Wednesday, March 24, 2010

శ్రీరామనవమి శుభాకాంక్షలు!


అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

రామ నవమికి నా 'గీత 'లు (ఒకటి భక్తుడిదీ, ఇంకొకటి భగవంతుడిదీ)


బోయి భీమన్న గారి "అశోకవనిలో రాముడు" పద్యాలలో ఇంకొన్ని ....


అశోకవనంలో రాముడు మొదటి భాగం ఇక్కడ
అశోకవనంలో రాముడు రెండవ భాగం ఇక్కడ

పది నెలలాత్మ నుంచుకుని, ప్రాణములన్ దనియించి, పెంచు కొ
న్నది కద సీత? దీర్ఘ విరహాముధి తీరి, తటమ్ము చెరుకొ
న్నది కద? ఎప్పు డెప్పు డను నాత్రము నే కులగోత్ర మడ్డు కొ
న్నదొ, రఘు రాము నిండు హృదయాన నెదో బడబాగ్ని రేగెడున్ !

సత్య మసత్య మంచెరుగ జాలదు లోకము, సర్వదా పర
ప్రత్యయ నేయ బుధ్ధి; అది వాలు నసత్యము వైపె నిత్యమున్;
సత్యము నమ్ము లోక మొక శక్తి పరీక్షనె; లోక ప్రీతి కై
ముత్యము వంటి జానకిని ముంచునె తా నస దగ్ని కీలలన్ ?

నాతియె సీత? నిశ్చల సనాతని; సాకృత బ్రహ్మ విద్య; ధీ
శ్వేత; అనాది; ఆమె రఘు శేఖరు ప్రస్థితికే ప్రబుధ్ధ సం
కేతము; సీత పట్ల తనకేమిటి వంక? అదంతె; కాని - సా
కేత జనాళి శంక తొలగించక లంకను గెల్చినట్లె టౌ?

ప్రణయము కొత్తదా? హృదయ భాండము ఉత్తద? రెండు మూడు దు
క్షణములు బాధపెట్టినను సైచి, పరీక్షకు నిల్వగా వలెన్;
రణములు, రంధి రంపులును, రచ్చలకీడ్చుటె రాజ వృత్తి; ఏ
అణువును లేదు సొంతమగు నట్టిది రాజుకు రాజ్య పధ్ధతిన్ !

"చీకటి విచ్చె నింక రఘు శేఖర సూర్యుని పాద పద్మ ప
ద్మా కరమౌదు" నంచు తమి మై మని యుండిన సీత - తా నటన్
లేక, విదారితాత్మ సళిన్ ఎటులేడ్చునొ ! ఎంత క్రుళ్ళునో !
లోకపు తృప్తికోసమిటు లుర్విజ నేచుట ధర్మమౌనటో?

సీతను తా నెరుంగడె? వశి కృత చేతను? యోగ రాగ భూ
మాతను? మర్మ వేద్య యగు మంత్రజ ఆమె; స్వతంత్ర నేడు ; ఖ
ద్యోత విభాత కాంతి సకలోర్వికి మార్గము చూపనిమ్ము; ఏ
లా తన ఇంటి వెల్గు జనమంతకు చీకటి మూల్గు కావలెన్?

శ్రావణ సంధ్యలై కురియ సాగిన కన్నులలో శరద్ద్యుతుల్
భావ విశేష పర్వములు పండగ, రాముడు లోక తారకో
జ్జీవన దీప్తినంది, విర జిమ్మెను చుట్టును మాధవోన్మనీ
శ్రీ విలస ద్విభాత రవి రేఖలు దృ క్శశి రేఖలొక్కటన్ !!

ఒక సతి, ఒక్క మాట, శరమొక్కటి - ఇయ్యవి మూడొకట్లు; ఇన్
దొకటియె చాలు మానవుని విశ్వ సమున్నతు జేయగ; మూడు నొక్కటై
వికసన మందు మానవుడు విశ్వ సమున్నతుడేల కాడు? అం
దుకె పరిపూర్ణుడై జన మనో రముడయ్యెను రాముడెంతయున్ !

వ్రత మొకటున్న, దానికొక వర్తనముండు; మార్గముండు; ని
శ్చిత మతి యైన మానవుని చేర్చును లక్ష్యము తత్ వ్రత ప్రభల్;
సతి పయి ప్రేమ, వాక్కు పయి శ్రధ్ధ , స్వశక్తి పయిన్ ప్రభుత్వ, మీ
త్రితయము కల్గు జీవుడు ధరిత్రి నెవాడును రామ దేవుడే !!


3 comments:

కామేశ్వరరావు said...

సనత్ గారూ,

మహాద్భుతమైన పద్యాలని పరిచయం చేసారు. అనేక ధన్యవాదాలు. బోయి భీమన్నగారి ఈ పద్యాలనెప్పుడూ చదవలేదు. మీ పద్యాల వెనక స్ఫూర్తి ఇప్పుడు స్పష్టమయ్యింది! కంఠస్థం చెయ్యాల్సిన పద్యాలు.
భీమన్నగారు సంతకం చేసి విశ్వనాథవారికిచ్చిన పుస్తకాలు మీకు లభించడం మీ అదృష్టం.

శ్రీరామనవమి శుభాకాంక్షలు.

రవి said...

మీ దగ్గర ఏదో అమృతభాండం ఉన్నట్టు నా అనుమానం. ఏదైనా ఓ రోజు మీ అమృతభాండం సౌరభాన్ని చూడాలని ఉంది. పద్యాలు అద్భుతం, అపురూపం. శుభాకాంక్షలు.

Sanath Sripathi said...

కామేశ్వర రావుగారూ, రవీ గారూ ధన్య వాదాలు.

@కామేశ్ :- తెలుగు సాహిత్యానికి అశేష కృషి సల్పిన 'యువ భారతిలో' (హైదరాబాదు) మా నాన్న గారు కూడా ఒకరు. రాణ్మహేంద్రిలో చాలా కాలం వృత్తి రీత్యా పనిచేయతం తో తిర్పతి కవులు, విశ్వనాథ వారు, మల్లంపల్లి శరభేస్వర శర్మ గారూ, ఏలూరుపాటి, బేతవోలు రామబ్రహ్మం, మధునాపంతుల సత్యనారాయణ, గరికపాటి , ఆచార్య జీ.వీ. సుబ్రహ్మణ్యం, ఉత్పల సత్యనారాయణాచార్యులు, దాశరథీ రంగాచార్యులు, సి.నా.రే, టీ.కే.వీ రాఘవన్ వంటి సాహితీ వేత్తలతో అత్యంత సన్నిహిత (ప్రత్యక్ష) సాహచర్యం గరిపినవారు మా నాన్నగారు. ఆయన దయ వల్ల నాకు తెలుగంటే ఇష్టం అబ్బింది(నా తోక ఝాళించి, పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతూ నేనాట్టే చదువుకోక పోయినా). ఈ మధ్యనే కొంచం ఆయన పుస్తక భాండాగారాన్ని రుచి చూసే ప్రయత్నం చేస్తున్నా.

మీరన్నట్టు ఆ పుస్తకం నాకు లభించటం, నాన్న గారు ఆ మాట చెప్పటం, నాకది గుర్తుండటం, నా అదృష్టమే. మీరు సరైన మాటన్నారు. నా భావాల్లో, నా పద్యాలో భీమన్న గారి 'అనుసరణ '(అనుకరణ కాదు)ప్రస్ఫుటం గా ఉంటుంది (అప్రయత్నం గా).

మణి మానసం అని శమంతకమణి భావావేశాన్ని కావ్యం గా మలిచిన పద్యాలను గమనిస్తే ఈ సత్యం మరింత స్పష్టం గా కనిపిస్తుంది. వీలైనప్పుడు వాతిని కూడా పరిచయం చేస్తా.

@రవీ :- 'రా రా మా ఇంటి దాకా..' అమృత భాండం ఉందో లేదో నాకే తెలీదు. ఉన్నదేదో అమృతంలా వడ్డిస్తాం... రండి.