మఱ్ఱియాకు పైన మఱులు గొల్పుచు గాలి
వ్రేలు చప్పరింతువేల ? దల్లిగర్భమందు నీదు గాల్జేతులాడించు
వేళ నొచ్చె నేమో వ్రేలు, గనగ
నీటిమీద దేలు నీకెట్లు దినిపింతు
బువ్వ యనుచు నడుగ నవ్వ సాగె
చీకగానె వ్రేలు నాకలంతయు దీరె
గంగ ఊరెనేమో కాలి నుండి
అన్నమయ్య మిమ్ము నట్లేల కీర్తించె
చిలిపి ఊహ గలుగ దెలిసె నాకు
ఎంగిలయ్యెననుచు నెంచెనేమొకొ బ్రహ్మ
కడుగ సాగె పాద కమలములను
అట్టి పాదయుగ్మమర్చించుకోనిమ్ము
ముక్తి గిక్తి వలదు మోహనాంగ
నీదు పాదయుగళి నిత్యమ్ము సేవించు
వరమునిమ్ము మార్గ శిరమునందు !!
అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
(బొమ్మలు అంతర్జాలం లో సేకరించినవి)






