Showing posts with label అవీ-ఇవీ. Show all posts
Showing posts with label అవీ-ఇవీ. Show all posts

Saturday, March 24, 2012

బ్లాగ్ కవులతో సద్గోష్ఠి @ Hyderabad


నందన నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని దివ్య కళాంజలి (మా అపార్ట్ మెంటు) లో సాయంత్రం 5 గం.ల నుండి పద్య కవి సమ్మేళనం ఏర్పాటు గావించబడినది.

శ్రీ చింతా రామకృష్ణారావు గారు "చిత్ర కవిత్వము" పై,
శ్రీ భైరవభట్ల కామేశ్వరరావుగారు " తెలుగు కవుల వాగ్విలాసము" పై ప్రసంగించనున్నారు

ఆసక్తి కలవారందరూ ఆహ్వానితులే 


Saturday, February 25, 2012

బ్లాగ్వినువీధిలో రవి మార్కు ప్రచండత ఇంకా కనిపించదేం?

మా హైద్రాబాదులో ఎండా కాలం వచ్చేసింది, వసంతం వచ్చేవేళ కూడా అయ్యింది కానీ ఎందుకో ... అయినా ప్రచండుడి పత్తా లేదు..సాహిత్యంలో కవ్వింపులు, చదివింపులూ అవుతున్నా ఎక్కడా సడిలేదు...ఎందుకో ఏమో అంటూ రంగం సినిమా సాంగేసుకున్నా ఆన్సరులేదు. ఎందుకంటారు???


Tuesday, October 18, 2011

కాటుక కంటి నీరు...


బ్లాగ్మిత్రులు కామేశ్వరరావు గారు "తెలుగు పద్యం" లో ఇటీవలి కాలంలో సాహిత్యావలోకనం చేస్తూండగా తనకెదురైన ఒకానొక సంఘటనకి కలత చెంది ఒక చిన్నటపా పెట్టగా దానిలో చర్చ "కాటుక కంటి నీరు" పద్యం మీదకి వెళ్ళడం (అది పోతన గారి రచనా కాదా అనే విషయంలో), నాణేనికి రెండువైపులా సమమైన వాదన ఉండడంతో ఆ చర్చని అంతటితో సమాప్తి చేద్దామన్న ఒడంబడికకి రావటం జరిగింది. ఐతే అదేవిషయమై నిన్ననే ఇంకొక వివరణ చదవటం చేత దానిని అక్కడే చర్చించి మాట తప్పటం కన్నా ఇంకొక టపాగా ప్రకటించవచ్చనే ఉద్దేశంతో ఈ టపా...

ఆసక్తి కలవారు ఇక్కడ ఆ టపా చర్చను చదువవచ్చు.

"కాటుక కంటి నీరు" చాటువుకు ప్రస్తావన శ్రీనాథ కవి సార్వభౌముడు రాజులకు కృతినిచ్చి, ధన సంపాదన చేసి దారిద్ర్యము బాపుకొనమని పోతనకు ప్రబోధము చేసినట్లూ, అప్పుడు ప్రత్యుత్తరముగా పోతన భారతీ దేవితో పలికిన పద్యంగా ఈ పద్యరాజం ప్రశస్తమయ్యింది.

ఐతే నిడదవోలు వేంకటరావుగారు "పోతన" అనే గ్రంథం లో ఈ క్రింది విధంగా వివరణనిచ్చారు
"ఇందు పేర్కొనిన మువ్వురూ (కర్ణాట, కిరాట, కీచకులు) శ్రీనాథునికి సంబంధించినవారే !


కర్ణాట రాజు:- శ్రీనాథుడు కర్ణాట రాజగు ప్రౌఢదేవరాయల ఆస్థానమున, ముత్యాలశాలలో కనకాభిషేక మహా సత్కారమును గాంచినవాడు - కర్ణాట క్షితినాథ మౌక్తిక సభాగారాంతరాకల్పిత స్వర్ణ స్నాన జగత్ప్రసిధ్ద కవిరాట్టు" నని చెప్పుకున్నాడు 


కిరాటులు:- కిరాటులనగా వైశ్యులు. శ్రీనాథుడు తన హర విలాస ప్రబంధమును, కాంచీ పురవాసి యగు అవచి దేవయ సెట్టి పుత్రుడగు తిప్పయ శెట్టికి గృతినిచ్చియున్నాడు. చిఱు తొండనంబి ని వర్ణిస్తూ శ్రీనాథుడు "కోటికిన్ పడగనెత్తిన నక్కిరాట వంశ కిరీటాలంకారంబు. 2-34" అని చెప్పి యున్నాడు


కీచకులు:-  ఈ పదము వలన శ్రీనాథుడు చెప్పిన పల్నాటి వీర యుధ్ధ కథ సూచితమైనది. పల్నాటి వీరచరిత్ర ప్రశస్త దేశికృతియైనను హీనజాతి వారి కోరిక పైన రచించినదే కదా. 


శ్రీనాథుడీవిధముగా మువ్వురవలన వారికి కృతులనిచ్చి గాని, కవితా సమ్మాన రూపమున గాని ధనమునార్జించినట్లుగా, త్రిశుధ్ధిగా తానట్టి పనులు చేయనని భారతి దేవితో విన్నవించాడు"  

ఈ పద్యం చాటువు కనుక, అప్పటి దేశకాల రీతులు, జరిగి ఉండవచ్చునన్న కథాంశమూ నిజమే అయితే, ఈ వివరణ దానికి ఊతమిచ్చేదే కనుక అయినట్టైతే అది పోతన రచన కాకపోయుండవచ్చన్నది నా అభిమతం
శారదా పుత్రుడు, బ్రహ్మ దత్త వరప్రసాదుడైన శ్రీనాథుణ్ణి పరోక్షం గా నిరశిస్తూ వాగ్ఞియమాన్ని పాటించే భాగవతోత్తముడైన పోతన పలికి ఉండడన్నది నా భావానికి హేతువు.

Monday, September 12, 2011

రామాయణ కల్పవృక్షం అర్థం కావాలంటే ఏమేమి కావాలి?


"రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠం దక్కిందంటే అది ఒక మహాద్భుత రచన అయిఉండాలి. కనుక అది మనం కూదా చదవాలి" అన్న ఆలోచన తో మొదలయ్యింది ప్రస్థానం. పుస్తకం కొనుక్కుని చదివితే అర్థం అవదా అని ఒకప్పుడనిపించేది. తీరా కొనడానికి ప్రయత్నించేసరికి తెలిసింది అది పుస్తకం కాదని పుస్తకాలు అని. కొంపదీసి తక్కువ అంచనా వేశామా ఏమిటి అనిపించింది.

అదృష్టం కొద్దీ కొన్నేళ్ళు బజార్లో ఆపుస్తకాలు దొరక్కపోవటం వల్ల (లేదా ఎక్కడదొరుకుతాయో నేను సరిగ్గా తెలుసుకోకపోవటం వల్ల) కొంచం సమయాభావం అవ్వటం, ఆలోపు అక్కడక్కడ వ్యాసాల్లో, రచనల్లో రామాయణ కల్పవృక్ష ప్రస్తావన రావటం, నా అజ్ఞానం కొద్దిగా తగ్గి, ఆ కావ్యం పట్ల కించిత్ గౌరవ భావం పెరగటం, శ్రధ్ధ కలిగిన తర్వాత వెదకగా కోటీ లో ఒకానొక షాపులో బాలకాండం ఒక్కటీ దొరికిటం తో మలి అడుగు పడింది అనుకున్నా.

తీరా పుస్తకం కొన్నాకా నా పరిస్థితి "అనుకున్నదొకటి, అయ్యింది ఒకటి" అన్న చందంగా తయారయ్యింది. అప్పటికి నాకింకా పద్యాల పేరున పైత్యం రాయడం కలలో కూడా వచ్చి ఉండదు. మొత్తానికి ఏమైతేనే భాగవతం లో పద్యాలని చదువుకున్నాం కదా అట్లానే ఇదీ చదివేద్దాం. అర్థం అయిపోతుంది అనుకుంటూ మొదలెట్టా... గ్రీకు లాటిన్ అంటే ఏమిటో అనుభవ పూర్వకంగా తెలిసొచ్చింది. ఆదెబ్బకి రెండువిషయాలు అర్థం అయ్యాయి (అనిపించింది). ఒకటి -విశ్వనాథను పాషాణపాక ప్రభువనెందుకన్నారో. రెండు - కల్పవృక్షం చదువుదామన్న క్రేజే గానీ చదవటానికి, అర్థం చేసుకోటానికి నాకు అంత పరిపక్వత లేదని. ఆదెబ్బకి పుస్తకం మూసేసి అటకెక్కించేశా. విశ్వనాథ నవలలు తీశా.. బహు బాగా అర్థం అవసాగాయి. దాంతో ఒకటి తేల్చేసుకున్నా. పద్యాలు మనకబ్బవురా అబ్బయి అని. ఇది జరిగి దాదాపు పదహారేళ్ళు దాటి ఉంటుంది.

ఇంటర్లో సంస్కృతమయ్యాక మళ్ళీ ఎట్లా ఏర్పడిందో రుచి తెలియదు గానీ పద్యాలు కొంచం కొంచం అర్ధం అవసాగాయి.  దాంతో అటకమీదనుంచీ తీసి మళ్ళీ కొన్ని పదుల పద్యాలు చదివా. పోతనగారి ఎఫెక్టో, మన బుర్ర కెపాసిటీనో గానీ భారతం లో పద్యాలు గానీ, కల్పవృక్షం పద్యాలు గానీ అంతగా అర్థం కాలేదు. కాకపోతే ధారుణి రాజ్య సంపద మొదలైన పద్యాలు రాగాలాపనలో బాగున్నాయని కొన్నింటిని కంఠస్థ పట్టి కాలీజీలో కొంచం ఫోజు కొట్టా. అంతటితోనే సరి. మళ్ళీ పుస్తకాలు యథాస్థానం ప్రవేసించాయి. శొభనార్థే క్షేమాయ పునరాగమనాయచ అని కూడా అన్నా.. ఈ సారి.

అన్నట్టుగానే నాన్నగారితో అవధానాలకి వెళ్ళటం, సరదాగా ఉందనిపించటంతో పుస్తకాన్ని మళ్ళీ తీశా. ఈ సారీ అదే రిజల్టు. వయసు పెరిగినకొద్దీ అవగాహన కలిగి అర్థం అయిపోతుంది అని భావించానేగానీ అంతకుమించి సాధన ఏమీ చేయలేదు. ఇక దీనికీ మనకీ రామ్రాం అనుకున్నా. కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి గోదావైభవ కావ్యాన్ని, దాని రహస్యప్రకాశాన్ని చదివా. అద్భుతం అనిపించింది. ఇన్నాళ్ళుగా నేనెటువంటి అనుభూతికోసం ఎదురుచూస్తున్నానో అది దక్కింది అనిపించి. ఒక మూడేళ్ళు ఆపుస్తకాన్ని ఆసాంతం చదువుకుని ఆనందించాక బోయి భీమన్న గారిని అనుకోకుండా చదవటం నా పయనంలో ఒక అనుకోని మలుపు.

భద్రాచల యాత్ర రాముడి ఆత్మీయతని పరిచయం చేస్తే అసంకల్పిత ప్రతీకార చర్యగా భావాలు ఒక పద్యం లాంటి వాటితో రావడం ఇంకొక మజిలీ. తోచింది రాసి అబ్బో అని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నప్పుడు బ్లాగన్నదై పరిచయమవ్వడం. అప్పటిదాక నూతిలో కప్పమాదిరి ఉన్నవాణ్ణి ప్రపంచాన్ని తెలుసుకోవడం మరొకమజిలీ...దాని పర్యవసానం కొంచం వ్యాకరణం, చందస్సు నేర్చుకుని చదివితే రమాయణ కల్పవృక్షం అర్థం అవుతుందేమో అని కొంచం ఇంగితం కలగటం..ఆ దిశగా ప్రయత్నం చేయటం.....

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు ఏ జన్మ లో చేసుకున్న పున్నెమో మంచిపద్యం లో వడలి మందేస్వర రావుగారి గురించి తెలుసుకోవడం, ఆపై "ఇదీ కల్పవృక్షాన్ని ఆస్వాదించగలగటం" అటుపై మొన్నీమధ్య విశ్వనాథ పుస్తకాలని కొనడానికి వెళితే నా కష్టాన్ని గమనించి విశ్వనాథ వారే కరుణించారన్నట్టుగా "కల్పవృక్ష రహస్యములు" పుస్తకం దొరికింది.

తన కావ్యానికి తానే వ్యాఖ్యాన్నందిచారని తెలిసిన మరుక్షణం నా ఆనందనికి అవధులు లేవు. నన్ను కరుణించటానికే అని నేననటానికి గల కారణం విశ్వనాథ వారు ఒక్క బాలకాండకు మాత్రమే వ్యాఖ్యానన్నందిచారు. (దురదృష్టవశాత్తు మిగిలిన కాణ్డలకు వారి వ్యాఖ్యానం లేదు).

కల్పవృక్షమెందుకు అంతటి బృహత్తర రచనో తనమాటల్లో తానే వ్యక్తపరిచారు. ఎంతో అరుదైన భాష్యాన్నందిచారు. ఆ మహాకావ్యానికి వెనుకనున్న ఆలోచన, హృదయమూ, రచనా శిల్పం, అలంకారాలూ, నానుడులూ, విశేషాలూ, రహస్యాలూ తనంత తానుగా ఆవిష్కరించారు. ఆశ్చయకరమైన విషయమేమిటంటే ఇటువంటి పుస్తకం లిస్టులో అమ్మకానికి ఉందని విశాలాంధ్రవారు చెప్పలేదు, విశ్వనాథ మనవళ్ళవద్దనున్న కేటలాగ్ లో కూడా ప్రస్తావనలేదు, కానీ విమర్శ గ్రంథాల సెట్టు కొంటే దాన్లో ఈ పుస్తకాన్ని ఉచితంగా అందిస్తున్నారు (పాత పుస్తకం మాదిరిగా ఉంటుంది. స్టాక్ క్లియరెన్సులో భాగంగానో ఎమో).

విశ్వనాథ విమర్శ గ్రంథాల సెట్టు కొనుక్కోవడం నాకే తెలియకుండా నాకునేను చెసుకున్న గొప్ప సాహయమేమో అని అనిపించింది..

చదివావా అంటే చదివాననిపించుకోవటానికేముంది? ఒక్క బిగిన చదివేయచ్చు కానీ కల్పవృక్షం అర్థమవ్వాలంటే చందస్సు, వ్యాకర్ణము, నిఘంటువు వంటివి ఉంటే సరిపోదు, తెలుగు తెలియాలి, తెలుగుదనం తెలియాలి, తెలుగు సంస్కృతి తెలియాలి, ఆ తీయని మకరందాన్ని ఆస్వాదించే విధానం కూడా తెలియాలి అప్పుడే దాని హృదయం ఆవిష్కృతమౌతుంది అన్న నిజం నిఖార్సుగా తెలిసొచ్చింది. అసలైన తెలివొచ్చింది. మనసు నిండింది.

ఆల్రెడీ "ఇదీ కల్పవృక్షం" చదివినవారికి ఈ పుస్తకం ఇంకోక దర్పణం. విశ్వనాథని తెలుసుకోడానికి. పుస్తకంలోని మధురానుభూతులు..... మచ్చుక్కి కొన్ని [వారి వ్యాఖ్య నీలం రంగులో]

(1) పుత్రకామేష్టి సందర్భంగా అగ్నిదేవుడు రాజుచేతిలోపాయసము పెట్టే సందర్భములో వారి వ్యాఖ్యానము

ముదిపృదాకువు సెజ్జమునులు జోదిళ్ళీయ
హాళిమై గూర్కు సుమాళి యొకడు
ప్రామింకు చిట్టచివళ్ళలో నసురుల
దోరించునట్టి కటారి యొకడు
ప్రామఱ్ఱి క్రీనీడ బాఠమ్ము ముసలులౌ
మునులచే జదివించు పోఱడొకడు
పాలవెల్లి కరళ్ళపై వెలికింతలై
కాలివ్రేల్చీకెడు కందొకండు


పసిమియై గాలికిని రాలిపడిన యొక్క
నలుసు నివ్వరిముల్లైన వెలుగొకండు
స్థూలమై వచ్చి వచ్చి తా సూక్ష్మమగుచు
జనపతి కరస్థమగు పాయసమున జొచ్చె


(అ) పృదాకువు - సర్పము. ముది పృదాకువు - ఆదిశేషువు
జోదిళ్ళు- నమస్కారములు
ఆదిశేషువనే సయ్యపై మునులు నంస్కరించుచుండగా నిద్రపోవునొక యొయ్యారి. ఇతడు విరాణ్మూర్తి
(ఆ) ప్రామినుకు - వేదములు
ప్రామిన్కు చిట్తచివళ్ళు - వేదాంతములు. అక్కడ రాక్షసులను సమ్హరించు ఖడ్గధారి.
విరాణ్మూర్తికన్న ఈ ఖడ్గధారి తక్కువరూపముకలవాడు
(ఇ)ప్రాత మఱ్ఱి చెట్టుకింద వృధ్ధులౌ ఋషులచేత పాఠమ్ములను వల్లెవేయించీ పోఱడు- బాలుడు. ఇతని మూర్తి మరియు చిన్నది
(ఈ)పాలవెల్లి కరళ్ళపై క్షీరసముద్ర తరంగములమీద తన కాలి వ్రేలు చీకెడి కందు-పసివాడు.
(ఉ) మరల వరిముల్లంతవాడు
విరాట్స్వరూపంతో మొదలెట్టి తగ్గుతూ తగ్గుతూ వచ్చి రాజు చేతిలో పాయసంలో ప్రవేశించాడు. అంతటి స్వామి ఇంతగా అయ్యాడని అర్థం. పరమేశ్వరుడు అణోరణీయాన్, మహతోమహీయాన్ కద"

చెప్పదలుచుకున్న విషయాన్ని సాపేక్షికంగా, పథకం ప్రకారంగా (planned గా అని నా ఉద్దేశం).. భావప్రసక్తి చేయటం, పద్య రచన దానిని పరిపుష్ఠిచేయటం అందులోనూ  "జోదిళ్ళు", "ప్రామిన్కు చిట్టచివళ్ళు", "పోఱడు (తెలంగాణ యాస కూడానేమో)", కాలి వ్రేల్చీకెడు కందు" వంటి తెలుగు పదాల పోహళింపు మామూలుగా చదివేసుకుంటూ పోతే వాటి అందం సొబగూ, అర్థం ఔతాయా?
 
(2) రామయణంలో రామ జననమయ్యక ఒక పద్యముంటుంది. దానిని కనీసం ఒక 10 సర్లైనా చదివి ఉంటా. ప్రత్యేకంగా ఏమీ అర్థం కాక ముందుకి వెళ్ళిపోయా కుడా....

వెలికి గొనిపోకుడీ బిడ్డబిట్టలారు
సంజవేళల నంచు గౌసల్య పలుక
గరుడి వైకుంఠమున భయకంపితుండు
మడమలను ద్రొక్కుకొను ఱెక్క ముడుచుకొనుచు

దానికి వ్యాఖ్యానాన్నందిస్తూ "ఈ భాగమంతయూ తెలుగుల ఇండ్లలో పురుళ్ళు, పిల్లలు పెరుగుటలు వారినాడించుటలు, ఆ మహాశోభ ఉన్నది. వట్టి కావ్యకఠిన బుధ్ధులకుతెలియదు. అంతయు రసభరితముగానుండును. ఆ రసము జీవితమందున్నది. తెలుగుగృహములలోనున్నది. ఇచ్చటకవిచేసినది పద్యములు వ్రాయుట మాత్రమే. తెలుగు దేసములో నేడాదిదాటని పిల్లలను సాయంకాలమందు నారుబయతకు దీసుకొనిపోనీయరు. పిట్టలారునందురు. పూర్వము పసిపిల్లలకదియొక జబ్బువచ్చెడిది. అట్లు రామచంద్రుని గూర్చి ఎవ్వలైన ననగా గరుత్మంతుడు భయముతో తన ఱెక్కలను ముడుచుకొనెడివాడట" అన్నారు.

ఇలా ఎన్నెన్నో ఆణిముత్యాలను, చందో విశేషాలను, చారిత్రక రాజనీతి రహస్యాలను, తెలుగువారి ఆచార వ్యవహారాలను ప్రతిపాదిస్తూ తానుచేసిన బృహత్కావ్యానుగత  హృదయాన్ని విహంగవీక్షణంగావిస్తారు విశ్వనాథ.

పద్యరచనపై, అందునా కల్పవృక్షంపై మక్కువగలవారి ఇంట నీరాజనాలందుకోగల మేటి పుస్తకమీ "కల్పవృక్ష రహస్యములు". విశ్వనాథవారి జయంతిని పురస్కరించుకుని వారికి కృతజ్ఞతగా నా ఈ టప...

Tuesday, August 16, 2011

విశ్వనాథ సమగ్ర సాహిత్య గ్రంథావళి




వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరిసేట్టు గా రచించిన మహా కవి 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు; "కవి సమ్రాట్" బిరుదాంకితుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ.

ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును అటువంటి విశ్వనాథ వారి సమగ్ర సాహిత్య గ్రంథావళిని విశ్వనాథ వారి మనుమడు, విశ్వనాథ పావని శాస్త్రి గారి అబ్బాయి - విశ్వనాథ సత్యనారాయణ (బహుశా జూనియర్ అనాలేమో)  పునర్ముద్రణ గావించారు.

మంచి కాగితం పై మంచి ముద్రణతో పుస్తాకాలు అందుబాటులోకి వచ్చాయి.

(1) నవలలు - 57 పుస్తకాలు --> 4500/-  
(2) నాటకములు - 16 పుస్తకాలు --> 666/-  
(3) విమర్శ గ్రంథాలు - 11 పుస్తకాలు --> 1116/-  
(4) పద్యకావ్యాలు (రామాయణ కల్పవృక్షం తో కలిపి) --> 1500/-
(5) పాటలు, ఇతరములు (కిన్నెరసాని పాటలు మొ||)  --> 500/-

వెరసి మొత్తం 118 పుస్తకాలు  8282/- రూపాయలు.
డిస్కౌంటు పోనూ 7500/-

కవిసామ్రాట్ విశ్వనాథవారి అమూల్యమైన 118 పుస్తకములను కేవలం 7500/- రూపాయలకు   కొనుగోలు చేసుకుని ఇంటినీ, మన తెలుగు అభిరుచినీ, సాహిత్య పిపాసనూ కూడా పరి పుష్టి చేసుకోవచ్చును.

ప్రతులకు : జూనియర్ వి.స.నా. ఫోన్ నంబర్ : 9246100751 (లేదా) నవోదయ పబ్లిషర్స్ : 9247471362
....ఆలస్యం అమృతం విషం ....
త్వర పడండి