Thursday, June 2, 2011

బాపు బొమ్మలు చూద్దాం రండి.


తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది ఒక తరం నానుడి అయితే కాబోయే పెళ్ళికూతురు బాపు బొమ్మలా ఉండాలన్నది నేటి తరం నానుడి. అది చూసినవాడికి, ఆనందించినవాడికీ మాత్రమే తెలిసే రుచి. తెలుగునాట బాపు బొమ్మల గురించి తెలియని పాత తరం వారు బహు తక్కువ. స్వాతి లో కోతి కొమ్మచ్చి పేర బాపూ రమణల విన్యాసం చదివినతర్వాత ఈ కాలం వారికి కూడా కొంచం తెలిసి ఉండచ్చు. ఒకవేళ అరాకొరా తెలియని వాళ్ళెవరైనా మిగిలి ఉన్నట్టైతే (అందునా హైదరాబాదు వారైనట్టైతే ) వారికి ఇదొక మంచి అవకాశం. (తెలిసిన వారికి బహు పసందైన అవకాశం)

సోదరుడు ఆర్టిస్ట్ అన్వర్ గారు ఆ నెల 4,5,6 తేదీలలో హైదరాబాదులో బాపుగారి బొమ్మల కొలువు పెడుతున్నారు. పైన పెట్టిన ఆహ్వానపత్రం వారిదే...

http://thisisanwar.blogspot.com/2011/05/blog-post_31.html

 మీ ఇంటిల్లిపాదీ బంధుమిత్ర సపరివారం గా విచ్చేసి బాపూబొమ్మల షడ్రసోపేతమైన విందునారగించి కళాతాంబూల సేవనం చేసి బాపిస్ట్లమైన మమ్మానందింపజేయమని ప్రార్థన

దేవుళ్ళబొమ్మలైతేనేమి, వ్యంగ్య కార్టూన్లైతేనేమి, పోర్త్రైట్ లైతేనేమి అన్నింటిలోనూ బాపుగారిదొక విలక్షణత. ఎంత విలక్షణ అంటే ఆయన రాత పేరన ఒక ఫాంటే ఉంది. బహు కొద్దిమందికి మాత్రమే దక్కే అతి గొప్ప, అరుదైన గౌరవం అది. తెలుగున్నంత కాలం, కంప్యూటరున్నంతకాలం వారి రాత, తెలుగుదనం మీద ఆప్యాయత ఉన్నంతకాలం వారి గీత శాశ్వతం గా ఈ నేల నాలుగుచెరలా నిలచి ఉంటాయి. ఉండాలని మనస్ఫూర్తి గా ఆశిస్తున్నా.