Thursday, November 4, 2010

సౌందర్యలహరి శ్లోకమూ - నా సందేహమూ...

కామేశ్వరరావుగారు "విజయదశమి శుభాకాంక్షలు" అంటూ సౌందర్యలహరి లోని రెండు శ్లోకాలకి అనువాద పద్యాలు చాలా సులభంగా ఇచ్చారు . అయితే అవి చూడగానే సౌందర్యలహరి లో అపరిష్కృతంగా ఉండిపోయిన ఒక చిన్నడౌటు మళ్ళీ బుర్ర దొలిచెయ్యటం మొదలెట్టింది.

100 శ్లొకాల సౌందర్యలహరిలో 1 వ శ్లోకమూ,100 వ శ్లోకమూ తప్ప మిగిలినవి అన్నీ అమ్మవారితో మాట్లాడినట్టూ లేదా అమ్మ వారిని వర్ణిస్తునట్టు అనిపిస్తాయి. ఈ రెండు మాత్రం వేరే ఎవరితోనో సంభాషిస్తున్నట్టు, వారికి సమాధానం ఇస్తున్నట్టు, లేదా తనను తాను సమర్ధించుకున్నట్టుగానో/  జస్టిఫికేషన్ ఇస్తున్నట్టు గానో అనిపిస్తాయి (నా పరిమిత జ్ఞానానికి)

"శక్తియుతుడైనప్పుడు శివుడు ఈ జగాలను సృష్టించగలుగుతున్నాడు. ఆ శక్తిలేకున్నచో ఒక వేలుకూడా కదపలేడు; అటువంటి హరి,హర, విరించి మొదలగు వారిచే ఆరాధింపబడే నిన్ను స్తుతించిన వాడు అకృతపుణ్యుడెట్లా ఔతాడు తల్లీ? (అంటే అవ్వడు, అవ్వలేడు అని భావం) ఇట్లాంటి భావాన్ని ప్రతిపాదిస్తున్నట్టున్న శ్లోకంతో సౌందర్యలహరి ప్రారంభించినట్లుంటుంది.

శంకరుల స్త్రోత్రాన్నో, వర్ణననో అర్థంచేసుకోటానికికూడా నా పురాకృతం సరిపోదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అయినా నాకొచ్చిన సందేహం తెలియజేస్తేనేగా నివృత్తి అయ్యేది. అందుకే సాహసం చేస్తున్నా.

ఈ శ్లోకంలో స్తుతింపబడుతున్న దేవత, ప్రతిపాదింపబడుతున్న సత్యమూ, వీటికీ అన్వయము చెబుతూ అసంపూర్ణంగా (లేదా అన్యాపదేశంగా) చేసిన ప్రశ్న అసంబధ్ధంగా ఉన్నదేమో అని నా భావం. అమ్మవారిని స్తుతిస్తున్నప్పుడు ఎవరికో సమాధానం చెబుతున్నట్టు/ జస్టిఫికేషన్ లాగా "కథం అకృత పుణ్యః ప్రభవతి?" అని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంటుంది?

ఇది ఒకరకంగా తనని తాను ప్రశ్నించుకొని సమాధానపరచుకున్నట్టుగా కూడా అనుకోవచ్చు. ఏ శక్తి అయితే శివునితో కలిసి సర్వ జగత్కారణమవుతోందో, ఏ శక్తి చేత సృష్టి స్థితి లయమనే మూడు కార్యాలు నిర్వహించబడుతున్నాయో అలాంటి శక్తిని తాను స్తుతించబోతున్నాడు, వర్ణించబోతున్నాడు. దానికి తాను తగిన వాడా? అలాంటి సంకల్పం కలగడమే పుణ్యమని స్ఫురించి ఉంటుంది. ఎంతో పుణ్యం చేసుకోవడం మూలానే తానీ పని చెయ్యగలుగుతున్నానని నచ్చచెప్పుకున్నాడు అనుకోవచ్చు

అయితే  ఏ స్త్రోత్రాన్ని చేసేముందు తన మీద తనకి రాని డౌటు శంకరభగవత్పాదులకి అమవారిని స్తుతించే సౌందర్య లహరి లోనే ఎందుకు వచ్చి ఉంటుంది? ద్వైత, అద్వైత, విసిష్తాద్వైతాలను ఆకళింపు చేసుకుని తత్త్వ జ్ఞనాన్ని సంపాదించుకున్న శంకరులకు తన సామర్థ్యం అంటూ వెరె ఒకటి ఉంటుందని, అమ్మ వారిని స్తుతించటానికి అది సరిపోతుందా సరిపోదా అనే శంక కలగటం, అంతలోనే "కాదులే, ఇట్లాంటి అమ్మవారిని స్తుతించేటప్పుడు ఇంక అకృతపుణ్యుణ్ణి ఎట్లా ఔతాను" అని సమాధానం చెప్పుకోవటం సాధ్యమా? సంభావ్యమేనా?

ఇంకొకటి. సౌందర్యలహరి గురించి (చాగంటి కోటేశ్వరరావుగారు చెప్పిన ప్రవచనంలో అనుకుంటాను)... సాక్షాత్తూ పరమశివుడు తప్ప అన్యులెవరూ అమ్మవారి వైభవాన్ని అంత అద్భుతంగా చెప్పలేరు. ఆదిశంకరులు సాక్షాత్తూ కైలాసశంకరులే. కైలాసశంకరులు చెప్పిన సౌందర్యలహరిని ఆదిశంకరులు భూమిపైకి తెచ్చారు. దానిలో కొంత భాగం ఖిలమైపోగా ఆదిశంకరులు తానే పూర్తిచేసారు.ఒకవేల గనక కైలాసశంకరులే గనక కీర్తిస్తే వారికి సందేహం కలగటమా?



మరొకటి. శంకరుల ఏ స్త్రోత్రాన్ని చూసినా "తనను" గురించిన (లేదా తనవంటి భక్తుడి గురించిన) ప్రస్తావనతో మొదలు కాలేదు. స్తుతింపబడుతున్న దేవతనుద్దేశించి చేసినవే అన్నీను. సౌందర్యలహరిలో కూడా రెండవ శ్లోకం నుండీ అదే పంథా కనిపిస్తుంది. కానీ మొదటి శ్లోకంలో మాత్రం ఉపాస్య దైవం ప్రస్తావనతో పాటు 'స్వ' విచక్షణ లాగా అనిపిస్తుంది. అసలు ఇటువంటిది శంకరులంతటివారు చేసిన ఏ స్తుతిలోనూ ఇటువంటి ప్రతిపాదనలేదు.
కావాలంటే శివానందలహరి లో చూడండి.

కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతప:
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే
శివాభ్యాం మస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున
ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియం అనే శ్లోకం తో మొదలయ్యింది.

కనకధారా స్తోత్రం చూడండి.

సమునిర్మురజిత్కుటుంబినీం పద చిత్రైర్నవనీత కోమలైః
మధురై రుపతస్థివాం స్తవైర్ద్విజ దారిద్ర్య దశా నివృత్తయే అనే శ్లోకం తో మొదలయ్యింది.

ఒకవేళ స్తోత్రం "వందే వందారు" తో మొదలయ్యింది అనుకున్నా అదీ అత్యధ్భుతం గా అమ్మ స్తుతితోనే ఉంటుంది కానీ తను ఎంతడివాడు అన్నది ప్రపంచానికో, లేదా తనకి తానేనో చెప్పుకున్నట్టు ఉందదు. నా వరకు నాకు ఎన్ని భాష్యాలు చదివినా, ఆశ్లోకం అక్కడ అప్రస్తుతమేమో అనిపిస్తుంది. (చెంపలేసుకుని గుంజీళ్ళు తీశా ఈ మాట అంటున్నందుకు)...

మీరెవరైనా కారణం తెలిస్తే చెప్పగలరా... ప్లీస్ ...

దీపావళికి నే పేలుస్తున్న పెద్ద "లక్ష్మీ" బాంబు ఇదేనేమో????

2 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

వ్యాఖ్యలు మీరు ప్రచురించలేదా, లేక ఎవరూ స్పందించలేదా ? నాకేమీ తెలీదు, తెలుసుకోవాలనే కూతూహలంతొ వస్తూనే ఉన్నాను.
అవునూ, సౌందర్యలహరికి భాష్యాలు ఏమైనా చదివే ఉంటారు కదా! వాటి వివరాలు కూడా దయచేసి ఇస్తారా? మీ వంటి వాళ్ళు వట్టి చదవటం కాదు, అధ్యయనం చేసి ఉంటారు అనాలనుకుంటాను.
ఈ చర్చ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటాను.

Sanath Sripathi said...

మందాకిని గారూ !!
నేను ప్రచురించకపోవటం ఏమీలేదు, నేనూ వ్యాఖ్యలకోసమే ఎదురుచూస్తున్నా.... పండగ కదా టపాల కన్న టపాసులు మిన్న అని భావిస్తున్నరేమో బ్లాగ్లోకస్థులు. అందుకే ఎవరూ స్పందించలేదేమో...

"సౌందర్యలహరికి భాష్యాలు ఏమైనా చదివే ఉంటారు కదా! వాటి వివరాలు కూడా దయచేసి ఇస్తారా? మీ వంటి వాళ్ళు వట్టి చదవటం కాదు, అధ్యయనం చేసి ఉంటారు అనాలనుకుంటాను." అని మీరు పొరబడ్డారు. అధ్యయనం చేయడం సంగతి పక్కన పెడితే, నేను భాష్యాల వంటివి సరిగ్గ చదువుకోనేలేదు. అదుకే కదా ఈ తాపత్రయం...