Tuesday, January 12, 2010

సంక్రాంతి లక్ష్మీ, నీ ఎడ్డ్రస్సెక్కడ?


తేదీ మారి అప్పుడే గంటకుపైనయ్యింది.

కాలుష్యం కొంచం కునుకు తీసొద్దాం అని వెళ్ళింది గావాల్ను. రోడ్ల మీద సంచారం ఆట్టే లేదు. ఆలోచనలు నిర్మానుష్యం గా ఉన్న రోడ్డు మీద గంటకి 120 కిలోమీటర్ల వేగంతో రౌండ్లు కొడుతున్నాయి.

ఏదో తెలీని గుబులు... ఉస్సురని నిట్టూర్చా...... ఈ నిస్సత్తువ ఇవ్వాల్టిది కాదు. పండగ దగ్గరికొస్తూంటే, మనసంతా ఏదో తెలీని వెలితి..... పట్టుమని పది రోజులు కాలే. న్యూ ఇయర్ సంబరాలయ్యి. అయినా ఏదో ఆవేదన. ఆలోచనలు భారంగా ఉన్నాయి.

తెలుగువారి పండగ సంబరాలు వర్ణించాలంటే ఎందుకో సినిమాల్లోనూ, చిత్రకారుల బొమ్మల్లోనూ పల్లెటూరి అందాలే కనువిందు చేస్తూంటాయి. ఎందుకో.. ... ఒక అతిథి, ఒక మురారి, ఒక పెళ్ళి సందడి, ఒక కలిసుందాం రా.......చెప్పుకుంటూ పోతూంటే లిస్టు చాంతాడల్లే ఉంది....


కోకిలలూ, పిచ్చుకలూ, చిలుకలూ కిలకిలా రావాలు చేస్తూ సందడి చేసే ఇంటి పెరళ్ళు ఉంటాయనో, పాడిపంటలతో పచ్చటి వాతావరణం ఉంటుందనో...


దూడలూ, మేకలూ చెంగు చెంగుమని దూకుతూ ఆడుకోటానికి విశాలమైన లోగిళ్ళు ఉంటాయనో....

రంగు రంగుల రంగవల్లులు ఇల్లంతా వేసుకోటానికి వీలుగా ఉంటాయనో,

బసవన్నలూ, హరిదాసులూ... పిల్లకాలువలో ఈతలూ, గాలిపటాల పందేలూ, 25-30 మంది హాయిగా కింద కూర్చుని పిచ్చా పాటీ మాట్లాడుకుంటూ బంతి భోజనాలు చేందుకు వీలుగా ఉంటుందనో.. ఎందుకో...

బస్సుల్లో, రైళ్ళల్లో, పల్లెటూళ్ళల్లో ఎక్కడ చూసినా పండగ సందడే సండడి. నా చుట్టూ మాత్రం ఆవరించిన చీకటి... ఎందుకిల్ల???

పుండు మీద కారం చల్లినట్టు వివిధభారతి లో మల్లీశ్వరి పాట "ఊరు చేరాలి, మన ఊరు చేరాలి" అని. ఉన్నట్టుండి బ్రేకయి పోయా... వెక్కి వెక్కి ఏడ్చా...తేరుకోడానికి కనీసం అరగంట పట్టిందనుకుంట.....

చూసినవాళ్ళు నవ్వుతారని తెలుసు.. కానీ ఏం చెయ్యను? మీరేచెప్పండి?

అదో స్వాప్నిక జగత్తు అని అనిపిస్తూంటుంది...బ్రతుకీడ్చటానికి పట్టణాలూ...పండగలకి పల్లెటూళ్ళూనా??

పండగ దగ్గరకొస్తోందని పళ్ళు, పూలు, కొత్త బట్టలు, బంధువులు, మొదలైనవి అన్నీ సమకూర్చుకుంటూంటే మీ ఇంట్లో ఉన్నట్టుండి సందడి అంతా మాయం అయిపోయినట్టుంటే మీరు మాత్రం ఎల్లా ఉంటారేం? నా మానసిక పరిస్థితి అల్లానే ఉంది.

ఇంతకీ నేనెవరో గమనించారా? నేనే... మీ సిటీ ని. పండగ పబ్బాల సందడికై కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసే మీ పట్టణాన్ని. పండగలప్పుడు మాత్రమే గుర్తొచ్చే పల్లెటూరికి స్వయానా అక్కని. పద్దమనిషైన తర్వాతనుంచీ చెల్లెళ్ళివ్వగలిగే ఆనందం లో కనీసం నాలుగోవంతు కూడా ఇవ్వలేక్పోతున్నా అని తల్లడిల్లే మీ నగరాన్ని.

అందరూ ఆనందించే క్షణాలలో నాకు మాత్రమే ఎందుకింత శిక్ష?
(*) పొలం పుట్రా, నగా నట్రా అన్నీ తాకట్టు పెట్టి ఉద్యోగావకాశాలపేరుతో ఊరొదిలేసి రావటానికి అనవసరమైన అడియాశలు కలింగించాననా?
(*) తల్లిదండ్రులెలా ఉన్నారో పట్టించుకోడానికి క్షణం కూడా తీరిక లేని జీవితాన్ని అందిచాననా?..
(*) మొగుడూ పెళ్ళాం నాలుగు చేతులా సంపాదించుకుంటే ఆనందం దానంతట అదే వచ్చేస్తుందనే వితండవాదానికి ఊపిరులూదాననా?
(*) పక్కవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నా పొడుచుకుంటున్న్న నిలబడి చోద్యం చూడచ్చు లేకపోతే పట్టనట్టు మన పని మనం చూసుకోవచ్చు అనే ధోరణిని సమర్ధించాననా?
(*) మన పనిభారం మనదైనప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు, భార్యా పిల్లలూ అందరూ మననే అర్ధం చేసుకోవాలి, సర్దుకుపోవాలే కానీ వాల్లకంటూ ఇస్టాలూ, కోరికలూ ఉంటాయి అని గమనించుకోలేని వింత తర్కానికి ఊతం అందించాననా?
(*) నిరంతర పరుగు పందేరం లో సూర్యోదయాన్నో, చల్లటి సూర్యాస్తమయాన్నో ఆనందించి ఎంతకాలం అయ్యింది అని ఎవరైనా ప్రశ్నిస్తే ఒక వింత పశువుని చూసినట్టు చూసే అలవాటు చేశాననా?

ఎందుకు?

ఎందుకు నాకు ఈ శిక్ష? చెప్పండి? ఇవన్నీ చేసింది నేనా? నాకు మాత్రం మనసుండదా? అది మాత్రం ఆనందాన్ని కోరదా? మీరైనా చెప్పండి....

ఏం చేస్తే పండగ వాతావరణం మాఇంట్లోనూ తాండవిస్తుందో ...దయచేసి చెప్పండి. నేనూ మా చెల్లెళ్ళూ మళ్ళీ ఆ పాతరోజులలో లాగా ఆనందంగా జీవించే అవకాశం ఈ దగ్గరలో ఉందా? దయ చేసి చెప్పండి..

మీకెవరికైనా తెలిస్తే ఆ సంక్రాంతి లక్ష్మి ఇల్లెక్కడో ఎడ్డ్రస్సు చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి... కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకుంటా.. ప్లీజ్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~@@~~~~~~~~~~~~~~~~~~~~

ఈ సంక్రాంతికి మీ ఇంట పాడీ పంట ఇబ్బడి ముబ్బడి గా 'పొంగా'లని, రంగవల్లులతో ఇల్లు కళ కళ లాడాలని, కోకిల కుహు కుహూ రాగాలతో , హరిలో రంగ హరి అనే హరిదాసు పాటలతో, డూడూ బసవన్న ఆటలతో, పచ్చని తోరణాలతో మన ఇంట పండగ వాతావరణం సందడి చెయ్యాలని, సంతోషాన్ని ఇవ్వలేని ఆలోచనలని భోగి మంటల్లో వేసేసి, చిరునవ్వులతో తేలికైన మనసులు పై పైకి గాలి పటాల్లగా ఎగరాలని, క్లిష్ట పరిస్థుతులు చుట్టు ముట్టినా, ఆత్మ స్థైర్యం సడలక, చిరునవ్వులు జీవితాల్లో నిండాలని శుభాలు చేకూరాలని ఆశిస్తూ

సంక్రాంతి శుభాకాంక్షలతో .... మీ నగరి.

గమనిక:
(1) అన్యాపదేశంగా ఉన్నట్టు, నిందా స్తుతి అన్నట్టు చిన్న పిల్లలు ఉక్రోషంతో పితూరీలు చెప్పినట్టునిపిస్తోంది కదూ? ఔను మరి... ఎన్ని ఉన్నా పండగ హడావుడి రూటే వేరు కదా..... మీరు సరిగ్గానే అర్ధం చేసుకుని ఉంటారని ఆశిస్తున్నా.
(2) రాత - గీత లో ఈ సంక్రాంతి గీతలు నావే.

9 comments:

Sujata M said...

పండగ పూట అంత నిస్పృహ ఎందుకండీ.. ? మనం ఎక్కడ ఉంటే అక్కడే పండగ. హాయిగా - బంధు మిత్రులందరికీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పండి. కుటుంబ సభ్యులతో హుషారుగా గడపండి. మనసు ఉల్లాసంగా ఉంటే, ఆ మనసులోకే సంక్రాంతి లక్ష్మి వస్తుంది. రోజులు మారాయి. మనమూ మారాలి. చీర్ అప్ !

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు !

శరత్ కాలమ్ said...

Well Said.

మాలా కుమార్ said...

సంక్రాంతి శుభాకాంక్షలు .

చిలమకూరు విజయమోహన్ said...

మీకు మీ కుటుంబానికి భోగి పర్వదిన శుభాకాంక్షలు

webtelugu said...

Wats your rank in webtelugu topsites??

WEBTELUGU.COM the Telugu topsites directory

Hai friend add your blog/website to webtelugu.com and get more traffic for your site .Its a new telugu topsite directory .Your blog readers vote for your site also ... go and add your site herehttp://www.webtelugu.com/

రవి said...

మా బాగా సెప్పారు. సంక్రాంతి లక్ష్మి చిరునామా, నగర వీధుల్లో గల్లంతు! అసలు మన (భాగ్య)నగరమే గల్లంతయే పరిస్థితుల్లో ఉంది, విభజన వాదుల చేతుల్లో పడి. ఇక లక్ష్మి కూడానా!

మీ రాత, గీత రెండూ అదుర్స్.

మధురవాణి said...

మీ రాత-గీత రెండూ బాగున్నాయి :) మీకూ, మీ కుటుంబ సభ్యులకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

Sanath Sripathi said...

సుజాత గారూ, శరత్ గారూ, మాలా కుమార్ గారు, విజయ్ మోహన్ గారూ, రవి గారూ, మధురవాణి గారూ.. ధన్యవాదాలు.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

కామేశ్వరరావు said...

సనత్ గారు,

బొమ్మలు చాలా బాగున్నాయి. సంక్రాంతి శుభాకాంక్షలు!