Showing posts with label కవి పరిచయం. Show all posts
Showing posts with label కవి పరిచయం. Show all posts

Thursday, January 27, 2011

పూరించిన (సమస్యా) శంఖం : శ్రీ కంది శంకరయ్య గారు


కంది శంకరయ్య గారికి పోలికలు చెప్పాలంటే "జగమెరిగిన బ్రాహ్మడు", "అలుపెరుగని బాటసారి". "నిత్య కృషీవలుడు" మొదలైనవి టపటపా వచ్చేస్తాయి. అన్నింటిలోకీ ఉత్తమమైనది మాత్రం "నిశ్శబ్ద విప్లవం".  నిర్మొహమాటం గా చెప్పాలంటే రెండొందలు పై చిలుకు సమస్యలనిచ్చినా ఇంకా ఆయన "కొత్త బిచ్చగాడే - పొద్దెరగడు". పండగలేదు పబ్బం లేదు, శనివారం లేదు ఆదివారం లేదు, సమస్యలు వస్తూనే ఉంటాయి. పూరించపోతే వెనకబడిపోతున్నామనే దిగులు పట్టుకుంటుందనటంలో అతిశయోక్తి లేదు.

ఈత నేర్చుకొనుట ఎట్లు? వంటి క్లాసులు తీస్కోకుండా ఎందరినో ఏట్లోకి దింపి, ఈత కొట్టించిన ఘనత, చెయ్ తిరిగిన ఈతగాడికి మల్లే ఫీట్లు కొట్టించిన ఘనత ఈయనదే. దిగితేనే ఈత వస్తుంది, మొదలెడితేనే రాయటం వస్తుంది. ఏదో భావాన్ని ఊహించుకుని రాసుకో అనటం వేరు. అది ఇంటర్మీడియట్, ఆపై చదువులాంటిది. అది కొందరికి అబ్బుతుంది. కానీ ఎంతోమందికి క్లాసు వర్కు, హోం వర్కు ఇస్తూ నేర్పవలసి రావచ్చు. జ్ఞానార్జన పెంచటం, సందేహాలనూ, దోషాలనూ తీర్చటం,  భాషణలెక్కువ ఇవ్వకుండా బాధ్యత తలకెత్తుకోవటం అందరికీ సాధ్యమయ్యేది కాదు.

ఒంట్లో బాగోలేకపోతే సమస్యాధార కి ఆటంకమౌతోందేమో అని చిన్నబుచ్చుకుంటారు. ఇంట్లో నెట్ లేకపోతే ఎక్కడో ఇంటర్నెట్ సెంటర్ లో కూర్చుని త్వర త్వరగా దిద్దుబాటులిచ్చేసి వెళ్ళిపోతారు. అడగనివాడిది వాడిది తప్పు అన్నట్టు అడిగిన ప్రతివాడికీ విద్యా దానం చేస్తునే ఉన్నారు, రాసిన ప్రతీ పూరణకీ స్పందిస్తారు. ఆత్మీయంగా హృద్యంగా పలకరిస్తారు. ఆడంబరాలకీ, భేషజాలకీ ఏమాత్రం తావివ్వని వ్యక్తిత్వం. అన్నీ వెరసి అన్నపూర్ణలా సుష్టుగా భోంచేయిస్తారు.

నిశ్శబ్ద విప్లవం కాస్త పెద్దమాటేమో అని అనిపించవచ్చు. అంత తెచ్చేసిన విప్లవం ఏముంది అని కూడా అనిపించవచ్చు. "నేను సైతం పద్య వీణకు కవులనే తంత్రులుగ జేస్తాను" అన్నట్టుగా చ్చిన్న చిన్న ఎక్షర్సైజులతో ఒక్కొక్కరిచేత ఇన్నేసి పద్యాలకు పూరణలు ఇప్పింపజేయటం మాటలా? బిందువు బిందువును జేరి సింధువగును అన్న దాశరథిగారి మాటలు వీరి కర్తవ్య నిర్వహణలో నిత్య సత్యాలు.

కెమిస్ట్రీ చదువుకునేటప్పుడు కేటలిస్టు అన్నది ఒకటి ఉంటుందనీ, రసాయనిక చర్యలలో దానంతట అది ఏమీ చెయ్యదు కానీ దాని సాన్నిధ్యమే చెయ్యాల్సినది చేసేస్తుందనీ చిన్నప్పుడు చదువుకున్నం. ఇప్పుడు అనుభవం తో నేర్చుకుంటున్నాం
 
ఎన్టీవోడికున్నంత ఫాన్ ఫాలోయింగు రేలంగికి ఉండకపోవచ్చు. కళామతల్లి సేవలో వారి స్థానం వారిది. కవిత్రయాన్ని, పోతననూ, విశ్వనాథనూ వివరింపకపోవచ్చు కానీ తెలుగు సాహిత్య సేవలో శంకరైయ్య గారి స్థానం వారిది.

నన్ను ప్రభావితం చేసిన వ్యక్త్యులలో శంకరయ్య గారొకరు. వారికిదే కృతజ్ఞతా పూర్వక నమస్కృతి

స్పందనమును నేర్పి పద్యాలు కూర్పించి
పూరణమ్ము లిచ్చె పుణ్య మూర్తి
ఏమొసంగగలను? ఈ పద్య పుష్పమ్ము
కంది శంకరయ్య కంద జేతు

లంకె : http://kandishankaraiah.blogspot.com/

Tuesday, December 14, 2010

విష్ణు సహస్ర నామ శతకాలు

అదేమిటి? ఇదేదో అప్పుతచ్చు లాగా ఉందే అనుకుంటున్నరా?

"విష్ణు సహస్ర నామ"మని చెప్పి వాక్యమును పూరింపుము అనగానే ఎవ్వరైనా "స్తోత్రం" అని ఠక్కున సమాధానమిస్తారు. నేనూ అలాగే అనుకునేవాణ్ణి "బాలకవి", "శతావధాని" శ్రీ సంపన్ముడుంబ సింగరాచార్యులవారి కృతి గురించి తెలియనంత వరకే.

శంకర భగవత్పాదులు, మధ్వాచార్యులు, పరాశర భట్టరులు, భగవద్రామానుజులు, కంచి పరమాచార్యులు,కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు మొ. ఎందరో మహానుభావులు ఈ స్తోత్ర రాజానికి భాష్యాన్నందించారు.

శ్రీ సంపన్ముడుంబ సింగరాచార్యులవారు  భగవద్గుణ ప్రతిపాదకములైన ఈ అనర్ఘమైన గ్రంథరాజానికి  పద్య వ్యాఖ్యానం అందించారు అదీ "నీవే గతి కృష్ణా దీనచింతామణీ" అనే మకుటంతో దశ శతకాలుగా....అంటే ఇది విష్ణు సహస్ర నామ స్తోత్ర పద్య సాహస్రం. అందులోనూ వ్యాఖ్యాన సహితం గా....

ఆంధ్ర దేశంలో పావన కృష్ణాతీరం లో జగ్గయ్యపేట ధనాచలం ప్రసిధ్ధ శ్రీవైష్ణవ క్షేత్రం. ఇక్కడి శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధి అపర శ్రీరంగం వలే భాసించింది. అలనాటి సుప్రసిధ్ధ నల్లాన్ చక్రవర్తుల, సంపన్ముడుంబై, మరింగింటి వంశస్థులు ఈ స్వామి వారికి కైంకర్యం చేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలురుగా వన్నెకెక్కారు. సంగీత-సాహిత్య గోష్ఠులూ, అవధానములూ, చందనగోష్ఠులూ, తదీయారాధనలూ వెరసి "ఆ నిష్థా నిధి గేహసీమ.." అని ఆముక్తమాల్యదలో వర్ణించినట్టు శ్రీవైష్ణవ సిరి ప్రకాశించింది.

అట్లాంటి శ్రీమధ్ధనశైల సీతారమచంద్రులవారు శ్రీ సంపన్ముడుంబ సింగరాచార్యులవారి కులదైవం. ఆ ఆలయంలో అష్టోత్తరశత శిలాస్తంభ మహామంటపం ప్రతిష్ఠించిన మహోత్సవ సమయంలో తమ కులదైవం అనుగ్రహంగా ఒక్కొక్క నామానికీ ఒక్కొక్క పద్యం రచించాలని సంకల్పం కలగటం, శార్దూల, మత్తేభ విక్రీడితాలతో (వాటిలో ఇమడని నామాలను అదనం గా గీత, కందపద్యాలలో) రచించారు. వారు రచించిన కృతులలో  సంస్కృత భాగవతానుసారము "శ్రీభాగవతం", శ్రీ హరి శతకం, భ్రమర గీత, అవధూత గీత, భిక్షు గీత, శ్రుతిగీత, గోపికాగీత, రుద్రగీత మొదలగునవే  కాక సాత్రాజితీ పరిణయం, రుక్మిణీ కల్యాణం, ప్రహ్లాద చరితం మొ|| హరికథలూ ఉన్నాయి.

దీర్ఘ సమాస సమన్వితమైన పద్యాలనెంత హృద్యంగా రచించారో సరళతరమూ, అలంకారశొభితమూ అయినపద్యాలనూ అంతే రమ్యం గా రచించిన విద్వత్కవి శ్రీ సంపన్ముడుంబ సింగరాచార్యులవారు.

నాకు బాగా నచ్చిన ఈ సాహిత్య సేవను మీకూ పరిచయం చేద్దామని చిన్న కోరిక. వారి పద్యాలలో కొన్ని....

స్ఫారత రాగ సంకలిత జన్మజరామరణాది రూప సం
సార మహాసముద్ర శత సంగత దుఃఖ తరంగ పంక్తి బి
ట్టూరక ఈడ్చి కొట్టగడు నుక్కిరిబిక్కిరియై నరుండు త
త్తారక నామమున్ నుడివి తత్ క్షణమందు విముక్తినందెడున్

అభయాత్ముండన నొప్పుచుండుదువు నీవశ్రాంతమున్! కేవలా
నుభవానందమయ స్వరూపగుడవెందున్ నీకు నీ భూత భ
వ్య భవద్భూతచయంబు శేషమగుటన్ భాసిల్లెడిన్ "భూత భ
వ్య భవత్ప్రభ్వ"భిధాన మీవెగతి కృష్ణా ! దీన చింతామణీ !!

ఘనకారుణ్య సుధా తరంగములు పొంగం గాంక్షితార్థంబులున్
దనరన్ జేయుచునెట్టి యాపదయు జెంతంజేరనీ కర్మిలిం
గనుచున్ భారము బూని భూతవితతిన్ గాపాడుతన్ "భూతభృ
త్త"ని చెప్పంబడుచుండు నీవెగతి కృష్ణా ! దీన చింతామణీ !!

త్యక్తాన్య స్పృహులూర్జితాత్మ కులవిద్యా బంధ నిర్ముక్తులౌ
భక్త శ్రేష్థులకున్ నిరంతరము ప్రాప్య స్థానమై యొప్పుటన్
"ముక్తానాం పరమా గతి" స్త్వ మనుచున్ భూషించి భాషించు నా
సక్తిన్ వైదికవాణి నీవెగతి కృష్ణా ! దీన చింతామణీ !!

నీ రూపంభును నీ గుణ ప్రకరమున్ నీయద్భుతైశ్వర్యమే
పారున్ వాఙ్మనసాతి భూములగుచున్ స్వాత్మానుభూతిన్ మహో
దారున్ సూరలకిచ్చుటం "బురుష" శబ్దంబొక్క నీ యందు న
న్యారూఢంబుగ మెప్పు నీవెగతి కృష్ణా ! దీన చింతామణీ !!

పిడకలవేట: టపాల్లో మొత్తనికి అటుచేసి ఇటుచేసి హాఫ్ సెంచరీ అయ్యిందనిపించానోచ్చ్... అయితే ఉపయోగపడినవెన్నో అని అంతే మాత్రం...తత్తత్తా మెమ్మెమ్మే....