవరురా అని అడగడమే గాని స్వామి వారిని రాముడు కరుణించినట్లు సొల్యూషన్ (ప్రశ్నలకు సమాధానాలు)  కనిపించదు.. మూడవదైన సాధించెనే ఓ మనసా కృతి చాలా వింతైనది. నిందా స్తుతిలో ఉన్నట్టు నిర్వచనాలున్నాయి... అసలు ఆ కృతే (సంగీత జ్ఞానం పెద్దగాలేని) నా మట్టి బుఱ్ఱకు చిత్రాతి చిత్రంగా అనిపిస్తుంది.. ఆపై ఒక ఆలోచన/ ఊహ కలిగింది.. దాని అక్షరరూపమే ఈ టపా...



ముందుగా ఈ కృతి సాహిత్యం ఇక్కడ
సాధించెనే ఓ మనసా

ఈ కృతి శ్రావ్యకం ఇక్కడ

అసలు సాధించెనే ఓ మనసా కృతి చాలా వింతైనది. ఒక 100 వరకూ కృతులు గమనించా.. వాటన్నిటికీ భిన్నమీ కృతి

1. అన్ని కృతులలో (ముఖ్యంగా పంచరత్న కృతులలో) చరణానికీ చరణానికీ మధ్య పల్లవో పల్లవిలో మొదటి పాదమో ఇట్లా ఉంటూంటుంది పద్ధతి (సంగీత పరిభాషలో దీనినేదో అంటారు).  పల్లవి, అనుపల్లవి ఆపై చరణం ఉన్నాగానీ ఈ కృతి మొత్తంలోనూ చరణానికీ చరణానికీ మధ్య మొదటి చరణం పాదమే ఉంటుంది.. ఎందుకో..

2. అన్ని కృతులకీ భిన్నంగా ఈ కృతిలో చెప్పదలుచుకున్న విషయం అన్యాపదేశం గా ఉంటుంది.. (అర్థం చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అన్నట్టు).. ఎందుకో...

3. ముఖ్యంగా మిగిలిన అన్ని కృతులలో త్యాగరాజులవారి నామంతో కూడిన మకుటం చివరి చరణంలో ఉంటూండగా ఈ కృతిలో ఆ మకుటం చివరి రెండు చరణాలలో వస్తుంది .. (మకుటం మొత్తం రెండుసార్లు వచ్చినట్టన్నమాట)... ఎందుకో..

4. నిందాస్తుతి జేసినట్లుంది అనిపించేలా వ్యాఖ్యానాలు జెప్పేవారు పల్లవిని, అక్కడక్కడ అనుపల్లవినీ అన్వయించి రాముడు నన్ను బ్రోవక తన పట్టు సాధించుకుంటున్నాడు అని చెబుతూంటారు... మొత్తం కృతి అంతట్లోనూ సమయానికి తగు మాటలాడెనె అని ఉంటే .. ఆ మాటేమిటో చెప్పకుండా సాధించాడంటూ వ్యాఖ్యానాలు చెబుతారు... ఎందుకో ....

5. మీరే చెప్పండి.. యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుతూంటే బోధించిన "సన్మార్గ వచనాలు" బొంకు ఎలా అయినట్టు?  పోనీ "పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండా జన్మ మనఘు డీ కలి బాధలు దీర్చు వాడనుచు నే హృదంబుజమున జూచు చుండగా" బొంకు ఏవిధం గా అయినట్టు??

6. ఒకవేళ శ్రీవేంకటేశ సుప్రకాశ చరణం చెప్పి మకుటం చివరి పాదంలో వచ్చింది కాబట్టి ముక్తాయించి ఉంటే (దుడుకుగల కృతి మాదిరిగా సొల్యూషన్లేకుండా) సాధించెనే అనే అర్థంతో కృతిపూర్తయినట్టే ఉండేది (ఊహిస్తె).. అయితే అంతటితో ఆగకుండా "కట్ చేస్తే" అన్నట్టుగా తర్వాతి చరణంలో ప్రతీ పాదంలో పై చరణాలన్నిటికీ భిన్నంగా సొల్యూషన్ ఇస్తున్నట్టు ఉంటుంది...ఎందుకో....

7. అసలు స్టోరీ మొత్తం ఆ చివరి చరణంలో ఉంటుంది
(అ) సద్భక్తుల నడతలిలా ఊంటాయిట. "ఇల్లా" అంటే ఎలా ?? నిందాస్తుతి జేస్తున్నట్టా (పైనంతా ఉన్నదదే కదా మరి ??)
(ఆ). "అమరికగా నా పూజగొనెనే" ట (ఏమిటో ఆ "అమరిక"? పైన ఎక్కడా దాని ఉటంకింపు ఉండదు నిందా స్తుతి తప్ప. ఎట్లా తెలిసేను ఆ అమరిక ఏమిటో..)
(ఇ) ఎటువంటి డౌటులేకుండా సూటిగా చెప్పినవి మూడే వాక్యాలు "అలుగ వద్దన్నాట.. విముఖులతో జేర బోకన్నాట. వెతలు గలిగితే తాళమన్నాట్ట" (తాళుకోవడమే ఆయన చెప్ప దలుచుకున్న సద్భక్తా ??)
(ఈ) దమశమాది సుఖదాయుకుడైన రాముడు చెంతరాకుండానే .. సాధించెనే అని ఉంటుంది...

దుడుకుగల కృతి వ్రాసినతర్వాత సొల్యూషన్ దొరక్క త్యాగరాజులవారు కావేరీ నదీ తీరమున కూర్చుని "నేనట్టాంటోణ్ణి.. ఇట్టాంటోణ్ణి" నా ఈ జన్మకు సరైన దారేది అనిపించిందిట.. తలపులోని చింత దాటినప్పుదు గదా | అలరిదైవంబు ప్రత్యక్షమౌట ! కానీ ఆ చింత దాటాలంటే ఎట్లా? ఇతః పూర్వం ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లోనే నారదమౌని వచ్చి స్వరార్ణవమిచ్చి బ్రహ్మ రహస్యమిచ్చారు .. మళ్ళీ అట్లాంటిదే సందర్భం మళ్ళీ వచ్చింది.. ఈ సారి ఇంకొక "సద్గురువు" దారి చూపించారుట.  త్యాగరాజులవారు స్వయంగా ఆ దారిని చూశారుట. ఆ దారి వలన దైవం ప్రత్యక్షమౌతారని దెలుసుకున్నారుట.. ఆ దారిని, ఆ సద్గురు మాటలనే ఈ కృతిలో ఉటంకించారు...

చోరుడ గాను రాఘవ ! రసోజ్జ్వల కావ్యము వ్రాయ నీ భువిన్ !
మారుతి గాను త్వత్పద సమాహిత దాస్యము జేయ! నేను  కూ
పార నిమగ్న జీవుడ నపారకృపాబ్ధి త్వదీయ పాదపూ
జారిగనౌటనెట్లు? నుపచారములన్ ఘటియించుటెట్లయా!  (*)

కరచరణాలు లేక సుమగంధములున్నుపవీత వస్త్రమా
భరణము లాసనాదు లభిమంత్రణ మాచమనంబు లర్ఘ్య మో
గిరములు స్నానపాద్య రసకేసర వీటిక దీప ధూప సం
భరిత ప్రదక్షిణాంజలులు మంగళహారతులెట్లొసంగెదో  !! (@)

జలములిచ్చి గజము, చత్రమై భుజగమ్ము
గూడు గట్టి లూత గొలువుజేసె !
ఏమి యొసగలేని స్వామి భక్తుల సంగ
తేమి? వారి మనసు దెలియదేమి?

పత్రపుష్పములను, ఫలతోయములభక్తి
గలిగి యొసగ బ్రీతిగలుగు ననుచు
బోధజేసె! దాని బొంకు జేయకయున్న
నెట్లునన్నుబ్రోచునెవ్వడైన ?

ఉన్నదిచ్చుకొందమన్ననున్ లేదేది
గుండెలోన "భయము గూడు" దక్క
బీరువేమి యొసగు బిసరుహాక్ష ! మదీయ
వెతల నెఱుగలేవొ విమలచరిత?

అంతరంగమందు ఆలోచనలుజేయు
శుక్తిపేశి హృదయ భక్తి జూచి
"వెతలు గల్గుటనున దంతయున్ సత్యమ్ము !
ఓర్వవమ్మ ! అలుగకుండవమ్మ !     (#)

నీదు భయమునిచ్చి నిశ్చింతగా నుండు
మమ్మ ! స్వీకరింతునమ్మ  తోడు !
ముదము గల్గజేతు ! మురిపింతు"ననిబల్కె
బెండ్లిలోన పెద్దపీటవేసి !

విమలయశోధరుడరిష
డ్దమనుడు స్మితవక్తృడజుడు దశరథసూనున్
డమితమ్మౌ గృపజూపుచు
నమరికగా నాదు పూజనందెను బెండ్లిన్

ఉడుతకిచ్చెనంట ఉన్నతోన్నతమైన
సుఖము గుహుని జూచె సఖుని రీతి
ముద్దు మీర బెండ్లి ముత్యాల తలబ్రాల
తోటి శుక్తి కిచ్చె మేటి కీర్తి !!   (#)

https://www.youtube.com/watch?v=T18E58vOTus

జానకి దోసిట కెంపులు
గానగుపడి రాము మస్తకమ్మున పూలై
శ్రీనీలదేహకాంతులు
గానగుపడు ముత్యమిచ్చుగావుత శుభముల్ !!

శ్రీ రామ నవమి శుభాకాంక్షలతో...


* కూపారము  = సముద్రము.
# శుక్తిపేశి, శుక్తి = ముత్తెపుచిప్ప..
@ రసకేసర వీటిక = కప్పుర విడెము

3 comments:

Kottapali said...

బాగుంది.
మీ ప్రశ్నలన్నిటికీ సూటిగా సమాధానం చెప్పడం కష్టం.
మొదటి విషయం - పంచరత్న కృతులు ఆ వరుసలో రచించారని రూఢి యేమీ లేదు. ఘనరాగ పంచకం అని ఆ ఐదు రాగాలనూ ఆ వరుసలో పేర్కొనడం ఒక ఆనవాయితీగా వస్తున్నది బహుశా త్యాగరాజు ముందటి నించీ. అంచేత పంచరత్న కృతులని కూడా అదే వరుసలో పాడుతున్నారని అనుకోవచ్చు.

సాధించెనే అనే పల్లవి ఉండగా సమయానికి తగు మాటలాడెనే అనే ముక్కని ఎందుకు తెచ్చారు అంటే కూడా చెప్పడం కష్టం. పంచరత్న కృతుల్లో ప్రతి చరణానికీ ముందు చిట్టస్వరం వస్తుంది. కానీ సమయానికి తగు మాటలాడెనే అనే ముకకి చిట్టస్వరం లేదు. దాన్ని పల్లవిలాగానే పాడుతూ ఉంటారు. ఈ ముక్క కాకుండా సాధించెనే అనే పల్లవినే చరణానికీ చరణానికీ మధ్య పాడిన ఉదంతాలు (ఎమ్మెస్ పాడింది ఒక రికార్డులో).
అర్ధం అన్వయం సాధించెనే అన్నా కూడా సరిపోతుంది.
కృతి ముత్తమ్మీద స్థూలంగా ఉన్న ధ్వని మీరు బాగానే గ్రహించారు. రాముడిగా అయినా, కృష్ణుడిగా అయినా ఆయన రక్షితానని చెప్పాడు. నన్ను రక్షించడం లేదు, అంచేత అది బొంకయింది - ఇదే అందులో పరమార్ధం.

Sanath Sripathi said...

స్వామి గారు, ధన్యవాదములు. కృతి మొత్తం లో "త్యాగరాజ" మకుటం రెండుసార్లు వచ్చింది కదా... ఈ ఒక్క కృతిలోనేనా వేరే కృతులలో కూడా ఉందా?

visalakshi said...

మీ ప్రశ్నకు బదులు ఆలస్యముగా ఇస్తున్న కారణంగా మీ బ్లాగులో సమాధానం ఇస్తున్నాను గమనించగలరు. ప్రారబ్ధం భోగతే.....అనే శ్లోకం ..కర్మత్రయ వివరణము చేసిన వారు శ్రీ మలయాళ స్వామి. "యదార్ధభారతి" అనే మాస పత్రికలో నా స్నేహితురాలు చదివి నాకు పంపించిన శ్లోకం.కర్మత్రయం అనే తత్వబోధలో ఆదిశంకరాచార్యులుగారు వివరించిన సంచిత,ఆగామి కర్మలను గూర్చి నేను త్వరలో రాసేది చదువగలరు.ధన్యవాదాలు.