Thursday, May 6, 2010

కవిసమ్మేళనానికి నా కుస్తీపట్లు!!

ఉగాదికి అంతర్జలంలో నిర్వహించిన కవిసమ్మేళనానికి పిల్ల కాకినైన నాకూ పిలుపొచ్చింది.

ఉద్దండ పండితుల మధ్య నా పద్యాలు కనీసం విదూషకుడి పాత్రనో, అప్రస్తుత ప్రసంగీకుడి పాత్రనో పోషిస్తాయి కదా అని నేనూ ఊ కొట్టేశా. ఆ పిలుపుకి పర్యవసానమే నా ఈ కుస్తీ పట్లు.

బ్లాగాడిస్తా రవి గారి టపా స్ఫూర్తి తో నేనూ ప్రచురిస్తున్నా నా పద్యాల్ని (ఉరఫ్ పైత్యాన్ని...)

"కుస్తీ పట్లు" అని ఎందుకన్నానో మీకు చదువుతూ పోతున్నకొద్దీ దానంతట అదే అర్ధమైపోతుంది.. కావాలంటే చూడండి..

చట్టబధ్ధమైన ముందస్తు మాట....
ఈ పద్యాలు చదివాకా.. మీకేమైనా అయితే అది నా బాధ్యత కాదు సుమీ...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(గతంలో ఓటరు భావన)
నోటుకి, మందుకి, క్రీకెట్
బ్యాటుకి తెగనమ్ముకొందు ! బ్యాడ్పొజిషన్నీ
పూటకి గడచిన చాలును
ఓటది నాయిష్టమనుచు వోటరు పలికెన్

(మరి నేడో .... )
కోటికి అర్రులు చాచుచు
కూటికి కొరగాని వాన్కి గూడివ్వంగా
ఆటల నాడెదవే? చీ !
ఓటది! నాయిష్టమనుచు వోటరు పలికెన్

ఘాటగు స్పీచులు దంచక
బూటక వాగ్దానమీక, పూజ్యులు బాపూ
బాటన్నడిచే నేతకు
ఓటది! నాయిష్టమనుచు వోటరు పలికెన్

తూటా కన్నా గొప్పది !
మాటాడని విప్లవమ్ము ! మార్పుకు బీజం
నాటెద! సత్తా చాటెద !
ఓటది! నాయిష్టమనుచు వోటరు పలికెన్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మన్మనంబున ప్రేమ భావన మంతరించెడి వేళ ! మా
కున్ముదంబున దారి జూపుచు, కోటి రత్నపు వీణయే,
వన్మినిట్టు సహింపబోమను వాదనల్ తెరదింపుచున్
రాణ్మహేంద్రవరమ్ము చేరెను, రత్నగర్భుని చెంతకున్

(ణ్మ కి న్మ ప్రాస సరికాదు అని విజ్ఞులు చెప్పారనుకోంది.. కానీ నాకు తట్టింది మాత్రం ఇంతే ..)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సూచన:- మీరు గమనించకపోయినట్టైతే పట్లు ఆల్రెడీ మొదలైపోయాయి..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మా సుమ బాణముల్ హరుని మానసమందున ప్రేమ నింపగా,
భాసురమైనతేజమిటు భాసిలె స్కంధుగ ! క్రౌంచ తారకా
ద్యసురారీ! ఒనరంగజేసితిని గాదా ధాత్రికిన్ గూర్మి ! నే
డిసుమంతైనను లేడు నా యశముకే ఢీ చెప్పు వాడెవ్వడున్ !
అసువుల్ బాసిన నేమి? జన్మ చరితార్ధంబయ్యె, సత్కర్మలన్

ఏవో చప్పిడి కూడు నీకిడుదు! నేనే జంతికో తిందు ! నే
వేవో పాటల టాపు లేపెదను ! వేవేలంట నా తిక్కలున్ !
నీవేరీతిన వేడుకున్న విన! నే నే ఖర్చు తగ్గించ నోయ్
శ్రీవారూ!! గృహజ్యోతి మాట విని ఏ.సీ. తేని పక్షాన! ఫో !

ఇంటికి దీపం ఇల్లాలు కదా.. ఈ మల మల మండే ఎండాకాలం లో ఏ.సీ తెమ్మని ఆవిడ పెట్టే పోరు లో దత్తపదుల కుస్తీ...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సూచన:- పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు అన్నారు కదా.. నా తఢాకా చివరిగా ఇక్కడ... ;)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
లక్షద్వీపపు మంత్రి వర్గమనగా లంచావతారమ్ములే
వీక్షింపంగ ! విభిన్న దీవులకు వేర్వేరైన శాఖల్నిడెన్
భక్షింపన్ కమిషన్లు! దాని కొరకై భా.నీ.ప లంకేశుడే
అక్షప్రౌఢిమ మీర ఆశ కు.ని. లంకాధీశుతో బోరెడిన్

లక్షద్వీప్ ప్రభుత్వం ఒక్కొక్క మంత్రిత్వ శాఖనూ ఒక్కొక్క ద్వీపం లో పెడుతుందనీ.. అప్పుడా మంత్రే ఆ లంకకు అధిపతి అనీ... మంత్రులు కాబట్టి రాజకీయం లో ఎత్తులు, పైయ్య్త్తులూ వేస్తూంటారనీ... భావన..

ఒక శాఖ మంత్రి కి వేరే శాఖ మీద కన్ను పడగా ఆయనతో పోరు పెట్టుకున్నాట్ట ఆశ ఎంతటి కైనా తెగిస్తుంది కదా... అని భావన..

మీకీపాటికే అర్ధం అయ్యి ఉంటుంది ఈ యుధ్ధం ఎవరెవరికీ మధ్యనో...
భా.నీ.ప = భారీ నీటి పారుదల శాఖ,
కు.ని = కుటుంబ నియంత్రణ శాఖ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
స్వస్తి

3 comments:

రవి said...

అక్షప్రౌఢిమ - ఈ సమస్య మీద, నేనూ చాలా సిగపట్లు పట్టాను. ఎందుకైనా మంచిది, గుండె చిక్కపట్టుకుని నా పూరణ వినండి. (తప్పులు మెండుగా ఉన్నాయి, భావం నాకే నచ్చలేదు, అయినా ఇక్కడ)

కాంక్షోన్మత్తుడు రావణాసురుడు ఆకాశంబు నందుర్విజన్
అక్షుద్రమ్మగు యంకమందు గొని అంతర్థానమౌ వేళయున్
అక్షిభ్రూకుటి చిట్లగన్నురిమి, చయ్యంచుర్కి యొక్కం మహ
త్పక్షిశ్రేష్టుడు తుండ పక్షములచే బాధించుచుమ్మూర్కొనిన్
అక్షప్రౌఢిమ మీర ఆ శకుని లంకాధీశుతో బోరెడిన్

Sanath Sripathi said...

నిఝ్ఝం గానే గుండె చిక్కబట్టుకుని చదివా..

భ్రూకుటి చిట్లగన్నురిమి, చయ్యంచుర్కి, మహత్పక్షిశ్రేష్టుడు, బాధించుచుమ్మూర్కొనిన్
వామ్మొ.... అంత కష్టం లోనూ మీరు పదాలని భలే వాడారే..(పక్షి ఫైటింగు అంటే అట్లానే ఉండాలేమో కదా..)
ఇవన్నీ బానే ఉన్నాయి అనిపించింది... 'అక్షుద్రమ్మగు యంకమందు' ఒక్కటే అభ్యంతరం కనిపించింది (నా కంటికి)

మిడి మిడి జ్ఞానాకి కనిపించిన దోషాలంటారా ... కాంక్షో 'వస్తె అన్ని పదాల్లోనూ 'ఆంక్షా నే ప్రాసాఖ్స్రం గా వాడాలట కదా... దానికీ అక్ష ప్రౌఢిమ కీ పడదంట కదా (ఈ మధ్యనే సులక్షణసారం కొన్నా కదా...)

రవి said...

అవునండి. (కాంక్షోన్మత్తుడు) మీరు చెప్పింది దోషమే. తట్టనే లేదు నాకు. ఇంకా అనేకం ఉంటాయి లెండి.అసలు భావమే పొసగలేదు, చివరి పాదంలో ఆ శకుని అని ఉంది కాబట్టి. అక్షుద్రమ్మగు కూడా ప్రాసకోసం పట్టిన కుస్తీ మాత్రమే.ఉర్విజ కూడా తప్పే. ఉర్వీజ అని వ్రాయాలి. (అలా అయితే గణభంగం. అందుకని అడ్జస్ట్ మెంటు) అసలు తెలుగు ఉర్వి కి సంస్కృత ప్రత్యయం జోడించొచ్చా అని డవుటు.

ఎంతయినా శార్దూలం పట్టుచిక్కడానికి నాకు కాస్త సమయం పడుతుంది.

ఇన్ని దోషాలు చూసి భయపడవద్దనే మీకు వార్నింగిచ్చాను. :-)