Thursday, February 12, 2009

కొంటె కృష్ణుడు -స్ఫుర్తి - 2



గోకులం లో రాత్రి ఒక ఇంట్లోకి ఒక పిల్లి చొరబడింది ట. చప్పుడు చెయ్యకుండా వంటింటికి వెళ్ళి, కళ్ళు మూసుకుని పాల కుండ లో పాలు తాగుదాం అనుకుంది ట. నాలుకకి పాలు తగల లేదు. కళ్ళు తెరిచి చూసేసరికి కుండ ఖాళీ గా ఉంది ట. ఇదేమిటబ్బా అనుకుంటూ వెనక్కి చూసే సరికి అక్కడ ఒకావిడ దీనికేసి అనుమానం గా గుడ్లురిమి చూస్తోంది ట. అయ్యొ అదెమిటి? నేను ఇంకా ఏమీ చెయ్యందే.. ఈవిడ నన్ను అనుమానిచ్చెస్తోంది? అని అటూ ఇటూ చూసిందట. ఆప్పుడే తలుపు చాటున ఒక తెల్ల మీసాల పిల్ల వాడు కనిపించాట్ట. అప్పటికి గానీ అర్ధం కాలేదు.. ఎంత పెద్ద గోతిలో పడిందో.. వార్నీ.. ఎంథ పని చెశాడు? ఆ పిల్ల వాడినే చెవి మెలేసి రోటికి కట్టింది ఈవిడ. అల్లంటిది, వాడికి లేకుండా పాలు నేను తాగేను అని కనక అనుమానించిందంటే ఇంక నా పనేం గానూ...అని ఒకటే ఇది అయిపోతోంది ట. దానిని చూసి ఆ పిల్ల వాడు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాట్ట.
పద్యం
బాలుడు చెప్పడాయె ! తన భావము మాతకు తెల్వదాయె ! ఆ
పాలును లేకపోయే ! అనుమానము మాత్రము నిల్చిపోయే ! మా
ర్జాలమునౌట నాదు అపరాధమటంచు తలంచు పిల్లినిన్
లీలగా జూచి నవ్వు మధు సూదనుడిచ్చుత సర్వ సంపదల్ !!


పద్య స్ఫూర్తి

ఈ క్రింది తిరుపతి వెంకట కవుల పద విన్యాసం నచ్చి అనుకరిస్తూ రాశా అని అనుకుంటున్నా.. (యతి మైత్రి విషయం దక్క....)

వేసవి డగ్గరాయె ! మిము వీడుటకున్ మనసొగ్గదాయె ! మా

వాసము దూరమాయె ! బరవాసము చేయుట భారమాయె ! మా

కోసము తల్లిదండ్రులిదిగో యదిగో యని చూచుటాయె ! వి

శ్వాసము కల్గి వే సెలవొసంగిన పోయెదమింక భూవరా !!

6 comments:

రాఘవ said...

నాకు తెలియకడుగుతానూ మీకు ఈ అవిడియాలు ఎక్కణ్ణించి వస్తాయండీ?

చిలమకూరు విజయమోహన్ said...

కొంటె కృష్ణుని చేష్టలు బాగున్నాయి.

ఆత్రేయ కొండూరు said...

మీ చిత్రాలు నాకీ క్రింది పద్యాలను గుర్తు చేస్తున్నాయి

శ్రీ శంకరాచార్య విరచిత బాలముకుందాష్టకం లోని పద్యం

కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగె నటనప్రియంతం !
తత్పుచ్చ్హహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి !!

శ్రీ కృష్ణకర్ణామృతం has the verse above (2.57)

ఆకుజ్ఞ్చితం జాను కరం చ వామం న్యస్య క్షితౌ దక్షిణహస్తపద్మె |
ఆలొకయంతం నవనీతఖణ్డం బాలం ముకుందం మనసా స్మరామి ||

Sanath Sripathi said...

రాఘవ గారూ, విజయ్ మోహన్ గారూ, ఆత్రేయ గారూ నెనరులు.

సహృదయులైన మీరు చలా సముచితం గా అడిగారు, స్ఫూర్తి ఏమిటి అని. నిజమే పద్యానికి స్పూర్తి లో చెప్పవలసిన ఇంకొక పద్యం మరచేపోయా..గుర్తు చేసి (సరిజేసుకోమ)న్నందుకు ధన్యవాదాలు..

దశమ స్కంధం లో ఒక శ్లోకం ఉంది. కస్త్వం బాల బలానుజ: కిమిహతే మన్మందిరా శంకయా.. అని. అది ఒక కొంటె పిల్లవాడికి ఒక గోపిక కి మధ్య జరిగిన సంభాషణ.

ఆవిడ:- "ఓ! పిల్లవాడా ఎవరు నువ్వు"
పిల్లవాడు :- "బలరాముడి తమ్ముడిని" (పేరు చెప్పొచ్చు గా.. కృష్ణుణ్ణి అని అహా.. చెప్పట్ట)
ఆవిడ:- "ఇక్కడెందుకున్నావ్?"
పిల్లవాడు :-"మా ఇల్లు అనుకుని భ్రమ పడ్డా" (అయ్యొ.. పాపం ఇల్లు ఏదొ కూడా గుర్తులేదుట..)
ఆవిడ:- "అనుకుంటే అనుకున్నావ్ లే కానీ.. ఆ పెరుగు కుండ లో చెయ్యి పెట్టి ఎంచేస్తున్నావ్?"
పిల్లవాడు :-"మా దూడ ఒకటి ఇందాక తప్పి పోయింది. ఇందులో దాక్కుందేమో అని వెతుక్కుంటున్నా..." (అబ్బ.. ఛా... ఎంత తెలివో చూడండి). అందుకే కొంటె కృష్ణుడు అన్నది.

పద్యం విన్న తరువాత భలే ముచ్చట వేసింది. మనలాగ ఉరుకులూ, పరుగుల బిజీ లైఫ్ లేకుండా పిల్లవాళ్ల తో ఎంత హాయిగా ఎంజాయ్ చేసి ఉంటారో కదా అని అనిపించింది. నిజం చెప్పలంటె కొంచం అసూయ వేసింది. (అక్కసు కదా.. మనకి దక్కంది వేరే ఎవరికో చాలా తేలిగ్గా దొరికేసింది అంటె).. సో, ఇలా ఇంకా ఏమేం చేసి ఉంటారో కదా అని అనుకుంటున్నప్పుడు వచ్చిన ఆలోచన ఇది.

అడిగారు కాబట్టి ఇంకొక విషయం నిరొమహమాటం గా ఒప్పేసుకుంటున్నా.. మీరు గమనించే ఉంటారు...అవిడియాల లో కానీ పద్యం లో కానీ పెద్ద ప్రతిభేమీ లేదు. కాకపోతే ఏ భావం వచ్చినా ప్రతీదానికీ చుట్టూ ఒక చిన్న కథగానే తడుతుంది. ఆ కథ మొత్తం పద్యం లో రాద్దామని ప్రయత్నించేసరికి యతి దొరికితే భావం సరిపోదు (ఉన్నవి పాపం నాలుగు పంక్తులేనాయె), గణం కుదిరితే యతి దొరకదు. ఆ జంజాటం లో భావం చెప్పెద్దాం...సహృదయ పఠకోత్తములు అర్ధం చెసుకుని సర్దేసుకుంటారు అని ధైర్య చేస్తున్నా...

Sanath Sripathi said...

నిక్కచ్చి గా చెపాలంటే మీకు సౌరవ్ గంగూలీ మీద, రాముడి మీద, సిరిసిరి మువ్వ మీద అవిడియాలు ఎక్కణ్ణుంచి వచ్చాయో నాకూ అక్కణ్ణుంచే వచ్చాయి. .....

Sanath Sripathi said...

జల్లెడ లో నా బ్లాగు ను తీసివేసాము అని జాలయ్య గారి నుండి టపా రాగానె.. నా కొత్త టపా ని శ్రేయోభిలాషులకు పంపా.. అభిప్రాయాన్ని తెలియ జేయమని.

వాత్సల్యం తో భైరవభట్ల కామేశ్వర రావు గారు క్రింది టపా రాసారు.

సనత్కుమార్ గారు,

భలేవారే, శుభవార్త అంటే ఏవిటో అనుకున్నాను!
మీ అభిమానులకింక జల్లెడ, కూడలితో పనిలేదు. అయినా ఒకసారి వాళ్ళకి మైలుకొట్టి చూడండి.
మీ కొత్త టపా విషయానికి వస్తే, ఎప్పటిలానే అనన్యం! ఇటువంటి భావనా బలం పద్య కవుల్లో ఈ మధ్య చాలా అరుదుగా చూసాను. ఒక రెండు అచ్చుతప్పులున్నాయి.

సవరించిన పద్యం:
బాలుడు చెప్పడాయె ! తన భావము మాతకు తెల్వదాయె ! ఆ
పాలును లేకపోయే ! అనుమానము మాత్రము నిల్చిపోయె ! మా
ర్జాలమునౌట నాదు అపరాధమటంచు తలంచు పిల్లినిన్
లీలగ జూచి నవ్వు మధుసూదను డిచ్చుత సర్వ సంపదల్ !!

-కామేశ్వర రావు

స్వామీ !! చాల చాల థాంకులు కానీ మునగ చెట్టు బాగానే ఎక్కిస్తున్నారే. శిష్యాళువు కింద పడి ఆ అనుభవాన్ని కూడా కాళిదాసు లాగ ఆకళింపు చేసుకోవాలనా? లేకపోతే ఎమిటండీ..అభిమానులూ గట్రా నా.. ఇంకా నయ్యం సంఘాలూ.. సన్మానాలూ అన్నారు కాదు. ప్రోత్సహిద్దామని మీరు రాశారు కానీ నాకు అంత సీను లేదు నన్నొగ్గెయ్యండి స్వామీ..