Monday, July 9, 2012

సింహావలోకనం

సింహావలోకనం, సింహావలోకనం అంటూంటాము.. అసలు తరచి చూసుకోడానికి సింహావలోకనమనే ఎందుకనాలి? జంతువులలో మిగిలిన ఆ జంతువూ వెనక్కి తిరిగి చూసుకోనే చూసుకోదా? చూసుకున్నా సింహానికున్నంత grace వాటికి ఉండదా? ఉత్తమమైన నడకని సూచించేప్పుడు సామజ వరగమనా అనీ, హంస గమనా అన్నారు కదా? సింహానికే ఎందుకంతటి grace ఉంటుందో గమనించారా? కారణమేమయ్యుంటుంది? నాకొచ్చిన చిలిపి ఊహ



శ్రీరంగంలో రంగడి కళ్ళంత అందమైన కళ్ళు చూసినతర్వాత ఒక భక్తాగ్రేసరుడికి ఇంక ఏ కళ్ళల్లోనూ అంతటి అందం లేదనిపించిందిట. అట్లే, వెనక్కి తిరిగి చూస్తే "తిప్పుకోలేనంత అందం" అంటారు కదా అది కనిపించిందట సింహానికి అమ్మవారిలో. అంతే అప్పటినుండీ ఆవిడ మోమును చూసుకుని చూసికుని మురిసి తరించిపోతోందిట సింహం అప్పటినుండే "సింహావలోకనం" ఉత్తమమైన పదప్రయోగమయ్యిందేమో..

మునులే మోమును గాంచినంత గలిగెన్ మోక్షమ్ము ! నెద్దానినిన్
అనిమేషత్వము నొంది జూతురట నింద్రాద్యష్ట దిక్పాలురున్
గనగా నెంచి తలెత్తి జూచితి ! శిరఃకంపమ్ము "సింహావలో
కనమయ్యెన్" నిల సింహవాహిని! శివా! కారుణ్యవారానిధీ !!

Saturday, March 24, 2012

బ్లాగ్ కవులతో సద్గోష్ఠి @ Hyderabad


నందన నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని దివ్య కళాంజలి (మా అపార్ట్ మెంటు) లో సాయంత్రం 5 గం.ల నుండి పద్య కవి సమ్మేళనం ఏర్పాటు గావించబడినది.

శ్రీ చింతా రామకృష్ణారావు గారు "చిత్ర కవిత్వము" పై,
శ్రీ భైరవభట్ల కామేశ్వరరావుగారు " తెలుగు కవుల వాగ్విలాసము" పై ప్రసంగించనున్నారు

ఆసక్తి కలవారందరూ ఆహ్వానితులే 


Saturday, February 25, 2012

బ్లాగ్వినువీధిలో రవి మార్కు ప్రచండత ఇంకా కనిపించదేం?

మా హైద్రాబాదులో ఎండా కాలం వచ్చేసింది, వసంతం వచ్చేవేళ కూడా అయ్యింది కానీ ఎందుకో ... అయినా ప్రచండుడి పత్తా లేదు..సాహిత్యంలో కవ్వింపులు, చదివింపులూ అవుతున్నా ఎక్కడా సడిలేదు...ఎందుకో ఏమో అంటూ రంగం సినిమా సాంగేసుకున్నా ఆన్సరులేదు. ఎందుకంటారు???


Monday, February 20, 2012

బాల శివుడు - కంప్లైంటు

అల్లరిచేసినా, ఆకలేసినా, నిద్ర వచ్చినా, ఆవలించినా, పండగైనా పబ్బమైనా,ఆటల్లో అరటిపండైపోయినా, వేరెవరైనా తొండి చేసినా  అన్నింటికీ కావలసింది అమ్మే. చూస్తే అందరూ చాలా అనందంగా ఉన్నారు నాకు మాత్రం ఏ సరదాలూ లేవు..

తడిస్తే జలుబు చేస్తుందనీ...
అన్ని దిక్కులకీ పరిగెడుతూంటే కాళ్ళు నొప్పులొస్తాయని...
వంటికంతా దుమ్మూ ధూళీ పట్టించుకుంటే క్రిములొస్తాయని...
నాకు చెప్పిందెవ్వరు? నన్ను పట్టించుకున్నదెవ్వరు?

Sunday, January 29, 2012

రాముడు- స్ఫూర్తి- మాతృ హృదయం


శ్రీ కృష్ణ జననం కథ చదువుకుంటున్నప్పుడు దేవకీ దేవికి సప్తమ గర్భంగా జన్మించిన బలరాముణ్ణి యోగమాయ గోకులానికి చేర్చింది, ఆ తరువాత కృష్ణుడు పుట్టడం, కావలి వాళ్ళందరూ నిద్రపోతూంటే వసుదేవుడు బుట్టలో పెట్టి తీసుకెళ్ళడం, యమున దారినివ్వటం, ఆదిశేషుడు గొడుగుపట్టడం వంటివి చదువుతున్నప్పుడు యోగమాయ అక్కడ పుట్టడమేంటి, మహా విష్ణువు ఇక్కడ పుట్టడమేంటి, వసుదేవుడు అంత రిస్కు చేసి అక్కడి పిల్లనిక్కడ, ఇక్కడి పిల్లవాణ్ణి అక్కడ మార్చడం ఏమిటి? యమున దారినివ్వడమేమిటి? ఎంచక్కా బలరాముడిలా ఆ పుట్టేదేదో అక్కడే పుట్టెయ్యచ్చు కదా, అంతగా అయితే దేవకికీ వసుదేవుడికీ కనిపించి అన్నయ్యలాగానే నేనూ గోకులంలో పుట్టి పెరిగి వస్తాను అని చెప్పవచ్చుకదా అని ఒక ప్రశ్న పుట్టింది (ఊహే కావచ్చుగాక). దాన్లోంచి పుట్టిన సమాధానమే ఇది...

Thursday, January 26, 2012

నవవిధ భక్తి - Pictorial representation

Please find the pictorial representation of Bhaagavata Murthi who demonstrated each aspect of Nine-Fold Devotion (నవవిధ భక్తి)

This was drawn in 2004 as part of Sphurthi- a 2 day Summer Camp for the children of age 7-14. The children were explained each bhakti with the help of story related to the great ones, who stood as the role model, demonstrating that particular aspect of Devotion and importantly what does it means now for us to practice in day-to-day life ...
 


(1)శ్రవణం  --> ఆదిశేషుడు,
(2) కీర్తనం --> అన్నమాచార్యుడు, 
(3) విష్ణోః స్మరణం --> నారదుడు,
(4) పాద సేవనం --> హనుమంతుడు, 
(5) అర్చనం  --> సుదాముడు (కుచేలుడు),
(6) వందనం --> గరుత్మంతుడు, 
(7) దాస్యం  --> లక్ష్మణుడు, 
(8) సఖ్యం --> మైత్రేయుడు, 
(9) ఆత్మ నివేదనం --> గోపికలు.

Wednesday, January 4, 2012

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

మఱ్ఱియాకు పైన మఱులు గొల్పుచు గాలి
వ్రేలు చప్పరింతువేల ? దల్లి
గర్భమందు నీదు  గాల్జేతులాడించు
వేళ నొచ్చె నేమో వ్రేలు, గనగ



నీటిమీద దేలు నీకెట్లు దినిపింతు
బువ్వ యనుచు నడుగ నవ్వ సాగె
చీకగానె వ్రేలు  నాకలంతయు దీరె
గంగ ఊరెనేమో కాలి నుండి

అన్నమయ్య మిమ్ము నట్లేల కీర్తించె
చిలిపి ఊహ గలుగ దెలిసె నాకు
ఎంగిలయ్యెననుచు నెంచెనేమొకొ బ్రహ్మ
కడుగ సాగె పాద కమలములను

అట్టి పాదయుగ్మమర్చించుకోనిమ్ము
ముక్తి గిక్తి వలదు మోహనాంగ
నీదు పాదయుగళి నిత్యమ్ము సేవించు
వరమునిమ్ము  మార్గ శిరమునందు !!

అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
(బొమ్మలు అంతర్జాలం లో సేకరించినవి)