Friday, February 19, 2010

మంచు కురిసిన (శివ)రాత్రి ...


మహాశివరాత్రి నాడు "లింగోద్భవ" సమయాన "మంచు" బిందువులు కురవటం పై నేను రాసిన పద్యం...

ఆలస్యంగానైనా నా శివరాత్రి పోస్టు..



కైలాసమ్మును జేరి భక్తి యుతులై కైవారముల్ చేసి ! "హే
ఫాలాక్షా, నటరాజ, పాహి" యనుచున్ భక్తాళి శ్రధ్ధాళులై
పాలున్, దేనె, ఫలోదకంబుల, దధిన్, భస్మాజ్యముల్, చక్కెరన్,
సాలగ్రామశిలాత్మకున్ శివునకున్ స్నానమ్ము గావింపగా
క్ష్మాలక్ష్మిన్ హిమవర్షమై కురిసె ద్రాక్షా పాక మత్తీర్థమున్ !!

అమెరికాలో రికార్డు లెవెల్లో మంచు తుఫాను (స్నో స్టార్మ్) వచ్చిందని మా ఆన్సైటు వాళ్ళు (డాలస్, కొలంబియాల్లో) చెప్పినప్పుడు సరదాగా రాసిన పద్యం...

స్ఫూర్తి:
(1) శివార్చనలో నమక చమకాదులతో అభిషేకానికి ముందు పంచామృత స్నానం, ఫలోదక స్నానం, ఆ తర్వాత శుధ్ధోదక స్నానం మంత్రాలు ఉంటాయి. కైలాసం లో శివుడికి వాటితో పాటు, భస్మాభిషేకం కూడా చేయగా ఆ పంచామృతమే భూమి పై మంచు వర్షమై కురిసింది అని భావన...
(2) "మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః" కాబట్టి ద్రాక్షా పాకం అని భావించా

శార్దూలాన్నాశ్రయిస్తే దానిమీద ఆవిడకూడా వస్తుందేమో కదా, కరుణిస్తుందేమో.. పద్యం మరీ అతుకుల బొంతలా కాకుండా ఉంటుందేమో అనిపించి అందులో కుస్తీ పట్టా...

ఇక్కడొక విషయం చెప్పాలి. ఇది నేను రాసిన రెండో శార్దూలం (మొదటిది భైరవభట్ల వారిచ్చిన భూతమ్మగుదాని బ్రీతిమతులై వీక్షించిరద్దేవతల్ అన్న సమస్యకి నా ప్రయత్నం.. పూరణ కాదు కాబట్టి...)

శార్దులంలో మనకు గురువులు చాలా అవసరం వుంటాయి. అందుచేత ద్రుతాల నెక్కువగా వాడుకోవాల్సి వస్తోంది, కరెక్టో కాదో తెలీదు కొన్నైతే ద్రుతము మీద ద్రుతము వేయాల్సి వస్తుందేమో అనుకునా..
నాకా... అంతర్జాలం లో (తెవికి, పద్యం.Net)చదువుకుని, పదాలు కూడబలుక్కుని, గణాలు లెక్కలు పెట్టుకుని రాయటం మాత్రమే వచ్చు. నా జ్ఞానం అంతంత మాత్రమే... అందువల్ల రాఘవ గారినీ, కామేశ్వర్రావు గారినీ కష్టపెట్టాననుకోండి... మొత్తమ్మీద (మహా)దేవుడి దయ వల్ల పద్యం బానే వచ్చినట్టు అనిపించింది.

ఇక మీరే చెప్పాలి....

పంచామృత స్నానం.. (ఫోటోల్లో)....

క్షీరేణ స్నపయామి


దధ్నా స్నపయామి


మధ్నా స్నపయామి


ఆజ్యేన స్నపయామి


శర్కరయా స్నపయామి


ఫలోదకేన స్నపయామి


భస్మ విలేపనం సమర్పయామి...


2 comments:

మాలా కుమార్ said...

చాలా బాగుంది .

Sanath Sripathi said...

ధన్యవాదాలు మాలాకుమార్ గారూ !!
sanath