Monday, September 7, 2009

మా బుడుగు కవితోపాఖ్యానం



ప్రతి రోజూ ఉదయం ఏవో శ్లోకాలూ, పద్యాలూ చదువుతూ మా బుడుగుని నిద్ర లేపటం మా ఆవిడకీ, పడుకునేటప్పుడు పద్యాలు చదివించుకుంటూ పడుకోవటం నాకూ అలవాటు. మా నాన్నగారు మాతో అలాచేస్తూండేవారు.

ఆస్ట్రేలియా కాలమానానికి ఊడిగం చలవా అని,బ్రాహ్మీ ముహూర్తం నుండీ నేనూ నా లాప్ టాపు బిజీ అయిపోయి, మా వాడిని నిద్ర లేపి చాల కాలమే అయిపోయింది. ఆ మధ్య డే లైట్ సేవింగు అయిపోయిన సందర్భంలో ఒకానొక శుభదినాన మావాడిని నిద్ర లేపే భాగ్యం నాకు దక్కింది, అదీ తెల్లవారి 7 దాటినతర్వాతే. మెలకువ వచ్చేసినా ఇంకా పక్క మీద దొర్లుతూనే ఉన్నడు. నిద్రలేమ్మా అని నేను యధావిధిగా సుప్రభాతం మొదలెట్టా.

వాడు కళ్ళుమూసుకునే 'నేన్చెప్తా..నేన్చెప్తా ' అని అందుకున్నాడు.

"లావణ్యా సుప్రజా సనందన్ పూర్వా సంధ్యా ప్రవర్తతే !
ఉత్తిష్ఠ 'బుల్లి శార్దూలా' కర్తవ్యం దైవమాహ్నికం. "

హాశ్చర్యపోయా నేను. కౌసల్య కి బదులు లావణ్య అనటం కాదు నరశార్దూలా కి బదులు బుల్లి శార్దూల అనటం నాకు నిఝ్ఝంగా హాశ్చర్యాన్నే కలిగించింది - బహుశా మా ఆవిడ నేర్పించి ఉంటుందేమో అనుకున్నా.

అంతకంటే షాకు తర్వాతి పద్యంలో ఇచ్చాడు.

ఉత్తిష్ఠోత్తిష్ఠ 'పండమ్మా' ఉత్తిష్ఠ 'కన్నవాడు '
ఉత్తిష్ఠ 'అల్లరి బుంటీ' త్రైలోక్యం మంగళం 'కురు కురే'.

షాకుకి కారణాలు రెండు.
(1)వీడికి ఇల్లా మార్చుకోవటం ఎల్లా తెలుసా అని.(వాడి అసలు పేరు కృష్ణ సనందన్. అయితే అక్కడ వాడినవన్నీ వాణ్ణి తనూ, మా అమ్మ, నేను పిలిచే ముద్దు పేర్లు)
(2)ఆఖర్లో కుర్కురే అన్నాడేంటి అని.

నేనింక ఉండబట్టలేక అడిగేశా 'ఎవరు చెప్పార్రా నీకిది అని '. నేనే చెప్పా అన్నాడు. నమ్మకం కుదర్లే. మా ఆవిడని అడిగా. విషయం విని తను నాకన్నా బోల్డంత హాశ్చర్యపోయింది. వచ్చి ముద్దులు పెట్టేసుకుంటూంటే అడిగా వీడికి మీనింగు ఎవన్నా నువ్వు చెప్పావా అన్నా.. 'అవునూ అంది. వాడు మీనింగు అడిగితే గోవిందా అన్నా, గరుడధ్వజా అన్నా, కమలాకాంతా అన్నా అన్నీ వెంకటేశ్వర స్వామి పేర్లే అని చెప్పా అంది. వాడికి వాడు అన్వయించుకోవటం ముచ్చతేసింది.

మరి ఆఖర్లో కుర్ కురే ఏమిటి అన్నా.. ఏమో అది నాకు తెలీదు అది మాత్రం వాడి పైత్యమే అంది.

ఈ పద్యం మీనింగు ఏంటి నాన్నా అన్నా..వాడు మూతి బాగా తిప్పుతూ అన్నాడూ..
"అమ్మ, నాన్న, బామ్మ సనందన్ ని నిద్రలేపుతున్నారూ.. తెల్లారిపోయిందీ...సూర్య భగవానుడొచ్చేశాడూ.., లేచి కుర్కురే తిందువుగాని లే అని అంటున్నారూ " అని.

మనీ సినిమాలో బ్రహ్మానందం స్టైల్ లో కిందపడి కొట్టుకోవటం ఒక్కటే తరువాయి నాకు.

10 comments:

Hima bindu said...

very cute

sunita said...

enta telivaina vaaDu. God bless him!!!

సుభద్ర said...

bhale bhale...inkaa bagaa time tisukuni nerpandi ,meevaadu inka inka nerchukumtaadu.

కొత్త పాళీ said...

so precious.

Sanath Sripathi said...

చిన్నిగారు, సునీతగారూ, సుభద్రగారూ, కొత్తపాళీగారూ ధన్యవాదాలు.

కామేశ్వరరావు said...

భేష్! భేష్! ఇంత చిన్నప్పుడే ఆ శ్లోకంలోని re-usable భాగాన్ని గుర్తుపట్టేసి దాన్ని ఎలా customize చెయ్యాలో చక్కగా కనిపెట్టేసేడంటే, అతి చిన్న వయసులో సాఫ్ట్వేరింజనీర్ అయిపోయే లక్షణాలు కనిపిస్తున్నాయి :-)
బహుశా సంస్కృతంలో ప్రొగ్రాములు రాస్తాడేమో! :-)

రవి said...

అఖండుడిలా ఉన్నాడు. స్కూలు కెళితే, పక్కనెవరైనా అమ్మాయి పేరు కూడా, సంస్కృత పద్యంలో వాడుకుంటాడేమోనండి!

బాబు పేరు చాలా బావుంది.

Sanath Sripathi said...

కామేశ్వరరావుగారు, నెనర్లు.

మావాడు మాత్రం మాకుమల్లే సాఫ్ట్వేరు దరిదాపులకి రాకుండా ప్రశాంతంగా జీవిస్తే బాగుణ్ణు అని కోరుకుంటున్నామండీ బాబూ.

ప్రతీరోజు 20 కిలోమీటర్లు జనసంద్రాన్ని ఈదుకుంటూ వచ్చేసరికి రాత్రైపోతుంది. వాడితో సరైన టైమే గడపలేకపోతున్నాం. వాడు హేప్పీగా ఏ తెలుగుమాస్టారో, సంస్కృతంమాస్టారో అయితే సుఖం గా ఉంటుంది కదా అని ఆశ. అయినా పెద్దై వాడెమౌదలచుకుంటాడో?

రవిగారు, ధన్యావాదాలు. నాకున్న భయమల్లా పేరడీలు కట్టి ఏడిపించటం గానీ స్కూలు లెవల్లోనే మొదలెట్టి మా దుంపతెంచుతాడేమో అని మాత్రమే.

Bhãskar Rãmarãju said...

బడికెళ్ళటం మొదలెడితే అన్నీ మర్చిపోతారేమో!! కాపాడుకోండి.
మావాడు తెలుగులో వాయించేవాడు మొన్నటిదాకా. ఇప్పుడు బడికి వెళ్తున్నాడు. జీసస్ సేవ్స్ అంటున్నాడు. తప్పులేకపోయినా, తెలుగుని నెమ్మదిగా పక్కకి నెట్టటానికి ప్రయత్నిస్తున్నాడు. మేము ఆ ప్రయత్నాలని అడ్డుకుంటున్నాం.
మీవాడికి అభినందనలు. మీకూనూ పిల్లాడికి నేర్పుతున్నందుకు.
:):)

ఊకదంపుడు said...

సంతోషమండీ సంస్కృతం తప్పక నేర్పించే ప్రయత్నం చేయండి.
భవదీయుడు
ఊకదంపుడు