Monday, February 16, 2009

ప్రహ్లాదుడు-ప్రోజెక్టు మేనేజిమెంటు

తెలుగు పద్యం లో ఉప్పు కప్పురంబు పద్యానికి ఒక చక్కని వివరణనిచ్చి భైరవభట్ల వారు ఒక కొత్త భావ స్ఫూర్తి నింపారు.

మంచి భావం మల్లె పొద పై ఆరవేసిన వేసిన ఉత్తరీయం లాంటిది. కప్పి ఉంచినంత సేపూ గాలి తెంపరలకి పరిమళం వ్యాపిస్తూనే ఉంటుంది. తీసి వేసిన తర్వాత కూడా గుప్పు మని గుబాళిస్తూనే ఉంటుంది. 'రుచి ' అన్నది వ్యాఖ్యో, రహస్య ప్రకాశమో తెలియదు కానీ గమ్మత్తు గా బాగున్నది. ఏమిటొ…. పద్యం లో సరైన సమయానికి సరైన పదం పడితే వచ్చే కిక్కు లాంటిది నాకూ వచ్చింది (కిక్కెక్కింది). అది అంతా ఆయన బ్లాగు లో రాస్తే అప్రస్తుత ప్రసంగం ఔతుంది అని మన మూస ధోరణి (రాముడూ-స్ఫూర్తి, కృష్ణుడూ-స్ఫూర్తి) ల నుండి, మంచి పద్యమూ- స్ఫూర్తి కి గేరు మారుస్తున్నా..

'చూడ చూడ 'ని వివరిస్తూ భైరవభట్ల వారు భలే విషయాన్ని ఎత్తుకున్నారనిపించింది. తెలియని విషయం ఎవరైనా చెప్పినా ఒక్కోసారి నా మూర్ఖత్వానిదే పైచేయి ఔతుంది కాబట్టి అది నిజమని నమ్మలేను అని తర్కం గొంతెత్తి అరుస్తున్నా మనసు మాత్రం ఎగిరి గంతేసింది. లింకుల లంకెలు దొరికనట్టనిపించింది. ఎందుకంటే అప్రయత్నం గా నాకు ప్రహ్లాద స్తుతి గుర్తుకు వచ్చింది.

ఇందుగల డందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు 'వెదకి చూచిన ' అందందే గలడు దానవాగ్రణీ వింటే అన్నాట్ట ప్రహ్లాదుడు. అక్కడ ' చూడ చూడ ' కీ ఇక్కడ 'వెదకి చూచుటకీ ' లింకు ఏర్పడింది.

సాఫ్ట్వేర్లో ప్రోజెక్టు మనేజిమెంటు వెలగబెడుతూ, ప్రోజెక్టు మనేజిమెంటు మీద క్లాసులు తీసుకుంటూ, ప్రహ్లాద చరిత్ర కీ సాఫ్ట్వెర్ కీ లంకె దొరికే సరికి తబ్బుబ్బైపోయి ఇక్కడ ప్రసంగిచ్చేస్తున్నా. సాఫ్ట్వేర్తో, లేక ప్రోజెక్టు మనేజిమెంటు తో సంబంధం లేని వారికి కొంచం సోది గా అనిపించ వచ్చేమో, చదువరులు నన్ను క్షమించాలి. అవసరానికి మించి విషయాన్ని సాగదీస్తూ చెప్తున్నా కొత్త బిచ్చ్గాడు పొద్దెరుగడు అన్న సామెత ను గుర్తించి మన్నించగలరు.

ఇక విషయానికొస్తే , ప్రహ్లాదుడు సెర్చ్ క్రైటీరియా చెప్పాడు. 'వాడు' దొరకాలంటే ముందు వెతకాలి. ఆ తర్వాత చూడాలి అన్నాడు. అప్పుడే కనిపిస్తాడు అని. ఏది కావాలో తెలియాలి, దాన్ని వెతకాలి, రెండూను.

ఎంతో చిన్న గా చిన్న పిల్లవాడి మాటల్లో చెప్పినట్టు చెప్పేశారు పోతన గారు. మన ఇంగిలీషు లో చెప్పలంటే necessary and sufficient condition అన్న మాట. సింపుల్ గా కంప్యూటర్ పరిజ్ఞానం లో చెప్పలంటే విండోస్ లో *.* తో సెర్చ్ చేస్తే కుప్పలు తెప్పలు గా రిజల్ట్సు వస్తాయి గానీ పని కాదు. దాంట్లో వేర్ కండీషన్ కూడా ఇవ్వాలి. కానీ ఇవ్వలంటే తెలియాలి కదా...అక్కడికి పెట్టాడు లింకు.

(పిడకల వేట 1 --> ప్రహ్లాదుడు నా దృస్టి లో ఒక మంచి ప్రోజెక్టు మేనేజరు. ఎవరైనా తనను ఒక సలహా గానీ ప్రశ్న గానీ అడిగితే,
(i) నీ బొంద నీకు ఇది కూడా తెలియదా అన్నట్టు ఒక పోజు పెట్టకుండా విన్నాడు.
(ii) విన్నతర్వాత సమస్య ని చిన్న చిన్న విభాగాలు గా విడగొట్టాడు. (WBS)
(iii) ప్రతీ చిన్న విభాగానికీ ప్రాతిపదిక ఏమిటో తెలియజేసాడు. (Pre Requisite)
(iv) ఆ విభాగానికి పర్యవసానం (Deliverable/ Exit Criteria) చెప్పాడు.
(v) ఆ వచ్చిన పర్యవసానం సరైనదే అని ఎలా నిర్ధారించటం అన్నది (Review) చెప్పాడు.
(vi) ఇది అంతా పధ్దతి (Process) లో చెప్పాడు.
(vii) అన్నిటికన్న ముఖ్యంగా వాడి పని వీడు చేసి పెట్టెయటం కాకుండా, తనంత తాను ఎలా చేసుకోవాలో చెప్పాడు. (Self reliance, not spoon feeding). సాప్ట్వేర్ టెర్మినాలజీ లో చెప్పాడు.

ఏమిటిట అవి అంటే

(1) ఏది కావాలి?
(2) ఎలా వెతకాలి?
(3) కావల్సిందే వెతికామనీ, వెతికినదే దొరికింది అని ఎలా నిశ్చయించాలి?

ఇవి దానిలో ఉన్న ప్రశ్నలు.

సరే. ముందు పరిధి ని నిర్ణయిద్దాం (Scope Definition చేసారు). ఎలా ఉంటాడు హరి? చెప్పు ఇవ్వళ తాడో పేడో తేల్చేద్దాం అని అడిగాడు హిరణ్యకశిపుడు. పాపం చిన్న పిల్లవాడాయె. ఆదిత్యుల్లో విష్ణువులా, నక్షత్రాల్లో చంద్రుడిలా, వేదాల్లో సామవేదం లా, పాములలో వాసుకి లా, అక్షరాల్లో అకారం లా ఉంటాడు అని ఏo చెబ్తాడు? చెప్పినా వీడికి అర్ధం ఔతుందా. Simplify చేసి నీలో నీలా ఉంటాడు, నాలో నాలా ఉంటాడు అన్నట్ట ప్రహ్లాదుడు. తిక్కరేగింది హిరణ్య కశిపుడికి. ఇక పైవన్నీ చెప్పి ఉండి ఉంటే జుట్టు పీక్కుని ఉండెవాడు. (పిడకల వేట --> 2 తెలిసిన వాడు నాకు తెలుసు కదా అని పాండిత్య ప్రకర్ష చూపించక వీలున్నంత తెలికగా పామర రంజకం చెప్పలి). కొన్నిటిని క్లిష్టంగా complicate చేస్తేనే మనసుకి హాయి గా ఉంటుంది అర్ధం కాకుండా వదిలెయ్యటానికి. ఔను. అరటి పండు ఒలిచినట్టు సులభం గా చెప్పేస్తే మహ ఇరకాటం గా నమ్మ శక్యం కానట్టు గా ఉంటుంది. బ్రహ్మ విద్య ఇంత వీజీ నా అన్నట్టు ఉంటుంది. హిరణ్య కశిపుడికి నచ్చలేదు. Scope సంగతి వదిలెయ్యి. ఎక్కడుంటాడో చెప్పు. డైరెక్టు గా ఎటాకిచ్చేద్దాం అన్నాట్ట. ఇక్కడా అక్కడా అని లేదు ఎక్కడైనా ఉంటాదు అన్నాట్ట ప్రహ్లాదుడు. మళ్ళీ తిక్క రేగింది.

సరైన దారిలో వెళ్ళే వాడయితే ‘జ్యోతి సె జ్యొతి జలావో’ అన్నట్టు ప్రశ్న నుంచి ప్రశ్న కి అనుసంధానం చేసుకుంటూ ముందు కెళ్ళే వాడు. ఫరీక్షిత్తు వెళ్ళలే..? అలానె. కానీ హిరణ్యకశిపుడు కూడా కొంచం ఇప్పటి వాళ్ళ టైపు. ఆట్టే టైం వేస్టు వద్దు. పాయింటుకొచ్చేద్దాం అనుకుంటూంటాడు. (preparation లేదు, analysis లేదు. Result oriented).

పాపం ప్రహ్లాదుడు మాత్రం ఏం చేస్తాడు? ‘వాడిని’ వివరించాలంటే వాడికంటూ ఏమీ లేదుట. వాడు అవ్యక్తుడు. నిరాకారుడు. వేదాలు కూడా వాడిని - ఆ పురుషుణ్ణి పూర్తి గా స్తుతించి చివర్లో లక్ష్మీ దేవి భర్త అయినవాడెవడొ వాడు అన్నర్ట. ఎర్ర చీర కట్టుకున్నావిడ నా భార్య అన్నట్టు. (నవ్వొచ్చేట్టు గా ఉన్నా ఇది సత్యం. వాళ్ళు అలానే అన్నారు. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని) వాళ్ళూ మాత్రం ఎం చెస్తారు? వాడిని డిఫైన్ చేయటానికి ఏ ప్రొపర్టీ (లక్షణం) వాడినా అది ఆవిడదే కానీ వాడివంటూ ఏమీ లెవుట. నల్లని వాడు అంటే శరీర చాయ = నలుపు అనే ప్రొపర్టీ ఉన్నవాడు అనీ అన్నట్టు. అందుకే కదా సౌందర్య లహరి లో "నిన్ను పెట్టుబడి గా పెట్టి శివుడు ఈ జగాన్ని మొత్తం నడుపుతున్నాడు. నువ్వే లేకపోతె ఏదీ చెయ్యలేడు అని" శంకరాచార్యుల వారు అన్నది.

సరే ఇది కూడా తేలేలా లేదు. నీకు కనిపిస్తున్నాడా? ఏది నువ్వు చూపించు అన్నాడు. హిరణ్యకశిపుడు. Activity- Role-Responsibility- తెలియకుండా. తీరా కనిపించాక ఏం చెయ్యాలి? పిలిచి భోంచెయ్యలా? మందీ మార్బలాన్ని పిలవాలా? ఒక్కడే వెళ్ళలా? అన్నది ఏమీ ఆలోచించలేదు. కనీసం మామూలు మనిషి గా లేడు, స్తంభం లోనుంచీ వచ్చాడు. అసలు ఇక్కడెలా ఉన్నాడు అని root cause analysis లేదు.పోనీ హిరణ్యాక్షుడి విషయం లో జరిగినది అయినా గుర్తుండాలి కదా (Historical data/ pattern/ analysis). అదీ లేదు.

ఎవరికైనా భూమ్యాకర్షణ అర్ధం కావాలంటే ముందు అయస్కాంతాన్ని, ఇనుప ముక్కల మధ్య సంబంధాన్ని చూపించి ఆతర్వాత అదే సిధాంతం భూమి కి కూడా పనిచేస్తోంది అని చెబితే అర్ధం ఔతుంది. కానీ హిరణ్య కశిపుడు నాకు 10 వ తరగతి లెక్కల్ని డైరెక్టు గా చెప్పు అని అడిగాడు. (పిడకల వేట--> 3 ఈ మధ్య యాడ్ లో హాల్ల్స్ పిప్పరమెంటు ఎంత చల్లగా ఉంటుంది అని ప్రశ్న కి విమానం లో నుంచీ తల బయటకి పెట్టి చూపించినట్టు చూపించాలి). అదే చేసాడు ప్రహ్లదుడు.

ఇంతలో ఆవేశం తో స్తంభాన్ని చీల్చాడు హిరణ్య కశిపుడు. లోపల నుండీ, ఒక వింత రూపం తో విష్ణుమూర్తి వచ్చాట్ట. అప్పటికైనా మనం వెతుకుతున్నదీ, ఇదీ ఒకటెనా అని తన్ను తాను ప్రశ్నించుకోలేదు.(Verification) వీడేనా ఆ శ్రిహరి అని పక్కనున్న కొడుకును అడగలేదు. (Velidation). హిరణ్య కశిపుడు మాత్రం ఊగిపోయాడు. బ్రహ్మని అడిగి వరాలతో Risk Mitigation చేసేశాను అనే అనుకున్నాడు. కానీ ఇక్కడ అది fail అయ్యింది, వెంటనే ఏం చెయ్యాలి అని ఆలోచించ లేదు. ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో చూసుకోకుండా మీద పడ్డాడు. (crisis management) లేదు.

గుడ్డ లో మంచి గంధం మూత కడితే మంచి గంధం వాసన వస్తుంది. మల్లె పూలు కడితే మల్లె పూల వాసన్ వస్తుంది. ఇంగువ కడితే ఇంగువ వాసన వస్తుంది. నిప్పు కణిక కడితే?? ఇది అదైపోతుంది. తెలుసుకుందాం తెలుసుకుందాం అనుకుంటూ వీడు వాడిలో ఐక్యం అయిపోయాట్ట. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే..
నృసింహావతారాన్ని చూడంగానే ప్రహ్లాదుడు కిందా మీదా పడి పోలేదు ట. అదెమిటి? అంత ఉగ్ర రూపం, ఎవ్వరూ ఊహించనట్టు గా వస్తే చిన్న పిల్లవాడు భయపడి పోలేదా అంటే వాడు Risk Management చేసాడు. (Expect the most Unexpected). స్తుతించాట్ట.

ఇప్పుడు కధా వస్తువు ని మొత్తం తీసేసి (అంటే హిరణ్య కశిపుడినీ, ప్రహ్లాదుడినీ పక్కకి పెట్టేసి) జరిగినదీ , జరగుండాల్సినదీ చూడండి. తప్పొప్పుల పట్టిక తయారౌతుంది. అదే Lessons learnt.

Project Management లో Scope తో మొదలెట్టి Analysis, Design, Testing, Quality Management, Risk Management, Communication Management, Project Closure తో సహా అన్నివిభాగాలనూ స్పృశిస్తూ వివరించాడు. దారి చూపించాడు. కాలక్షేపానికి అడగటం కాకుండా ఆర్తి తో అడిగితే బోధ పడే విద్య ఏమిటొ రుచి చూపించాడు.

భగవంతుణ్ణి తెలుసుకుందాం అన్న ఒక చిన్న ప్రోజెక్టు లో హిరణ్య కశిపుడికి అడుగడుగునా తప్పులే.

భగవంతుడు ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? ఎలా గుర్తించాలి? ఎలా నిర్ధారించాలి? వెతకటానికి మనం వెళ్తున్న దారి సరైనదేనా? అలా అని నమ్మకమేమిటి? ఎందుకు వెతుకుతున్నాం? దొరికిన తర్వాత ఏం చెద్దాం? ఇవి పరి ప్రశ్న లు. హరి ఎక్కడ అన్న ప్రశ్న కి. ప్రహ్లాదుడు దానికి దారి చూపించాడు. తద్విధ్ధి: ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని.

చేసున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్టు ఎవరైతే ఈ అంతరార్ధాన్ని తెలుసుకున్నారో వారికి చిక్కింది వాడి లీల. అర్ధం చేసుకోక ఆయాసపడ్డాడు హిరణ్య కశిపుడు.

కధని ఇలా నిష్పాక్షికం గా విశ్లేషిస్తే, ఐ.ఐ.ఎం లలో,హార్వర్డ్ ల లో వీటినే కేసు స్టడిలంటారు, ఎక్కడైనా కేసు స్టడిలు ఇలానే చేస్తారు. జరిగిన సంఘటనల లో నుంచీ, వ్యక్తుల అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు, పరిస్థితులకు అనుగుణం గా తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం వల్ల కలిగిన మార్పు, అది ఏ విధం గా సిధ్దాంతీకంచవచ్చు అని సమాలోచన చేసి పాఠ్యాంశాలు గా నిర్ణయిస్తారు.

ఇంతటి మహోన్నతమైన బాధ్యతని పిల్లలు బడికి వెళ్ళే వయసు రాక ముందే అప్రకటితం గా అలవరచే వారు తల్లి దండ్రులు చిన్న పిల్లలకు నీతి కధలు వినిపిస్తున్నట్టు గా.

అనాది గా వస్తున్న ఇటువంటి మన సాంప్రదాయం ఇంకా కొనసాగాలంటె, పోగో, పవర్ రేంజర్ ల ధాటి లో కొట్టుకు పోకుండా నిలబడాలంటె, మనం ముందు వాటిని సరైన దృక్పధం తో అర్ధం చేసుకోవాలి, ఇప్పటి వారి ధోరణి కి అప్పటి విషయాలను నూత్న రీతిన చెప్పగలగాలి.

"నేను సైతం విశ్వ వీణకు తంత్రినై.." ఆ దిశ గా నేను వేసిన తొలి ఆడుగు ఇది. చిన్ని ప్రయత్నం.
పెదరాయుడు సినిమాలో గ్రామర్ లో తప్పులుంటే మన్నించు. అసలు భావమే తప్పనుకుంటే క్షమించు అని...అన్నట్టు.
తప్పులుంటె మన్నించి సరిజేయండి. బోరు కొట్టుంటే క్షమించండి.

ఈ దిశ గా 'బుధ్ధి ప్రచోదన 'మవ్వటానికి కారణ భూతులైన భైరవభట్ల వారికి నమస్సుమాంజలి.
ఓపిక తో చదివిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

మీ
శ్రీపతి సనత్ కుమార్

భైరవభట్ల వారూ !! సందర్భోచితంగా సవితృ మండలాంతర్వర్తి తో గ్రీటింగ్... ఇది మీకే...


6 comments:

రాఘవ said...

సౌందర్య లహరి లో "నిన్ను పెట్టుబడి గా పెట్టి శివుడు ఈ జగాన్ని మొత్తం నడుపుతున్నాడు. నువ్వే లేకపోతె ఏదీ చెయ్యలేడు అని" శంకరాచార్యుల వారు అన్నది. ఇది ఏ శ్లోకమో నాకు తెలియరాలేదు. మీరు శ్లోకం కూడా ఉటంకించాల్సింది.

Sanath Sripathi said...

శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్త: ప్రభవితుం
నచేదేవం దేవో నఖలు కుశల: స్పందితుమపి.....

రాఘవ said...

నేను అనుకున్నంతా అయ్యింది. ఈ శ్లోకంలో చాలా అంతరార్థం ఉందీ అని చాలా మంది అనగా విన్నాను.

నిన్ను పెట్టుబడి గా పెట్టి శివుడు ఈ జగాన్ని మొత్తం నడుపుతున్నాడు... ఈ భావన సరైనది కాదేమో అని నా గాఠి అభిప్రాయం.

Sanath Sripathi said...

మీరన్నది నిజమేనేమో నాకు సరిగ్గా తెలియదు. నేనేభావంతో అలా రాశానో వివరిస్తా.

శక్తి తో కూడుకున్నవాడైన శివుడు సృష్టి ని చేయుటకు సమర్ధుడై ఉన్నాడు. శక్తి తోడులేనప్పుడు వేలు కూడా కదపలేకున్నాడు. అని మొదటి రెండు వాక్యాలకీ భావం.

ఇక్కడ శక్తి ని energy గా అర్ధం చేసుకున్నట్లైతే, potential energy కూడుకున్నవాడైన శివుడు సృష్టి ని చేయుటకు సమర్ధుడై ఉన్నాడు. శక్తి తోడులేనప్పుడు (kinetic energy లేనప్పుడు) వేలు ను కూదా కదపలేడు.

kinetic energy = work needed to accelerate a body of a given mass from rest to its current velocity.

శివుడు అవ్యక్తుడు.గుణాతీతుడు. ఎప్పుడూ ధ్యాన ముద్ర లో ఉంటూంటాడు .At rest. చలనం లేదు కాబట్టి అచేతనం గా ఉంటాడు.అంటే kinetic energy లేదు. కానీ potential energy ఉన్నది. వాడు వ్యక్త రూపం లోకి (సృష్టి రూపం లో)రావాలంటే kinetic energy రావాలంటే transformation జరగాలి. అంటే transformation నడుస్తోంది అంటే శక్తి ఆధారం గానే నడుస్తోంది. కాబట్టి నిహితం గా ఉన్న energy ని ముడి సరుకు గా పెట్టి ఈ నడక transformation ను సాధిస్తున్నాడు శివుడు.

వాగర్ధావివ సంప్రుక్తౌ లో ఒకటి భౌతికం, రెండవది మానసికము/ ప్రజ్ఞామయము. అటువంటి మానసికమైన దానిని వ్యక్త పరచాలంటె ఎలాగైతే భౌతికమైన వాక్కు ముడి సరుకు గా వాడబడుతున్నదో అట్లే అమ్మ వారిని పెట్టుబడి గా పెట్టి గుణముల రూపం లో (లక్షణముల రూపం లో) ఈ సృష్టి అంతా నిర్మింపబడుతున్నది/ వ్యక్తమౌతున్నది (వ్యక్తం చేస్తున్నాడు శివుడు) అని నా భావం.పెట్టుబడి లేకపోతే చేసేదేమీ ఉండదు. మళ్ళీ ధ్యానమగ్నుడైపోతాడు.

కాబట్టి 'నిన్ను పెట్టుబడి గా పెట్టి శివుడు ఈ జగాన్ని మొత్తం నడుపుతున్నాడు. నువ్వే లేకపోతె ఏదీ చెయ్యలేడు'అని రాశా.

తప్పులుంటే సవరించ గలరు.

రాశా

కామేశ్వరరావు said...

శివపార్వతులని విజ్ఞానశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే నేననేది శివుడు = mass, పార్వతి = energy. శివుడు జడుడు, పార్వతి శక్తి. రెండూ ఒకటే అని మనకి Einstien నిరూపించాడు కదా :-)
ఇలా మన పురాణాలని విజ్ఞానశాస్త్రానికో, మేనేజిమెంటుకో అన్వయించుకొని ఎన్ని అర్థాలైనా తియ్యొచ్చు, సరదాగా. అవన్నీ నా దృష్టిలో మన ఊహలు, కల్పనలే. ఒక రెండు విషయాల మధ్య ఎదో రకమైనా పోలికని చూడ్డం మన మనసుకున్న సహజలక్షణం.
ఇప్పటికే తెలిసున్న విషయాలకి అన్వయించడం కాకుండా, వీటిల్లోంచి కొత్త విషయాలని వెలికి తీసి శాస్త్రీయంగా నిరూపించగలిగితే, ఉపయోగించగలిగితే దానివల్ల ప్రయోజనం.
హిరణ్యకశిపుని కథలోంచి నేను తీసిన అర్థం వీలుచూసుకొని బ్లాగుతాను.
మీ స్నేహపత్రానికి ధన్యవాదాలు.

లోతైన స్నేహమెన్నడు
ఖాతరు చేయదు పరిచయ కాలమును త్రుటి
ర్జాతము మన పరిచయము స
నాతనమై సాగవలె సనన్మిత్రవరా!

Sanath Sripathi said...

రాఘవ గారూ, కామేశ్వర రావు గారూ !
నిర్మొహమాటం గా ఉన్నదున్నట్టు చెప్పినందుకు ధన్యవాదాలు.

కామేశ్వర రావు గారూ !
మీ పద్యానికి నెనరులు.