Showing posts with label నా పద్యాలు. Show all posts
Showing posts with label నా పద్యాలు. Show all posts

Saturday, October 10, 2020

రాముడూ- స్ఫూర్తి - దత్తపది

Vijaya Bhaskar Rayavaram
గారు B+ with Bhaskar .అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో నేటి అంశం పద్య లహరి. స్వర్గీయ ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యంగారి బహుళ ప్రచారంపొందిన వేర్వేరు సినిమా పాటలలోని నాలుగు పదాలతో (దత్తపది) రామాయణార్థములో ఒక పద్యము, భారతార్థంలో ఒక పద్యము చెప్పమన్నారు. కార్యక్రమంలో భాగంగా సిరాశ్రీ గారు ఒకే పాటలోని నాలుగు పదాలతో ఒక పద్యాన్ని చెప్పారు. వారలా అంటూండగానే నాకూ స్ఫూర్తి కలిగి ఆశువుగా వ్రాసాను. కార్యక్రమం సమయాభావంకాకూడదు కాబట్టి అక్కడ ప్రస్తావించలేదు. ఇక్కడ ప్రకటిస్తున్నాను..

పదాలు : యురేక, సకమికా, నీ ముద్దు, తీరేదాకా

రామాయణార్థం: హనుమ సంజీవనీ పర్వతమును తీసుకు వచ్చిన సమయం ఒక వానర సైనికుని హృదయ స్పందన.

భళిరా ఏమది వాయురేఖ ! గగనవ్యావృత్తమై నౌషధా
ఖిలమై వచ్చె నగమ్ము! పంచకమికన్ కించిత్కృపా వృష్టిమై
చలగంగా మృతులైన వానరులుకున్ సంజీవనీ ముద్దు గా
లిలజీవమ్మిడె ! మారుతీ ! ఋణము తీరేదాక సేవించెదన్ !!

లక్ష్మణుని మూర్చనుండీ ఉధ్ధరించటానికి సుషేణుడు నాలు మొక్కలను తేవయ్యా అంటే సర్వౌషధ సంపన్నమైన సంజీవని పర్వతాన్నే తీసుకొచ్చేశాట్ట హనుమ. ఒక జెట్ ప్లేనో అంతకన్న వేగంగా వెళ్ళగలిగేదో పయనిస్తే మనకు కనిపించేది దాని మార్గమే. అలా హనుమ వెళ్ళి వస్తూంటే సంజీవనీ పర్వతం ఒకటే ఎగిరి వస్తోందా అన్నట్టు కనిపిస్తోందిట దూరం నుండీ... ఎంత కరుణ కాకపోతే రణరంగం (పంచకము) నకు ఆ పర్వతం తేవడం వల్ల, పర్వతం మీద ఉన్న ఔషధముల మీదుగా ఎగిరిన ముద్దు గాలి (పిల్లగాలి) సోకి మృతులైన వానర వీరులు సజీవులైనారట.. ఆంజనేయుని ఋణము తీర్చుకోలేను ఆజన్మాంతమూ అతనిని సేవింతునని ఒక వానరుని భావన !!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
భారతార్థం: కృష్ణలీల సందర్భం - ఒక గోపిక అంతరంగం.

భళిరా నీమురళీ ద్యురేఖ గగనవ్యావృత్తమై చెల్వగో
కుల స్త్రీ మానసమెల్ల పంచకమికన్ ! గో, గోపికా, గోపకుల్
చెలులై రాసవిలాస లీలలను నిల్చేరంట ! నీ ముద్దు మ
ల్లెల మోమెంతని చూచినా తనివితీరేదా? కనా కష్టమే !!

కృష్ణుని వేణుగానం ఒక వెలుగు రేఖయై (ద్యు రేఖ) ఆకాశమంతా సుడులు తిరుగుతూ గోపికల మానసమును ఒక రణరంగం (పంచకము) గా చేస్తున్నది. కృష్ణుడొక్కడే పురుషుడన్నప్పుడు గోవులూ, గోపకులూ, గోపికలూ అన్న బేధం లేకుండా అన్ని ప్రాణులూ రాసలీలా విలాసములో చెలులై నిలిచిపోయారట. ముద్దు మల్లెల మోమును ఎంతచూచినా తనివి తీరేనా? కనా కష్టమే అని గోపిక భావన

Sunday, June 16, 2013

Happy father's day


ఎన్నో విలువలనిచ్చెను
ఎన్నో సద్గుణములిచ్చె ! నెంతటి ప్రేమో
నాన్నకు! మాటలు జెప్పక
నన్నిటినందించె మాకునాచరణమునన్ !

Monday, July 9, 2012

సింహావలోకనం

సింహావలోకనం, సింహావలోకనం అంటూంటాము.. అసలు తరచి చూసుకోడానికి సింహావలోకనమనే ఎందుకనాలి? జంతువులలో మిగిలిన ఆ జంతువూ వెనక్కి తిరిగి చూసుకోనే చూసుకోదా? చూసుకున్నా సింహానికున్నంత grace వాటికి ఉండదా? ఉత్తమమైన నడకని సూచించేప్పుడు సామజ వరగమనా అనీ, హంస గమనా అన్నారు కదా? సింహానికే ఎందుకంతటి grace ఉంటుందో గమనించారా? కారణమేమయ్యుంటుంది? నాకొచ్చిన చిలిపి ఊహ



శ్రీరంగంలో రంగడి కళ్ళంత అందమైన కళ్ళు చూసినతర్వాత ఒక భక్తాగ్రేసరుడికి ఇంక ఏ కళ్ళల్లోనూ అంతటి అందం లేదనిపించిందిట. అట్లే, వెనక్కి తిరిగి చూస్తే "తిప్పుకోలేనంత అందం" అంటారు కదా అది కనిపించిందట సింహానికి అమ్మవారిలో. అంతే అప్పటినుండీ ఆవిడ మోమును చూసుకుని చూసికుని మురిసి తరించిపోతోందిట సింహం అప్పటినుండే "సింహావలోకనం" ఉత్తమమైన పదప్రయోగమయ్యిందేమో..

మునులే మోమును గాంచినంత గలిగెన్ మోక్షమ్ము ! నెద్దానినిన్
అనిమేషత్వము నొంది జూతురట నింద్రాద్యష్ట దిక్పాలురున్
గనగా నెంచి తలెత్తి జూచితి ! శిరఃకంపమ్ము "సింహావలో
కనమయ్యెన్" నిల సింహవాహిని! శివా! కారుణ్యవారానిధీ !!

Monday, February 20, 2012

బాల శివుడు - కంప్లైంటు

అల్లరిచేసినా, ఆకలేసినా, నిద్ర వచ్చినా, ఆవలించినా, పండగైనా పబ్బమైనా,ఆటల్లో అరటిపండైపోయినా, వేరెవరైనా తొండి చేసినా  అన్నింటికీ కావలసింది అమ్మే. చూస్తే అందరూ చాలా అనందంగా ఉన్నారు నాకు మాత్రం ఏ సరదాలూ లేవు..

తడిస్తే జలుబు చేస్తుందనీ...
అన్ని దిక్కులకీ పరిగెడుతూంటే కాళ్ళు నొప్పులొస్తాయని...
వంటికంతా దుమ్మూ ధూళీ పట్టించుకుంటే క్రిములొస్తాయని...
నాకు చెప్పిందెవ్వరు? నన్ను పట్టించుకున్నదెవ్వరు?

Wednesday, January 4, 2012

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

మఱ్ఱియాకు పైన మఱులు గొల్పుచు గాలి
వ్రేలు చప్పరింతువేల ? దల్లి
గర్భమందు నీదు  గాల్జేతులాడించు
వేళ నొచ్చె నేమో వ్రేలు, గనగ



నీటిమీద దేలు నీకెట్లు దినిపింతు
బువ్వ యనుచు నడుగ నవ్వ సాగె
చీకగానె వ్రేలు  నాకలంతయు దీరె
గంగ ఊరెనేమో కాలి నుండి

అన్నమయ్య మిమ్ము నట్లేల కీర్తించె
చిలిపి ఊహ గలుగ దెలిసె నాకు
ఎంగిలయ్యెననుచు నెంచెనేమొకొ బ్రహ్మ
కడుగ సాగె పాద కమలములను

అట్టి పాదయుగ్మమర్చించుకోనిమ్ము
ముక్తి గిక్తి వలదు మోహనాంగ
నీదు పాదయుగళి నిత్యమ్ము సేవించు
వరమునిమ్ము  మార్గ శిరమునందు !!

అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
(బొమ్మలు అంతర్జాలం లో సేకరించినవి)

Wednesday, February 23, 2011

ముళ్ళపూడి పట్టె మోక్ష పథము !!



మీకిది భావ్యమా? రమణ ! మీకయి మీరిటు నిశ్చయించినన్
మాకెవరయ్య దిక్కు యని మారము చేయరొ బుంగమూతితో
మీ కతి ప్రీతిపాత్రులగు మీ బుడుగున్, మరి బాపు బొమ్మలున్!
శ్రీ కరమైన ధామమును జేరగ మీకిటు తొందరేలనో?

కమ్మగ కధలను జెప్పగ
రమ్మని పిలుపొచ్చెనేమొ రమణకు ! బాపూ
కొమ్మల నూగెడు కోయిల
ఇమ్మహి విడి నాకమునకు ఇటజనె నకటా !!


కళ్ళల్లో వెలుగువు మా
ఇళ్ళల్లో నవ్వునింపు ఇనుడవు ! నీకే
మళ్ళీ జన్మొకటుంటే
వెళ్ళొచ్చెయ్ ముళ్ళపూడి వెంకట రమణై !!


మా తండ్రిగారికి బాబాయి వరస ఔతారు శ్రీ ముళ్ళపూడి వారు (పెత్తల్లి, పినతల్లి బిడ్డలు). ఎప్పుడు మద్రాసు వెళ్ళినా కక్కిగారిని (ముళ్ళపూడి వారి తల్లిగారిని) కలవకుండా వచ్చేవారు కాదు నాన్నగారు. రాముడూ - స్ఫూర్తి అని నేన్రాసుకున్న పద్యాలు విన్న మొదట్లో నాన్నగారు బాపు రమణలకు వీలైనప్పుడు చూపిస్తే సంతోషిస్తారు అన్నారు. అది కాస్తా తీరకుండానే వీరు విజయం చేయటం....  వేటూరివారు, ముళ్లపూడి వారు మొదలైన హేమాహేమీలు, జగజ్జెట్టీలు ఇట్లా తెలుగు ప్రియులను వదిలి సుదూర తీరాలకు వెళ్ళిపోవటం అత్యంత దురదృష్టకరం....

వారి రచనలద్వారా, వారి బుడుగుద్వారా, బాపూ బొమ్మలద్వార వారు మనలకు స్ఫూర్తి కలిగించాలని ఆకాంక్షిస్తూ...

(నాకు నచ్చిన  ఈ బొమ్మ అన్వర్ గారు వేసినది. దాని లంకె ఇక్కడ)
http://www.flickr.com/photos/anwartheartist/5441482567/sizes/m/in/photostream/
వారి నుండీ లిఖిత పూర్వక అనుమతితీసుకోకుండా ఇక్కడ ప్రచురించినందుకు వారికి సభాముఖంగా క్షమాపణలు

Tuesday, February 1, 2011

త్యాగయ్య - అందుకో నా వందనాలు !!

అందరికీ త్యాగరాజ ఆరాధనోత్సవాల శుభాకాంక్షలు (ఆలస్యంగా)

యోగము చేసెనో? విమల యూహల మిమ్మనుభూతి చెందగా
యాగము చేసెనో? స్వర లయాత్మకులౌ మిము ప్రస్తుతింపగా
ఏ గరిమన్ లభించెనయ ఇంతటి తీయదనమ్ము వ్రాయగా    
త్యాగయకున్, వచింపుమయ ! దాశరధీ, హృదయాంతరాకృతీ  !!



ఏ రస వాహిని మదికిన్
తారణ మార్గమ్ము నిచ్చె, తలచెద వానిన్
కారుణ్యామృత రాశిని,
తారక నామమ్ము వాని, త్యాగయ వానిన్ !!

Wednesday, January 26, 2011

గణతంత్ర దినమ్మునాడు క్షమియింపగదే?





అణువణువున దోపిడితో
క్షణమునకో కుట్రతోడ, కక్షలతో దు
ర్గుణముల వెల్గెడి బిడ్డల
గణతంత్ర దినమ్మునాడు క్షమియింపగదే ?


Tuesday, January 25, 2011

పండిట్ భీంసేను మీకు ప్రాఞ్జలు లివ్వే




దండిగ ఆలాపనలున్,
మెండుగ రాగాలు బాడు మేలౌ గానో
ద్దండా, కీర్తి ప్రచండా    
పండిట్ భీంసేను మీకు ప్రాఞ్జలు లివ్వే

Wednesday, July 7, 2010

మాగాయ్ పచ్చడి...

నేపధ్యం:

కంది శంకరయ్యగారు ఒక సమస్య ని ఇచ్చారు

నా పద్యం:

వెచ్చని గాడ్పుల వేసవి
వచ్చిన సడి తెలియునట్లు వడ్డించండోయ్
నచ్చిన ముక్కల మాగాయ్
పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్

స్ఫూర్తి :
మాగాయొక మహా పచ్చడి పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరీ మానిన్యాం మహాసుందరీ అన్నారు కదండీ.. అందుకే..

Sunday, June 13, 2010

పులి మానసం

రామాయణ కథనంతా చిత్రకారులు చిత్రీకరిస్తే రాముడూ, సీతాదేవీ వాటిని గమనిస్తూ అప్పటి రోజులని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకున్నారు అని భవభూతి ఉత్తర రామచరితం లో వర్ణిస్తారు. అదేభావనతో ఈ పద్యం..

వేటగాళ్ళ క్రూరత్వానికి పులులు బలై పొతూంటే పులి పిల్లలు అనాథలైపోతున్నాయి. అట్లాంటి ఒక అనాథ పులిపిల్ల తన గతాన్ని, తన తల్లితో ముడిపడి ఉన్న మధురమైన జ్ఞాపకాలనూ నెమరువేసుకుంటూంటే ఎలా ఉంటుందో అని ఆలోచనకి ఇది పద్య రూపం..




ఆవల ఈవలంచు తిరుగాడెడి పిల్లల నెల్ల ప్రేమతో
కావలి గాచి సొక్కితివొ, కంటికి నిద్దుర దూరమయ్యెనో?
త్రోవల తూలినావు ! కనుదోయిని నా మునివేళ్ళ విప్పనా?
దేవుని పైన భారమిడి ఈ సమిధన్ చెవి దూర్చి చూడనా?
ఈ వనమందు నీవు శయనింపగ లేపెడి ధూర్తు నేనె గా....

Saturday, May 22, 2010

రాలిన సాహితీ సుమం - వేటూరి

తెలుగు తల్లికి సాహితీ సమర్చన చేసిన సత్కవి, సినిమా పాటల ద్వారా ఎందరి గుండెల్లోనో తెలుగుదాన్ని చిరస్థాయిగా నింపిన స్రష్ఠ, మహోన్నత వ్యక్తి శ్రీ వేటూరి సుందర రామ మూర్తి గారికి హృదయ పూర్వక పద్య సుమాంజలి

కొందరు భాష జూచెదరు ! కొందరు భావ పరంపరల్ గనున్ !
కొందరు భక్తి గ్రోలెదరు ! కొందరు సూక్తుల నాదరింపగన్ !
ఇందరి కిన్ని ఇచ్చు కలమే అది? తెల్గుతనాని కంతకున్
సుందర రామ మూర్తి ఒక సూత్రమొ? గోత్రమొ? దివ్య నేత్రమో !!




Thursday, May 6, 2010

కవిసమ్మేళనానికి నా కుస్తీపట్లు!!

ఉగాదికి అంతర్జలంలో నిర్వహించిన కవిసమ్మేళనానికి పిల్ల కాకినైన నాకూ పిలుపొచ్చింది.

ఉద్దండ పండితుల మధ్య నా పద్యాలు కనీసం విదూషకుడి పాత్రనో, అప్రస్తుత ప్రసంగీకుడి పాత్రనో పోషిస్తాయి కదా అని నేనూ ఊ కొట్టేశా. ఆ పిలుపుకి పర్యవసానమే నా ఈ కుస్తీ పట్లు.

బ్లాగాడిస్తా రవి గారి టపా స్ఫూర్తి తో నేనూ ప్రచురిస్తున్నా నా పద్యాల్ని (ఉరఫ్ పైత్యాన్ని...)

"కుస్తీ పట్లు" అని ఎందుకన్నానో మీకు చదువుతూ పోతున్నకొద్దీ దానంతట అదే అర్ధమైపోతుంది.. కావాలంటే చూడండి..

చట్టబధ్ధమైన ముందస్తు మాట....
ఈ పద్యాలు చదివాకా.. మీకేమైనా అయితే అది నా బాధ్యత కాదు సుమీ...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(గతంలో ఓటరు భావన)
నోటుకి, మందుకి, క్రీకెట్
బ్యాటుకి తెగనమ్ముకొందు ! బ్యాడ్పొజిషన్నీ
పూటకి గడచిన చాలును
ఓటది నాయిష్టమనుచు వోటరు పలికెన్

(మరి నేడో .... )
కోటికి అర్రులు చాచుచు
కూటికి కొరగాని వాన్కి గూడివ్వంగా
ఆటల నాడెదవే? చీ !
ఓటది! నాయిష్టమనుచు వోటరు పలికెన్

ఘాటగు స్పీచులు దంచక
బూటక వాగ్దానమీక, పూజ్యులు బాపూ
బాటన్నడిచే నేతకు
ఓటది! నాయిష్టమనుచు వోటరు పలికెన్

తూటా కన్నా గొప్పది !
మాటాడని విప్లవమ్ము ! మార్పుకు బీజం
నాటెద! సత్తా చాటెద !
ఓటది! నాయిష్టమనుచు వోటరు పలికెన్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మన్మనంబున ప్రేమ భావన మంతరించెడి వేళ ! మా
కున్ముదంబున దారి జూపుచు, కోటి రత్నపు వీణయే,
వన్మినిట్టు సహింపబోమను వాదనల్ తెరదింపుచున్
రాణ్మహేంద్రవరమ్ము చేరెను, రత్నగర్భుని చెంతకున్

(ణ్మ కి న్మ ప్రాస సరికాదు అని విజ్ఞులు చెప్పారనుకోంది.. కానీ నాకు తట్టింది మాత్రం ఇంతే ..)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సూచన:- మీరు గమనించకపోయినట్టైతే పట్లు ఆల్రెడీ మొదలైపోయాయి..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మా సుమ బాణముల్ హరుని మానసమందున ప్రేమ నింపగా,
భాసురమైనతేజమిటు భాసిలె స్కంధుగ ! క్రౌంచ తారకా
ద్యసురారీ! ఒనరంగజేసితిని గాదా ధాత్రికిన్ గూర్మి ! నే
డిసుమంతైనను లేడు నా యశముకే ఢీ చెప్పు వాడెవ్వడున్ !
అసువుల్ బాసిన నేమి? జన్మ చరితార్ధంబయ్యె, సత్కర్మలన్

ఏవో చప్పిడి కూడు నీకిడుదు! నేనే జంతికో తిందు ! నే
వేవో పాటల టాపు లేపెదను ! వేవేలంట నా తిక్కలున్ !
నీవేరీతిన వేడుకున్న విన! నే నే ఖర్చు తగ్గించ నోయ్
శ్రీవారూ!! గృహజ్యోతి మాట విని ఏ.సీ. తేని పక్షాన! ఫో !

ఇంటికి దీపం ఇల్లాలు కదా.. ఈ మల మల మండే ఎండాకాలం లో ఏ.సీ తెమ్మని ఆవిడ పెట్టే పోరు లో దత్తపదుల కుస్తీ...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సూచన:- పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు అన్నారు కదా.. నా తఢాకా చివరిగా ఇక్కడ... ;)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
లక్షద్వీపపు మంత్రి వర్గమనగా లంచావతారమ్ములే
వీక్షింపంగ ! విభిన్న దీవులకు వేర్వేరైన శాఖల్నిడెన్
భక్షింపన్ కమిషన్లు! దాని కొరకై భా.నీ.ప లంకేశుడే
అక్షప్రౌఢిమ మీర ఆశ కు.ని. లంకాధీశుతో బోరెడిన్

లక్షద్వీప్ ప్రభుత్వం ఒక్కొక్క మంత్రిత్వ శాఖనూ ఒక్కొక్క ద్వీపం లో పెడుతుందనీ.. అప్పుడా మంత్రే ఆ లంకకు అధిపతి అనీ... మంత్రులు కాబట్టి రాజకీయం లో ఎత్తులు, పైయ్య్త్తులూ వేస్తూంటారనీ... భావన..

ఒక శాఖ మంత్రి కి వేరే శాఖ మీద కన్ను పడగా ఆయనతో పోరు పెట్టుకున్నాట్ట ఆశ ఎంతటి కైనా తెగిస్తుంది కదా... అని భావన..

మీకీపాటికే అర్ధం అయ్యి ఉంటుంది ఈ యుధ్ధం ఎవరెవరికీ మధ్యనో...
భా.నీ.ప = భారీ నీటి పారుదల శాఖ,
కు.ని = కుటుంబ నియంత్రణ శాఖ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
స్వస్తి

Tuesday, March 30, 2010

హనుమజ్జయంతి శుభాకాంక్షలు.

దాశరధీ శతకం పద్యాలు చదువుతూంటే, నా భావాలని నేనే రాముడితో మొర పెట్టుకుంటున్నట్టు భావనే, ఎన్నేళ్ళు గా చదువుతున్నా.. ఇప్పటికీ... మిగిలిన ప్రపంచం ఉందన్న స్ఫురణే జారిపోతూంటుంది... చాల ఎమోషనల్ గా సెంటిమెంటల్ గా కూడా ఔతూంటుంది....

హనుమజ్జయంతి సందర్భం గా....నన్ను బాగా కదిలించే పద్యాలు .. ఓ మూడు ఇక్కడ...

డాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
దాసుల దాసుడా గుహుడు? తావక దాస్యమొసంగినావు; నే
జేసిన పాపమా? వినుతి సేసినఁ గావవు! గావుమయ్య! నీ
దాసులలోన నేనొకడ దాశరథీ! కరుణాపయోనిధీ!

పెంపున దల్లివై, కలుషబృంద సమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై, మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా
రింపను వెజ్జవై కృప గురించి పరంబు తిరంబుగాగ స
త్సంపదలియ్య నీవె గతి దాశరథీ! కరుణాపయోనిధీ!

సిరులిడ సీత, పీడ లెగఁజిమ్ముటకున్ హనుమంతు, డార్తి పోఁ
దరుమ సుమిత్రసూతి, దురితంబులు మానుప రామనామమున్
గరుణ దలిర్ప, మానవులఁ గావగఁ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ! దాశరథీ! కరుణాపయోనిధీ!

పద్యాలు రాసే ప్రారంభదశలో (యతి, ప్రాసలపై ధ్యాసేలేని పాతరోజుల్లో) ఒకానొక రోజు రాసుకున్న పద్యం...

హృదయము నందు మిమ్ము గొనినంతనె మారుతి ఆఢ్యుడయ్యెనా?
విదితము గాదె? రామ ! తమ గేహము సేసితి నాదు ఆత్మనున్
ముదమున; గాని ఆత్మ దరి జేరెడి మార్గము మర్చిపోతి; శ్రీ
మదఖిల లోక పాలక సమస్తము జూపెద ! దారి జూపినన్ !!

స్ఫూర్తి:- కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే "ఆత్మారవిందం" అనుకుంటూ నా ఆత్మని మీ ఇంటిగా తీర్చిదిద్దా... పెద్దవాళ్లైన మిమ్మల్ని ఇంట్లో పెట్టి, పిల్లాణ్ణైన నేను బయటెక్కడో తప్పిపోయా... తిరిగి ఇల్లెలా చేరుకోవాలో తెలీటం లేదు....రామా.. ఆత్మని ఎలా చేరుకోవాలో దయచేసి చెప్పవా? అక్కడ నిన్నే కాదు సమస్తాన్నీ చూపించకపోతే అప్పుడు అడుగు అని నా ని'వేదన' !! (నువ్వుంటే సమస్తమూ ఉన్నట్టె కదా...)

ఏ మార్గమైనా/ ఏ గురు సాంప్రదాయమైనా ఆత్మని తెలుసుకో, నీవెవరో తెలుసుకో అనే అంటుంది కదా... ఆత్మని తెలుసుకుంటే సమస్తమూ తెలిసినట్టే, ఆత్మారాముణ్ణి తెలుసుకున్నా సమస్తమూ తెలిసినట్టే అనే భావన ఆలంబనగా...

రామార్పణం...

Monday, February 22, 2010

"పులి" విలాపం... - 1


Save Our Tigers పేరున మన పులి సంరక్షణకై జరుగుతున్న ఉద్యమానికి నేను సైతం సమిధనొక్కటి ధార పోస్తున్నా..


కం.
ఎక్స్టింక్టయ్యెను ఫాజిలు
ఎక్స్టింక్టయె డైనొజారు, లిస్టున జూడన్
నెక్స్టింకున్నది బెబ్బులి
ఎక్స్టెన్షన్నివ్వకున్న నెక్స్టింక్టవ్వన్

(extinct pieces --> fossil bird, dinosaur)


కం.
నలభై వేలకు పైగా
పులులుండెను ఈ శతాబ్ద పూర్వము, వేయి
'న్నలభై పదులకు' జేరుట
"పులిపై నొనరింపబడిన పుట్రే"...! కాదా ???

(From 40,000 to 1411)


కం.
"నాన్నా పులి"కథ కథగా
చిన్నారుల మనసు గెల్చె చిత్రముగా, నిం
కొన్నాళ్ళకు కథ మరుగై
కన్నీరు మిగిల్చునేమొ? ఖర్మ? కనన్గా...


చం.
ఒకనికి మూఢ నమ్మకము ఒక్కనికిన్ వ్యసనమ్ము, క్రీడ ! వే
రొకనికి వర్తకమ్ము! మరి యొక్కని శూరత దెల్పు దర్పణ
మ్మొకటననేల హేతువులు మూర్ఖులు వ్యాఘ్రములన్ వధింప, నిన్
దొకనికి కూడ ద్రోహమని తోచదొ, 'సాకి' ఉదంతమంతయున్ ???

Nehru Zoological Park, Hyderabad: In 2001, a tiger named Saki was killed by poachers, reportedly with the connivance of zoo staff members

ఉ.
శూరత జూపుడయ్య భువి శొకము దీర్చెడు కర్మ జేయుచున్
ధీరత జూపుడయ్య ఇల దీనుల కష్టము బాపు సత్క్రియన్
బీరువులౌచు యోగమను పేరున హింసలు మానుడయ్య ! మీ
క్రూరత వీడుడయ్య ! పులి గోరును కోరకుడయ్య ! వేడెదన్ !!
Anticipating Goodluck, Courage and valour, people often tend to wear Tiger's nail in the locket....

సనత్ కుమార్
From 40,000 Tigers at the beginning of century, they have come down to just 1411......

My poems are in reflection.....

Friday, February 19, 2010

మంచు కురిసిన (శివ)రాత్రి ...


మహాశివరాత్రి నాడు "లింగోద్భవ" సమయాన "మంచు" బిందువులు కురవటం పై నేను రాసిన పద్యం...

ఆలస్యంగానైనా నా శివరాత్రి పోస్టు..



కైలాసమ్మును జేరి భక్తి యుతులై కైవారముల్ చేసి ! "హే
ఫాలాక్షా, నటరాజ, పాహి" యనుచున్ భక్తాళి శ్రధ్ధాళులై
పాలున్, దేనె, ఫలోదకంబుల, దధిన్, భస్మాజ్యముల్, చక్కెరన్,
సాలగ్రామశిలాత్మకున్ శివునకున్ స్నానమ్ము గావింపగా
క్ష్మాలక్ష్మిన్ హిమవర్షమై కురిసె ద్రాక్షా పాక మత్తీర్థమున్ !!

అమెరికాలో రికార్డు లెవెల్లో మంచు తుఫాను (స్నో స్టార్మ్) వచ్చిందని మా ఆన్సైటు వాళ్ళు (డాలస్, కొలంబియాల్లో) చెప్పినప్పుడు సరదాగా రాసిన పద్యం...

స్ఫూర్తి:
(1) శివార్చనలో నమక చమకాదులతో అభిషేకానికి ముందు పంచామృత స్నానం, ఫలోదక స్నానం, ఆ తర్వాత శుధ్ధోదక స్నానం మంత్రాలు ఉంటాయి. కైలాసం లో శివుడికి వాటితో పాటు, భస్మాభిషేకం కూడా చేయగా ఆ పంచామృతమే భూమి పై మంచు వర్షమై కురిసింది అని భావన...
(2) "మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః" కాబట్టి ద్రాక్షా పాకం అని భావించా

శార్దూలాన్నాశ్రయిస్తే దానిమీద ఆవిడకూడా వస్తుందేమో కదా, కరుణిస్తుందేమో.. పద్యం మరీ అతుకుల బొంతలా కాకుండా ఉంటుందేమో అనిపించి అందులో కుస్తీ పట్టా...

ఇక్కడొక విషయం చెప్పాలి. ఇది నేను రాసిన రెండో శార్దూలం (మొదటిది భైరవభట్ల వారిచ్చిన భూతమ్మగుదాని బ్రీతిమతులై వీక్షించిరద్దేవతల్ అన్న సమస్యకి నా ప్రయత్నం.. పూరణ కాదు కాబట్టి...)

శార్దులంలో మనకు గురువులు చాలా అవసరం వుంటాయి. అందుచేత ద్రుతాల నెక్కువగా వాడుకోవాల్సి వస్తోంది, కరెక్టో కాదో తెలీదు కొన్నైతే ద్రుతము మీద ద్రుతము వేయాల్సి వస్తుందేమో అనుకునా..
నాకా... అంతర్జాలం లో (తెవికి, పద్యం.Net)చదువుకుని, పదాలు కూడబలుక్కుని, గణాలు లెక్కలు పెట్టుకుని రాయటం మాత్రమే వచ్చు. నా జ్ఞానం అంతంత మాత్రమే... అందువల్ల రాఘవ గారినీ, కామేశ్వర్రావు గారినీ కష్టపెట్టాననుకోండి... మొత్తమ్మీద (మహా)దేవుడి దయ వల్ల పద్యం బానే వచ్చినట్టు అనిపించింది.

ఇక మీరే చెప్పాలి....

పంచామృత స్నానం.. (ఫోటోల్లో)....

క్షీరేణ స్నపయామి


దధ్నా స్నపయామి


మధ్నా స్నపయామి


ఆజ్యేన స్నపయామి


శర్కరయా స్నపయామి


ఫలోదకేన స్నపయామి


భస్మ విలేపనం సమర్పయామి...


Tuesday, February 9, 2010

నూకలాయనకిదో నూలుపోగు - 1 !!!


నాదోపాసనే జీవిత పరమావధిగా ఆరు దశాబ్దాల పాటు సంగీత సాహిత్యాలకు అనితర సాధ్యమైన సేవ జేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు డా. నూకల చిన సత్యనారాయణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన శుభ సందర్భంలో వారికి పద్య కుసుమాంజలి


సీ
సంగీత సామ్రాజ్ఞి సంప్రదాయపు కంచి
గద్వాల చీరల్ని గట్టినట్టు
స్వర, రాగ, తాళాలు స్వర్గ సీమలు జేరి
తాదాత్మ్యతనుబొంది దవిలినట్లు
కృతుల సంగతులన్ని కరుణించి నాల్కపై
నటరాజ నాట్యమ్ము నాడినట్లు
నాదాబ్ధి మధియించి, నారదాదుల భక్తి
నావలో భావమ్ము నడచునట్లు

తే.గీ.
గాన మాలపించు మధుర గళము మెచ్చి,
వేయి చంద్రులు జూచెడి వేళలందు (@)
అమ్మహామహోపాధ్యాయు నాదరించి
పద్మ 'భూషణ ' మిచ్చెరో 'పాణి', 'వాణి' (*)

(*) శ్రీపాద పినాకపాణి
(@) విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో యజ్ఞ చయనమ్మ, అన్నపూర్ణేశ్వర శర్మ దంపతులకు 1927 ఆగస్టు నాలుగోతేదీన ఆయన జన్మించారు. ఇది వారి సహస్ర చంద్ర దర్శన వత్సరం. భారత ప్రభుత్వం ఏ కారణం చేతనో ఆయన సేవల్ని ఇన్నాళ్ళకు గానీ గుర్తించలేకపోయినా సరిగ్గా ఎనభై నాల్గో సంవత్సరం లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించటం దైవ సంకల్పమే తప్ప కేవలం యాదృచ్చికం కాదేమో.




కం
వాణికి, శాస్త్రీయమ్మౌ
గానానికి, త్యాగరాజ కృతులకి, విద్వత్
శ్రేణికి సత్కారమ్మిది
బాణికి, గురుడౌ పినాక పాణికి చెందున్


త్యాగరాజ ఆరాధనల్లో నూకల వారితో ఫొటోల్లోని వారు

(1) శ్రీ చింతలపాటి కాశీ విశ్వనాథ శర్మగారు (మా మామగారు)
(2) శ్రీమతి శారద గారు (నూకల వారి శిష్యురాలు, మా అత్తగారు)
(3) శ్రీమతి శ్రీవల్లీ లావణ్య (నా శ్రీమతి)
(4) వటపత్రమ్మీద త్యాగరాజులు (నా గీత)

నూకల వారితో
మరిన్ని రాతలూ, మరికొన్ని గీతలూ తర్వాతి టపాలో ...........

Saturday, February 14, 2009

సౌందర్య లహరి - స్ఫూర్తి -2

శ్లోకం.
అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీప నగరీ
జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ
దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ
నిమగ్నానాం దంష్ఠ్రా మురరిపు వారాహస్య భవతి !!

పద్యం.
అరిషడ్వర్గ మదాంధకారమును పారంద్రోలు మార్తాండమున్
పరమున్ జూచు అచేతనాళికి మరందానంద నిష్యందమున్
శరణున్ గోరు భవాబ్ధి మగ్న జనునుధ్ధారించు దంష్ఠ్రంబునౌ
వరలక్ష్మీప్రద పాదరేణువులు చింతల్దీర్చి సౌఖ్యమ్మిడున్ !!

Thursday, February 12, 2009

కొంటె కృష్ణుడు -స్ఫుర్తి - 2



గోకులం లో రాత్రి ఒక ఇంట్లోకి ఒక పిల్లి చొరబడింది ట. చప్పుడు చెయ్యకుండా వంటింటికి వెళ్ళి, కళ్ళు మూసుకుని పాల కుండ లో పాలు తాగుదాం అనుకుంది ట. నాలుకకి పాలు తగల లేదు. కళ్ళు తెరిచి చూసేసరికి కుండ ఖాళీ గా ఉంది ట. ఇదేమిటబ్బా అనుకుంటూ వెనక్కి చూసే సరికి అక్కడ ఒకావిడ దీనికేసి అనుమానం గా గుడ్లురిమి చూస్తోంది ట. అయ్యొ అదెమిటి? నేను ఇంకా ఏమీ చెయ్యందే.. ఈవిడ నన్ను అనుమానిచ్చెస్తోంది? అని అటూ ఇటూ చూసిందట. ఆప్పుడే తలుపు చాటున ఒక తెల్ల మీసాల పిల్ల వాడు కనిపించాట్ట. అప్పటికి గానీ అర్ధం కాలేదు.. ఎంత పెద్ద గోతిలో పడిందో.. వార్నీ.. ఎంథ పని చెశాడు? ఆ పిల్ల వాడినే చెవి మెలేసి రోటికి కట్టింది ఈవిడ. అల్లంటిది, వాడికి లేకుండా పాలు నేను తాగేను అని కనక అనుమానించిందంటే ఇంక నా పనేం గానూ...అని ఒకటే ఇది అయిపోతోంది ట. దానిని చూసి ఆ పిల్ల వాడు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాట్ట.
పద్యం
బాలుడు చెప్పడాయె ! తన భావము మాతకు తెల్వదాయె ! ఆ
పాలును లేకపోయే ! అనుమానము మాత్రము నిల్చిపోయే ! మా
ర్జాలమునౌట నాదు అపరాధమటంచు తలంచు పిల్లినిన్
లీలగా జూచి నవ్వు మధు సూదనుడిచ్చుత సర్వ సంపదల్ !!


పద్య స్ఫూర్తి

ఈ క్రింది తిరుపతి వెంకట కవుల పద విన్యాసం నచ్చి అనుకరిస్తూ రాశా అని అనుకుంటున్నా.. (యతి మైత్రి విషయం దక్క....)

వేసవి డగ్గరాయె ! మిము వీడుటకున్ మనసొగ్గదాయె ! మా

వాసము దూరమాయె ! బరవాసము చేయుట భారమాయె ! మా

కోసము తల్లిదండ్రులిదిగో యదిగో యని చూచుటాయె ! వి

శ్వాసము కల్గి వే సెలవొసంగిన పోయెదమింక భూవరా !!

Sunday, February 8, 2009

సౌందర్య లహరి - స్ఫూర్తి -1


శంకర భగవత్పాదుల సౌందర్య లహరి శ్లోకానికి స్ఫూర్తి పొంది నేను రాసిన తెలుగు పద్యాన్ని మన్నించగలరు (అనువాదం కాదు సుమా...)

రాముడూ స్ఫూర్తి అని నేను రాస్తున్న టపాల లో మధ్య ఇది రాయటానికి వెనుక రెండు కారణాలు ఉన్నాయి.

(1) తెలుగు తేజం రాఘవ గారి బ్లాగ్పఠనం తో నాకు నిన్న రాత్రి జాగరణ అయ్యింది. ఆయన రాసిన పద్యాలు రామానుభూతి కై, రామ దర్శనార్థమై పరితపించే 'నాదు జిహ్వకున్ పానకమయ్యె '. వారి భక్తి, వాక్పటిమ నాలో స్ఫూర్తి కలిగించాయి. వారికి అనేకానేక నమస్సులు. ఇక్కడ ప్రస్తావిస్తె పులిని జూసి నక్క వాత పెట్టుకున్న చందం గా ఉంటుందేమో ... కానీ .. ఆయన అంధ్రీ కరణ పద్యాలు చదివి ఉత్సాహం ఉరకలెత్తింది. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు కదా.. అందుకే దూకా..(తప్పో ఒప్పో నేర్చుకోవచ్చు కదా చిన్నవారైనా విద్యాధికులైన వారి వంటి వారి నుండి అని...)

(2) నా మిత్రులు నీ టపాల్లో రాముడు మంచి బాలుడు అనే కోవకెనా ఇంకేమైనా కూడా ఉంటయా? పైగా కృష్ణుడి బొమ్మ పెట్టావు రాముడి గురించి రాశావు .. అని భీష్మ ఏకాదశి నాడు అడిగినప్పుడు నేను ఎప్పటికీ నా హృదయ రాముడు రాముడే.. స్మిత వక్త్రో మితా భాషీ పూర్వ భాషీ కదా..(I feel, I am some how obsessed with Rama) అందుకే నా దృష్తి లో రాముడు ఎప్పటికీ మంచి బాలుడే. కృష్ణుడు కొంటె కోణంగె. ఇద్దరూ నా హృదయ నాథులే అయినా రాముడంటే ఒక సాఫ్ట్ కార్నర్.

అయినా ఆ అపవాదు మాత్రం ఎందుకని కొంటె కృష్ణుడి గురించి కలిగిన ఒక భావం రాశా. (ఇది చిరంజీవి శ్రీమాన్ రాఘవ గారికి ఆశీస్సులు గా భావించి రాస్తున్నావారి అమ్మ పద్యాలకి ముగ్ఢుణ్ణై ... 22 ఏళ్ళ చిరుత ప్రాయము వారు అనుకుంటూ...)

నా బ్లాగు పేరు లోనే సూచించినట్టుగా నేను ఈ పద్యాల 'రాత ' బడిలో ఎల్.కే.జీ. చదువుతున్న చిన్న పిల్ల వాడిని. ఎప్పటి లాగా నే యతి నియమోల్లంఘన ను పెద్ద మనసుతో క్షమించెయ్యండి. మంచి పద్యాలు కొంచం కొంచం గా ప్రత్నించి తొందరలో నే నేర్చుకుని, రాసే ప్రయత్నం చేస్తా..


సౌందర్య లహరి శ్లోకం.

शरज्ज्योत्स्ना शुध्धाम शासियुत जटा जूट मकुटाम

वरत्त्रसत्त्राण स्फटिका घटिका पुस्तक कराम

सक्क्रुन्नात्वा नत्वा कथमिव सतां सन्निदधते

मधु क्षीर द्राक्षा मधुरि मधुरीणा: परिणत:


సౌందర్య లహరి శ్లోకం.

శిర మకుటంబు చంద్రుడు శరదృతు వెన్నెల దేహకాంతి ! శ్రీ

కరముల పుస్తకంబు వరదాభయముల్ స్పటికాక్ష మాలయున్

వర ధరియించి మ్రొక్కిడిన వారికి పాలును, ద్రాక్ష, తేనియున్

వరముగ వాక్కు నందు నిడు తల్లి కృపన్ గను నెల్లవేళలన్ !!


ఇక కొంటె కృష్ణుడి విషయానికొస్తే..

గోకులం లో పిల్లల అల్లరి ఎక్కువయ్యింది ట. ఆందరూ చాడీలు చెబుతూంటె ఇక లాభం లెదు అని తల్లి అనుకుందిట.


ఫద్యం.

బాలుని పట్టి తెచ్చి నొక రోటికి గట్టె యశోద ! బాలుడున్

కాలు కదల్చనెంచి నొక వేలును చూపగ తల్లడిల్లుచున్

మాలిమి తోడ బల్కె "మము గాచుటకున్ గిరి నెత్తినట్టి నీ

కేలుకు రక్ష శ్రీ హర"ని, అట్టి యశొదయె మీకు రక్షగన్ !!


అల్లరి పిల్ల వాడు చిటికిన వేలు చూపిస్తే ముడి విప్పేస్తుంది కదా అని తప్పించుకో జూచాట్ట. ఆవిడకి మాత్రం ఎంత పెద్ద కొండని మోసేసాదో నా బంగారు కొండ, ఎంత కష్టమయ్యిందో అని ఎప్పుడూ బుగ్గలు ఒత్తుకుంటూ అనుకుంటూంటుంది ట. అల్లాంటిది పిల్లవాడు వేలు చూపెట్టగానే.. ఇక పరుగు పరుగున వచ్చి కౌగలించుకుని "అయ్యొ వెర్రి నాగన్నా... నీకు నెప్పి ఇంకా తగ్గలేదా నాయనా ' అంటుందిట. అప్పటి దాకా వాడు చేసిన అల్లరి అంతా హుష్ కాకి.....అంతటి ప్రేమాప్యాయతలు ఒలకబోసే తల్లి యశోద మీకు రక్ష యగుగాక. !

చిన్న పాటి వివరణ.

పిల్ల వాడిని రోటికి కట్టింది చిన్నప్పుడూ, గోవర్ధన గిరి నెత్తింది కొంచం పెద్దైన తర్వాత కదా అని ఎవరికైనా సందేహం కలగచ్చు. పోతన గారు కృష్ణుణ్ణి యశోద ఒక్క సారి మాత్రమే కట్టింది అని చెప్పలేదు కదా.. కృష్ణుడు తర్వాత ఎప్పుడైన అల్లరి చేసి ఉంటె చెవి మెలేసె కూడా ఉండచ్చు.