Monday, February 22, 2010

"పులి" విలాపం... - 1


Save Our Tigers పేరున మన పులి సంరక్షణకై జరుగుతున్న ఉద్యమానికి నేను సైతం సమిధనొక్కటి ధార పోస్తున్నా..


కం.
ఎక్స్టింక్టయ్యెను ఫాజిలు
ఎక్స్టింక్టయె డైనొజారు, లిస్టున జూడన్
నెక్స్టింకున్నది బెబ్బులి
ఎక్స్టెన్షన్నివ్వకున్న నెక్స్టింక్టవ్వన్

(extinct pieces --> fossil bird, dinosaur)


కం.
నలభై వేలకు పైగా
పులులుండెను ఈ శతాబ్ద పూర్వము, వేయి
'న్నలభై పదులకు' జేరుట
"పులిపై నొనరింపబడిన పుట్రే"...! కాదా ???

(From 40,000 to 1411)


కం.
"నాన్నా పులి"కథ కథగా
చిన్నారుల మనసు గెల్చె చిత్రముగా, నిం
కొన్నాళ్ళకు కథ మరుగై
కన్నీరు మిగిల్చునేమొ? ఖర్మ? కనన్గా...


చం.
ఒకనికి మూఢ నమ్మకము ఒక్కనికిన్ వ్యసనమ్ము, క్రీడ ! వే
రొకనికి వర్తకమ్ము! మరి యొక్కని శూరత దెల్పు దర్పణ
మ్మొకటననేల హేతువులు మూర్ఖులు వ్యాఘ్రములన్ వధింప, నిన్
దొకనికి కూడ ద్రోహమని తోచదొ, 'సాకి' ఉదంతమంతయున్ ???

Nehru Zoological Park, Hyderabad: In 2001, a tiger named Saki was killed by poachers, reportedly with the connivance of zoo staff members

ఉ.
శూరత జూపుడయ్య భువి శొకము దీర్చెడు కర్మ జేయుచున్
ధీరత జూపుడయ్య ఇల దీనుల కష్టము బాపు సత్క్రియన్
బీరువులౌచు యోగమను పేరున హింసలు మానుడయ్య ! మీ
క్రూరత వీడుడయ్య ! పులి గోరును కోరకుడయ్య ! వేడెదన్ !!
Anticipating Goodluck, Courage and valour, people often tend to wear Tiger's nail in the locket....

సనత్ కుమార్
From 40,000 Tigers at the beginning of century, they have come down to just 1411......

My poems are in reflection.....

Friday, February 19, 2010

మంచు కురిసిన (శివ)రాత్రి ...


మహాశివరాత్రి నాడు "లింగోద్భవ" సమయాన "మంచు" బిందువులు కురవటం పై నేను రాసిన పద్యం...

ఆలస్యంగానైనా నా శివరాత్రి పోస్టు..



కైలాసమ్మును జేరి భక్తి యుతులై కైవారముల్ చేసి ! "హే
ఫాలాక్షా, నటరాజ, పాహి" యనుచున్ భక్తాళి శ్రధ్ధాళులై
పాలున్, దేనె, ఫలోదకంబుల, దధిన్, భస్మాజ్యముల్, చక్కెరన్,
సాలగ్రామశిలాత్మకున్ శివునకున్ స్నానమ్ము గావింపగా
క్ష్మాలక్ష్మిన్ హిమవర్షమై కురిసె ద్రాక్షా పాక మత్తీర్థమున్ !!

అమెరికాలో రికార్డు లెవెల్లో మంచు తుఫాను (స్నో స్టార్మ్) వచ్చిందని మా ఆన్సైటు వాళ్ళు (డాలస్, కొలంబియాల్లో) చెప్పినప్పుడు సరదాగా రాసిన పద్యం...

స్ఫూర్తి:
(1) శివార్చనలో నమక చమకాదులతో అభిషేకానికి ముందు పంచామృత స్నానం, ఫలోదక స్నానం, ఆ తర్వాత శుధ్ధోదక స్నానం మంత్రాలు ఉంటాయి. కైలాసం లో శివుడికి వాటితో పాటు, భస్మాభిషేకం కూడా చేయగా ఆ పంచామృతమే భూమి పై మంచు వర్షమై కురిసింది అని భావన...
(2) "మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః" కాబట్టి ద్రాక్షా పాకం అని భావించా

శార్దూలాన్నాశ్రయిస్తే దానిమీద ఆవిడకూడా వస్తుందేమో కదా, కరుణిస్తుందేమో.. పద్యం మరీ అతుకుల బొంతలా కాకుండా ఉంటుందేమో అనిపించి అందులో కుస్తీ పట్టా...

ఇక్కడొక విషయం చెప్పాలి. ఇది నేను రాసిన రెండో శార్దూలం (మొదటిది భైరవభట్ల వారిచ్చిన భూతమ్మగుదాని బ్రీతిమతులై వీక్షించిరద్దేవతల్ అన్న సమస్యకి నా ప్రయత్నం.. పూరణ కాదు కాబట్టి...)

శార్దులంలో మనకు గురువులు చాలా అవసరం వుంటాయి. అందుచేత ద్రుతాల నెక్కువగా వాడుకోవాల్సి వస్తోంది, కరెక్టో కాదో తెలీదు కొన్నైతే ద్రుతము మీద ద్రుతము వేయాల్సి వస్తుందేమో అనుకునా..
నాకా... అంతర్జాలం లో (తెవికి, పద్యం.Net)చదువుకుని, పదాలు కూడబలుక్కుని, గణాలు లెక్కలు పెట్టుకుని రాయటం మాత్రమే వచ్చు. నా జ్ఞానం అంతంత మాత్రమే... అందువల్ల రాఘవ గారినీ, కామేశ్వర్రావు గారినీ కష్టపెట్టాననుకోండి... మొత్తమ్మీద (మహా)దేవుడి దయ వల్ల పద్యం బానే వచ్చినట్టు అనిపించింది.

ఇక మీరే చెప్పాలి....

పంచామృత స్నానం.. (ఫోటోల్లో)....

క్షీరేణ స్నపయామి


దధ్నా స్నపయామి


మధ్నా స్నపయామి


ఆజ్యేన స్నపయామి


శర్కరయా స్నపయామి


ఫలోదకేన స్నపయామి


భస్మ విలేపనం సమర్పయామి...


Tuesday, February 9, 2010

నూకలాయనకిదో నూలుపోగు - 1 !!!


నాదోపాసనే జీవిత పరమావధిగా ఆరు దశాబ్దాల పాటు సంగీత సాహిత్యాలకు అనితర సాధ్యమైన సేవ జేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు డా. నూకల చిన సత్యనారాయణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన శుభ సందర్భంలో వారికి పద్య కుసుమాంజలి


సీ
సంగీత సామ్రాజ్ఞి సంప్రదాయపు కంచి
గద్వాల చీరల్ని గట్టినట్టు
స్వర, రాగ, తాళాలు స్వర్గ సీమలు జేరి
తాదాత్మ్యతనుబొంది దవిలినట్లు
కృతుల సంగతులన్ని కరుణించి నాల్కపై
నటరాజ నాట్యమ్ము నాడినట్లు
నాదాబ్ధి మధియించి, నారదాదుల భక్తి
నావలో భావమ్ము నడచునట్లు

తే.గీ.
గాన మాలపించు మధుర గళము మెచ్చి,
వేయి చంద్రులు జూచెడి వేళలందు (@)
అమ్మహామహోపాధ్యాయు నాదరించి
పద్మ 'భూషణ ' మిచ్చెరో 'పాణి', 'వాణి' (*)

(*) శ్రీపాద పినాకపాణి
(@) విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో యజ్ఞ చయనమ్మ, అన్నపూర్ణేశ్వర శర్మ దంపతులకు 1927 ఆగస్టు నాలుగోతేదీన ఆయన జన్మించారు. ఇది వారి సహస్ర చంద్ర దర్శన వత్సరం. భారత ప్రభుత్వం ఏ కారణం చేతనో ఆయన సేవల్ని ఇన్నాళ్ళకు గానీ గుర్తించలేకపోయినా సరిగ్గా ఎనభై నాల్గో సంవత్సరం లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించటం దైవ సంకల్పమే తప్ప కేవలం యాదృచ్చికం కాదేమో.




కం
వాణికి, శాస్త్రీయమ్మౌ
గానానికి, త్యాగరాజ కృతులకి, విద్వత్
శ్రేణికి సత్కారమ్మిది
బాణికి, గురుడౌ పినాక పాణికి చెందున్


త్యాగరాజ ఆరాధనల్లో నూకల వారితో ఫొటోల్లోని వారు

(1) శ్రీ చింతలపాటి కాశీ విశ్వనాథ శర్మగారు (మా మామగారు)
(2) శ్రీమతి శారద గారు (నూకల వారి శిష్యురాలు, మా అత్తగారు)
(3) శ్రీమతి శ్రీవల్లీ లావణ్య (నా శ్రీమతి)
(4) వటపత్రమ్మీద త్యాగరాజులు (నా గీత)

నూకల వారితో
మరిన్ని రాతలూ, మరికొన్ని గీతలూ తర్వాతి టపాలో ...........